శ్రీ వినాయక లాండ్రీ సర్వీస్

ఆశ్చర్యపోవడం అసిస్టెంటు మేనేజరు వంతయింది. గొంతు తగ్గించి చెప్పేడు. “అదేంటీ? మీకు తెలీకుండానేనా?”

“ఏమోనండి, నాకెలా తెలుస్తాయి ఇవన్నీను. నేను పూజ చేసి వెళ్ళిపోతాను అంతే.”

ఆయన లెడ్జరు తీసి చూపించేడు. లక్షల్లో విత్‌డ్రాయల్స్.

“సరే ఎవరి దగ్గిరా అనకండి, మళ్ళీ రెడ్డిగారికి తెలిస్తే బాగుండదు కదా?”

“నేనా నోరు విప్పేది? నాకెందుకండీ ఇదంతాను?”

బేంకులోంచి బయటకొచ్చాడన్నమాటే గానీ పంతులుగారికి ఒళ్ళు మండుతూనే ఉంది. ఈ డబ్బులన్నీ హుండీలో ఈయన వేసినవేనన్న మాట. అందుకే అలా ఇష్టం వచ్చినట్టూ తీసుకుంటున్నాడు అనే ఆలోచన వచ్చింది. మర్నాడు పూజకి వచ్చాడన్నమాటే కానీ ఇదే మనసులో మెదుల్తోంది. పత్రికలవాళ్ళకో ఇంకెవరికో చెప్దామా అనుకున్నాడు కానీ అలా చేస్తే తను వీధిలో పడతాడు. ఎందుకొచ్చిన తల్నొప్పి. ఎదురుగా కూర్చుని పూజ మొదలుపెట్టాడు. విగ్రహం కేసి చూస్తూంటే వినాయకుడు ఎవర్నో చూసి భయపడుతున్నట్టుంది. పంతులుగారైతే తన చేతకానితనానికి సర్దిచెప్పుకోగలిగేడు కానీ వినాయకుడికి అది చేతకాక దిగులుగా ఉన్నట్టున్నాడు. పూజ ముగించి ప్రసాదం పెట్టి బయటకొస్తుంటే ఫోను మోగింది – రెడ్డిగారి దగ్గిర్నుంచే. వెంఠనే ఓ సారి ఇంటికి రమ్మని పిలుస్తున్నారు.


వచ్చిన పంతులుగార్ని లోపలకి తీసుకెళ్ళి ఆయనిచ్చిన ప్రసాదం తీసుకున్నాక అడిగేడు రెడ్డి.

“ఏటండి సంగతులు, గుళ్ళో అన్నీ బాగా జరగతన్నాయా?”

“అంతా మీ దయ. ఏవిటిలా పిల్చేరు? ఆరోగ్యం ఎలావుంది తమరిది.”

“బానే ఉంది. దేవుడి మీద బరువేసి బతుకుతుండా. యాపారం చూసుకునేందికి కొడుకులూ అల్లుళ్ళూ ఉండారు. రామా కిష్ణా అనుకుంటూ వుండా.”

“మంచిదే. తమరికీ విశ్రాంతి అవసరం.”

“సరే గానీ, దేవుడి పేరు మీద ఇంకేంజేయచ్చా అని.”

“ఉచిత భోజనాలు మరిన్ని రోజులు పెట్టచ్చు. విద్యార్థులందరికీ పెన్నులూ పెన్సిళ్ళూ పుస్తకాలు కొనివ్వొచ్చు. పేద విద్యార్ధులకు పండగలప్పుడు బట్టలిచ్చినా బాగుంటుంది.”

“భలే చెప్పావ్ పంతులూ. బట్టల్దేవుంది. మన కొట్.. మనకు తెలిసినోళ్ళుండారు. సవగ్గా ఇస్తారు.”

“ఖర్చు ఎక్కువవుతుందేమో మరి?” పంతులు కూపీ లాగుతున్నట్టు అడిగేడు.

“అది మనోళ్లు చూసుకుంటార్లే. అయినా ఎంతవుద్ది. రంగులకి రెండు లక్షల కంటే కాకపాయె…”

“మన చిన్న వినాయకుడికి రంగులేయడానికి అంత ఖర్చా?” నోరు వెళ్ళబెట్టేడు పంతులు.

“ఆ ఖర్చు గురించి తర్వాత మాట్లాడదాం గానీ… పంతులుగారూ మీకిస్తున్న జీతం సరిపోతోందా?” వెంకటరెడ్డి నోరు జారినట్టు తెలియగానే పరిస్థితి చక్కదిద్దడానికి అక్కడే ఉన్న అల్లుడు రంగంలోకి దిగేడు.

“హుండీలో డబ్బులు లేవు ఇంతకాలం అని నేను అడగట్లేదు కానీ వెయ్యి రూపాయలు ఏమూలకండి? మిమ్మల్నే అడుగుదామనుకుంటున్నాను. మీరే అడిగారు ఈలోపున.”

“పంతులుగారూ, అన్నింటికీ ఖర్చులు పెరిగాయి కదా. మీ జీతం వచ్చే నెల నుంచి ఐదువేలు చేస్తే సరిపోతుందా?” వెంకటరెడ్డి ఏమీ మాట్లాడకపోవడం చూసి అల్లుడే చెప్పేడు,

తన జీతం పెరుగుతోందనే విషయం వినగానే పంతులుగారు గంట క్రితం తాను గుళ్ళో వినాయకుడి దగ్గిర గొణిగిన గొణుగుడూ అన్నీ మర్చిపోయి సంతోషంగా చెప్పేడు, “మహా భాగ్యం. వేణ్ణీళ్ళకి చణ్ణీళ్ళు. అంతకన్నానా?”

కాసేపు అదీ ఇదీ మాట్లాడేక పంతులుగారు లేచాడు ఇంటికెళ్ళడానికి. పంతులుగారిని వెళ్ళనిచ్చి వెంకటరెడ్డి అల్లుడితో అన్నాడు.

“ఈ పంతులుగార్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. మొన్నోమాటు బేంకులో అసిస్టెంటు మేనేజరుతో ఏదో తెగ మాటాడతన్నాడంట.”

“జీతం పెంచాం కనక అంత సీను లేదు ప్రస్తుతానికి, కానీ జాగ్రత్తలో ఉండడం మంచిదే. అయినా ఏం చెప్తాడు మన గురించి? ఎవరితో చెప్తాడు? అయినా మనకి దేనికీ భయం? వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఊరు మనది, బిజినెస్సు మనదీను.”


రెడ్డి ఇంట్లోంచి బయటకొచ్చిన పంతులుగారికి ఇంకేమీ చెప్పక్కర్లేకుండానే మిగతా కథ అర్థమైపోయింది. ఈ హుండీలో మొదట్లో డబ్బులెవరు కుక్కి కుక్కి వేశారో ఎవర్నీ అడగక్కర్లేదు. ఈయన చేసిన నిర్వాకం తెలుస్తూనే ఉంది. ఓ పదో ఇరవయ్యో లక్షలు అసలు ఖర్చులకి పోయినా మొత్తమ్మీద ధర్మకర్త నల్లధనం దాదాపు అంతా తెల్లగా అయిపోయింది. అయిదువేల రంగులకి రెండు లక్షలనీ వెయ్యి రూపాయల ప్రసాదాలకి డెబ్భైవేలని ఇలా తిరిగి లాక్కుంటున్నారన్నమాట. అలాగే పందిరి వేయడానికి, రేప్పొద్దున్న కుర్రాళ్లకిచ్చే బట్టలకీ ఇలానే అవుతుంది. ఎంత అద్భుతం! పూజ చేస్తూ వినాయకుడి ముందు గొణుక్కున్నాడు, స్వామీ! నువ్వయినా ఏదో ఒకటి చేయచ్చు కదా, అని. కానీ ఇటువంటి తెలివితేటల ముందు బుల్లి వినాయకుడి తెలివితేటలు ఏ మూలకి? అందుకేనేమో పూజ చేస్తూంటే వినాయకుడు భయపడ్డట్టు కనిపించినది? ఆమాటకొస్తే తన తెలివితేటలేపాటివి? ఇంకా ఏం జరగనున్నాయో. ఏమైతేనేం, జీతం పెరిగింది. అందరూ బాగుంటే అదే పదివేలు. నలుగురితో నారాయణ.

రెండు వారాలు పోయాయో లేదో రెడ్డిగారికి గుండెనొప్పి వచ్చింది. ఛాతీ పట్టుకుని ‘ఏనుగు, ఏనుగు’ అని పలవరిస్తూ పడిపోయేడు. అప్పటికప్పుడు ఆపరేషన్ చేసి కార్డియాలజిస్టు ప్రాణంపోశాడు. రెండు మూడు వారాలు హాస్పిటల్లో గడిపి బరువు తగ్గిపోయి ఉల్లాసంగా వెనక్కొచ్చాడు రెడ్డి ఇంటికి. పెళ్ళాం పిల్లలూ సపర్యలు చేశారు. కొడుకులూ, అల్లుళ్ళూ అద్భుతంగా చూసుకుంటున్నారు బిజినెస్సు. ఏమీ కంగార్లేదు.

రెడ్డిగారి తరపున మరోసారి బుల్లి వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. పూజలో పంతులుగారికి మంచి సంభావన, కార్డియాలజిస్టుకి మరో బహుమతీ ఇచ్చారు. బుల్లి వినాయకుడి అనుగ్రహం వల్లే ఇదంతా అని రెడ్డిగారి కుటుంబం అంతా అందరికీ చెప్పుకున్నారు. గుడిని ఇలానే ప్రాణంగా చూసుకుంటామని కొడుకులూ అల్లుళ్ళూ ప్రమాణాలు కూడా చేసేరు. రెడ్డిగారికి విశ్రాంతి కావాలి కనుక తామంతా కూడా ధర్మకర్తలయ్యేరు.

త్వరలోనే ఊళ్ళో ఒక నమ్మకం మొదలైంది. గుడి కట్టాక రెడ్డిగారి బిజినెస్సులు బాగా పెరిగాయి కనక, బైపాస్ తర్వాత ఆరోగ్యం బాగుపడింది కనక, ఇదంతా వినాయకుడి మహిమే అని ఆ నోటా ఈనోటా తెలిసిపోయింది. ఆనోటా ఈనోటా తెలిసిందేమిటంటే రెడ్డిగారు గుడి మొదలు పెట్టింది, బైపాస్ చేయించుకున్నదీ రెండూ బుధవారమే అని. అప్పట్నుంచి ప్రతీ బుధవారం బుల్లి వినాయకుడి విశేష దినం. ఆ రోజు పూజలు చేస్తే తిరుగు లేదు. పంతులుగారు ఆ రోజున తన బ్రాహ్మణీకం మానుకుని రోజంతా వినాయకుడికి స్పెషల్ పూజలూ అవీ చేస్తాడు. ఊర్లో మిగతా వ్యాపారస్తులు, ఉద్యోగులు, లేబరు వాళ్ళు, ప్రతీ ఒక్కరూ వచ్చి పెద్ద ఎత్తున దక్షిణ సమర్పించడం కూడా బుధవారమే. అలా వచ్చిన హుండీ డబ్బులు శుక్రవారం పొద్దున్నే బేంకులో వేసేస్తారు.

ప్రజలకి తెలియని విషయాలు కొన్ని బయటకి ఎవరూ అడగరాదు, చెప్పరాదు. కానీ అసిస్టెంటు మేనేజర్ చెప్పడం ప్రకారం ఊరి బేంకులో శుక్రవారం పెద్ద పని ఉండదు. రెడ్డిగారు ఎవరికీ అనుమానం రాకుండా బేంకులో ఏదైనా పని తీరిగ్గా చేసుకోవడానికి సులభం శుక్రవారమే. ధర్మకర్తలకి గురువారం మాత్రమే వినాయకుడి హుండీ డబ్బులు లెక్కపెట్టడం కుదురుతుంది. అందువల్ల వినాయకుడికి విశేష దినం బుధవారం. పంతులుగారికి ఆ రోజున ప్రత్యేకంగా ఐదొందలు చెల్లిస్తారు. దక్షిణ పళ్ళెంలో డబ్బులు మొత్తం పంతులుగారివే ఆ రోజు. (నిజానికి గుడి కట్టించినది శుక్రవారం, రెడ్డిగారికి బైపాస్ అయినది ఆదివారం.) మేనేజరుగారే కాదు, అప్పుడప్పుడూ రీజినల్ మేనేజరుగారూ సకుటుంబంగా వచ్చి, వినాయకుడి దర్శనం చేసుకుని, రెడ్డిగారు ఇచ్చే ప్రత్యేక తీర్థప్రసాదాలు స్వీకరించి వెళుతుంటారు. వినాయకుడు తలచుకుంటే జరగనిది ఏమీ లేదు. ఆయన అనుగ్రహం చాలా అవసరం.

అలా వినాయకుడు మరింత శ్రీమంతుడయేడు. ఇంకా అవుతూనే ఉన్నాడు. ఎవరైనా బుల్లి వినాయకుడికి నగో నట్రో చేయిస్తామంటే వినాయకుడికి నగలు పెట్టకూడదనీ నగదే మంచిదనీ ఆగమ పండితుడైన పంతులుగారి ఉవాచ. డబ్బును వారు గుడి పేరున ధర్మకర్తలకు ఇస్తారు. వారు దేవుడికి కావలసినవన్నీ చేయిస్తారు. వెండి ఆభరణాలు, తొడుగులూ పోయి ఇప్పుడు వినాయకుడికి బంగారు నగలు వచ్చేయి. మూషికవాహనమూ బంగారు తాపడంతో పచ్చగా మెరిసిపోతోంది. గర్భగుళ్ళో అన్నీ – ఉద్ధరిణి, వెండి పళ్ళెం, చిరుగంట, భక్తుల నెత్తిమీద పెట్టడానికి శఠగోపం – ఇప్పుడు వెండి, బంగారంతో చేసినవే. పంతులుగారు కూడా బేంకుకు ఇప్పుడు వారానికి రెండు మూడుసార్లు వెళుతున్నాడు. అసిస్టెంటు మేనేజరు పుణ్యమా అని పని తొందరగానే అయిపోతుంది లైనులో నిలబడకుండా.

ఒకరోజు అలానే బేంకుకెళితే, అసిస్టెంటు మేనేజరు కాగితాలు సర్దుకుంటున్నాడు. అడిగితే చెప్పేడు, తనకు ట్రాన్స్‌ఫరయిందని. ఆంధ్రా ఒరిస్సా బార్డరులో డొంకరాయి అనే ఊళ్ళో బేంకుకి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆర్డర్లు వచ్చాయిట. అది చూసి నెత్తి నోరూ కొట్టుకుని పైకెళ్ళి చెప్పుకుంటే రీజినల్ మేనేజర్ గారు, ‘డొంకరాయిలో పని చేస్తే ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని’ చెప్పేరట. అయినా డొంకరాయికేం? ఊర్లో ఓ శివాలయం, రామాలయం, పోస్టాఫీసు ఉన్నాయి. పక్కనే ఆహ్లాదంగా సీలేరు, అప్పుడప్పుడూ కనిపించే జింకలు, ఎలుగు గొడ్లూను. హృదయం ఉండాలే గానీ చూసి ఆనందించడానికి చుట్టూరా పచ్చని చెట్లతో అద్భుతమే.

“అయ్యో, అదేమిటండీ. మీరు కష్టపడి పనిచేస్తారు కదా. మీలాంటి వాళ్ళ ఉపయోగం ఇలాంటి పెద్ద బేంకుల్లోనే కదా?” పంతులుగారు నొచ్చుకున్నాడు.

“ఆ ‘కష్టపడడమే’ నచ్చినట్టు లేదు మావాళ్ళకి.”

కొంచెం బలవంతం చేస్తే, అసలు సంగతి చెప్పేడు ఆయన. ఈ గుడి అకౌంటు లావాదేవీలు చూడమని బేంకు ఆడిటర్లకి ఈయన ఉప్పందించబోయేట్ట. అక్కడిదాకా పోకుండానే రీజినల్ మేనేజరుగారు విని పిలిచి మందలించేట్ట. ఆయనసలే భక్తుడాయె. దేవుడిపని చేస్తున్న వాళ్ళని ఇలా అనుమానించద్దనీ ఇది బేంకుకూ పరువు పోయే విషయమనీ చెప్పేట్ట.

“ముందేం జరిగిందో నాకూ తెలుసునండీ. కానీ ఇప్పుడదంతా తెల్లదే కదా?” అన్నాడు పంతులుగారు.

“ఎలా అయింది? దొంగ రశీదులతో మిగిలిపోయిన డబ్బంతా మళ్ళీ నలుపే అవుతోంది కదా, ఏం?” ఏదో పొడుపుకథ అడిగినట్టు అడిగేడు అసిస్టెంట్ మేనేజరు.

“అవున్నిజమే కదా!” తల గీక్కున్నాడు పంతులుగారు.

“నేను చెప్తా వినండి. అలా మిగిలిపోయిన డబ్బంతా అలానే ఉండదు. అందులో కొంత వేరే బిజినెస్సుల్లోకీ, వ్యాపారాల్లోకీ పోతుంటుంది. అలా వ్యాపారాలు పెరిగేకొద్దీ వాటిల్లోంచి మిగుల్తున్న డబ్బూ మరింతగా నలుపవుతుంటుంది. మీరెప్పుడైనా గమనించారో లేదో. బుధవారం వినాయకుడి హుండీలో పడే డబ్బు లక్షల్లో ఉంటోంది. పెద్దమొత్తాల్లో ఏ ఇద్దరో ముగ్గురో నుంచి వచ్చిన దక్షిణలు అవి. ఎవరో నేను చెప్పక్కర్లేదు. అలా ఆ డబ్బు వినాయకుడి ఎకౌంట్లోకి పడుతుంది. మీ వినాయకుడు దాన్ని తెల్లగా పవిత్రం చేస్తాడు. ఆ డబ్బు మళ్ళీ ధర్మకార్యాలకు, అన్నదానాలకూ బైటకు తీస్తారు. మళ్ళీ రసీదులు, మళ్ళీ మిగుల్పు, మళ్ళీ పెట్టుబడులు, వాటిల్లోంచి మళ్ళీ నొక్కిపెట్టిన సొమ్మంతా హుండీ నుంచి వినాయకుడి ఎకౌంట్ లోకి. ఇలా ప్రతీ విడతలోనూ కొంత తెల్లగా అవుతుంటుంది. మరికొంత కొత్తగా నలుపవుతుంది. వ్యాపారాలు ఎంతకని పెంచుతారు, ఎంతకని చేస్తారు? వాటితో ఉన్న ఇబ్బందులు దేవుడితో ఉండవు. దేవుడితో ఇలా అనంతంగా ఎంతకాలమైనా సాగిపోతుంటుంది. ధర్మకర్తల దానధర్మాలూ పెరిగిపోతాయి. కీర్తి ప్రతిష్ఠలూ వస్తాయి. వినాయకుడుగారు ఏ రంగు డబ్బు హుండీలో ఎంత పడ్డా చలించకుండా వాషింగ్ మెషీన్ లాగా ఉతికి తెల్లగా చేస్తుంటాడు.”

“ఆఁ!” నోరు తెరిచాడు పంతులుగారు.

“కంగారు పడకండి. భక్తితో కళ్ళు మూసుకున్నంత కాలం మీ ఆదాయమూ పెరుగుతూనే ఉంటుంది.” చిన్నగా అని పెద్దగా నవ్వేడు అసిస్టెంటు మేనేజరు.


రెడ్డిగారు వ్యాపారాలు, లావాదేవీలు అన్నీ కొడుకులకూ అల్లుళ్ళకూ పంచేసి విశ్రాంతి తీసుకుంటున్నాడిప్పుడు. పాదరసం లాంటి బుర్ర ఉన్న కొడుకులు, అల్లుళ్ళుండగా ఆయనకేం చింత? వీలు కుదిరినప్పుడు సాయంకాలం గుండె బాగుండడం కోసం కార్డియాలజిస్టు చెప్పినట్టూ అలా ఊర్లో నడుస్తుంటాడు. ఆ నడక అయిపోయాక బుల్లివినాయకుడి గుడి దగ్గిరకెళ్ళి భక్తితో దణ్ణం పెట్టుకుని కాసేపు కూర్చుంటాడు విగ్రహం కేసి చూస్తూ. వినాయకుడు చూపు కలపకుండా జాగ్రత్త పడుతుంటాడు. ఇదీ రోజూ జరిగే తంతు.

వినాయకుడు ఎప్పట్లానే ఊరిని చూస్తున్నాడు. కానీ ఉల్లాసంగా కాదు.

రెడ్డిగారికి ఏనుగు కలలోకొస్తుంటుంది అప్పుడప్పుడూ. కానీ అది ఆయనను ఇప్పుడు భయపెట్టడంలేదు.

(కథకి చూచాయగా ముందస్తు ఆలోచన ఇచ్చిన కష్టేఫలీ బ్లాగు శర్మగారికి కృతజ్ఞతలు.)