శ్రీ వినాయక లాండ్రీ సర్వీస్

రెడ్డీ, అల్లుడూ అరగంటలో కారు దిగేసరికి గుడి చుట్టూ జనం పోగై ఉన్నారు వింత చూస్తూ. డబ్బులు ముట్టుకోవడానికి ఎవరికీ ధైర్యం లేదు. వినాయకుడి డబ్బా, మజాకా? సాక్షుల్లేకుండా ముట్టుకుంటే జైలూ, దేవుడి డబ్బులు ముట్టుకుంటే నరకమూను. అదీకాక ఈ హుండీ తెరవాలంటే బేంకువారు రావాలి; దేవుడిది ధర్మఖాతా కదా? కానీ బేంకువారు గంట పది దాటకుండా, ఆఫీసులు తీయకుండా అలా వచ్చేస్తారా? కొన్నిసార్లు వచ్చేస్తారు మరి.

బేంకులో ఓ లక్ష దాచుకుని, అప్పుడో పది వేయడం, ఇప్పుడో పది తీసుకోవడం – చేసేవాళ్ళంతా బేంకుకి ఊడబొడిచిందేమీ లేదు. మరి రెడ్డి లాంటివాళ్ళో? అబ్బో, వాళ్ళు పెద్ద అప్పులు తీస్తారు, వడ్డీలు కడతారు, అంతా లకారాలలోనే. బేంకులను రక్షించేదీ భక్షించేదీ వాళ్ళే మరి. అందుకని రెడ్డిగారు తాను స్వయంగా వచ్చినా, అల్లుణ్ణి పంపించినా మేనేజర్ గుమ్మం దగ్గిర సిద్ధంగా ఉంటాడు. కొండొకచో ఫోనుమీదే వ్యవహారం జరిగిపోతుంది. అటువంటప్పుడు బేంకు ఇంకా తెరిచారా లేదా అనే విషయాలు పట్టించుకోకుండా ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రావడానికీ, పోవడానికీ మేనేజరు సిద్ధం.

బేంకులు ఎలా పనిచేస్తాయో రెడ్డికి క్షుణ్ణంగా తెలుసు కనక అల్లుడి చేతికి ఫోనిచ్చి చెప్పేడు, “అల్లుడూ మేనేజర్ని ఓ సారిలా రమ్మను మరో క్లర్కుతో.”

మరో పదిహేను నిముషాల్లో మేనేజర్ ఇంకో ఇద్దరు ఆఫీసర్లతో గుడి ముందు వాలిపోయేడు. ఎవరూ ఎవరికీ ఏమీ చెప్పక్కర్లేకుండానే విషయం అర్థమైపోయింది. పది నిముషాలు ఆలోచించి మేనేజర్ చెప్పేడు.

“ఈ డబ్బులు ఎవరు వేశారో కానీ మా హైద్రాబాదు రీజినల్ మేనేజర్‌తో మాట్లాడాలండి. అయితే ఇవన్నీ డబ్బాల్లోకి ఎత్తేసి బేంకు లాకర్లో ఉంచుదాం. లెక్క కట్టి చూసి ఇలా ఇంత వేశారు అని నేనూ మా కుర్రాళ్ళూ సాక్ష్యం. మీరూ పంతులుగారూ ఎలాగా చూసిందే. ఫోటోలు తీసి ఉంచుదాం ఎందుకైనా మంచిది.”

స్పెషల్‌గా పిలవబడ్డ ఊరి ఫోటోగ్రాఫర్ తీసినవి కాక, అల్లుడు టక టకా వేరేగా తన సెల్ ఫోనులో ఫోటోలు తీశాడు. మరి తర్వాత తేడా వస్తే లెక్క చూసుకోవద్దూ? చూసిన ఎవరికీ ఏ అనుమానం రాకుండా, డబ్బులన్నీ డబ్బాల్లోకి ఎత్తేసి రెడ్డిగారి దగ్గిరా పంతులుగారి దగ్గిరా ఇలా అని సాక్ష్యానికి సంతకాలు తీసుకుని బేంకుకేసి వెళ్ళిపోయింది మేనేజరు కారు.


వినాయకుడు తన భుక్తాయాసం అలా తీరిపోగానే మళ్ళీ మామూలుగా ఉల్లాసంగా ఊరికేసి చూడ్డం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని వారాలకు కిందా మీదా పడి ఎలాగైతేనేం హైద్రాబాదు రీజినల్ మేనేజర్‌గారి ఆశీర్వాదంతో డబ్బంతా వినాయకుడి ఎకౌంట్లోకి జేరిపోయి తెల్లగా అయిపోయింది. శుక్లాంబరధరం విష్ణుం… అనేది విష్ణువు గురించిన శ్లోకం అని శివానందులంతటి వారు చెప్పినా మనం అది గణపతిని ఉద్దేశించి చదువుతున్నాం కనక వళ్ళు దగ్గిర పెట్టుకుని అంతటి నలుపునీ శశివర్ణంలోకి మార్చేశారు బేంకువారు. ఎలక తోలు తెచ్చి ఎంత ఉతికినా తెలుపు గాదని వేమన అన్నాడంటే ఆ రోజులు వేరు. ఇప్పుడు మైకల్ జాక్సన్ చేయించుకున్నట్టూ ఏ రంగు తోలునైనా సరే అంగుళం కదలకుండా తెల్లగా చేసుకోవచ్చు. బుర్ర ఉంటే చాలు, పది నిముషాల్లో పని.

డబ్బులు వినాయకుడి ఎకౌంట్లోకి వెళ్ళాక నెలలు గడిచే కొద్దీ ఈ నోట్ల రద్దు కార్యక్రమం మెల్లిగా మరుగున పడిపోయింది. భారద్దేశ ప్రజలు ఎంత బుర్రలేని వాళ్ళో, వాళ్లని ఎలా ఆడించినా నోరు మూసుకుని పడి ఉంటారో, ఎంత ఓపిక ఉన్నవాళ్ళో మరోసారి ప్రపంచానికి ఋజువు చేయబడింది. పెద్ద ప్రాజక్టు కడుతూంటే కొంత మంది అమాయకులు బలి అవుతారు. అది అత్యంత సహజం. అలా అవకపోతే పనులెలా అవుతై? జనాల్దేవుంది? ఇప్పటికే ఓ బిలియన్‌కి పైబడి ఉన్నాం. రోజుకి పది మంది పోతే మరో ముఫ్ఫై మంది పుట్టుకొస్తున్నారు కదా, అబ్బాయే కావాలంటూ అబార్షన్లు చేయించినా, కడుపుతో ఉన్న ఆడంగుల్ని చంపేసినా? దేశభక్తి గంజాయి ఎలానూ సమృద్ధిగా ఉంది అందరూ పీల్చడానికి.

ఈసరికి వెంకటరెడ్డి అల్లుడి ఆలోచనలు క్రమంగా రూపుదిద్దుకోవడం మొదలైంది. మొదటి విడతలో ఆ ఏడు వినాయక చవితికి గుడి ముందు పెద్ద పందిరి, మైకు సెట్టు పెట్టించారు. బుల్లి వినాయకుడికీ, ఆయన వాహనానికీ రంగులు, వెండి ఆభరణాలు, గోడకి సున్నం, గేటుకి, హుండీకి రంగులూ అన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. ఖర్చులకి జోబులు తడుముకోవాల్సిన అవసరం లేకపోయింది; బుల్లి వినాయకుడు ఇప్పుడు కోటీశ్వరుడు కాదు మరీ?


గణపతి నవరాత్రులైన మూడో రోజుకి రెడ్డిగారికి గుండెల్లో నెప్పి వచ్చింది. వెంఠనే ఆఘమేఘాల మీద హాస్పిటల్లో జేర్పించారు. ఊళ్ళోనే ఉన్న కార్డియాలజిస్టు వచ్చి చూడ్డం అయింది. ఒక నైట్రోగ్లిసరిన్ టాబ్లెట్ ఇచ్చి తర్వాత అన్ని టెస్టులూ చేయించి రెడ్డితో చెప్పేడు, “గుండెలో ఓ నాళం మూసుకుపోయింది. వెంఠనే ఓ స్టెంటు వేయించాలి.”

మరో పది రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటి కొచ్చాడు వెంకటరెడ్డి. ఇంతకు ముందు తిన్న ఆహారం ఇప్పుడు పనికిరాదు. పొద్దున్నే రెండు ఇడ్డెన్లు, మధ్యాహ్నం నూనె లేకుండా రెండు చపాతీలు, సాయంత్రం మళ్ళీ అలాంటిదే భోజనం అనబడే ఎండు గడ్డీను. కొబ్బరి పనికిరాదు, మసాలాలు తింటే ఇంక అంతే సంగతులు.

రెడ్డిగారికి ఒంట్లో బాగుపడితే గుడికి రంగులేయించి మహాభిషేకం చేయిస్తానని వాళ్ళావిడ వినాయకుడికి మొక్కుకుంది. రంగులు వేయించి ఆర్నెల్లు కాకుండా మళ్ళీ రంగులేస్తుంటే గుడి దగ్గిరే ఉన్న పంతులుగారు ఆశ్చర్యపోయేడు. అక్కడే రంగులేస్తున్న కుర్రాడితో మాటా మాటా కలిపితే తెల్సింది అసలు విషయం, రెడ్డిగారి మొక్కు గురించి. అసలు మొదట్లో గుడి కట్టించేటప్పుడు పదికీ, పరకకీ డబ్బులైపోతాయేమోనని చూసుకునే రెడ్డిగారు దీని మీద ఎంత ఖర్చుపెడుతున్నాడో చూసి పంతులుగారు ఆశ్చర్యపోయేడు. కూపీ లాగడానికి ప్రయత్నం చేస్తూ రంగేస్తున్న కుర్రాణ్ణి అడిగేడు,

“ఈ రంగులకెంతవుతుంది బాబూ?”

“తెలీదండి. మా మేస్త్రీ చూసుకుంటాడు అవన్నీ”

“అవున్లే. అంటే మామూలుగా. ఈమాత్రం గోడకు ఉరామరిగ్గా ఎంతో అని.”

“ఈ చిన్న విగ్రహానికి మహా అయితే అయిదారువేలు చాలండి. గుడి గోడలకి వెల్ల, అవీ మొత్తం పదిహేను, ఇరవై వేలల్లో చేసేయొచ్చు.”

రంగుల పనీ అదీ ఐపోయాక గుడి తలుపుకి వేసిన తాళం సరిచూసుకుని పంతులుగారు తన బ్రాహ్మణీకం చూసుకోవడానికి బండి స్టార్ట్ చేశాడు.


గుండె నెప్పి వచ్చినప్పుడల్లా ఎప్పటికప్పుడు కార్డియాలజిస్టు దగ్గిరకెళ్లడం ఆయనిచ్చే సలహా ప్రకారం ఓ నైట్రో గ్లిసరిన్ నాలిక్కింద పెట్టుకోవడం అలవాటైంది వెంకటరెడ్డికి. అలా వెళ్ళిన ఓ రోజున అడిగేడు కార్డియాలజిస్టుని.

“అప్పుడప్పుడు చిన్న చిన్న నెప్పులొస్తున్నాయి. దీనితోనే నేను పోతానంటారా?”

“అలా ఎందుకనుకుంటున్నారు? గుండెలో స్టెంటు వేశాం కదా? దానివల్ల బాగానే ఉంది. మరి మనసుకి ఏ కష్టం రాకుండా చూసుకోండి. మరీ నెప్పి వస్తే ఈ మందు నాలిక కింద ఉంచుకుని నాకు ఫోన్ చేయండి.”

“అసలు చావొచ్చేటప్పుడు ఎలా తెలుస్తుంది?”

“తట్టుకోలేని గుండె నెప్పి వస్తే ఛాతీ మీద ఏనుగు కూర్చున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత స్పృహ పోవచ్చు. అయినా అంతదాకా రాదనే ఆశిద్దాం.”

ఏనుగు మాట వినేసరికి ఒక్కసారి రెడ్డికి బుల్లి వినాయకుడు గుర్తొచ్చాడు ఎందుకో. కాసేపు డాక్టర్‌తో మాట్లాడి బయటకొచ్చేడు.


ఆ ఏడాది నవరాత్రుల తర్వాతి నుంచి వినాయకుడికి పూజలూ పునస్కారాలు ఎక్కువయ్యేయి. ఎప్పటిలాగానే కొత్త రంగులు, తాటాకు పందిళ్ళు, కొత్త కొత్త నైవేద్యాలు, స్పెషల్ మిఠాయిలు, మరింత తరచుగా వస్తున్నాయి. కొత్తగా మొదలైనది ఏవిటంటే వినాయకుడి పేరు మీద ఊర్లో స్కూల్లో వారానికోసారి కుర్రాళ్ళకి ఉచిత భోజనం.

ఓ రోజు పని మీద పంతులుగారు బేంకుకెళ్ళేడు. కౌంటర్ల వెనుకగా ఉన్న అసిస్టంటు మేనేజరు, తెలిసినవాడే, నవ్వి పలకరించేడు. పిలిచి ఎదురుగా కూర్చోమని చెప్పి, పంతులుగారి డీడీ మేనేజరు రూములోకి పంపించేడు. ఆమాటా ఈమాటా చెప్తూ నవ్వుతూ అన్నాడు.

“ఏం శాస్త్రిగారూ, వినాయకులవారు దర్జాగా ఉన్నారా?”

“అదేం అలా అడుగుతున్నారు?”

“లక్షల్లో ఖర్చు పెడుతున్నారుగా ఆయనకోసం, తక్కువేమీ కాలేదు కదా అని.”

“లక్షల్లోనా?”