పాకశాలలో పాణినీయం

“ఏమయ్యా! ఎవరయ్యా నువ్వు? ఎందుకంత దిగులుగా ఉన్నావు?”

అటు చూసిన వంటపెద్దకి మహాతేజశ్శాలియైన ఒక పురుషుడు కనిపించాడు. అమ్మో! మరో మునీంద్రుడా, వద్దులే! అనుకొన్నా, ఆ తేజశ్శాలిని చూసి ఏదో కొత్త ఆశ చిగురెత్తింది. ‘ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో. ఒకసారి ప్రయత్నిద్దాం,’ అనుకొన్నాడు స్వగతంగా.

“పాము కాదు. ఆదిశేషుడే దొరికాడనుకో. నీ సమస్య ఏమిటో చెప్పు నాయనా!” అన్నాడా మహాపురుషుడు చిరునవ్వుతో.

“నా మనసులో మాట కనిపెట్టేశారంటే తమరు సామాన్యులు కారు. ఎవరు స్వామీ తమరు?” భక్తితో అంజలించి అడిగాడు వంటలయ్య.

“నేను పతంజలిని. పాణిని వ్యాకరణానికి మహాభాష్యం వ్రాసినవాడను. నీ సమస్య ఏమిటో విన్నవించుకో. నేనేమైనా సహాయపడగలనేమో చూస్తాను.”

పాణిని పేరు వినగానే వంటపెద్ద ముఖం ప్రకాశించింది. “అవునండీ. ఆయనేనండీ నా సమస్య. బృహస్పతి మాట విని ఆయన సాయం కోరి వెళ్ళాను. ఆయనేవో చాలా క్లుప్తంగా చెప్పి ఊరుకున్నాడు. అవే బోధపడకుండా ఉన్నాయంటే, ఇంకో ఆయన వాటికి మరికొన్ని వాక్యాలు చేర్చారు. అంతా అయోమయం అయిపోయింది. విందులో ఎలా నెట్టుకురావాలో బొత్తిగా తెలియడం లేదండీ…” అంటూ తన గోడు వెళ్లబోసుకొన్నాడు.

“ఓహో, వరరుచిని కూడా కలిశావన్న మాట,” అన్నాడు పతంజలి ప్రసన్నంగా.

“కాదు స్వామీ. ఆ రెండో ఆయన పేరు ఇంకేదో… ఆఁ, గుర్తొచ్చింది. కాత్యాయనుడు, కాత్యాయనుడు!”

“వరరుచి కూడా ఆయన పేరేలేవయ్యా. ఇంతకీ ఆయన ఏం చెప్పారు?”

పాణిని చెప్పిన వాక్యాలు, వాటికి వరరుచి చేర్చిన వార్తికాలు గడగడమని ఒప్పజెప్పాడు వంటపెద్ద. పతంజలి దాన్ని ఒళ్లంతా చెవులై విన్నాడు.

“అర్థమయింది. విందులో మీ వాళ్ళు చేయవలసిన అతిథి మర్యాదలను సూత్రప్రాయంగా చెప్పారన్న మాట!”

“ఏం సూత్రమో, ఒక్క ముక్క బోధపడలేదు నాకు. ఈ మాటలని అనుసరించి ఇంద్రుడు చెప్పిన విధంగా అతిథి మర్యాదలు ఎలా చేయాలో నాకు అర్థంకావడంలేదు.”

“కంగారుపడకు. సూత్రాలు అలాగే ఉంటాయి. నేను వివరంగా నీకు అర్థమయ్యేలా చెబుతాను. అలా కూర్చో.”

ఆ ఆశ్వాసంతో కొండంత ధైర్యం వచ్చేసింది పాకశాలాధిపతికి. నింపాదిగా పతంజలి ఎదుట కూర్చొన్నాడు.

“చెప్పాల్సిందేదో సూటిగా చెప్పకుండా ఈ సూత్రాల గొడవేమిటి స్వామీ. ఇంతకీ ఇవి సూత్రాలని మీకెలా తెలిశాయి?”

“సూత్ర లక్షణాలను బట్టి.”

మహాభాష్యకారుడు గొంతు సవరించుకున్నాడు.

అల్పాక్షరమసందిగ్ధం, సారవద్విశ్వతోముఖం
అస్తోభమనవద్యంచ సూత్రం సూత్రవిదో విదుః

సూత్రానికి ఆరు లక్షణాలుండాలి:

అల్పాక్షరం – క్లుప్తంగా ఉండాలి
అసందిగ్దం – అందులో ఏమీ సందేహించడానికి లేకుండా స్పష్టంగా ఉండాలి
సారవత్ – అర్థవంతంగా, సమగ్రంగా ఉండాలి
విశ్వతోముఖం – అందరికీ, అన్ని చోట్లా వర్తించేదిగా ఉండాలి
అస్తోభం – నిరర్థకమైన శబ్దాలు లేకుండా ఉండాలి
అనవద్యం – దోషాలు లేకుండా ఉండాలి

ఈ ఆరు లక్షణాలు ఉన్న దానిని సూత్రమని సూత్రం గురించి తెలిసిన జ్ఞానులంటారు.”

శ్రద్ధగా విన్నాడు పాకశాలాధిపతి. “ఇంత విషయం ఉందన్న మాట ఆయన మాటల్లో. మరి ఆ కాత్యాయనుడు, సవరింపులని మరి కొన్ని సూత్రాలు చెప్పారే!”

“అవి సూత్రాల్లాంటివే కానీ సూత్రాలు కావు నాయనా. అవి వ్యాఖ్యలు. వార్తికాలంటారు వాటిని.”

“అవును స్వామీ, గుర్తొచ్చింది. వార్తికాలనే అన్నాడాయన. మరి వార్తికం అంటే ఏమిటో?”

వంటపెద్ద ఆసక్తికి మెచ్చుకోలు చూపు ఒకటి సారించి వివరణ కొనసాగించాడు పతంజలి.

ఉక్తానుక్త దురుక్తానాం చింతాయత్ర ప్రవర్తతే
తం గ్రంథం వార్తికం ప్రాహుర్వార్తికజ్ఞాః విచక్షణాః

అంటే సూత్రంలో – చెప్పవలసిన అవసరం లేకున్నా చెప్పబడిందీ, చెప్పవలసి ఉండీ చెప్పనిదీ, తప్పుగా చెప్పబడినదీ – ఈ మూడు విషయాలను గురించిన విచారం ఎక్కడ ఉంటుందో దాన్ని వార్తికం అంటారు.”

“అబ్బో! ఇంత వివరం ఉందన్న మాట వారి మాటల్లో. మరి సూత్రాలేమిటి ఇలా ఉన్నాయి? భీమునికి లడ్డూలంటాడు. విందు రాత్రి భోజనం అంటాడు. కారానికీ అంటాడు. రకరకాలుగా ఉన్నాయి.”

“నువ్వన్నది ఒకవిధంగా నిజమే! సూత్రాలన్నీ ఒక రకంగా ఉండవు. సూత్రాలు ఆరు రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క వివరాన్ని చెప్పడానికి ఒకొక్క రకం సూత్రం కావలసి వస్తుంది. విను – సంజ్ఞా సూత్రం, పరిభాషా సూత్రం, విధి సూత్రం, నియమ సూత్రం, అతిదేశ సూత్రం, అధికార సూత్రం అని సూత్రాలు ఆరు విధాలు…”

“అయ్యా! అయ్యా! మీకో పెద్ద నమస్కారం. ఈ సూత్రాల గొడవలన్నీ నాకెందుకులెండి. నాకు ఆయన ఏం చెప్పారో కాస్త అర్థమయ్యేలా వివరించండి చాలు!”

పతంజలి నవ్వి పాకశాలాధిపతికి అర్థమయ్యేలా సూత్ర వివరణ మొదలుపెట్టాడు.

“పాణిని చెప్పిన ఒక్కొక్క వాక్యాన్నీ ఎలా అర్థం చేసుకోవాలో చెపుతాను విను. పాండవుల వడ్డన గురించిన వాక్యం ఏది చెప్పు?”

“పాండవులకు తీపి వడ్డించాలి.” తొమ్మిదవ సూత్రాన్ని తడుముకోకుండా చెప్పాడు వంటపెద్ద.

“అంటే?”

“ఇదొక్కటి బాగా అర్థమయింది స్వామీ! పాండవులకు తీపి తినుబండారాలు వడ్డించమని.”

“తీపి తినుబండారాలు అంటే ఏవి? రసగుల్లాలు చెయ్యమని చెప్పాడా ఇంద్రుడు?”

“ఆహాఁ! లేదండోయ్. కురురాజులకి తెలుగు వంటకాలంటే ప్రత్యేకమైన ప్రీతి. వాటినే వండమని ఆదేశం.”

“ఆఁ, చూశావా మరి! కాబట్టి ఇక్కడ ‘తీపి’ అంటే ఏమిటో మనం ముందుగా నిర్వచించుకోవాలి. ఏదీ? రెండు, మూడు సూత్రాలను చెప్పు.”

“2. లడ్డూలు, అరిసెలు తీపి. 3. బూరెలూ.”

“అదీ. మీ వడ్డనకు సంబంధించి తీపి అంటే లడ్డూలు, అరిసెలు అన్న మాట.”

“మరి ‘బూరెలూ’ ఏమిటండీ?”

“అంటే బూరెలు కూడా తీపి అన్న వర్గంలోనికే వస్తాయని అర్థం.”

“ఆ మాట ఎక్కడుంది ఆయనన్న దానిలో?”

“అన్నీ ఆ సూత్రంలోనే ఉండవు. అక్కడ కనిపించని పదాలను దాని పై సూత్రంలోనుండో, క్రింది సూత్రంలోనుండో లేకపోతే మరెక్కడైనా ఉన్న సూత్రంలోనుండో తెచ్చుకొని కలిపి అర్థంచేసుకోవాలి.”

“ఇంత తిరకాసు ఎందుకు స్వామీ. బూరెలు కూడా తీపి వర్గంలోనివే అని స్పష్టంగానే చెప్పవచ్చు కదా?”

“అందుకే వరరుచి అక్కడ వార్తికం చెప్పాడు – బూరెలను కలిపే చెప్పి ఉండవచ్చు అని.”

“సరిగ్గానే చెప్పారు. వార్తికం అంటే అదన్నమాట!”

“అర్థమైందా? కాబట్టి ఇక్కడ తీపి అంటే ఒక రుచి అని కాకుండా లడ్డూలు, అరిసెలు, బూరెలకు ఒక ఉమ్మడి పేరుగా అర్థం చేసుకోవాలి. బయట ఉన్న అర్థం ఇక్కడ వర్తించదు.”

“ఓహో!” అన్నాడు వంటపెద్ద. చిక్కుముడులు కాస్త వదులవ్వడం మొదలుపెట్టాయి.

“దాన్ని డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ అంటారు.” పక్కనుండి ఎవరో వెళ్ళిపోతూ ఆగి మాట్లాడారు.

“అయ్యా, తమరెవరండీ?”

“నా పేరు డెనిస్ రిచీ. కంప్యూటర్ల కోసం ఒక కొత్త భాషను కనిపెట్టాను నేను. వాటి భాష కూడా యిలా సూత్రప్రాయంగానే ఉంటుంది.”

“ఈ కంప్యూటర్లేమిటి? భాషను కనిపెట్టడమేమిటి! అసలే గందరగోళంలో ఉన్నాను. ఇంకా కంగారు పెట్టకండి. అయ్యా, మీరు దయచేయండి! స్వామీ, తమరు కానీయండి.”

పతంజలి తిరిగి తన భాష్యాన్ని మొదలుపెట్టాడు.