గడి-నుడి-2 సమాధానాలు

వివరణలు – కొన్ని అవసరమైన ఆధారాలకి

అడ్డం

 1. కసరత్తు సరిపాళ్ళతో పిండి కలిపితే అమ్మవారి నైవేద్యం రెడీ! – “సరిపాళ్లు” అంటే “సరి” భాగాలు. “కసరత్తు” అన్న పదంలో “సరి” సంఖ్యలో ఉన్న అక్షరాలు “స” “త్తు”. వాటికి పిండి కలిపితే వచ్ఛేది “సత్తుపిండి”. ఇది బతుకమ్మ పండగలో అమ్మవారికి చేసే నైవేద్యాలతో ఒకటి.
 2. వేరే ప్రశంస సరే, తీసి చూడు లోపలికి మార్గం కనిపిస్తుంది. – “వేరే ప్రశంస” అన్నదగ్గర విడగొట్టి చదువుకోవాలి. “వేరే ప్రశంస” అన్న పాదంలో “సరే” అన్న అక్షరాలు తీస్తే మిగిలేది “వే”, “ప్ర”, “శం” అన్న అక్షరాలు. వాటితో వచ్చే లోపలి మార్గం “ప్రవేశం”.
 3. రావి విశాలాక్షి కట్టుకోవాలని కోరుకున్నది – ఇది నేరుగా ఉన్న ఆధారమే. రావిశాస్త్రిగారి కథ “జారీ అంచు తెల్లచీర”. అందులో పాత్ర పేరు విశాలాక్షి.
 4. ఈ గీతని మోయడమంటే గాయపడటమేనట! – విజయవిలాసం చదివిన వారికి (అది తాపీవారి వ్యాఖ్యానంలో), ఈ ఆధారం అర్థమవుతుంది! అందులో ఒక పద్యంలో చేమకూర కవి యిలా ప్రయోగించాడు:

  “కన్నె నగుమోము తోడం
  బున్నమ చందురుని సాటిఁ బోలుప వచ్చున్
  నెన్నెదురు తోడ మార్కొని
  మున్నందఱు జూడ రేకమోవక యున్నన్”

  ఇందులో “రేక మోయుడం” అంటే ఏమిటో చాలా కాలం మహామహా పండితులకి కూడా తెలియలేదు. తాపీ ధర్మారావుగారు తమ హృదయోల్లాస వ్యాఖ్యలో దీనికి గాయపడడం అనే అర్థాన్ని చెప్పారు. చంద్రుడు నాయిక నుదుటితో యుద్ధముచేసి గాయం పాలయ్యాడనీ, అదే చంద్రునిలోని మచ్చ అనీ కవి ఉత్ప్రేక్ష. ఈ వాడుక రాయలసీమ మాండలికంలో ఉందట.

 5. సోదరి సోదరుని సోదరుడు ఎవరో మా తానీషాగారికి తెలుసు – సోదరి సోదరుడు “అక్క” “అన్న” – “అక్కన్న”. అతని సోదరుడు “మాదన్న”. అక్కన్న మాదన్నలు తానిషాగారి కొలువులో పనిచేసినవారు.
 6. ఒక పురుగు విషం కూడా శుభమే – “శ్రీ” అంటే “సాలెపురుగు”, “విషం”, “శుభం” అనే అర్థాలున్నాయి.
 7. కింద క్యా హై? శిరసే హై! – హిందీలో “తలే” అంటే “కింద” అని అర్థం.
 8. పూర్వం మొదలు తుది ఒకటే – “మును” అనే పదానికి “పూర్వం”, “మొదలు”, “చివర” అనే అర్థాలున్నాయి.
 9. పోపుండే చోటు తెలియాలా? ఈ తోటకి పొల్లు చేరిస్తే సరి! – “పోప్” ఉండే చోటు “వాటికన్”. “వాటిక” అంటే తోట. “వాటికన్”, “వాటిక” రెంటినీ సరైన సమాధానాలుగా పరిగణించాము.
 10. ఇంటిపైన కమ్ముకొనే నల్లని చీకటిలో టీ తాగుదాం – “కప్పు” అనే పదానికి “ఇంటి పైన”, “కమ్ముకొను”, “నలుపు”, “చీకటి” అనే అర్థాలున్నాయి, మనందరికీ బాగా తెలిసిన “టి కప్పు” అనే అర్థం కాక!
 11. వద్దన్నా చిటపటలాడుతూ వస్తుంది – “చి! రాకు” (వద్దు) అన్నా వచ్చేది చిరాకు అది వస్తే చిటపటలాడడమే కదా! 🙂
 12. ఓపలేము మము ఆద్యంతమూ రక్షించు! – “ఓపలేము” అన్న పదంలో ఆది అంతాలను కలిపితే వచ్చేది “ఓము” – అంటే రక్షించు అని అర్థం.
 13. జారిన కల చుట్టూ వలపన్నడం పూర్తయిందా? – “జారిన కల” చుట్టూ అంటే మళ్ళీ మొదలు కోస – “జాల”. “జాల”, “జాలము” అంటే వాల.

నిలువు

 1. దీనర్థం త్రవ్వుచు అనుకునేరు! కాదు, కిందకి వచ్చుచు – దీనికి కొంతమంది “డిగుచు” అని సమాధానం ఇచ్చారు. దీని అర్థం కూడా కిందకి దిగడమే అయినా, “త్రవ్వుచు” అన్న పదం ఎక్కడా రాదు కదా. డిగ్ అంటే ఇంగ్లీషులో త్రవ్వు అని. అంచేత “డిగ్గుచు” అంటే త్రవ్వు అని అర్థం చేసుకొనే అవకాశం ఉంది. కాబట్టి “డిగ్గుచు” అనేది సరైన సమాధానం.
 2. తొందరగా ప్రవహించే నది – క్షిప్ర అంటే తొందరగా అనే అర్థం ఉంది. ఒక నది పేరు కూడా.
 3. ఇంకొక రూటే – వేరు అంటే ఇంగ్లీషులో “root”. వేరే అంటే “ఇంకొక” అని అర్థం కదా.
 4. 20 అడ్డంతో కలిసి మాయమైపోతున్న మనిషిని వెతకండి – 20 అడ్డం “శ్రీ”. “అందెశ్రీ” మంచి జానపద గాయకుడు, కవి. “మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడూ” అనే అతని పాట జనాదరణపొందింది.
 5. ప్రాలేయపథములో కరిగింది భూసురుని మనసు కాదు… – ప్రాలేయాపథం అంటే మంచుదారి. ఇక్కడ భూసురుడు ప్రసిద్ధుడే, ప్రవరుడు. అతని మనసు కరగలేదు, కరిగింది కాలికి రాసుకున్న లేపము. దీనికి కొందరు “లేపనం” అని జవాబిచ్చారు. “లేపనం” అనేది వ్యవహారంలో పదం, సరైన రూపం “లేపము”. పైగా “ప్రాలేయాపథము” అనే పదంలో ఉన్నది “లేపము”, “లేపనం” కాదు.
 6. సముద్రం సమగ్రంగా, ప్రథమావిభక్తితో సహా, తిరగబడింది – “కూలంకష” అంటే సముద్రం. వ్యవహారంలో “కూలంకషము” (“ము” అనేది ప్రథమా విభక్తి) అంటే “సమగ్రముగా” (చాలా లోతుగా) అనే అర్థం ఏర్పడింది.
 7. సాయంకాలం breakfast ఏమిటో అడుగుతారా? – సాయంకాలం చేసే ఉపవాస ముగింపు విందు ఇఫ్తార్. “సప్పర్”, “డిన్నర్” మొదలైన పదాలకి breaking the fast అనే అర్థం రాదు.