రెండు కవితలు

1​. ఎటులైనా ఇచటనే ఆగిపోనా

చిటారు కొమ్మకి
పారీ చూపు
ఈలలు ఊరీ
కోనకి కైపు

పడుచు సూరీడి
నీడల అల్లుడు
చీమ మీసాల
గుస గుస
బారెడు

కొమ్మ రెమ్మ
వంకర ఓలు
పురుగులు దున్ను
టింకర చాలు

మబ్బు బానలు
మోసుకు వచ్చి
చీకటి సబ్బును
ఒంటికి రుద్దే
సంజె గాలికి
సాగీ కాలు

నడిమి అడివి
కాటుక కాయి
మూత తెరచే
పాలపుంతలో
పేరీ ఊహ
సోలీ కన్ను.

2. ఇంటికొచ్చిన వర్షం


రంగారాయుడు
చెరువులో
వానకి తడుస్తున్న
తామర పూల​ని ​
ఒళ్ళు విదిల్చే
బాతుల్ని

గడ్డిలో
చినుకుల బరువుకు
వంగిన పూలని
అప్పుడే బయటికి
వచ్చి స్నానం చేస్తోన్న
వానపాముల్ని

చూస్తూ
రంగు చుక్కల
గొడుగు వేసుకున్నా
సగం వీపు తడిసేలా
జల్లు కొడుతోంటే

వచ్చావూ
ఇప్పటికి
ఇంటికి?

ఇదిగో
ఈ వేడి వేడి
దిబ్బ రొట్టి తిని
పక్కనే పొగలు
కక్కుతోన్న
అల్లం టీ
తాగు.

వాన హోరు
వినిపిస్తుందిలే
ఇంట్లోంచి

మెరుపులు
నల్ల చీరకి
​జరీ అంచులా ​
తార్రోడ్డుకి
అటూ ఇటూ పారే
​ఎర్ర ​
మట్టి నీళ్ళూ

పూల అంచుగా
​ఒకటొకటిగా
​జారి
ఇసకలో​​
తీరుబడిగా
కన్నాలు
​పెడుతోన్న
వాన చినుకులూ ​

చూడొచ్చులే
కిటికీలోంచి.