సమూలాంధ్రపుష్పబాణవిలాసము

ఏతస్మిన్ సహసా వసన్తసమయే ప్రాణేశ దేశాన్తరం
గన్తుం త్వం యతసే, తథాపి న భయం తాపాత్ ప్రపద్యేఽధునా|
యస్మాత్ కైరవసారసౌరభముషా సాకం సరోవాయునా
చాన్ద్రీ దిక్షు విజృమ్భతే రజనిషు స్వచ్ఛా మయూఖచ్ఛటా||

ఈ ననకారునం దెటకొ యేఁగఁగనెంతు వతర్కితంబుగా
నైనను ప్రాణనాథ! విరహాగ్నికి భీతిల నేను – చంద్రికా
నూనసుషీమయామినులు, నూతనకైరవగంధహర్తయై
పూని సరస్సుశైత్యమును పొందుగ వీఁచు సమీరుఁ డుండఁగన్.

సందర్భము: వసంతకాలము ప్రేయసీప్రియుల కుద్దీపనకరమైనది. అట్టి కాలమున ప్రియుడు దూరదేశమేగుటకు నిశ్చయించి నాడు. దానికంగీకరింపనిదైనను, అంగీకరించినట్లుగా నతని ప్రియురా లిట్లు పలుకుచున్నది.

అర్థము: ప్రాణేశ=ఓ ప్రాణనాథుడా! ఏతస్మిన్ వసన్తసమయే=ఈవసంతకాలములో, సహసా=ఆలోచనలేకుండ, త్వం=నీవు, దేశాన్తరం=అన్యదేశమునకు, గన్తుమ్=పోవుటకు, యతసే=యత్నించుచున్నావు. తథాపి=అట్లైనను, అధునా=ఇప్పుడు, తాపాత్=విరహతాపమువలన, భయం=దిగులును, న ప్రపద్యే=పొందను. యస్మాత్=ఎందుచేతననగా, రజనిషు=రాత్రు లందు, కైరవ=తెల్లగలువలయొక్క, సార=మేలైన, సౌరభముషా=సువాసనను దొంగిలించుచున్నట్టి, సరోవాయునా సాకం =కొలనిగాలితో గూడ, చాన్ద్రీ=చంద్రునిదైన, స్వచ్ఛా=నిర్మలమైన, మయూఖచ్ఛటా=కిరణములచాలు, దిక్షు=(అన్ని) దిక్కులందు, విజృమ్భతే=వ్యాపించుచున్నది.

తాత్పర్యము: నాయిక యనుచున్నది: ‘ఓ ప్రాణనాథ! నీవనాలోచితముగా విదేశమేగుటకు నిశ్చయించినావు. కాని యట్లు గల్గెడు విరహతాపమునకు నేనేమీ భయపడను. ఏలనన పండువెన్నెలతో చల్లనైన రాత్రులు, ఆరాత్రులందు సరస్సులందు విరిసిన తెల్లకలువల గంధమును హరించి వీచు చల్లని మరుత్తులు ఉండనే యున్నవి.’ లోకమునందు తప్తమైన వస్తువునకు శీతలవస్తువు తాకిన తాపవినిమయమువల్ల తప్తవస్తువు చల్లబడుట స్వాభావికము. చల్లని వెన్నెల, శీతలసురభిళమారుత ములు తాపోపశమనసమర్థములని, అందుచేత తనకు తాపభయము లేదని పైకి స్ఫురించు అర్థము. కాని అంతరార్థము దీనికి విపరీతమైనది.

విరహతాప మొక వింతతాపము. శీతలచంద్రికావాతములు దానిని అతిశయింపజేయునే కాని అల్పమొన రింపవు. అందుచేత ఆమె మాటల కంతరార్థ మిట్లున్నది – ‘ప్రాణేశ=ప్రాణనాథ’ అను సంబోధనముచే, నీకధీనమైన నాప్రాణ ములు నీవు పోవ నీతోనే వెడలిపోవును. అందుచేత నిన్ను విడిచి నేనుండలే ననుచున్నది. ‘అస్మిన్ వసంతే = ఈ ననకారులో’ అని ఎత్తుకొనుటవల్ల ఈవసంతం అన్ని విధముల ప్రేమికుల కుద్దీపనకరము, అది నీవు గణింపక ‘సహసా = అతర్కితంబుగా =అనాలోచితముగా’ పోవుటకు నిశ్చ యించితి వనుచున్నది. అన్యకార్యవ్యాసంగమున పగలు గడచినను, రాత్రు లొంటరిగ గడపుట దుర్భరమగును. నిండుపున్నమ రాత్రులు, ఆరాత్రులందు వీచు కైరవపరీమళభరితములైన శీతలవాతములు విరహ తాపము నధికము చేయును. అవి నీవు వెడలగనే విజృంభించి నా ప్రాణమునే తీసివేయును. ప్రాణముండినగదా తాపభయ ముండుట. అందుచేత నాకు తాపభయము లేదనుచున్నది. ప్రవాసవార్తాశ్రవణమాత్రము చేతనే విశ్లేషణాసౌఖ్యము ననుభ వించుచున్నది కనుక ఈనాయిక ప్రవత్స్యత్పతిక. ఆక్షేపము, విశేషోక్తి, కావ్యలింగము లలంకారములు.

చక్షుర్జాడ్యమపైతు, మానిని ముఖం సందర్శయ, శ్రోత్రయోః
పీయూషస్రుతిసౌఖ్యమస్తు మధురాం వాచం ప్రియే వ్యాహర|
తాపః శామ్యతు, మే ప్రసాదశిశిరాం దృష్టిం శనైః పాతయ,
త్యక్త్వా దీర్ఘ మభూతపూర్వ మచిరా ద్రోషం సఖీ దోషజమ్||

కన్నులజాడ్యముం దొలఁగఁ గాంచుము మానిని, వక్త్రపద్మమున్
నన్నరయంగనిమ్ము, శ్రవణామృతమై తగు నీదుభాషలన్
నన్నలరంగనిమ్ము, కరుణన్ సఖులాడిన కొండెము ల్మదిం
గ్రన్నన విస్మరించి, నను గాంచుము చల్లని ప్రేమదృష్టులన్.

సందర్భము: చెలికత్తెల మాటలు విని తనయం దనాదరము వహించిన నాయికను ప్రియు డిట్లు ప్రసన్నురాలిని జేసికొన పల్కుచున్నాడు.

అర్థము: మానిని= ఓ మానవతురాలా (సాభిప్రాయసంబోధన. నాయెడ నిష్కారణముగా మానమును వహించితివని అంత రార్థము), సఖీ దోషజమ్=చెలులయొక్క దోషముచే కలిగిన (అనగా వారు నీకు జేసిన చెడుబోధనలచే జనించిన), అభూత పూర్వం=మున్నెన్నడును లేని, దీర్ఘం=చాల సేపున్నట్టి, రోషం=కోపమును, అచిరాత్=త్వరగా (వెంటనే), త్యక్త్వా=విడిచి, ముఖం=(నీ)ముఖమును, సందర్శయ=చూపుము, చక్షుర్జాడ్యమ్=(అట్లు నాయొక్క) కన్నుల మాంద్యము, అపైతు=తొల గును గాక (నిన్ను బోలగలేని ఇతరకాంతలను జూచుటచేత నా కన్నులకు జాడ్యము పట్టినది. నీసుందరముఖమును జూపి దానిని తొలగింపు మనుట), ప్రియే =ఓ ప్రియురాలా! మధురాం వాచం వ్యాహర=తీయని మాటలాడుము, మే=(అట్లు) నాయొక్క, శ్రోత్రయోః = చెవులకు, పీయూషస్రుతిసౌఖ్యమ్=అమృతధారవలన కలుగు సుఖము, అస్తు=కలుగునుగాక (భావమునందును, స్వనమునందును అమృతమువలె మధురమైన మాటలను పలికి నా చెవులకు విందొనరింపు మనుట), ప్రసాద=అనుగ్రహముచే, శిశిరాం= చల్లని, దృష్టిం= చూపులను, శనైః =మెల్లగా, పాతయ=ప్రసరింపుము, మే=నాయొక్క, తాపః=సంతాపము, శామ్యతు= శమించును గాక (నీ యాగ్రహముచే గల్గిన క్లేశమే తాపము. దానిని బాపుటకు నీ చల్లని దృష్టు లనగా నీయనుగ్రహదృష్టులే సమర్థము లనుట.)

తాత్పర్యము: ఓ ప్రియురాలా! చెలికత్తెలు చెప్పిన కొండెములచేత మున్నెన్నడు లేని దీర్ఘమైన కోపమును నాపై బూనినావు. నీ మానమును వీడి నీముఖదర్శనభాగ్యము ననుగ్రహించి నా చక్షుర్జాడ్యమును బాపుము. నీ మధురాలాపములచే నా చెవుల కింపును గూర్చుము. నీ చల్లని దృష్టులను సత్వరమే నాపై బఱపి నా తాపము నపనయింపుము. నాయిక ఖండిత. చెలికత్తెల మాటలు నిజమైనచో నాయకుడు ధృష్టుడు, కాకున్నచో ననుకూలుడు. మానవిప్రలంభశృంగారము. కావ్యలింగ, నిదర్శన, పరికరాలంకారములు.

మానమ్లానమనా మనాగపి నతం నాలోకతే వల్లభం
నిర్యాతే దయితే నిరన్తర మియం బాలా పరం తప్యతే|
ఆనీతే రమణే బలాత్ పరిజనై ర్మౌనం సమాలమ్బతే
ధత్తే కణ్ఠగతానసూన్ ప్రియతమే నిర్గన్తుకామే పునః||

మానమ్లానమనంబుచేఁ గనదు ప్రేమాలాపియౌ నాథునిన్
దీనం జెల్లదటంచు నాతఁ డరుగన్ దీనాత్మయై కుందెడిన్
వానిం బల్మిని దేఁగఁ జేటి మగుడన్ వా విప్ప దీబాల, అ
య్యో నాథుం డపు డేగనెంచ గళమందూన్చు న్నిజప్రాణముల్.

సందర్భము: పొలయల్కచే ప్రియుడు చెంత నున్నపుడు మానమును, అతడు చెంత లేనపుడు తాపమును వహించుచున్న కలహాంతరితావర్ణనము.

అర్థము: మాన=అలుకచేత, మ్లాన=వాడిపోయిన, మనాః=మనస్సుగలదగు (మ్లాన అనుటవల్ల మనస్సు పూవువంటిదని, కోపముచే నది వాడుచున్నదని విశేషార్థము), ఇయం బాలా=ఈ చిన్నారి (అజ్ఞానము చేతనే ఇట్లు చేయుచున్న దనుట ‘బాలా’ శబ్దప్రయోగమునకు ప్రయోజనము), నతం=(తప్పిదము క్షమించుమని) మ్రొక్కిన, వల్లభం=ప్రియుని, నాలోకతే = చూడదు; నిర్యాతే దయితే=ప్రియుడు వెడలిపోగా, నిరన్తరం=ఎడతెగకుండ, పరం=మిక్కిలి, తప్యతే=సంతాపము నొందును; పరిజనైః=చెలికత్తెలచేత, బలాత్=బలవంతముగా, ఆనీతే=(తిరిగి)కొనిరాబడిన, రమణే=ప్రియునియందు, మౌనం=(అతనితో మాటాడక) మౌనమును, సమాలమ్బతే=పూనును; పునః=మఱల, ప్రియతమే నిర్గన్తుకామే (సతి)= ప్రియుడు వెడల నుద్యుక్తుడు కాగా, కణ్ఠగతానసూన్= కంఠగతప్రాణములను, ధత్తే=ధరించియున్నది (మరణించు నప్పుడు ప్రాణములు చివరకు కంఠమునుండి పోవును గనుక, మరణింప నుద్యుక్తురాలగుచున్న దనుట). మానవిప్రలంభశృంగారము. నాయిక మధ్యాధీరా, కలహాంతరితయు. నాయకుడు ధృష్టుడు. కారకదీపకాలంకారము.

కర్ణారున్తుద మేవ కోకిలరుతం తస్యాః శ్రుతే భాషితే
చన్ద్రే లోకరుచి స్తదాననరుచేః ప్రాగేవ సందర్శనాత్|
చక్షుర్మీలనమేవ తన్నయనయో రగ్రే మృగీణాం వరం
హైమీవల్ల్యపి తావదేవ లలితా యావన్న సా లక్ష్యతే||

ఆచెలి పల్కు కర్ణముల నంటిన కోయిలపాట రూక్షమౌ,
ఆచెలి వక్త్రముం గనని యప్పుడె యింపగు నిందునందమున్,
ఆచెలి కంటిముందు హరిణావళి కొప్పగు నక్షిమీలనం
బాచెలి మైజిగిం గనని యప్పుడె సొంపగు హేమవల్లియున్.

సందర్భము: ఒకానొక సుందరాంగిని గని ఆమెయం దాసక్తుడైన నాయకుడు చెలికానితో ఆమె మంజిమను వర్ణించుచున్నాడు.

అర్థము: తస్యాః=ఆ జవరాలియొక్క, భాషితే=మాటలను, శ్రుతే=వినగా, కోకిలరుతం=పికకూజితము, కర్ణ=చెవులకు, అరున్తుద మేవ=బాధ గలిగించునదియే, భవతి=అగును – ఆజవరాలి కంఠధ్వని కోకిల కూజితమునకన్న శ్రావ్యముగా నున్న దనుట. ‘అరుంతుదస్తు మర్మస్పృక్’ అని అమరము. అనగా మర్మభేదనమొనరించు బాధకు ‘అరుంతుద’ మని పేరు. అందుచేత, ఆమె మాటలు విన్న తర్వాత కోకిలపాట చెవులకు మహాపాయకరమే యగునని ‘అరున్తుదమేవ’ అను శబ్దమునకు విశేషార్థము. చన్ద్రే=చంద్రునియందు, లోకరుచి=జనులయొక్క కోరిక, తదాననరుచేః=ఆమె ముఖకాంతియొక్క, సందర్శనాత్= దర్శనమునకంటె, ప్రాగేవ=పూర్వమే, వర్తతే=ఉన్నది – ఆకాంతముఖము చంద్రునికంటె అందముగా నున్నదనుట. అనగా ఆమె ముఖమును జూచిన వెనుక చంద్రుని జూచినచో జుగుప్సాకరముగనే యుండుననియు, అట్టి చంద్రుని జూడ జను లిచ్చ గింపరనియు భావము. తన్నయనయోః అగ్రే=ఆమెకన్నుల ముందట, మృగీణాం =హరిణములకు, చక్షుర్మీలనమేవ =కన్నులు మూసికొను టయే, వరం=శ్రేష్ఠమైనది, తగినది – ఆమె కన్నులు లేడికన్నులకన్న సుందరముగా నున్న వనుట. ఆమె యెదుట కన్నులు మూసికొని నిల్చినచో, లేళ్ల కామె కన్నులతో తమకన్నులను పోల్చుకొని అవమానపడుట తప్పునని భావము. యావత్=ఎంతవఱకు, సా=ఆమె, న లక్ష్యతే=చూడబడదో, తావదేవ=అంతవఱకే, హైమీవల్ల్యపి=బంగారుతీగెయు, లలితా =సుందరమైనదిగా, లక్ష్యతే=చూడబడుచున్నది – ఆమె పచ్చని శరీరము బంగారుతీగకంటె సొగసుగా నున్నదనుట. హైమీ వల్ల్యపి=బంగారుతీగెయు ననుటచే, బంగారుతీగెయే సరిగాకున్న నిక వేఱే తీగల ప్రసక్తియే పొసగదను భావము దోచు చున్నది.

తాత్పర్యము: ఆ సుకుమారి శరీరము బంగరుతీగకంటె సొగసుగా నున్నదనియు, ఆమె కంఠధ్వని కోకిలకూజితమునకంటె మధురముగా నున్నదనియు, ఆమె చూపులు లేడిచూపులకంటె మనోజ్ఞముగా నున్నవనియు, ఆమె ముఖము చంద్రునికంటె సుందరముగా నున్నదనియు భావము. భావము సామాన్యముగా నున్నను, ఉపమానోపమేయములను పోల్చి చెప్పుటలో నొక క్రొత్తదనము పైశ్లోకములో నుండుట గమనింపదగును. నాయిక పరకీయ. అయోగవిప్రలంభశృంగారము. వ్యతిరేకము, అప్రస్తుతప్రశంస, సంబంధాతిశయోక్తు లలంకారములు.