సమూలాంధ్రపుష్పబాణవిలాసము

గూఢాలిఙ్గన గణ్డచుమ్బన కుచస్పర్శాది లీలాయితం
సర్వం విస్మృతమేవ విస్తృతవతో బాలే ఖలేభ్యో భయాత్|
సల్లాపోస్త్వధునా సుదుర్ఘటతమ స్తత్రాపి నాతివ్యథా
యత్ త్వద్దర్శన మప్యభూదసులభం తేనైవ దూయే భృశమ్||

మఱచితి లోకభీతిమెయి మాటుగఁ గూడిన కౌఁగిలింతలున్,
వరకుచసంగ్రహంబులును, వాగ్దలచుంబనలీలలెల్ల, నీ
సరసపుబల్కులు న్వినెడు సౌఖ్యముఁ బాసితి, వీనికోర్చినం
దరమిడి కాల్చు బాల! త్వదదర్శనదుఃఖమె నన్నజస్రమున్.

సందర్భము: మున్నొక నాయకునితో రహస్యముగా నెరపిన ఆలింగనాదివిలాసక్రీడలు బయల్పడగా లోకభీతిచే నాయిక యాతనితో మాటాడుటయే మానివైచినది. పైగా నిప్పు డామె దర్శనమే కరవైనది. ఇట్టి నాయిక హఠాత్తుగా నొకసారి కన్పడగా నాయకు డామెతో దన వేదనను దెల్పుకొనుచున్నాడు.

అర్థము: బాలే=ఓ ముద్దరాలా! (చిన్నదానా!), ఖలేభ్యో భయాత్= ఖలులైన ఇతరుల భయముచేత (లోకభీతిచేత), విస్తృతవతః=అధికమైన, గూఢాలిఙ్గన గణ్డచుమ్బన కుచస్పర్శాది లీలాయితం= రహస్యముగా (మునుపు) నెరపిన ఆలింగనములు, ముఖచుంబనములు, స్తనగ్రహణములు మొదలుగా గల విలాసవర్తనములు, సర్వం=అన్నియు, విస్మృత మేవ=మఱవనేబడినవి. అధునా=ఇప్పుడు, సల్లాపః=వేడుకమాటలాడుట (కూడ), సుదుర్ఘటతమః= పొసగకున్నది. అస్తు=కానిమ్ము, తత్రాపి=అట్లైనను, నాతివ్యథా=ఎక్కువ బాధ లేదు. కిన్తు=కాని, త్వద్దర్శనమపి= నీ దర్శనము కూడ, అసులభం =కష్టతరము, అభూత్=అయ్యెననునది, ఇతి యత్=ఏదిగలదో, తేనైవ=దానివలననే, భృశమ్=మిక్కిలి, దూయే=దురపిల్లుచున్నాను.

తాత్పర్యము: సులభము. ‘బాలే’ యనుటచేత నీవప్రగల్భవగుటచేత లోకమునకు వెఱచినావు. బాలవు కానిచో నట్లు చేసెడి దానవు గావను అర్థము స్ఫురించుచున్నది. నాయిక పరకీయ. నాయకుని మాటలను బట్టి అత డనుకూలుడుగా దోచు చున్నాడు. విరహవిప్రలంభశృంగారము. దైన్య మను సంచారీభావము. అప్రస్తుతప్రశంస, విశేషోక్తి, పరికరాలంకారములు.

యా చన్ద్రస్యకళఙ్కినో జనయతి స్మేరాననేన త్రపాం
వాచా మన్దిరకీరసున్దరగిరో యా సర్వదా నిన్దతి|
నిశ్వాసేన తిరస్కరోతి కమలామోదాన్వితాన్యాఽనిలాన్
సా తైరేవ రహస్త్వయా విరహితా కాఞ్చిద్దశాం నీయతే||

ఏచెలి స్మేరవక్త్ర మొనరించు శశాంకుఁ ద్రపాకళంకునిన్,
ఏచెలి పల్కులుం దెగడు నింటిశుకంబుల వాఙ్మనోజ్ఞతన్,
ఏచెలి యూర్పుతావి వణఁకించు సరోజసుగంధిలానిలున్,
ఆచెలి గుందు నేకతమ ఆర్య! భవద్విరహార్తితప్తయై.

సందర్భము: కార్యవశమున రాక విలంబము చేయుచున్న నాయకుని కడకు నాయిక పంపిన దూతిక పోయి, అతనికి నాయికావిరహావస్థ నిట్లు వర్ణించుచున్నది.

అర్థము: యా=ఏ నాయిక, స్మేరాననేన=నగుమోముతో, కళఙ్కినః=నలుపుగల్గిన, చన్ద్రస్య=చంద్రునికి, త్రపాం=సిగ్గును, జనయతి=కూర్చునో, యా=ఏ నాయిక, వాచాం=మాటల (మాధుర్యము)చేత, సర్వదా=ఎల్లప్పుడు, మన్దిరకీరసున్దరగిరః =ఇంటి (పెంపుడు) చిలుకయొక్క సుందరమైన పలుకులను, నిన్దతి=నిందించునో, యా=ఏ నాయిక, నిశ్వాసేన=(సువాసన గల) ఊర్పుగాలులచే, కమలామోదాన్వితాని=తామరపూలవాసనతో గూడిన, ఆనిలాన్=వాయువులను, తిరస్కరోతి= నిరసించునో, సా=ఆ నాయిక, త్వయా=నీచేత, విరహితా=లేనిదై, రహః=ఏకాంతమునందు, కాఞ్చిద్దశాం=ఒకానొక యవస్థను, తైరేవ=నీచేతనే, నీయతే=పొందింపబడుచున్నది.

తాత్పర్యము: ఓ నాయకుడా! ఏ నాయిక తన నగుమోముతో కళంకితుడైన చంద్రుని త్రపాన్వితుని జేసెడిదో, ఏ నాయిక వాఙ్మధురిమచేత పెంపుడుచిల్కల పలుకుల నిందించెడిదో, ఏనాయిక నిశ్వసనపరిమళముచే కమలగంధకలితానిలుని నిరసించెడిదో, ఆ నాయిక నీవు లేని కారణమున అమితమైన విరహావస్థ పాలైనది. అనగా స్మేరాననము శోకాననము, సుధాలాపములు విలాపములు, సురభిళనిశ్వాసములు కవోష్ణనిశ్వాసములుగా మారి యామె విరహావస్థ ననుభవించు చున్నది. ఆమెను ప్రసన్నురాలిని జేయ నీవు సత్వరమే రావలసినది. వస్తుతః విరహలక్షణము లిట్లున్నను, వానిని చెప్పక, ‘కాఞ్చిద్దశాం నీయతే’ అనుటవల్ల, విరహావస్థ చెప్పనలవిగానిదని చెప్పినట్లైనది. ఇచ్చట ‘మన్దిరకీర’మను పదము సాభిప్రాయపదము. దీనివలన ఇంటనున్న పెంపుడుచిల్కలు మానవభాషలు నేర్చుకొనుటచే అడవిచిల్కలకంటె మధుర ముగా మాటాడుననియు, అట్టి మాటలకంటె ఆమె మాటలు మధురము లైనవి – అను విశేషార్థము స్ఫురించును. ‘కాఞ్చిద్దశాం=ఒకానొక యవస్థను, తైరేవ=నీచేతనే, నీయతే=పొందింపబడుచున్నది’ – అని చెప్పుటవల్ల ‘ఆమె నీయందు మాత్రమే ఆసక్తురాలైనందున, నీవిరహమే ఇట్టి అవస్థకు మూలమైనది. దీనిని దీర్పగ కేవలము నీవే సమర్థుడ’ వను భావము దోచుచున్నది. నాయిక స్వీయామధ్యా, విరహోత్కంఠితయును. విప్రలంభశృంగారము.

తన్వీ సా యది గాయతి శ్రుతికటు ర్వీణాధ్వని ర్జాయతే
యద్యావిష్కురుతే స్మితాని మలినై వాలక్ష్యతే చన్ద్రికా|
ఆస్తే మ్లాన మివోత్పలం నవమపి స్యాచ్చేత్ పురో నేత్రయో
స్తస్యాః శ్రీ రవలోక్యతే యది తటిద్వల్లీ వివర్ణైవ సా||

వీణియరాగమెల్లఁ గటువే యగు నాచెలిపాట విన్నచోన్,
కానఁగనౌను నల్లనయి కౌముది కాంత స్మితంబుఁ గన్నచోన్,
మ్లానమె యౌను క్రొంగలువ మానిని యక్షిసమక్షమందునన్,
పూను వివర్ణతన్ మెఱుపు పొల్తుక మైజిగిఁ గాంచవచ్చినన్.

సందర్భము: ఒకానొక విలాసిని సౌరును నాయకుడు చెలికానికి వర్ణించుచున్నాడు.

అర్థము: సా = ఆ (నేను గాంచిన), తన్వీ=నాజూకు శరీరముగల స్త్రీ, గాయతి యది =పాడినచో, వీణాధ్వని=వీణానాదము, శ్రుతికటుః=కర్ణకఠోరముగ, జాయతే=అగును – వీణారవమునకంటె ఆజవరాలి పాట శ్రావ్యముగా నున్నదనుట. స్మితాని=చిఱునగవులను, ఆవిష్కురుతే యది=విరియించెనేని, చన్ద్రికా=వెన్నెల, మలినైవ=నల్లదిగానే, లక్ష్యతే=చూడ బడును – ఆమె చిఱునగవులు తెలివెన్నెలకన్న స్వచ్ఛముగా, మనోహరముగా నున్నవనుట. నేత్రయోః పురః=(ఆమె)కన్నుల యెదుట, స్యాత్ చేత్=ఉండెనేని, నవమపి=క్రొత్తదైనను (అప్పుడే వికసించినదైనను), ఉత్పలం= కలువ, మ్లానమివ=వాడినదిగనే, ఆస్తే=ఉన్నది – ఆమె కన్నుల యందము అప్పుడే వికసించిన కలువలకన్న మిన్నగా నున్న దనుట. తస్యాః=ఆజవరాలియొక్క, శ్రీః=తనుకాంతిని, అవలోక్యతే యది=చూడబడినచో, సా తటిద్వల్లీ=ఆ మెఱుపుదీగె, వివర్ణైవ= తెల్లపాఱినదే (పాలిపోయినదే) యగును – ఆజవరాలి తనుకాంతి మెఱుపుదీగను మించి యున్నదనుట.

తాత్పర్యము: నాజూకుగా నున్న ఆ జవరాలియొక్క గానము వీణాధ్వనికంటె శ్రావ్యముగ నున్నదనియు, చిఱునగవు వెన్నెలకంటె స్వచ్ఛముగను, మనోహరముగను ఉన్నదనియు, కన్నులు అప్పుడే వికసించి కళకళలాడుచున్న కలువలకంటె సుందరముగా నున్నవనియు, తనుకాంతి మెఱుపుదీగకంటె ప్రకాశవంతముగ నున్నదనియు భావము. నాయిక పరకీయ. ఆమె అందచందములే ఉద్దీపనవిభావములు. వానివలన జనించిన ప్రథమానురాగావస్థ ఇందు వర్ణితము. సంబంధాతిశయోక్తియు, అప్రస్తుతప్రశంసయు అలంకారములు.

సత్యం తద్యదవోచథా మమ మహాన్ రాగ స్త్వదీయాదితి
త్వం ప్రాప్తోఽసి విభాత ఏవ సదనం మాం ద్రష్టుకామో యతః|
రాగం కించ బిభర్షి నాథ హృదయే కాశ్మీరపత్త్రోదితం
నేత్రే జాగరజం లలాటఫలకే లాక్షారసాపాదితమ్||

నీయనురక్తికన్నను గణింపఁగ నాయనురక్తి మిన్న యం
చేయది పల్కితో యదియె యిప్డు నిజంబయె నాథ! వేకువం
బాయక వచ్చితీ వురముపై వరపత్త్రకరాగమున్, సుయా
వాయతరాగము న్నుదుట, నక్షుల జాగరరాగమూనుచున్.

సందర్భము: నాయకుడు రాత్రి అన్యకాంతతో గడిపి, వేకువన తనకాంత కడకు వచ్చినాడు. అతని తనువందు పరకాంతా రతిచిహ్నములు స్పష్టముగా నున్నవి. వానిని జూచి, వ్యాజస్తుతితో ఆనాయిక ప్రియు నిట్లు ఉపాలంభించుచున్నది.

అర్థము: నాథ=ప్రియుడా! త్వదీయాత్=నీకంటె, మమ రాగః మహాన్ ఇతి= నా రాగము అధికమైనదని, యత్=ఏది, అవోచథాః= పలికితివో, తత్=అది, సత్యం=సత్యమే; యతః=ఎందుచేత ననగా, మాం=నన్ను, ద్రష్టుకామః =చూడగోరిన వాడవై, త్వం=నీవు, విభాత ఏవ = పెందలకడనే (రాత్రి రాలేదనుట), ప్రాప్తోఽసి=వచ్చితివి; కించ=మఱియు, హృదయే= ఎదయందు, కాశ్మీరపత్త్రోదితం= కుంకుమపత్త్రభంగజనితమైనట్టిదియు, నేత్రే జాగరజం= కనులయందు జాగరణచే గల్గి నదియు, లలాటఫలకే=పలకవంటి నొసటియందు, లాక్షారసాపాదితం= లాక్షారసముచే గల్గినదియు నగు, రాగం=రాగ మును , బిభర్షి=ధరించియున్నావు.

తాత్పర్యము: ‘ఓ నాయకుడా! నాకు మనసులో మాత్రమే నీపై రాగమున్నది. మఱి నీకో శరీరమందంతటను రాగమున్నది. నీయెదలో కశ్మీరపత్ర రాగ మున్నది; కనులలో జాగరణరాగ మున్నది; నొసటిపై లాక్షారసరాగ మున్నది. నాపై ఎంత మక్కువయో, నాకడకు పెందలకడనే వచ్చితివి (రాత్రి రాలేదనుట). నీవు వచించినట్లు నాకు నీయందు గల రాగమునకంటె నీకు నాయందు గల రాగ మధికమైన దనుటలో అసత్య మింతయు లేదు. ఇచ్చట రాగ మనగా అనురాగమనియు, ఎఱ్ఱదన మనియు గ్రహింపవలెను. ‘నాకు మనసులో మాత్రమే రాగమనగా అనురాగ మున్నది. నీకో శరీర మంతటను రాగము (అన్య కాంతాసంభోగచిహ్నమైన ఎఱ్ఱదనము) ఉన్నది గాని మనసులో మాత్రము లేదు’ అని వ్యాజస్తుతిచే నాయిక నాయకుని ఉపాలంభించుచున్నది. ‘లలాటఫలకే లాక్షారసాపాదితం రాగం’ అనుటవల్ల, ‘పరకాంతపాదములపై బడుటచేత నీ నొసటియందు లత్తుకగుర్తులు పడినవి. ప్రియురాలనగు నన్ను విస్మరించి బెట్టు సేసెడు పరకాంత పాదముల బడితివి.నీ కర్మ మేమనవలెను!’ అను అర్థము స్ఫురించుచున్నది. నాయిక ఖండితా, మధ్యా, ధీరాధీర. నాయకుడు ధృష్టుడు. ఈర్ష్యమానవిప్రలంభశృంగారము. కావ్యలింగ, వ్యాజస్తుతు లలంకారములు.