సమూలాంధ్రపుష్పబాణవిలాసము

సాస్రే మాకురు లోచనే విగళతి న్యస్తం శలాకాఞ్జనం
తీవ్రం నిశ్వసితం నివర్తయ నవా స్తామ్యన్తి కంఠస్రజః|
తల్పే మాలుఠ కోమలాంగి!తనుతాం హన్తాఙ్గరాగోఽశ్నుతే
నాతీతో దయితోపయానసమయో మాస్మాన్యథా మన్యథాః||

కాటుక యంతయుం జెదరు కన్నుల నశ్రులు నింపకమ్మ, ప
ల్మాటులు నూర్చకమ్మ గళమాలలు మ్లానము లౌను, పల్చనై
పాటిలు నంగరాగ మటు పాన్పునఁ బొర్లకుమమ్మ, ఇంకనుం
దాటఁగలేదు వేళయును, తాళుము నాథుఁడు వచ్చునంతకున్.

సందర్భము: నాయకుడు చేరవత్తు ననగా నొక నాయిక గృహమును, తనను, శయ్యను చక్కగా నలంకరించుకొనినది. ఇట్లామె వాసకసజ్జయై ప్రియునికై వేచినది. కాని అతడెంతకును రాలేదు. అప్పుడామె కధికసంతాపము, కలవరము కలిగినది. తత్ఫలముగా అశ్రునయనయై, నిట్టూర్పులను నిగిడించుచు తల్పమునఁ బొరలసాగినది. ఇట్లు విరహోత్కంఠితయైన యామెను వారించుచు చెలికత్తె నామె నూరడించినది.

అర్థము: కోమలాంగి= ఓ సుకుమారీ ! లోచనే సాస్రే మాకురు= కన్నులలో కన్నీరు నింపకుము, న్యస్తం =పెట్టఁబడిన, శలాకాఞ్జనం=పులకతో (నాజూకుగా) దీర్చిన కాటుక, విగళతి= కరగిపోవుచున్నది; తీవ్రం= అధికమైన, నిశ్వసితం= నిట్టూర్పును, నివర్తయ=మఱలింపుము (వీడుము), నవాః =క్రొత్తనైన (తాజాగా మిసమిసలాడుచున్న), కంఠస్రజః= మెడలోని పూదండలు, తామ్యన్తి=వాడిపోవుచున్నవి; తల్పే=పాన్పునందు, మా లుఠ=పొరలకుము, హన్త=అయ్యో, అఙ్గరాగః= మైపూత (makeup), తనుతాం=పలుచదనమును; అశ్నుతే=పొందుచున్నది; దయితోపయానసమయః= ప్రియాగమన వేళ, న అతీతః= (ఇంకను) మీఱి పోలేదు, అన్యథా=వేఱువిధముగా (అనగా అతడింకొక కాంతతో గడపుచు రాలేదనునటు వంటి తలపులు) , మాస్మ మన్యథాః =తలంపకుము.

తాత్పర్యము: ఓ కోమలాంగీ! ప్రియుడు వేళకు రాలేదను విచారమును వీడుము. అలంకారములను మాపుకొనక అతనికై వేచియుండుము. అత డితరకాంతలతో గూడియుండి రాలేదేమో యనునటువంటి అన్యథావిచారములను మానుము. అతడు తప్పక వచ్చును. ఓపిక వహింపుము. నాయిక విరహోత్కంఠిత. విరహవిప్రలంభశృంగారము. ఔత్సుక్య మను సంచారి భావము. ‘కోమలాంగి’ యనుటచే నామె కించిద్విరహతాపము నైన ఓర్చుకొనలేని సుకుమారి యని స్ఫురించుచున్నది. కావ్యలింగము, పరికరము లలంకారములు.

కాచిత్ సర్వజనీనవిభ్రమపరా మధ్యే సఖీమణ్డలం
లోలాక్షిభ్రువసంజ్ఞయా విదధతీ దూత్యా సహా భాషణమ్|
అక్ష్ణో రఞ్జన మఞ్జసా శశిముఖీ విన్యస్య వక్షోజయోః
స్థూలంభావుకయోః స్థితం మణిసరం చేలాఞ్చలేన ప్యధాత్||

అనుపమవిభ్రమప్రథితయైన యొకానొక బోటి చేటికా
జనతతి మధ్య నుండి కనుసన్నలఁ బల్కుచు నాథుదూతితోఁ
గనులను గాటుకం ఝటితి గాటముగాఁ గయిసేసి, ఉన్నత
స్తనముల రత్నహారమును సాంతము గప్పును పైఁటకొంగుతోన్.

సందర్భము: చెలులనడుమ నున్న నాయిక, నాయకుని దూతికకు గూఢముగ సంకేతకాలమును దెలుపుటకై చేయు చేష్టల నీశ్లోకము వర్ణించుచున్నది.

అర్థము: సర్వజనీన=ఎల్లరకు హితమైన, విభ్రమ=విలాసములయందు, పరా=ఆసక్తురాలైన, కాచిత్=ఒకానొక, శశిముఖీ =చంద్రునివంటి ముఖముగల నాయిక, మధ్యే సఖీమణ్డలం=చెలికత్తెలగుంపు నడుమ, లోలాక్షిభ్రువసంజ్ఞయా = చలించు కన్నులు, కనుబొమలయొక్క సైగ చేయుటచేత, దూత్యా సహా =(నాయకునియొక్క) దూతితోడ, ఆభాషణమ్= మాట లాడుటను, విదధతీ=చేయుచున్నదై, అఞ్జసా=శీఘ్రముగా, అక్ష్ణోః=కనులయందు, అఞ్జనమ్=కాటుకను, విన్యస్య= దట్టముగా బెట్టుకొని, స్థూలంభావుకయోః=వలుదగా నగుచున్న (పొంగుచున్న), వక్షోజయోః=స్తనములయందు, స్థితం =ఉన్నట్టి, మణిసరం=రత్నములదండను, చేలాఞ్చలేన=పైటకొంగుతో, ప్యధాత్=కప్పెను.

తాత్పర్యము: సర్వజనానందకరములైన విలాసములు గల నొక చంద్రవదన చెలికత్తెల మధ్యనుండి, నాయకుని దూతితో కనులు,కనుబొమల విక్షేపముచే సైగ చేయుచున్నదై మొదట చంద్రునివంటి వదనమును దాకి, కన్నులయందు దట్టముగా గాటుకను బెట్టుకొని, ఆపైని పొంగువాఱు స్తనమండలమందలి రత్నహారముపై పైటచెఱగును గప్పెను. ముందుగా ముఖ చంద్రుని దాకి, దట్టమగు కాటుక బెట్టుకొనుటవలన, చంద్రు డస్తమించి చీకటి క్రమ్ముట సూచింపబడినది. స్తనములపై నున్న యెఱ్ఱని రత్నముల హారమును గప్పుటద్వారా నిండ్లలో దీపము లార్పుట సూచింపబడినది. ‘స్థూలంభావుకయోః వక్షోజయోః’ అనుటచేత కామేంగితము వ్యక్తము. ఇట్లు చంద్రు డస్తమించి చీకటి యావరించి, లోకులు ఇండ్లలోని దీపముల నార్పివేసిన పిదప రహస్యముగా నాయకుడుండు స్థలమున కేతెంచెదనని స్త్వైరిణి యగు నాయిక సంకేతమును చేయు చున్నది. కాంతుని జేర సంకేతమునకు బోవునది గావున నీ నాయిక అభిసారిక. పరకీయ గావున ఉక్తవిధముగా రహస్యముగా బోవనెంచుచున్నది. సూక్ష్మము, మీలితధ్వనియు నలంకారములు.

జిఘ్రత్యాననమిన్దుకాన్తి రధరం బిమ్బప్రభా చుమ్బతి
స్ప్రష్టుంవాఞ్ఛతి చారుపద్మముకుళచ్ఛాయావిశేషః స్తనౌ|
లక్ష్మీః కోకనదస్య ఖేలతి కరా వాలమ్బ్య కిం చాదరా
దేతస్యాః సుదృశః కరోతి పదయోః సేవాం ప్రవాళద్యుతిః||

ఈచెలిమోము మూర్కొనును నిందునికాంతియె, మోవి ముద్దిడం
జూచును బింబశోభ, జలజోజ్జ్వలకుట్మలకాంతి తాఁకగాఁ
జూచును జన్నులం, గొలువఁ జూచును పల్లవకాంతి పాదముల్,
వేచును హల్లకప్రభయె ప్రేముడి నాడుకొనం గరాలతోన్.

సందర్భము: ఒక యందగత్తెను జూచి మోహించిన నాయకుడు చెలికానితో నామె యందమును వర్ణించుచున్నాడు.

అర్థము: ఏతస్యాః సుదృశాః=ఈ వామాక్షియొక్క, ఆననం=ముఖమును, ఇన్దుకాన్తిః= చంద్రుని ప్రకాశము (వెన్నెల), జిఘ్రతి=మూర్కొనుచున్నది, అధరం=పెదవిని, బిమ్బప్రభా=దొండపండుయొక్క ఎఱ్ఱని కాంతి, చుమ్బతి=ముద్దు పెట్టుకొనుచున్నది, స్తనౌ=కుచములను, చారు=అందమైన, పద్మముకుళచ్ఛాయావిశేషః=తామరల దోరమొగ్గల కాంతిమొత్తము, స్ప్రష్టుం=తాకగా, వాఞ్ఛతి=కోరుచున్నది, కరౌ=రెండుచేతులను, కోకనదస్య=ఎఱ్ఱతామరలయొక్క, లక్ష్మీః=శోభ, ఆలమ్బ్య=పట్టుకొని, ఖేలతి=ఆడుచున్నది, కిం చ=మఱియు, ప్రవాళద్యుతిః=పల్లవములకాంతి, పదయోః=పాదములయొక్క, సేవాం=కొలువును (ఊడిగమును), ఆదరాత్=ప్రేమతో, కరోతి=చేయుచున్నది.

తాత్పర్యము: చక్కని కన్నులు గల ఆ సుందరి ముఖము చంద్రుని బోలిన దనియు, మోవి పక్వబింబఫలమును బోలిన దనియు, వక్షోజములు పద్మకుట్మలములను బోలినవనియు, కరములు రక్తోత్పలముల బోలినవనియు, పాదములు పల్లవముల బోలినవనియు తాత్పర్యము. ఉపమానము లైన చంద్రకాంత్యాదులకు జేతనత్వము నారోపించి, యవన్నియు ఉపమేయములైన నాయికాంగముల నాయా యంగములకు హితమైన రీతిగా సేవించినట్లు వర్ణించుట ఈ శ్లోకమునందలి విశేషము. ఇట్లు అచేతనములకు జేతనత్వ మారోపించుటచే ‘సమాధి’ యను కావ్యగుణ మిందున్నది. పదార్థవృత్తినిదర్శన, సమాసోక్తి, అతిశయోక్తి ఇందలి అలంకారములు. నాయిక పరకీయ. అయోగవిప్రలంభశృంగారము.

దూతి త్వయా కృత మహో నిఖిలం మదుక్తం
న త్వాదృశీ పరహితప్రవణాఽస్తి లోకే|
శ్రాన్తాసి హన్త! మృదులాంగి గతా మదర్థం
సిద్ధ్యన్తి కుత్ర సుకృతాని వినా శ్రమేణ||

చేటి! చెప్పిన దెల్లను జేసితీవు
భువిని నీవంటి పరహితప్రవణు లెవరు?
అలసితివి మృదులాంగి మదర్థ మేగి
అశ్రమంబున సుకృతంబు లమరు నెందు?

సందర్భము: ఇది ‘దూతీదం’ అను 11వ శ్లోకమువంటిదే. ప్రియుని దోడితెమ్మని పంపిన దూతిక అతనితో విలాసముగా గడిపి, ‘నీవు చెప్పినదంతయు జేసివచ్చితిని. కాని అతడు రాలేదు’ – అని బొంకినది. కాని ఆమె శరీరమునందు సురతచిహ్నములు స్పష్టముగా నున్నవి. ప్రగల్భ యైన నాయిక యది గ్రహించి, దూతికాకృత్యమును వ్యాజస్తుతిరూపమున నిట్లు నిందించు చున్నది.

అర్థము: అహో దూతి=ఓహో దూతీ! మదుక్తం నిఖిలం =నాచే చెప్పబడినదంతయు, త్వయా కృతమ్=నీచే చేయబడినది. (నీవిది చేయుము, ఇది చేయకుము – అని చెప్పిన దెల్లను చేసితివి. వేఱేమియు చేయలేదు. ఎంతమంచి దానవో! – అని వ్యాజస్తుతి. చెప్పినది జేయక చెప్పని సురతక్రీడ చేసివచ్చితివని నిందార్థము.) లోకే=ప్రపంచమునందు, త్వాదృశీ=నీవంటి, పరహితప్రవణా=పరహితమునందు శ్రద్ధగలది, న అస్తి =లేనే లేదు. (పరుల కింత మోసమును చేయుటలో నిన్ను మించినవా రీ లోకములో లేరని నిందార్థము.) హన్త=అయ్యో! మృదులాంగి=కోమలాంగీ! మదర్థం=నాకొఱకు, గతా=పోయినదానవై, శ్రాన్తాసి=బడలితివి. (నీవు సుకుమారి వగుటవలన నాకొఱకేగి అలసిపోయితివిగదా! – అని వ్యాజస్తుతి. నాకొఱకేగి నాకే ద్రోహము చేసిన నీ సుకుమార మైన శరీరము సురతశ్రమను దాచజాలకున్నదిగదా! – అని నిందార్థము.) వినా శ్రమేణ=శ్రమ లేకుండ, సుకృతాని=సత్కార్యములు, కుత్ర=ఎచ్చట, సిద్ధ్యన్తి =సిద్ధించుచున్నవి? (ఔను. నిజమే! శ్రమ పడనిదే మంచికార్యములు చేకూరవు గదా! ఇంత శ్రమ చేసితివి – అని వ్యాజస్తుతి. ఔనులే! సురతసుఖము సురతశ్రమలేనిదే సిద్ధింపదుగదా – అని నిందార్థము.) నాయిక స్వీయ, ప్రగల్భ. దూతి అభిసారిక. నాయకుడు శఠుడు. వ్యాజస్తుతి, అర్థాంతరన్యాస, పరికరాలంకారములు.

న బరీభరీతి కబరీభరే స్రజో
న చరీకరీతి మృగనాభిచిత్రకమ్|
విజరీహరీతి న పురేవ మత్పురో
వివరీవరీతి న చ విప్రియం ప్రియా||

మఱిమఱి కొప్పునందు సుమమాలలు గూర్పదు, ఫాలమందున
న్మఱిమఱి దీర్చుకోదు మృగనాభిలసత్తిలకంబుఁ జక్కగన్,
సరసన నాదుముంగిటను సంచరియింపదు ముందురీతిగన్,
మఱిమఱి పల్క మౌనమును మానదు, కారణమేమె నెచ్చెలీ!

సందర్భము: ఇతరులు చెప్పిన మాటలవల్లనో లేక నాయకుని పరకాంతాసక్తి గ్రహించుటచేతనో ఒక నాయిక నాయకునియం దనాదరము పూనినది. అతడామెను ప్రసన్నురాలిని జేసికొన యత్నించినను అవి ఫలించుట లేదు. ఈ విపరీతవర్తనకు కారణ మేమని నాయకు డామె చెలికత్తె నడుగుచున్నాడు.

అర్థము: ప్రియా=(ఈ) ప్రియురాలు, పురా ఇవ=ముందువలె, కబరీభరే=గొప్పనైన కొప్పున, స్రజః=పూదండను, న బరీభరీతి=మఱిమఱి తుఱుముకొనదు; మృగనాభిచిత్రకమ్=కస్తూరితిలకమును, న చరీకరోతి=మఱిమఱి (సవరించి) పెట్టుకొనదు; మత్పురః=నాయెదుట, న విజరీహరీతి=మఱిమఱి చరింపదు; విప్రియం=(నా)తప్పిదమును, న వివరీవరీతి చ= (మఱిమఱి యడిగినను) చెప్పదు గూడ.

ఓ చెలీ! ఈమె వైఖరి నీకు దెలిసియున్న చెప్పుము. నాయిక ఖండిత. అలంకారశాస్త్రప్రకారము ఈనాయిక ‘మధ్యాధీరా’ అను కోవకు చెందినది. ‘మధ్యా ధీరా ప్రియం మానే న పశ్యతి న భాషతే’ – ‘మధ్యాధీర మానము (ప్రణయకోపమును) వహించినప్పుడు ప్రియునివైపు చూడదు, మాటాడదు’ – అని ఆమె లక్షణము. పైశ్లోకములో అపరాధియైన నాయకునిపట్ల ఇట్టి (ఖండిత)నాయిక చేయు విపరీతవర్తనము వర్ణింపబడినది. ఇందులో గల ‘బరీభరీతి’, ‘చరీకరీతి’ ఇత్యాది పౌనఃపున్యార్థకములైన యఙ్లుగంతరూపములు ఈశ్లోకమునకు అధికమైన అందము నొసగుచున్నవి. ఇతరులు చెప్పిన మాటలు సత్యమైనచో నాయకుడు ధృష్టుడు. కానిచో అనుకూలుడు. కారకదీప కము, స్వభావోక్తి, వృత్త్యనుప్రాసము లలంకారములు.