సమూలాంధ్రపుష్పబాణవిలాసము

శేతే శీతకరోఽమ్బుజే, కువలయద్వన్ద్వాద్వినిర్గచ్ఛతి
స్వచ్ఛా మౌక్తికసంహతి, ర్ధవళిమా హైమీం లతామఞ్చతి|
స్పర్శాత్ పఙ్కజకోశయో రభినవా యాన్తి స్రజః క్లాన్తతామ్,
ఏషోత్పాతపరమ్పరా మమ సఖే! యాత్రాస్పృహాం కృన్తతి||

నీరజవైరి యబ్జమున నిద్రను బూనె, సుమౌక్తికావళుల్
కైరవయుగ్మమందొదవె, కాంచనవల్లిక తెల్లనయ్యె, నం
భోరుహకుట్మలంబులను బూలసరంబులు దాఁకి మ్లానతం
గూరెను, దుర్నిమిత్తములు గూడఁగ నిట్టులఁ బోవమానితిన్.

సందర్భము:నాయికావిధేయుడైన నాయకు డొకడు హఠాత్తుగా తన ప్రయాణమును మానుకొన్నాడు. దానికి కారణ మేమి యని ప్రశ్నించు తన సఖునితో నతడిట్లు పలుకుచున్నాడు.

అర్థము: శీతకరః=చంద్రుడు, అమ్బుజే=కమలమునందు, శేతే=శయనించుచున్నాడు; స్వచ్ఛా మౌక్తిక సంహతిః = స్వచ్ఛ మైన ముత్యముల సమూహము, కువలయద్వన్ద్వాత్=కలువలజంటనుండి, వినిర్గచ్ఛతి=వెలువడుచున్నది; హైమీం లతామ్ = బంగారుతీగెను, ధవళిమా=తెల్లదనము, అఞ్చతి=పొందుచున్నది; పఙ్కజకోశయోః=పద్మకుట్మలముల యొక్క, స్పర్శాత్=తాకిడివల్ల, అభినవా స్రజః = (అప్పుడే కూర్చిన) పూలదండలు, క్లాన్తతామ్=వాడుటను, యాన్తి= పొందుచున్నవి; సఖే=ఓ మిత్రమా! ఏషోత్పాతపరమ్పరా = ఈ దుర్నిమిత్తముల వరుస, మమ =నాయొక్క, యాత్రా స్పృహాం=ప్రయాణేచ్ఛను, కృన్తతి= ఛేదించు (చంపు)చున్నది.

తాత్పర్యము: కమలవిరోధియైన చంద్రుడు కమలములోనే పరుండుట, కలువలజంటనుండి మంచిముత్తెములు రాలుట, (హఠాత్తుగా ) బంగారుతీగె తెల్లవాఱుట, పద్మకుట్మములను తాకగనే క్రొత్తనైన పూదండలు వాడిపోవుట, ఇట్టి దుశ్శకున ములు పొడసూపినవి. అందుచేత శ్రేయస్కరము కాదని నాప్రయాణము నాపికొంటిని. అనగా, నాయకుని ప్రయాణవార్తను వినగానే ఆతని విడిచి యుండలేని నాయిక తన చేతిలో మోము నానించుకొని సంతాపమును బూనినది. ఇది యొక సంతాప సూచకభంగిమ. అనగా పద్మమువంటి ఆమె చేతిలో చంద్రునివంటి యామె ముఖము విశ్రమించినది. కలువలజంట(వంటి ఆమె కన్నుల)నుండి మంచిముత్తెములు (అనగా శోకబాష్పములు) రాలినవి. బంగరుతీగె (వంటి ఆమె మైదీగె హఠాత్తుగా) పాలిపోయినది. (విరహతాపముచే వేడెక్కిన యామె తనువందలి స్తనము లనెడి) కమలపుమొగ్గలను తాకగనే మెడలో వేసికొన్న క్రొత్తనైన పూదండలు వాడిపోయినవి. ఇట్లు తన యెడబాటువార్త ఆమెను అత్యంతఖిన్నురాలిని జేయుటచేత ప్రయాణము నాపికొంటినని నాయకుడు తెల్పుచున్నాడు. నాయకుడు అనుకూలుడు. నాయిక ప్రవత్స్యత్పతిక. చపలాతిశయోక్తి, రూపకాతిశయోక్తి, విరోధము, విభావనాలంకారములు.

దూతీదం నయనోత్పలద్వయమహో! తాన్తం నితాన్తం తవ
స్వేదామ్భఃకణికా లలాటఫలకే ముక్తాశ్రియం బిభ్రతి|
నిశ్వాసాః ప్రచురీభవన్తి నితరాం, హా! హన్త! చన్ద్రాతపే
యాతాయాతవశా ద్వృథా మమకృతే శ్రాన్తాసి కాన్తాకృతే||

చెలియా! నీనయనోత్పలంబు లకటా! చెందెంగదే మ్లానతన్,
అలికంబందున స్వేదబిందువులు ముక్తాభంబులయ్యెం, గడుం
బొలిచె న్నిశ్వసనంబు, లీగతి వృథా పోవ న్మదర్థంబు, బి
ట్టలయించెంగద సుందరాంగి! నిను జ్యోత్స్నాఽయాతయాతవ్యథల్!

సందర్భము: ఒక నాయిక సుందరాంగియైన యొక దూతికను నాయకుని దోడ్తేర బంపినది. ఘటికురాలైన ఆదూతిక అతనితో భోగించి వచ్చుటయే కాక అతడు రాకుండుట కేదో మిషను కల్పించి, అతడు రాలేడనినది. కాని ఆమె తనువందు స్పష్టమైన సంభోగచిహ్నము లున్నవి. ఆ విషయమును గమనించిన నాయిక వక్రోక్తిగా నిట్లనుచున్నది.

అర్థము: హే దూతీ=ఓ చెలీ! ఇదం=ఈ, తవ=నీయొక్క, నయనోత్పలద్వయమ్ = కలువకన్నులజంట, నితాన్తం=ఎంత గానో (మిక్కిలి), తాన్తం= వాడినది, అహో=ఆశ్చర్యము; స్వేదామ్భఃకణికా=చెమటనీటిబిందువులు, లలాటఫలకే= నుదుటి యందు, ముక్తాశ్రియం =ముత్యములకాంతిని, బిభ్రతి=ధరించుచున్నవి; నిశ్వాసాః=నిట్టూర్పులు, నితరాం=మిక్కిలి, ప్రచురీభవన్తి =హెచ్చగుచున్నవి. హా! హన్త = అయ్యయ్యో! కాన్తాకృతే=అందమైనదానా, చంద్రాతపే=వెన్నెలలో, వృథా మమకృతే= వృథాగా నాకై చేయబడిన, యాతాయాతవశాత్= పోయివచ్చుటలవలన, శ్రాన్తాసి=డస్సియుంటివి.

వివరణ:‘వృథా మమకృతే శ్రాన్తాసి’ అనుటవల్ల నాకొఱకు పోయిన పని నిష్ఫలమయ్యెను. నీకు అలసటయే చిక్కెను – అనునది పైకి దోచు భావము. నాయర్థము వ్యర్థమైనది గాని నీయర్థము సిద్ధించినదని వ్యంగ్యము. ‘చంద్రాతపే’, ‘నిశ్శ్వాసాః ప్రచురీభవన్తి’, ‘స్వేదాంభఃకణికా లలాటఫలకే’, ‘తాన్తం నితాన్తం’ అనుటవల్ల, ఎంత సుకుమారివో చల్లనివెన్నెలలో పోయివచ్చినంతనే నీకు శ్రమవల్ల నిశ్శ్వాసము లధికమైనవి, చెమటపట్టినది, కనులు వాడినవి – అనునది పైకి దోచు భావము. చల్లనివెన్నెలలో కొలదిదూర మేగివచ్చినంతనే ఇట్టి శ్రమము కల్గదు, చెమట పట్టదు, కనులు వాడవు, నిశ్శ్వాసములధికము గావు. ఈచిహ్నము లన్నియు నాప్రియునితో భోగించుటచేతనే కల్గినవనునది వ్యంగ్యార్థము. కనులు అలయుట (మ్లాన మగుట), స్వేదము గల్గుట, నిశ్శ్వాసములు దట్టమగుట రతిచిహ్నములు. ‘కాన్తాకృతే’ అనుటవల్ల నీయందమే నాకొంప ముంచినది. నీవంటి యందకత్తెను దూతిగా బంపుట నాదే పొరపాటు – అనునది వ్యంగ్యము. అందుచేతనే ‘నోజ్జ్వలం రూపవన్తం వా, న చాతురం దూతం వాపి హి దూతీం వా బుధః కుర్యాత్కదాచన’ – అనగా, ‘ఉజ్జ్వలమగు వేషము, సుందరరూపము, ఆతురత గల వ్యక్తిని దూతగా గాని, దూతిగా గాని నిర్ణయింపదగదు’ – అని భరతుడు నాట్యశాస్త్రములో చెప్పినాడు.ఈశ్లోకములో రూపక, నిదర్శన, విరోధ, విషమాలంకారములు గలవు.

అధివసతి వసన్తే మర్తుకామా దురన్తే
నవకిసలయతల్పం పుఞ్జితాంగారకల్పమ్|
విరహమసమానా చక్రవాకీసమానా
చకితవనకురంగీలోచనా కోమలాంగీ||

చకితమృగాక్షి యీతరుణి జంటను బాసిన చక్రికైవడిన్
ప్రకటితవిప్రయోగభరబాధ సహింపక మ్రగ్గనెంచి పా
వకకణరాశికల్ప నవపల్లవకల్పిత తల్పమందునన్
సకి! శయనించు సంతపనశాలిదురంతవసంతమందునన్.

సందర్భము: విరహార్త యైన నాయికయొక్క మరణోద్యోగ మను మన్మథావస్థ ఇందు వర్ణితము.

అర్థము: చక్రవాకీసమానా =ఆడుజక్కవపక్షివంటిదియు, చకిత=భయపడిన, వనకురంగీలోచనా =అడవిజింకవంటి కన్నులు గలదియు, కోమలాంగీ =సున్నితమైన శరీరము గలదియు నగు నాయిక, దురన్తే =చివరికి కీడు కల్గించునదైన, వసన్తే =వసంతకాలమునందు, విరహమసమానా =ప్రియుని యెడబాటును సహింపజాలనిదై, మర్తుకామా=మరణింప గోరినదై, పుఞ్జిత=ప్రోవుచేయబడిన, అంగారకల్పమ్=నిప్పుకలతో తుల్యమైన, నవకిసలయతల్పం=లేఁజిగురులతో గూర్పబడిన పఱుపును, అధివసతి=ఎక్కుచున్నది.

తాత్పర్యము: ప్రియుడు దూరదేశమేగినాడు. అతని యెడబాటు సుకుమారి యైన నాయికకు సహింపరాని దైనది. ఇంతలో వసంతము వచ్చినది. ఇంకను తాపము హెచ్చినది. ఆమె కిక దశమమన్మథావస్థయైన మరణోద్యోగమే శరణ్యమైనది. అందుచే నిప్పుకలరాశివలె నున్న లేజిగుఱుల తల్పము నెక్కి మరణింప నెంచినది. పెంటి,పోతు పక్షులు కలిసియుండుట జక్కవల స్వభావము. అందు మగపక్షి లేకున్న పెంటిపక్షి కత్యంతశోకము కల్గునని కవులు వర్ణింతురు. ప్రియుని నెడబాసిన నాయికయు నట్లే యున్నదని ‘చక్రవాకీసమానా’ అను పదము వ్యంజించుచున్నది. వనకురంగీ అనగా అడవిజింక యని అర్థము. పెంపుడుజింకకంటె అడవిజింక ఎక్కువగా బెదరుచుండును. అందుచేత ‘వనకురంగీలోచనా’ యనుటచేత భయాతిశయము వ్యక్తము. ‘కోమలాంగీ’ యనుటచేత, సహజముగా సుకుమారియైన యా తరుణి యీ విరహమును సహింపలేదనుట. ‘దురన్తే’ యనుటచేత, కోయిలల కూజితములు, మలయమారుతము పుష్పసౌరభములు మున్నగు నుద్దీపనసామగ్రులుండుటచే వసంతము తుదిముట్ట గడపుట యసాధ్యమగుచున్నదనుట. ‘నవకిసలయ’ మనుటచేత చివురులు క్రొత్తవగుటచేత నవి ఎఱ్ఱగా నిప్పులవలె మెఱయుచున్నవని, ‘పుంజిత’ అనుటచే వానిని రాశివోసి కూర్చుటచే తల్పము నిప్పులపడకవలె నున్నదనియు, దానిపై కృశాంగియగు నాయిక తనువును జేర్చుట మరణోద్యోగము చేయుటయే యనియు భావము. నాయిక ప్రోషితభర్తృక. ‘చకితకురంగీలోచనా’ ‘కోమలాంగీ’ యనుట చేత ఆమె పద్మినీజాతిస్త్రీ యని సూచితము. మరణమను పదవ మన్మథావస్థ వర్ణితము. ఉపమా,కావ్యలింగ, పరికర,వృత్త్యను ప్రాసాలంకారములు.

నైష్ఠుర్యం కలకణ్ఠకోమలగిరాం పూర్ణస్య శీతద్యుతే
స్తిగ్మత్వం బత దక్షిణస్య మరుతో దాక్షిణ్యహానిశ్చ తామ్|
స్మర్తవ్యాకృతిమేవ కర్తు మబలాం సన్నాహమాతన్వతే
తద్విఘ్నః క్రియతే తృణాదిచలనోద్భూతై స్త్వదాప్తిభ్రమైః||

కలకంఠాలి మృదుస్వనాంతరితమౌ కాఠిన్యమున్, బూర్ణశీ
తలరుక్తైక్ష్ణ్యము, దక్షిణానిలుని నిర్దాక్షిణ్యముం, బాప మా
లలనోపస్థితి యూహకే మిగులు లీలం జాలఁ గాఱించుచో
నిలుపుం బ్రాణము లెట్లొ లోలతృణమే నీరాక వ్యంజించుచున్.

సందర్భము: ప్రియుడు వచ్చునని నాయిక నిండుపున్నమవేళ అతనికై నిరీక్షించినది. కాని అతడు రాలేదు. ఆమె విరహము హెచ్చినది. అతని దోడితెమ్మని తన దూతిని పంపినది. చతుర యైన యాదూతిక నాయకుని కడకేగి నాయికయొక్క యవస్థ నిట్లు వర్ణించుచున్నది.

అర్థము: కలకణ్ఠ=కోయిలలయొక్క, కోమల=ఇంపైన, గిరాం=కూజితములయొక్క, నైష్ఠుర్యం=కఠినత్వమును, పూర్ణస్య=నిండగు, శీతద్యుతేః=చల్లని కిరణములు గల చంద్రునియొక్క, తిగ్మత్వం=తీక్ష్ణత, దక్షిణస్య మరుతః= దక్షిణానిలముయొక్క, దాక్షిణ్యహానిశ్చ=కనికరము లేమియు, బత=అయ్యో! తాం అబలాం= బలహీనురాలగు నా నాయికను, స్మర్తవ్యాకృతిమేవ= ఊహించుకొనవలసిన రూపముగలదానిగనే (అనగా మరణించినదానిగనే), కర్తుమ్= చేయుటకు, సన్నాహమ్=యత్నమును, ఆతన్వతే=చేయుచున్నవి; తృణాదిచలనోద్భూతైః=గడ్డిపరకలు మున్నగువాని కదలికవలన కల్గిన, త్వదాప్తిభ్రమైః=నీవు వచ్చుచున్నావను భ్రమచేత, తత్=ఆ మారణయత్నమునకు, విఘ్నః= ఆటంకము, క్రియతే= చేయబడుచున్నది.

తాత్పర్యము: ఓ నాయకుడా! నిండుచందురుని తీక్ష్ణత, కోయిలల మృదుకంఠధ్వనులలోని కాఠిన్యము, దక్షిణానిలుని నిర్దాక్షిణ్యము, ఇవన్నియు తోడై ఆకృశాంగిని మరణింపజేయ సమకట్టినవి. ఆలసించిన ఆమె రూపము కేవల మూహకే మిగులు ప్రమాద మున్నది. ఐనను కదలెడి గడ్డిపరకలు మున్నగువానిని గాంచి నీవు వచ్చుచుంటివేమో యను భ్రమ ఆమె కొదవుటవల్ల వాని మారణయత్నమునకు విఘ్నము వాటిల్లుచున్నది. (అందుచేత నీవు త్వరగా వచ్చి ఆమెను రక్షించు కొనవలెను.) ఇచ్చట కలకంఠముల రుతములు కోమలములైనను నాయికకు రూక్షముగా నున్నవి. నిండుచంద్రుడు శీతద్యుతి యైనను (చల్లని కాంతి గలవాడైనను) ఆమెకు తీక్ష్ణద్యుతిగనే తోచినాడు. దక్షిణానిలుడు సుఖప్రదుండైనను నిర్దాక్షిణ్యముగ తనను బాధించుచున్నట్లుగనే ఆమె కనుభవమైనది. ఈ యుద్దీపన లన్నియు విరహార్తయైన యా యబలను విరుద్ధధర్మ యుతములై బాధించినవి. ‘అబల’ యనుటచే ఈవిరుద్ధధర్మముల కోర్చికొనునంత బల మామెకు లేదని స్ఫురించుచున్నది. అట్లే ‘కలకంఠ’, ‘శీతద్యుతి’ పదములు సాభిప్రాయములు. నాయిక విరహోత్కంఠిత. విప్రలంభశృంగారము. పర్యాయోక్తి, విరోధ, పరికరాలంకారములు.