సమూలాంధ్రపుష్పబాణవిలాసము

నీరన్ధ్ర మేత దవలోకయ మాధవీనాం
మధ్యే నికుఞ్జసదనం చ్యుతపుష్పకీర్ణమ్|
కుర్యుర్యదీహ మణితాని విలాసవత్యో
బోద్ధుంన శక్య మబలే నినదైః పికానామ్||

అబలా! కాంచుము రాలుపూగముల మధ్యంబందు మవ్వంబు నై
గుబురై యున్నది మాధవీవ్రతతికాకుంజంబు, పుంస్కోకిల
ప్రబలారావములందు లీనమగుటం బ్రత్యేకమై తోఁప విం
దుఁ బడంతుల్ రతివేళ సల్పు మణితానూనధ్వనుల్, సీత్కృతుల్.

సందర్భము: సంకేతమునకు పూలు గోయు నెపంబున వచ్చిన ఒకానొక కాంతకు ప్రియుడు రహస్యముగా విహరింపదగిన స్థలము నిట్లు సూచించుచున్నాడు.

అర్థము: అబలే=ఓ ముద్దరాలా! నీరన్ధ్రమ్=దట్టమైన (బయటివారికి గనఁబడకుండ సందులు లేని), మధ్యే=మధ్యభాగమున, చ్యుత=రాలిన, పుష్ప=పూవులతో, కీర్ణమ్=నిండినట్టి (అందుచేత స్వాభావికమైన పూసెజ్జవలె నున్న మధ్యభాగము గల), ఏతత్ =ఈ, మాధవీనాం= బండిగురివెందతీఁగెలయొక్క, నికుఞ్జసదనం=పొదరింటిని, అవలోకయ=చూడుము. ఇహ= ఇచ్చట, విలాసవత్యః=రతికేళీసక్తలైన యతివలు, మణితాని=సురతసంబంధమైన కూజితములు, కుర్యుర్యది= చేసినచో, పికానామ్=కోకిలలయొక్క, నినదైః=కూజితములచేత, బోద్ధుం=తెలిసికొనుటకు, న శక్యమ్=(బయటివారికి) సాధ్యము గాదు.

తాత్పర్యము: గడుసరియగు నాయకుడు వనమందు దట్టమగు బండిగురివెందపొదను చూపించుచు ప్రియురాలి కిట్లు సూచించుచున్నాడు. దట్టమైన యీ బండిగురివెందతీవపొద సందులు లేకుండ నున్నది. విరివిగా రాలిన పూవులవల్ల దీని లోపలిభాగము మెత్తనై, పరిమళవంతమై, స్వాభావికమైన పూలపఱుపువలె నున్నది. ఇందులో విలాసముగా గడపు రమణుల రతికూజితములు ఇందులో వినవచ్చు మిక్కుటమైన కోకిలకూజితములవలె నుండి బయటివారికి ప్రత్యేకముగా దోపవు. ‘అబల’ యను పదమువలన నీవు గుట్టు బయలగునేమో యని భయపడుదువేమో, అట్టి భయ మక్కఱ లేదు, ఇచ్చట కోకిలరుతములు మిక్కుటముగా నున్నవి, పొద దట్టముగా నున్నదని నాయకుడు సూచించుచున్నాడు. సామాన్యాలంకారము, భ్రాన్తిమదలంకారధ్వని.

దష్టం బిమ్బధియాధరాగ్ర మరుణం, పర్యాకులో ధావనా
ద్ధమ్మిల్ల, స్తిలకం శ్రమామ్బుగళితం, ఛిన్నా తనుః కంటకైః|
ఆః కర్ణజ్వరకారికఙ్కణఝణత్కారం కరౌ ధూన్వతీ
కిం భ్రామ్యస్యటవీ శుకాయ? కుసుమాన్యేషా ననన్దాగ్రహీత్||

గడుసరిచిల్క నీపెదవిఁ గాటఁగ బింబమటంచు, దానివెం
బడి సడిచేయ గాజు లిటు పర్వెదవేటికి కొప్పు వీడగం,
జెడగను బొట్టు స్వేదమున, చీలలచందము ముండ్లు మేనినిం
బడిబడిఁ గ్రుచ్చ? వ్రచ్చెఁ గుసుమంబులు ముందె ననంద సుందరీ!

సందర్భము: ఒక నాయిక వనములో నొక బండిగురివెందపొదలో ప్రియుని గవయుచున్నది. ఆమె చెలికత్తె రక్షణార్థము బయట గాపున్నది. ఇంతలో నాయికయొక్క ననంద (ఆడుబిడ్డ) అచ్చటికి పూలు గోసికొనుటకు వచ్చుచున్నది. ననంద రాక నాయిక కెరింగించుటకు, నాయిక సురతచిహ్నములను గాంచి ననంద సందేహింపకుండుటకు వీలుగా చతుర యైన చేటిక ఇట్లనుచున్నది.

అర్థము: అరుణం=ఎఱ్ఱనైన, అధరాగ్రమ్=మోవియంచు, బిమ్బధియా=(ఎఱ్ఱని) దొండపండనెడి భ్రాంతిచేత, దష్టం=కొఱక బడినది; ధావనాత్=పరుగెత్తుటవల్ల, ధమ్మిల్లః=కొప్పు, పర్యాకులః (జాతః) = చెదరి (వీడి)పోయినది; తిలకం =నొసటి బొట్టు, శ్రమామ్బు=శ్రమచే గల్గిన చెమ్మటచే, గళితం=జారిపోయినది (శిథిలమైనది); తనుః=శరీరము, కంటకైః= ముండ్లచేత, ఛిన్నా=గాయపడినది (కోయబడినది); ఆః=అక్కటా! కర్ణజ్వరకారి=చెవులకు సంతాపమును కలిగించు, కఙ్కణ=గాజుల యొక్క, ఝణత్కారం=గలగలధ్వనులు గల్గునట్లుగా, కరౌ=రెండుచేతులను, ధూన్వతీ=విదలించుచు, అటవీశుకాయ= అడవిచిల్కకొఱకు, కిం భ్రామ్యసి=ఎందుకు తిరుగుచున్నావు? ఏషా ననన్దా=ఈ (నీ) ఆడుబిడ్డ, కుసుమాని=పూలన్నియు, అగ్రహీత్= తీసికొన్నది (కోసికొన్నది).

తాత్పర్యము: ‘పూలు గోయుట మాని వృథాగా చిలుకవెంబడి పరుగెత్తుచున్నావు. నీ ఆడుబిడ్డ పూవుల నన్నిటిని ముందు గానే కోసికొన్నది చూడు!’ అని పైకి స్ఫురించు భావము. పొదలో నున్న నాయికకు ఆడుబిడ్డయొక్క రాకను సూచించుట అంతరాశయము. ఆమె రాక విని హఠాత్తుగా పొదనుండి నిర్గమించు నాయికయొక్క సురతచిహ్నములను ఆమె తన పెదవిని కొఱకిన అడవిచిల్కను బట్టుకొనుటకై పరుగెత్తగా శరీరమందు కల్గిన చిహ్నములుగా వర్ణించి, ఆడుబిడ్డకు నాయికయం దనుమానము కలుగకుండగా జేయుట చెలికత్తెయొక్క ఆశయము. ‘అటవీశుకాయ=అడవిచిల్కకొఱకు’ అనుటచే అది పెంపుడుచిల్క గాదు, పట్ట సాధ్యముగాని అడవి చిల్క, అందుచే అధికశ్రమతో నుఱుకవలసి వచ్చినది. అందుచే ఈ తనుచిహ్నము లన్నియు గల్గినవి అను విశేషార్థము ద్యోతకమగుచున్నది. ‘ఆః కర్ణజ్వరకారికఙ్కణఝణ త్కారం కరౌ ధూన్వతీ’ అను వాక్యములోని ‘ఆః’ అను అవ్యయము కోపమును వ్యక్తీకరించునది (ఆః కోపే తాప పీడయోః – అని అమరము). ఇట్లు తగని పనిని చేయుచున్నట్లు ఆక్షేపణరూపకముగా నాయికను బలికి, అట్లు చేయుటవల్లనే ఆమె తనువందు వ్యక్తమగు స్వేద, కంటకవ్రణాదులు కల్గినవను భావము ఆడుబిడ్డ మనసులో రూఢముగ నాటుట ఇచ్చట చెలికత్తెయొక్క ఆశయము. ఇట్లు ఈ చెలికత్తెయందు భరతుడు నాట్యశాస్త్రములో చెప్పిన దూతికాలక్షణములైన కాలజ్ఞత (సమయానువర్తనము), చాతుర్యము, రహస్యగోపనమను లక్షణములు ప్రదర్శింపబడినవి. భ్రాన్తిమదలంకారము, విషమ ధ్వని, వ్యాజోక్తిధ్వనియు.

బిభ్రాణా కరపల్లవేన కబరీమేకేన పర్యాకులా
మన్యేన స్తనమండలే నిదధతీ స్రస్తం దుకూలాఞ్చలమ్|
ఏషా చన్దనలేశలాఞ్ఛితతను స్తామ్బూలరక్తాధరా
నిర్యాతి ప్రియమన్దిరా ద్రతిపతేః సాక్షాజ్జయశ్రీ రివ||

సడలినకొప్పు నొక్క కరసారసమందున, జాఱుపయ్యెదన్
వడిగ గ్రహించి యన్యకరపద్మమునందుఁ, బ్రియాలయంబు వె
ల్వడు నదె కాంత కంతురమభంగి, సుచందనలేశయుక్తమై
యొడలును, వీటికారుణిమ నుజ్జ్వలమై యధరంబుఁ గ్రాలఁగన్.

సందర్భము: ప్రియునిగృహమునుండి రతిశ్రాంతయై వెడలుచున్న కామినీవర్ణనము.

అర్థము: పర్యాకులాం=చిక్కుపడియున్న (చిందరవందరయైన), కబరీం=కొప్పును, ఏకేన కరపల్లవేన= ఒక చిగురాకువంటి (చిగురాకువలె కోమలమును, అరుణమును నైన) చేతితో, బిభ్రాణా=పట్టుకొన్నదియు, అన్యేన (కరపల్లవేన)=ఇంకొక (చిగురాకువంటి) చేతితో, స్తనమండలే=స్తనప్రదేశమునందు, స్రస్తం=జాఱుచున్న, దుకూలాఞ్చలమ్=వలిపెముయొక్క కొనను, నిదధతీ= ధరించినదియు నగుచు, చన్దనలేశలాఞ్ఛితతనుః — చన్దన=గంధముయొక్క, లేశ=కణములచేత, లాఞ్ఛిత=చిహ్నితమైన, తనుః=శరీరము గలదియు, తామ్బూలరక్తాధరా=తాంబూలముచేత ఎఱ్ఱబడిన క్రిందిపెదవి గలదియు నైన, ఏషా=ఈ వన్నెలాడి, సాక్షాత్=ప్రత్యక్షమైన, రతిపతేః =మన్మథునియొక్క, జయశ్రీ రివ= జయలక్ష్మియో యనునట్లు, ప్రియమన్దిరాత్ = ప్రియుని గృహమునుండి, నిర్యాతి=వెడలుచున్నది. (అనువాదములో చేతులు పల్లవములతో గాక పద్మములతో బోల్పబడినవి.)

తాత్పర్యము: సులభము. ‘చన్దనలేశలాఞ్ఛితతనుః’ అనుటవల్ల దట్టముగా తనువున కలందుకొన్న గంధమునకు ప్రణయపు కౌఁగిలింతలచే కలిగిన శైథిల్యము స్ఫురించుచున్నది. సురతమృదితయైన నాయికను మన్మథజయలక్ష్మితో బోల్చుట సరసముగా నున్నది. నాయికారూపవేషాదులవర్ణన స్వాభావికముగా నుండుటచే స్వభావోక్తి. ఉత్ప్రేక్షాలుప్తోపమ లితరాలం కారములు.

కాన్తో యాస్యతి దూరదేశ మితి మే చిన్తా పరం జాయతే
లోకానన్దకరో హి చన్ద్రవదనే వైరాయతే చన్ద్రమాః|
కిం చాయం వితనోతి కోకిలకలాలాపో విలాపోదయం
ప్రాణానేవ హరన్తి హన్త నితరామారామమన్దానిలాః||

ధవుఁడు విదేశ మేగునన దద్దఱిలెన్మది చింతతోడుతన్,
భువనముదంకరుండు శశభూషణుఁడే యిపు డేచె వైరియై,
శ్రవహితకోకిలారవమె సంధిలె శోకవిరావమూలమై,
నవసుమవాటికానిలమె నాయసువుల్ హరియించె వీచుచున్.

సందర్భము: ప్రియుడు దూరదేశమేగు నను వార్త విన్నంతనే విరహము ననుభవించుచున్న నాయిక (ప్రవత్స్యత్పతిక) తన చెలికత్తెతో తన యవస్థ నీ శ్లోకములో వర్ణించుచున్నది.

అర్థము: కాన్తః=ప్రియుడు, దూరదేశం=దూరదేశమునకు, యాస్యతి ఇతి=పోవుచున్నాడని, మే=నాకు, పరం=అధిక మైన, చిన్తా=విచారము, జాయతే=కలుగుచున్నది; చన్ద్రవదనే= ఓ చంద్రునివంటి ముఖముగలదానా ! (ఇది చెలికత్తెకు సంబోధనము), చన్ద్రమాః =చంద్రుడు, లోకానన్దకరో హి = లోకమునకెల్ల ఆనందమును గూర్చువాడే కాని , వైరాయతే= (నాతో) విరోధించుచున్నాడు; కిం చ=ఇంకను, అయం=ఈ, కోకిలకలాలాపః=కోకిలలయొక్క అవ్యక్తమధురధ్వనులు, విలాపోదయం= దుఃఖాలాపముయొక్క పుట్టుకను, వితనోతి=కలిగించుచున్నవి. మధురమైన వయ్యు కోకిలాలాపములు దుఃఖాలాపజనకము లగుచున్నవనుట. హన్త=అయ్యో (కష్టము!), నితరాం=అధికమైన, ఆరామ=తోఁటలయందలి, మన్దానిలాః=మందమారుతములు, ప్రాణానేవ హరన్తి=ప్రాణములనే తొలగించుచున్నవి.

తాత్పర్యము: సులభము. చల్లని చంద్రుడు (విరహ)తాపమును కలిగించు విరోధి యైనాడు. మధురమైన కోకిలరవము విలాపా రవమునకు మూలమైనది. ఆరామవాయువే ప్రాణవాయువును హరించుచున్నది. ఇట్లు చంద్రాదుల సహజధర్మములే నాయిక కపాయకరములైన విరుద్ధధర్మములుగా భాసించి, ఆమె విరహము నధికము చేసినవి. నాయిక ప్రవత్స్యత్పతిక, విప్రలంభశృంగారము. చపలాతిశయోక్తి , అనుప్రాసాలంకారములు.

నవకిసలయతల్పం కల్పితం తాపశాన్త్యై
కరసరసిజసఙ్గాత్ కేవలం మ్లాపయన్త్యాః|
కుసుమశరకృశానుప్రాపితాఙ్గారకాయాః
శివ శివ! పరితాపం కో వదేత్ కోమలాఙ్గ్యాః||

ఘనతరతాపశాంతికయి కల్పితమైన కిసాలతల్పమున్
తన మృదుపాణిపద్మములఁ దాఁకినతోడనె వాడఁజేయుచున్
మనసిజవహ్నిరూపమున మండుచునున్నది, రామ రామ! వా
కొనఁగఁ దరంబె యీ కుసుమకోమలి తాపభరం బెవారికిన్!

సందర్భము: విరహార్త యగు నొక నాయికయొక్క అవస్థను జూచి, ఆమె చెలి యిట్లు జాలిపడుచున్నది.

అర్థము: తాపశాన్త్యై=(విరహ)తాపమును శమింపజేయుటకై, కల్పితం=కూర్చబడిన, నవకిసలయతల్పం=క్రొత్తచిగురుల పఱుపును, కేవలం కరసరసిజసఙ్గాత్=తామరలవంటి (తన) చేతులయొక్క స్పర్శమాత్రముననే, మ్లాపయన్త్యాః=వాడ్చు చున్న, కుసుమశర=మన్మథుఁ డనెడు, కృశాను=అగ్నిచేత, ప్రాపిత=పొందింపఁబడిన, అఙ్గారకాయాః=అగ్నిత్వము గల యట్టి (ఒక అగ్ని మఱొకవస్తువులో అగ్నిపరికల్పన చేయుట సహజము), కోమలాఙ్గ్యాః =కోమలమైన శరీరము గల కాంత యొక్క, పరితాపం= విరహతాపమును, శివశివ=అబ్బబ్బ! కో వదేత్ = (అంతయింతయని) ఎవడు చెప్పగలడు? (ఆపరితాపము వాచాతీత మనుట).

తాత్పర్యము: సులభము. కోమలాంగి యనుటచే నామె విరహతాపము నోర్వలేని సుకుమారి యని వ్యంజితము. అందుచేతనే ఆమె శరీరము మన్మథుని అగ్గికుంపటివలె మండుచున్నది. అట్టి తాపముగల యామె తాఁకినంతనే క్రొంగ్రొత్తవైనను పల్లవ ములు వాడిపోవుచున్నవి. ఈవాడిపోవుట ఆమె కర్కశమైన కరములచే గాదు. అవి తామరలవలె అత్యంత కోమలముగానే యున్నవి. ఆకరముల వేడివల్లనే వాడుట. అయోగవిప్రలంభశృంగారము. తాప మను మదనావస్థవర్ణితము. కావ్యలింగము, రూపకము, పరికరము, విషమాలంకారధ్వని.