సమూలాంధ్రపుష్పబాణవిలాసము

పుష్పబాణవిలాసము 26 శ్లోకములు గల అత్యంతలఘుకావ్యము. ఐనను ఈశ్లోకము లన్నియు అలంకారశాస్త్రములో నిర్వచింపబడిన శృంగారనాయికానాయకుల స్వభావమును వ్యంజించున వగుటచే ఈ స్వల్పకావ్యము దీనికంటె దీర్ఘతరములైన అమరుకాది సుప్రసిద్ధ శృంగారకావ్యముల సరసన విశిష్టస్థానమును సంతరించుకొని, ఆదినుండియు రసజ్ఞుల కత్యంతప్రీతిపాత్రమై యున్నది. ఈకావ్యము కాళిదాసకృత మను ప్రథ సామాన్యముగా నుండెడిది. కాని ఇది కాళిదాసకృతము కాదని, దీని కర్త ‘సాహిత్యకౌముది’ కర్త అయిన అర్క భట్టుగారని విమర్శకులు నిర్ణయించినట్లు నాకు శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారు తెల్పినారు. నేనిటీవల ఈమాటలో శృంగారనాయిక లను గుఱించి వ్రాసిన నాల్గువ్యాసములలో నిందలి కొన్ని శ్లోకముల నుదాహరించుచు, వానిలో నాల్గు శ్లోకములకు పద్యానువాదములను గూడ నిచ్చితిని. తదనంతరము మిగిలిన 22 శ్లోకములకు గూడ పద్యానువాదములు వ్రాయు సంకల్పము కలిగెను. సత్వరమే కూర్చొని సరస్వతీదేవి యనుగ్రహమువల్ల ఈకార్యమును పూర్తి చేసితిని. ఇది భావానుసృజనమే కాని ప్రతిపదానువాదము కాదు. అనువాదమును మూలముతో బోల్చి చూచికొనుటకును, మూలశ్లోకముల స్వారస్యమును గ్రహించుటకును వీలుగా మూలశ్లోకములు, వాని అర్థ తాత్పర్యములతో గూడిన నా యనువాదము నిచ్చట నిచ్చుచున్నాను. ఈ కావ్యమునకు శ్రీ వేంకటరాయపండితసార్వభౌములు రచించిన ‘శృంగారచంద్రిక’ యను విపులమైన ప్రశస్తమైన సంస్కృతవ్యాఖ్యాన మున్నది. నేనిట నిచ్చిన ప్రతిపదార్థతాత్పర్యాలంకా రాదులు దీని ననుసరించియే యున్నవి. విస్తరణభీతిచే సంస్కృతవ్యాఖ్యానములో ప్రసక్తమైన శ్లోకములయొక్క అలంకారనిర్దేశచర్చను విడిచి, అచ్చట నిచ్చిన అలంకారముల పేర్లనుమాత్రమే నేనిచ్చట పేర్కొంటిని. జిజ్ఞాసువులు సంస్కృతవ్యాఖ్యానమును చూచి విశేషములను గ్రహింపగలరని విన్నవించుకొనుచున్నాను.


శ్రీమద్గోపవధూస్వయంగ్రహపరిష్వఙ్గేషు తుఙ్గస్తన
వ్యామర్దాద్గళితేఽపి చన్దనరజస్యఙ్గే వహన్ సౌరభమ్|
కశ్చిజ్జాగరజాతరాగనయనద్వన్ద్వః ప్రభాతే శ్రియం
బిభ్రత్కామపి వేణునాదరసికో జారాగ్రణీః పాతు వః||

శ్రీయుత లున్నతస్తనులు వ్రేతలు దామె కవుంగిలింప నా
రాయిడిచేత వక్షమున రంజిలు గంధము రాలిపోయినం
బాయని మేనితావి గల వైణవికుండు, ప్రజాగరారుణా
బ్జాయతనేత్రుఁడై వరలు జారశిఖామణి మిమ్ముఁ బ్రోవుతన్.

అర్థము: శ్రీమత్…పరిష్వఙ్గేషు – శ్రీమత్=సౌందర్యము గల్గిన, లేక శోభాయుతలైన, గోపవధూ=గోపికలయొక్క, స్వయంగ్రహ=తాముగా పైకొనునట్టి, పరిష్వఙ్గేషు=ఆలింగనములయందు; తుఙ్గస్తన=ఉన్నతస్తనములయొక్క, వ్యామర్దాత్=రాయిడివలన, చన్దనరజసి=గందపుఁబొడి,గళితేఽపి =రాలిపోయినను, సౌరభమ్=సువాసనను, అఙ్గే = (తన)దేహమునందు, వహన్=తాల్చియున్నవాఁడును, జాగర…ద్వన్ద్వః – జాగర=(రాత్రి) మేల్కొనుటచేత, జాత=కల్గిన, రాగ=ఎఱ్ఱదనముగల, నయనద్వన్ద్వః=కన్నుదోయి గలవాఁడును, ప్రభాతే=ఉదయమునందు, కామపి=ఇట్టిదని చెప్ప నలవి గాని, శ్రియం=శోభను, బిభ్రత్=ధరించియుండువాఁడును నైన, వేణునాదరసికః=వేణుగానమునందాసక్తుఁడగు, కశ్చిత్= ఒకానొక, జారాగ్రణీః =మేటి జారుఁడు (శ్రీకృష్ణుఁడు) , వః=మిమ్ము, పాతు=రక్షించుగాక.

తాత్పర్యము: గ్రంథారంభమున కవి మంగళాచరణ మిట్లు చేయుచున్నాడు. ‘శోభావంతులు, సుందరులైన గోపికాకాంతలు తమంతట తామే వచ్చి కౌఁగిలించుకొనుటవలన నొదవిన స్తనముల రాయిడిచే తన శరీరమునందలి గంధపుఁబూత రాలి పోయినను తనుపరీమళము తఱుగనివాఁడును, (కేళీమూలమున) రాత్రి నిదురలేమివలన ఎఱ్ఱనైన నేత్రములు గలవాఁడును, ప్రభాతమందు వర్ణనాతీతమైన శోభగలవాఁడును, వేణునాదలోలుఁడును నైన ఒకానొక జారాగ్రణి మిమ్ములను రక్షించుగాక!’

అలంకారములు: ప్రేయో రసవదలంకారములు. విశేషోక్తి, పర్యాయోక్త్యలంకారము. ‘పరిష్వఙ్గేషు తుఙ్గస్తన’ అని ఉన్నచోట వృత్త్యనుప్రాసమను శబ్దాలంకారము.

విశేషములు: గ్రంథమును కవి శ్రీకారముతో గూడిన మగణముతో ఆరంభించినాడు. ఇట్టి ఆరంభము కవికిని, కావ్యపఠితల కును శుభప్రదమగుమని ఛందశ్శాస్త్రము. తరువాతి శ్లోకములో చెప్పినట్లుగా శృంగారరసప్రధానమైన కావ్యమును వ్రాయ సంకల్పించుచున్నాడు గనుక కవి గోపికాస్త్రీశృంగారచేష్టాయుతమైన మంగళశ్లోకముతో కావ్యారంభము చేసినాడు. ‘స్వయంగ్రహపరిష్వంగేషు’ అనుటచే, శ్రీకృష్ణునియొక్క భువనమోహనత్వము, గోపికల గాఢానురాగతత్త్వము వ్యక్తమగు చున్నవి. శ్రీకృష్ణుడని నేరుగా చెప్పక, ‘వేణునాదరసికః’, ‘జాగరజాతనయనద్వన్ద్వః’ అని చెప్పుటచే, భాగవతములో చెప్పబడినరీతిగా వేణుగానప్రభావితలైన గోపికలు, వారి అవిరతసాంగత్యములు స్ఫురించుచున్నవి. అందుచేతనే అతడు ‘జాగరజాతనయనద్వన్ద్వుఁ’డైనాడు. ‘స్వయం తుష్టః పరాన్ తోషయతి’ అను నానుడి ప్రకారము ఇట్లు గోపికాసాంగత్యముచే సంతుష్టుడైన శ్రీకృష్ణుడు కావ్యపఠితలను గూడ సంతుష్టులను జేయగలడని కవియొక్క ఆశయము.

భువనవిదితమాసీద్యచ్చరిత్రం విచిత్రం
సహ యువతిసహస్రైః క్రీడతో నన్దసూనోః|
తదఖిలమవలమ్బ్య స్వాదు శృఙ్గారకావ్యం
రచయితుమనసో మే శారదాఽస్తు ప్రసన్నా||

వేనకువేలగుబ్బెతల వేడుకఁ గూడి రమించు శౌరిచి
త్రానఘచారితంబు ప్రథితంబు జగంబున, దానిఁ గొంచు నే
నూనెద నొక్క యుజ్జ్వలరసోత్కటకావ్యము సేయ, శారదా
నూనకృపాకటాక్షమధునుత్తకవిత్వకళాధురీణునై.

అర్థము: యువతిసహస్రైః సహ=పెక్కండ్రు యువతులఁ గూడి, క్రీడతః=క్రీడించుచున్న, నన్దసూనోః= నందుని పుత్త్రుఁడైన శ్రీకృష్ణునియొక్క, విచిత్రం=వింతయైన, యత్ చరిత్రం=ఏ చరిత్రము, భువనవిదితమ్=లోకప్రసిద్ధము, ఆసీత్= ఐనదో, తత్ అఖిలమ్=అది యంతయు, అవలమ్బ్య=ఆధారముగాఁ జేసికొని, స్వాదు=మనోహరమైన, శృఙ్గారకావ్యం= శృంగారరస ప్రధానమైన కావ్యమును, రచయితుమనసః=రచింప సంకల్పించిన, మే=నాకు, శారదా= సరస్వతీదేవి, ప్రసన్నా అస్తు= అనుగ్రహముగలది యగుఁగాక. (పైన ‘శృఙ్గారకావ్యం’ అను పదము ‘ఉజ్జ్వలరసోత్కటకావ్యము’గా అనూదితమైనది. ‘శృఙ్గార శ్శుచి రుజ్జ్వలః’ అని అమరకోశములో నుండుటచే ఉజ్జ్వలరసోత్కటకావ్య మను పదమునకు శృంగారసాధికకావ్య మని అర్థము. నుత్త మనగా ప్రేరిత మని యర్థము- ‘నుత్తనున్నాస్తావిద్ధక్షిప్తేరితాస్సమాః’ అని అమరము.)

తాత్పర్యము: మంగళాచరణానంతరము కవి కావ్యనిర్వహణమునకై సరస్వతీదేవి అనుగ్రహము నిట్లర్థించుచున్నాడు. ‘సహస్రాధికులైన యువతులతో క్రీడించుచున్న శ్రీకృష్ణుని విచిత్రచరిత్రము జగత్ప్రసిద్ధము. దాని నాధారముగాఁ గొని నేనొక జనరంజకమైన శృంగారరసప్రధానకావ్యమును నిర్మింపఁగోరుచున్నాను. దీనికై సరస్వతీప్రసాదము నాకుఁ గలుగుఁగాక.’

కాన్తే దృష్టిపథం గతే, నయనయోరాసీద్వికాసో మహాన్
ప్రాప్తే నిర్జనమాలయం, పులకితా జాతా తనుః సుభ్రువః!
వక్షోజగ్రహణోత్సుకే, సమభవత్ సర్వాఙ్గకమ్పోదయః;
కణ్ఠాలిఙ్గనతత్పరే, విగళితా నీవీ దృఢాపి స్వయమ్||

కనఁబడినంతనే ప్రియుఁడు కన్నులు వక్త్రము నెల్లఁ గ్రమ్మె, ని
ర్జననిలయంబునందతఁడు ప్రాప్తిలినంతనె నిక్కెఁ బుల్కలున్,
స్తనయుగమున్ గ్రహింపఁగనె దట్టపుఁగంపము వుట్టెఁ, గౌఁగిటం
గొనియెనొ లేదొ, దానికదె గొబ్బున వ్రీలెను నీవి కాంతకున్.

సందర్భము: పరస్పరానురాగయుతులై యుండియు, కలసికొను నవకాశము లేక, ఒకనాడు ఏకాంతముగా గలసికొన్న నాయికానాయకుల చేష్ట లిందు వర్ణింపబడినవి.

అర్థము: కాన్తే =ప్రియుఁడు, దృష్టిపథం గతే = కన్నులఁబడినవాఁడు కాఁగా (కనిపింపఁగా), సుభ్రువః = (అందమైన కనుబొమలుగల)నాయికయొక్క, నయనయోః=కన్నులకు, మహాన్=అధికమైన, వికాసః=విచ్చుకొనుట, ఆసీత్=కలిగెను. కాన్తే =ప్రియుఁడు, నిర్జనమాలయం=జనులు లేని(ఏకాంత) గృహమును, ప్రాప్తే సతి=పొందగానే, తనుః=(నాయికయొక్క) శరీరము, పులకితా జాతా=గగుర్పాటు గలదయ్యెను. కాన్తే =ప్రియుఁడు, వక్షోజగ్రహణోత్సుకే సతి= స్తనగ్రహణాసక్తుఁడు కాఁగా, సర్వాఙ్గకమ్పోదయః — సర్వాంగ= శరీర మంతట, కమ్పోదయః=వణకుయొక్క పుట్టుక, సమభవత్=కలిగెను. కాన్తే =ప్రియుఁడు, కణ్ఠాలిఙ్గనతత్పరే సతి=కంఠమును కౌఁగిలించుటయం దాసక్తుఁడు కాఁగా, దృఢాపి=గట్టిదైనను, నీవీ= (నాయికయొక్క) కోకముడి, స్వయమ్=తనంతటనే, విగళితా=జారి(విడి)పోయినది.

తాత్పర్యము: ప్రియుఁడు కంటఁబడఁగానే అతనిపై మక్కువగలది కావున అతనిని చూచుటకు నాయికకన్నులు విప్పారినవి. అతడు ఏకాంతమున నామెను చేరఁగనే శరీరము పులకాంకితమైనది. స్తనగ్రహణాసక్తుఁడు కాఁగానే శరీరమున వేపథువు (కంపము) జనించినది. అతఁడామెను కౌఁగిలింపగనే దృఢముగా గట్టినదైనను కోకముడి దానికదియే వీడిపోయినది. నాయిక స్వాధీనపతిక. దర్శన స్పర్శనాలింగనాదులు వర్ణించుటచే సంభోగశృంగారము. చక్షుష్ప్రీతి యను అవస్థ, రోమాంచము, వేపథువు (కంపము) అను సాత్త్వికభావములు వర్ణితములు. నాల్గవపాదమున కామేంగితము వర్ణితము. స్వభావోక్త్యలంకారము. అనువాదపద్యములో ‘కన్నులు వక్త్రము నెల్లఁ గ్రమ్మె’ అను వాక్యము ‘కన్నులు వికసించినవి’ అనుటకన్న రమ్యముగా నుండి, నాయిక కొదవిన చక్షుష్ప్రీతి యను అవస్థను చక్కగా చిత్రీకరించుచున్నది.

మాం దూరాదరవిన్దసున్దరదరస్మేరాననా సంప్రతి
ద్రాగుత్తుఙ్గఘనస్తనాఙ్గణగళచ్చారూత్తరీయాఞ్చలా|
ప్రత్యాసన్నజనప్రతారణపరా పాణిం ప్రసార్యాన్తికే
నేత్రాన్తస్య చిరం కురఙ్గనయనా సాకూతమాలోకతే||

పరులను కన్మొఱంగ నిజపాణినిఁ గప్పి యపాంగసీమ, నా
దరహసితాంబుజాస్య నను దవ్వులనుండి చిరంబుగా నదే
యరయుచునున్నదున్నతకుచాంచలసంస్ఖలితాంశుకంబు నే
మఱికను దీర్పకుండఁ, గుసుమాంబకచోదితలోలదృష్టులన్.

సందర్భము: తనయం దనురక్త యైన ఒకానొక నాయికయొక్క దర్శానాది చేష్టల నొక నాయకుడు మిత్రునితో జెప్పుకొను చున్నాడు.

అర్థము: సంప్రతి=ఇప్పుడు, అరవిన్ద…స్మేరాననా – అరవిన్ద=కమలమువలె,సున్దర=అందమైనదియు, దర= ఇంచుక, స్మేర=నవ్వుచున్నదియునగు, ఆననా=ముఖము గల్గిన, సా కురఙ్గనయనా=ఆ లేడికన్నులనాయిక, ద్రాగుత్తుఙ్గ… చారూత్తరీయాఞ్చలా -ద్రాక్=వడిగా, ఉత్తుఙ్గ=పొంగినవియు, ఘన=గొప్పనైనవియు నైన, స్తనాఙ్గణ=స్తనముల చెంత నుండి, గళత్=జారుచున్న, చారు=అందమైన, ఉత్తరీయాఞ్చలా=పైఁటచెఱగు గలదియు, ప్రత్యాసన్న…పరా– ప్రత్యాసన్న= సమీపించుచున్న, జన=జనులయొక్క(మనస్సులను), ప్రతారణ=మోసపుచ్చుటయే, పరా సతీ= ప్రధాన వ్యాపారము గలదియు నగుచు, నేత్రాన్తస్య=కనుగొనలయొక్క, అన్తికే=సమీపమున, పాణిం=చేతిని, ప్రసార్య=చాచి (విస్తరించి), దూరాత్=దూరమునుండి, మాం=నన్ను, చిరం=చాలసేపటినుండి, సాకూతమ్=సాభిప్రాయముగా (అనురక్తితో ననుట), ఆలోకతే=చూచుచున్నది.

తాత్పర్యము: పద్మమువలె సుందరమైన ముఖమందుఁ జిఱునవ్వును జేర్చి, (లోనుప్పొంగు భావావేశమునకు ప్రతిబింబాయ మానముగా) పొంగువారెడి ఘనస్తనములనుండి పైఁట జారుచుండగా (జాఱుచున్నను పరాకుతో దానిని గమనింపక), ఇతరులనుండి తన యవస్థను కప్పిపుచ్చుకొనుటకై కడగంటి చెంత చాచినచేతి నడ్డముగా నుంచి, సాభిప్రాయముగా (దృగ్విలాసాదులచేత తన యనురక్తిని సూచించుచు), నన్నా కురంగనేత్ర దూరమునుండి చాలసేపటినుండి చూచుచున్నది.

యుక్తి, స్వభావోక్తి, వృత్త్యనుప్రాస, ఛేకానుప్రాసము లలంకారములు. నాయిక ప్రౌఢ. కురంగనేత్ర అనుటచే చూపులయందలి చంచలత్వము, త్రాసము స్ఫురించుచున్నది. కాని ప్రౌఢ కావున నలుగురిలో నుండియు సాభిలాషముగా నాయకుని జూచుచు, ఇతరులు తన దృగ్విలాసములను గమనింపకుండ కనుగొనయందు చేతి నడ్డముగా బెట్టుకొన్నది.