తన మాట కోసం

ఈ తుపాకీ చప్పుళ్ళు కుడివైపు మూడుమైళ్ళ దూరంలో ఉన్న రెజిమెంట్‌కు వినబడినట్టుంది. వాళ్ళ నుంచి టెలిఫోన్ వెళ్ళినట్టుంది. వెంటనే గంట, గంటన్నర లోపల ఇద్దరు వైద్యులతో సహా రెండు బండ్లు కూడా గాయపడిన వారికోసం పంపించబడ్డాయి. దగ్గర్లో ఫీల్డ్ వైద్యశాల ఉంది. తెల్లవారే సరికి చేరుకోవచ్చు. అందుకే ప్రాథమికచికిత్సల అనంతరం ఒక బండిలో గాయపడిన వాళ్ళను, ఇంకో బండిలో శవాలను ఎక్కించారు. సుబేదారు వచ్చి లహనాసింగ్ తొడకయిన గాయానికి కట్టు కట్టించుకోమన్నాడు. లహనాసింగ్ పట్టించుకోకుండా చిన్న గాయమే, పొద్దున చూడచ్చంటూ దాటవేశాడు. బోధాసింగ్ జ్వరంలో మూలుగుతున్నాడు. వాడినీ బండిలో పడుకోబెట్టారు. లహనాను వదిలి సుబేదార్ వెళ్ళలేదు. అది చూసి లహనాసింగ్ అతన్నీ ఎక్కమన్నాడు. బోధాసింగ్ మీద, సుబేదార్ భార్య మీద ఒట్టుపెట్టి ఎక్కమన్నాకే కదిలాడు.

“మరి నీవు!”

“మీరు వెళ్ళి నాకోసం బండి మళ్ళీ పంపండి. జర్మన్ శవాల కోసం కూడా బండి వస్తుంది. నాకు పర్వాలేదు. చూస్తున్నారు కదా ఎలా నిలబడినానో! వజీరాసింగ్ కూడా నాతోనే ఉన్నాడు.”

“సరే. కానీ…”

“బోధాకు బండిలో పడుకోడానికి ఉంది కదా! మంచిది. మీరూ ఎక్కండి. ఆఁ, ఇంట్లో వాళ్ళకు ఉత్తరం వ్రాస్తే నా నమస్కారాలు తెలియచేయండి. ఇంటికి వెళ్ళినపుడు చెప్పండి — వారు చెప్పినట్లు చేశానని.”

బండ్లు బయల్దేరబోతున్నాయి. సుబేదారు బండెక్కుతూ, లహనా చేయి పట్టుకొని, “నీవే బోధాను, నన్ను రక్షించావు. ఉత్తరం ఎందుకు? ఈసారి ఇంటికెళ్ళినపుడు నా కూడా వచ్చి నీవే చెప్పురాదూ ఆమెకు! ఇంతకీ ఏం చెప్పింది?”

“ఎక్కండి, ఎక్కండి మీరు. నేను చెప్పింది తప్పక వ్రాయండి. చెప్పండి.”

బండ్లు బయల్దేరగానే లహనా కూలబడ్డాడు. “వజీరా! కాసిన్ని నీళ్ళు పట్రా. ఈ నడుంకట్టు విప్పు. అంతా రక్తంతో తడిసిపోయింది.” అన్నాడు.

5.

మరణం సమీపించినపుడు కొంచెం సేపు గతస్మృతులు తాజా అవుతాయి. జీవనగమనమంతా ఒక్కసారి కళ్ళముందు చక్రంలా తిరుగుతుంది. పేరుకున్న కాలధూళి తొలగుతూ ఉంటే దానితో కప్పబడిన రంగులన్నీ బయటపడి, స్పష్టంగా గోచరిస్తాయి.

6.

లహనాసింగ్ కప్పుడు పన్నెండేళ్ళు. అమృత్ సర్‌లో మేనమామ యింటికి వచ్చాడు. పెరుగో కూరలో కొనేటపుడు, అక్కడా ఇక్కడా అతగాడికి ఒక ఎనిమిదేళ్ళమ్మాయి కనిపించేది. నీకు పెళ్ళి కుదిరిందా? అని అడగ్గానే ఫో! అంటూ పారిపోయేది. ఒకరోజు అలా అడగ్గా, ‘ఆఁ, కుదిరింది. చూడు ఈ పట్టు పూల దుపట్టా వాళ్ళిచ్చిందే!’ అన్నది విని లహనాసింగ్‌కు ఎంత దుఃఖం వచ్చిందో! ఎంత బాధ కలిగిందో! ఎందుకు కలిగింది?

“వజీరాసింగ్, కాసిన్ని నీళ్ళు ఇస్తావా?”

పాతికేళ్ళు గడచిపోయాయి. ఇప్పుడు లహనాసింగ్ 77 నం. రైఫిల్స్ దళంలో జమాదార్ అయినాడు. ఆ ఎనిమిదేళ్ళ అమ్మాయి సంగతే మనసులో లేదు. మళ్ళీ ఎప్పుడైనా కలిసిందో, లేదో! ఒక వారం రోజులు సెలవు పెట్టి పొలం తగాదా వాయిదా ఉంటే ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే రెజిమెంట్ ఆఫీసరు నుంచి ఉత్తరం వచ్చింది – ఆర్మీ లామ్‌కు వెళ్తుంది, వెంటనే రావాలని. అంతలో సుబేదారు హజారాసింగ్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ‘నేనూ మా వాడు బోధాసింగ్ కూడా లామ్‌కు వెళ్తున్నాము. నీవు వెళ్ళేటప్పుడు ఇటు మా ఇంటికి రా. కలిసి వెళ్దాము,’ అని. సుబేదార్ వాళ్ళ ఊరు ఎలాగూ దార్లోనే ఉంది. సుబేదారుకు లహనాసింగ్ అంటే చాలా ఇష్టం కూడా. లహనాసింగ్ ప్రయాణమై సుబేదారు ఇంటికి చేరుకున్నాడు.

బయల్దేరేముందు సుబేదార్ జనానా నుంచి బయటకొస్తూ, “లహనా, ఇంటావిడకు నీవు తెలుసంట. పిలుస్తుంది వెళ్ళు,” అని చెప్పాడు. లహనాసింగ్ లోపలికెళ్ళాడు, ఆమెకు నేనెలా తెలుసబ్బా అనుకుంటూ. రెజిమెంట్ క్వార్టర్స్‌లో కూడా సుబేదారు కుటుంబం ఎప్పుడూ నివసించి ఉండలేదు. తలుపు దగ్గర నిలబడి నమస్తే అన్నాడు. బదులు విన్నాడు. లహనాసింగ్ మౌనంగా నిలబడ్డాడు.

“నన్ను గుర్తు పట్టలేదా?”

“లేదే!”

“నీకు పెళ్ళి కుదిరిందా? ఫో! నిన్నే కుదిరింది, ఈ పట్టుపూల దుపట్టా చూడు- అమృత్ సర్!”

ముప్పిరిగొన్న భావోద్వేగాల మధ్య తెలివిడి వచ్చింది. పక్కకు తిరిగి పడుకొన్నాడు. పక్కటెముకల గాయం సలుపుతోంది.

“వజీరా, నీళ్ళు ఇస్తావా? – తన మాట కోసం.”

కలా మెలకువా కాని స్థితి. సుబేదారిణి చెప్తోంది – “నిన్ను చూస్తూనే నేను గుర్తు పట్టాను. నీకొక పని అప్పగిస్తున్నాను. సర్కారు బహద్దూర్ అని బిరుదిచ్చింది, లాయల్పూర్‌లో భూమి ఇచ్చింది. ఈనాటికి విశ్వాసం చూపించే అవకాశం వచ్చిందంట. ఆ సర్కారు ఆడవాళ్ళనూ సైన్యంలో ఎందుకు చేర్చుకోదో? నేనూ సుబేదార్‌ను వెంట ఉండి చూసుకొనే దాన్ని. ఒక్క కొడుకున్నాడు. పోయినేడే సైన్యంలో చేరినాడు. వాడి తర్వాత కూడా నాలుగు కాన్పులైనా ఒక్కరూ దక్కలేదు.” గొంతులో ఏడుపు.

“ఇప్పుడు తండ్రీకొడుకులిద్దరూ యుద్ధానికి బయల్దేరుతున్నారు. నా తలరాత ఎట్లుందో?

నీకు గుర్తుందా, ఒకరోజు జట్కాబండి నుంచి నా ప్రాణాలు కాపాడావు కొట్టు దగ్గర. గుఱ్ఱం దెబ్బలు నీవు తిన్నా, నన్ను మాత్రం జాగ్రత్తగా గట్టుమీదకెక్కించావు. ఈ సారి వీళ్ళిద్దరినీ కాపాడాలి నీవు. నిన్ను వేడుకుంటున్నాను. కొంగు పరచి భిక్ష అడుగుతున్నాననుకో.”

ఏడుస్తూ సుబేదారిణి లోపలికెళ్ళిపోయింది. లహనా కండ్లు తుడుచుకొని బయటికొచ్చాడు.

“వజీరాసింగ్, నీళ్ళు కొంచెం… తన మాట కోసం.”

లహనాసింగ్ తలను ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు వజీరాసింగ్. అడిగినపుడల్లా నీళ్ళు గొంతులో పోస్తున్నాడు. అర్ధగంట వరకూ లహనా మౌనంగా ఉండిపోయాడు. తర్వాత –

“ఎవరూ? కీరత్‌సింగా?”

వజీరా కొంచెం ఆలోచించి, “ఔను,” అన్నాడు.

“భయ్యా, కొంచెం నా తల పైకెత్తు. నీ తొడమీద పెట్టు.”

వజీరా అలాగే చేశాడు.

“ఆఁ! ఇప్పుడు సరిగ్గా ఉంది. కొంచెం నీళ్ళు పోస్తావా? ఆఁ! చాలు. ఈ వేసవిలో మామిడిపండ్లు బాగా వచ్చేటట్టున్నాయి. అందరూ ఇక్కడే కూర్చొని తినండి. నీ మేనల్లుడు ఎంత ఉన్నాడో అంతున్నాయి పండ్లు. వాడు పుట్టిన నెలలోనే ఇక్కడ ఇవి నాటించినాను నేను.”

వజీరా కండ్లు తడి అయ్యాయి.


కొన్నాళ్ళ తరువాత ప్రజలు పత్రికల్లో వార్త చదివారు.

ఫ్రాన్స్, బెల్జియం. 68వ సూచి: ఫీల్డ్‌లో గాయాల పాలై మరణించినవారు – 77 నం. సిఖ్ రైఫిల్స్ – జమాదార్ లహనాసింగ్.


(చంద్రధర్ శర్మా గులేరీ 1915లో రచించిన కథ ఉస్ నే కహా థా (उस ने कहा था). ఈ కథ మొదటి ప్రపంచయుద్ధం నేపథ్యంలో ఆ కాలపు ముఖ్యఘట్టాల మధ్య పవిత్రప్రేమ, ఆత్మబలిదానం వీటిని ఆదర్శంగా తీసుకొని ఉదాత్తంగా చిత్రించిన విధానం విలక్షణంగా ఉండి విమర్శకుల మన్ననలందుకుంది. కథా వస్తువుకు అనుకూలమైన శిల్పవిధానము, భాషాప్రౌఢిమ, ఆ కాలంలోని కథ యొక్క శైశవకాలపు అపరిపక్వతను విడిపించి కథకు ఒక గౌరవనీయమైన స్థానాన్ని చేకూర్చిందని విమర్శకులంటారు. హిందీ కథల వికాసానికి సాక్షిగా నిలిచిన సరస్వతి పత్రికలో ప్రచురింపబడిన ఈ కథ కథల స్వతంత్రగమనానికి తొలి అడుగుగా మెప్పుపొందింది. గులేరీ వ్రాసినవి మొత్తం మూడే కథలు. కానీ మిగతా రెండు గాని, వేరే రచయితల నాటి, నేటి కథలు గాని, ఏవీ ఈ కథకు పోటీ ఇవ్వలేవని ముందుమాటల్లోనూ, సాహిత్యచర్చల్లోనూ ప్రముఖంగా వినబడే మాట. వందేళ్ళ క్రితం నాటి ఈ కథ పఠనీయతను గానీ, వస్తుగతమైనప్రాసంగికతను కానీ కళాత్మకతను గానీ కోల్పోలేదని హిందీ సాహిత్యకారుల నమ్మకం. 1883లో పుట్టి, 1922లో మరణించిన గులేరీ ఒకే ఒక్క కథ ఇచ్చిన కీర్తితో ఇప్పటివరకూ హిందీ సాహిత్య చరిత్రలో నిలబడిపోవడం గమనార్హం. )