తన మాట కోసం

అరగంట గడిచింది. ఇంతలో బయటనుంచి పిలుపు వినిపించింది. “సుబేదార్ హజారాసింగ్!”

“ఎవరూ? లపటన్ సాహెబ్ గారా! నమస్తే సర్.” సైనిక వందనం చేసి నిటారుగా నించున్నాడు సుబేదార్.

“చూడు, ఇప్పుడే మనం దాడి చేయాల్సుంది. ఒక మైలు దూరంలో తూర్పు వైపు ఒక మూలకు ఒక జర్మన్ దండు ఉంది. అక్కడ ఒక యాభైకి మించి జర్మన్లు లేరు. ఇటు ఈ చెట్లదారినే వెళ్తే, రెండు పొలాల సరిహద్దులు దాటి ఒక దారి కనిపిస్తుంది. రెండు మూడు మలుపులున్నాయి. ఒక్కొక్క మలుపులో పదహైదుమంది సిపాయిలను ఉంచి వస్తున్నాను. నీవు ఇక్కడ ఒక పది మందిని మాత్రం ఉంచి అందర్నీ తీసుకొని బయల్దేరు. వాళ్ళను కలు. ఆ జర్మన్ల కందకాన్ని ఆక్రమించండి. మళ్ళీ ఆదేశాలందేవరకూ అక్కడే ఉండండి. ఇక్కడ నేనుంటాను.”

“అలాగే సర్జీ!”

వెంటనే అందరూ సిద్ధమయ్యారు. బోధా కూడా కంబళి పక్కకు పెట్టి లేచాడు. లహనాసింగ్ అతన్ని ఆపి తను వెళ్ళాలనుకున్నాడు. అంతలో బోధా తండ్రి సుబేదార్ బోధా వైపు వేలు చూపి సైగ చేయగానే, లహనాసింగ్ ఆగిపోయాడు. ఇంక దాడికి వెళ్ళకుండా కందకంలో ఉండి పోయేదెవరని చాలా చర్చ జరిగింది. ఎవరూ ఆగిపోడానికి ఇష్టపడలేదు. ఎలాగోలా నచ్చజెప్పి సుబేదార్ మార్చ్ బయల్దేరదీశాడు.

లపటన్ సాబ్ బట్టీ దగ్గరే నిలబడి సిగరెట్ బయటకు తీసి వెలిగించుకున్నాడు. పది నిముషాలయ్యాక లహనాసింగ్‌కు కూడా సిగరెట్ ఇదిగో, తీసుకొమ్మని ఇవ్వబోయాడు. రెప్పపాటులో లహనా బుఱ్ఱ వెలిగింది. తన ముఖంలో ఏ మార్పూ కనిపించకుండా, ఆఁ, ఇవ్వండి, అంటూ సిగరెట్ తీసుకోవడానికి ముందుకు వంగాడు. బట్టీ మంట వెల్తురులో సాబ్ ముఖం చూశాడు. జుట్టు చూశాడు. లపటన్ సాహెబ్ కున్న ఒత్తైన జుట్టు పోయి ఒక్కరోజులో ఇలా ఖైదీలకున్నట్టు చిన్నగా కత్తిరించిన జుట్టు ఎలా వచ్చింది?

సాహెబ్ తాగి ఉన్నాడా? లేక అతనికి జుట్టు కత్తిరించుకునే వీలు దొరికిందేమో? లహనాసింగ్ పరీక్షించాలనుకొన్నాడు. లపటన్ సాహెబ్ ఐదేళ్ళనుంచీ అతని రెజిమెంట్లో ఉన్నాడు.

“సాహెబ్, మనం హిందూస్తాన్ ఎప్పుడు వెళ్ళగలమంటారు?”

“యుద్ధం ముగిశాకే. ఏం, ఈ దేశం నచ్చలేదా?”

“అదికాదు సాబ్, వేటకెళ్ళడం ఆ మజా అవన్నీ ఇక్కడెక్కడ? గుర్తుందా మీకు, పోయినసారి తప్పు సమాచారంతో యుద్ధానికి సిద్ధమైనపుడు ఒకసారి వేటకు వెళ్ళాం, జగాధారీ జిల్లాలో!”

“అవునవును. అప్పుడు మీరంతా గాడిద మీద వెళ్తుండగా దార్లో మీ వంటవాడు అబ్దుల్లా ఒక గుడిలో అభిషేకం చేయించాలని ఆగాడు. కదా!”

సందేహం లేదు, వీడు ఆ బద్మాషే అనుకున్నాడు లహనాసింగ్.

“అప్పుడు ఆ పెద్ద దుప్పి ఎదురొచ్చింది. అసలంత పెద్ద దుప్పిని నేనెక్కడా చూడలేదు. మీరు గురిపెట్టి కాల్చేసరికి దాని భుజం మీద తగిలి మూపు లోంచి బయటికొచ్చింది. మీ వంటి ఆఫీసర్లతో కలిసి వేటాడ్డంలో మజానే వేరు. ఔను సర్, దాని తలను రెజిమెంట్ మెస్‌లో అలంకారంగా తగిలిస్తామన్నారు కదా, అది తయారై వచ్చిందా సిమ్లా నుంచి?”

“ఓ, అదా! దాన్ని నేను విదేశాలకు పంపేశాను…”

“ఎంత పెద్ద పెద్ద కొమ్ములు! రెండ్రెండు అడుగులుంటాయేమో!”

“ఆఁ! రెండడుగుల నాలుగంగుళాలు. నీవింకా సిగరెట్ వెలిగించలేదే?”

“ఇప్పుడే తాగుతా సర్, అగ్గిపెట్టె తీసుకొస్తా.” అంటూ లహనాసింగ్ కందకం లోపలివైపుకు వెళ్ళాడు. ఇంక సందేహం లేదు. ఏం చేయాలో క్షణాల్లో నిర్ణయించుకున్నాడు లహనాసింగ్. చీకట్లో లోపల పడుకున్నవారి కాలు తగిలింది.

“ఎవరూ, వజీరా?”

“ఔను, లహనా! ఏం, ఏం ముంచుకొచ్చింది? ఇప్పుడే కునుకు పడుతోంది.”

4.

“మేలుకోవయ్యా! మేలుకో! నిజంగానే ఆపద ముంచుకొచ్చింది. లపటన్ సాహెబ్ కాదు యూనిఫారంలో వచ్చింది.”

“ఏ…ఏంటీ!”

“మన లపటన్ సాహెబ్‌ను చంపేసన్నా ఉండాలి లేదా ఖైదు చేసన్నా ఉండాలి. ఆయన యూనిఫార్మ్ వేసుకొని ఎవడో జర్మన్ వచ్చాడు. సుబేదార్ ఇతని ముఖం సరిగ్గా గమనించినట్టు లేదు. నేను చూశాను, మాట్లాడాను. ఆ బద్మాష్ తడబడకుండా ఉర్దూ మాట్లాడుతున్నాడు, కానీ సహజంగా లేదు వాని భాష. నాకయితే సిగరెట్ ఇచ్చాడు తాగమని.”

“మరేం చేద్దాం?”

“చచ్చాం మనం. బాగా మోసపోయాం. సుబేదార్ అక్కడ బురదలో తిరుగుతుంటాడు. ఇక్కడ కందకం మీద దాడి జరుగుతుందిక. అక్కడ వాళ్ళ మీదా దాడి చేయకుండా ఉండరు. పద, ఒక పని చేయి. సుబేదార్‌తో వెళ్ళి చెప్పు వెంటనే తిరిగి రమ్మని. వాడు చెప్పిందంతా అబద్ధమని చెప్పు. వెంటనే బయల్దేరు. కందకం వెనుక వైపు నుంచి వెళ్ళిపో. భద్రం, ఒక్క ఆకు చప్పుడు కూడా కాకూడదు. ఆలస్యం చేయవద్దు!”

“ఇలా చేయడానికి మనకు ఆదేశాలు రాలేదు కదా, మరి…?”

“ఆదేశం రావాలా, ఇంకా నయం. నేనే ఆదేశిస్తున్నాను! జమాదార్ లహనాసింగ్! ప్రస్తుతం ఇక్కడున్న వారందరికీ పెద్ద అధికారిని. నేను చెప్పిన పని చేయి. ఇక్కడ ఈ లపటన్ సాహెబ్ సంగతి నేను చూసుకుంటా.”

“కానీ ఇక్కడ అంతా కలిసి ఎనిమిది మందే ఉన్నారు.”

“ఎనిమిది కాదు, ఎనిమిది లక్షలమంది! ఒక్కొఖ్ఖ సిక్కు ఒక లక్ష మందితో సమానం. ఊఁ, వెళ్ళు.”

మళ్ళీ మెల్లగా వచ్చి కందకం ప్రవేశద్వారం వద్ద మౌనంగా గోడకంటుకొని నించున్నాడు లహనాసింగ్. జాగ్రత్తగా గమనించసాగాడు. ఆ లపటన్ సాబ్ తన చొక్కా లోంచి మూడు చిన్న ఉండల్లా ఉన్న వాటిని తీసి కందకంలొ అక్కడక్కడా గోడలో దిగేశాడు. వాటినన్నిటినీ కలుపుతూ ఒక దారపుఉండతో కలిపి కట్టాడు. ఆ ఉండ చివరి భాగాన్ని బట్టీ దగ్గరే పెట్టాడు. తాను బయటివైపుకు వెళ్తూ, అగ్గిపుల్లను తీసి ఆ ఉండ మీద పెట్టబోతుండగా…

చప్పున కదలి మెరుపు వేగంతో తన తుపాకి వెనక్కి తిప్పి రెండు చేతులతో పట్టుకొని అతని తల మీద లహనాసింగ్ బలంగా మోదాడు. అతగాడి చేతిలో అగ్గిపెట్టె జారి పడింది. మెడమీద ఇంకొక దెబ్బ వేసే సరికి అబ్బా అంటూ పడిపోయాడతను. లహనాసింగ్ వెంటనే ఆ మూడు ఉండల్నీ గోడల్లోంచి పీకేసి బయట పడేశాడు. అతన్ని బట్టీ దగ్గరికి లాక్కుంటూ తీసుకొచ్చాడు. జేబులన్నీ వెదికాడు. మూడు నాలుగు కవర్లు, ఒక డైరీ దొరికాయి. తీసి తన జేబులో పెట్టుకొన్నాడు.

అంతలోనే వాడికి మెలకువ వచ్చింది. లహనాసింగ్ నవ్వుతూ – “ఏంటి లపటన్ సాహెబ్! ఎట్లుంది వంట్లో? ఈరోజు నేనెంత నేర్చుకొన్నానే చెప్పలేను. ఒకటా, రెండా? సిక్కులు సిగరెట్ తాగుతారని తెలుసుకొన్నాను. జగాధారీ జిల్లాల్లో దుప్పులుంటాయి. వాటికి రెండడుగుల నాలుగంగళాల కొమ్ములుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ముస్లింలు గుళ్ళోని మూర్తులకు అభిషేకం చేయాలనుకుంటారని, లపటన్ సాబ్ గాడిదనెక్కుతారని. సరే గానీ నీవు ఇంత వేగంగా ఉర్దూ మాట్లాడడం ఎలా నేర్చుకున్నావు? మా లపటన్ సాబ్ అయితే డామిట్ అనకుండా నాలుగైదు పదాలు కూడా మాట్లాడడు.” అన్నాడు.

లహనాసింగ్ పాంటు జేబులను వెదుకలెదు. సాహెబ్ తన చేతులను చలి ఉన్నట్టుగా తన రెండు చేతులను జేబులో పెట్టుకొన్నాడు.

లహనాసింగ్ – “ఊఁ! టక్కరివే. కానీ ఈ మాంఝే లహనాసింగ్ లపటన్ సాబ్‌తో ఇన్నేళ్ళ బట్టీ ఉంటున్నాడు. వీణ్ణి మోసగించడానికి రెండు కాదు నాలుగు కండ్లు కావాలి. మూడు నెలల క్రిందటనుకుంటా. ఒక తురక మౌల్వీ మా ఊరికి వచ్చాడు. పిల్లలు కాలేదని వచ్చే ఆడవాళ్ళకు తావీజులిచ్చేవాడు. పిల్లలకు మందులిచ్చేవాడు. చౌదర్ల ఇంటి మఱ్ఱిచెట్టు క్రింద మంచమేసుకొని కూర్చొని హుక్కా పీల్చేవాడు. జర్మనీవాళ్ళు గొప్ప పండితులని చెప్తుండేవాడు. మన వేదాలన్నీ చదివీ చదివీ వాళ్ళు విమానాలు తయారుచేసుకున్నారని చెప్పేవాడు. వాళ్ళు గోవుల్నీ చంపరనీ, హిందూస్తాన్‌కు వచ్చారంటే గోహత్య నిషేధిస్తారనీ చెప్పేవాడు. మండీ లోని వర్తకులకు పోస్టాఫీసుల్లోని మీ డబ్బు తీసేసుకొమ్మని, త్వరలో ఈ సర్కార్ రాజ్యం పోతుందని రెచ్చగొడుతుండేవాడు. అక్కడి పోస్ట్‌మాన్ పోల్హూరామ్ నిజమేననుకొని హడలిపోయాడు కూడా. నేనా ముల్లా గారి గడ్డం గీయించి ఊరి నించి తరిమేశాను. మళ్ళీ ఊర్లోకి అడుగుపెట్టావంటే…”

సాహెబ్ జేబులోంచి పిస్తోలు పేలింది. లహనాసింగ్ తొడలోకి దూసుకుపోయింది. లహనా తన హెన్రీ మార్టినీ రైఫిల్ రెండు రౌండ్లు కాల్చేసరికి సాహెబ్ కపాలక్రియ ముగిసింది. శబ్దాలు విని అందరూ పరుగెత్తి వచ్చారు.

బోధా, “ఏమయింది?” అంటూ లేచాడు.

లహనాసింగ్ – ‘ఏం లేదు ఒక పిచ్చి కుక్క వస్తే వేసేశా’నని చెప్పి అతన్ని పడుకోమన్నాడు. మిగిలినవారితో విషయమంతా చెప్పాడు. అందరూ తుపాకులను సిద్ధం చేసుకున్నారు. లహనాసింగ్ తలపాగా చింపి గాయానికి గట్టిగా బిగించి కట్టు కట్టుకున్నాడు. గాయం కండరానికే తగిలింది. గట్టిగా బిగించి కట్టు కట్టాక రక్తం ఆగింది.

ఇంతలో ఒక డెబ్భై మంది జర్మన్లు కందకం లోకి గట్టిగా అరచుకుంటూ దూరారు. సిక్కుల తుపాకీ వర్షం ఆక్రమణ మొదటి రౌండును ఎదుర్కోగలిగింది. రెండవ రౌండునూ ఆపగలిగింది. కానీ, అక్కడున్నది ఎనిమిదిమంది. (లహనా ఉండుండి తుపాకి పేలుస్తున్నాడు. నిలబడే ఉన్నాడు. మిగిలిన వారు నేల మీద పడుకొని పేలుస్తున్నారు.) వచ్చినవాళ్ళు డెబ్భై మంది. తమ సహచరుల శవాలపైనుంచి దాటి వాళ్ళింకా ముందుకొస్తున్నారు. కొద్ది క్షణాల తర్వాత…

ఉన్నట్టుండి వినిపించింది – “వాహె గురూజీ జయ్ హో। వాహె గురూజీ ఖాల్సా!”

ధడధడమంటూ తుపాకిగుండ్ల వర్షం జర్మనుల వెనుకవైపు నుంచి మొదలైంది. జర్మన్ల పరిస్థితి రెండు తిరగలి రాళ్ళమధ్య ఇరుక్కున్నట్టు అయిపోయింది. సుబేదార్ హజారాసింగ్, అతని బృందం వెనుకనుంచి నిప్పులు కురిపిస్తుంటే, ముందునుంచి లహనాసింగ్ తన వాళ్ళతొ కలిసి తీవ్రంగా పోరాడుతున్నాడు.

కేకలు మిన్నంటాయి. అకాల్ సిక్కుల ఫౌజు వచ్చింది! వాహె గురూజీ జయ్ హో! వాహెగురూజీ దా ఖాల్సా! సత్ శ్రీ అకాల్ పురుఖ్! – యుద్ధం ముగిసింది. అరవై ఏడుగురు జర్మన్లలో కొందరు మట్టి కరిస్తే, కొందరు గాయాలతో అరుస్తున్నారు. పదిహైదు మంది సిక్కులు అమరులయినారు. సుబేదారు కుడిభుజాన్ని గుండు గీసుకుపోయింది. లహనాసింగ్ పక్కటెముకల్లో ఒక గుండు తగిలింది. గాయానికి కందకంలో ఉన్న తడి మట్టి రాశాడు. పాగాలో మిగిలిన ముక్కని చుట్టూ తిప్పి కట్టుకున్నాడు. ఇతని రెండో గాయమూ పెద్దదేనని ఎవరూ గమనించలేదు.

యుద్ధం జరుగుతున్నప్పుడే చంద్రోదయమూ అయింది. సంస్కృత కవులిచ్చిన క్షయీ బిరుదుకు తగినట్టు చంద్రుడు తన పేరు సార్థకం చేసుకున్నట్టున్నాడు. బాణభట్టకవి వర్ణించిన దంతవీణోపదేశాచార్య స్థాయిలో చల్లగాలి వీస్తోంది. వజీరా సింగ్ తాను సుబేదారును తిరిగి తీసుకురావడానికి వెళ్తూంటే టన్నులకొద్దీ బురద తన బూట్లకు అంటుకొందొ వర్ణిస్తున్నాడు. సుబేదారు, లహనాసింగ్ ద్వారా జరిగిందంతా విని, అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని పొగడుతూ, ఈరోజు నీవు లేకుంటే మేమంతా చచ్చిపోయే వాళ్ళం అన్నాడు.