గడి నుడి – 1 సమాధానాలు

వివరణలు

క్రిప్టిక్ క్రాస్ వర్డ్ పజిళ్లలో ఇచ్చే ఆధారాల్లో సమాధానాన్ని నేరుగా గానీ డొంకతిరుగుడుగా గానీ సూచించేవి, సాధకుల సాధారణ పరిజ్ఞానాన్ని పరీక్షించేవి, పదాలకు గల నానార్థాలను ఆధారం చేసుకుని చమత్కారంగా ఇచ్చేవి, ఉచ్చారణలో సారూప్యం ద్వారా సమాధానాన్ని సూచించే హోమోఫోన్లు, ఆనగ్రాములతో చేసే విన్యాసాలు, మొదలైనవి ముఖ్యమైన రకాలు. నానార్థాల ఆధారాల్లో ఒక పదం లేదా పదబంధాన్ని సూచించే రెండు (లేక అంతకంటే ఎక్కువ) భాగాలుంటాయి. వాటిలో ఒక్కొక్కటీ సమాధానం యొక్క నానార్థాల్లో ఒక్కొక్కదాన్ని సూచిస్తుంది. ఆనగ్రాములున్న ఆధారాల్లో సాధారణంగా మూడు భాగాలుంటాయి. అలాగని ప్రతి ఆధారంలోనూ మూడూ ఉండాలనే నియమమేదీ లేదు. ఆ మూడు: 1. సమాధానాన్ని నేరుగా సూచించే భాగం, 2. ఆనగ్రామ్, 3. ఆనగ్రామ్ సూచన. ఆనగ్రామ్ నుంచి సమాధానాన్ని రాబట్టడం కోసం ఒక్కోసారి కొన్ని అక్షరాలను చేర్చడం లేదా తొలగించడం, సాధారణంగా అక్షరాల అమరికను మార్చడం అవసరమౌతాయి. వీటిలో ఏమేం చెయ్యాలో సూచించేదే ఆనగ్రామ్ ఇండికేటర్ (ఆనగ్రామ్ సూచన). సమాధానాన్ని నేరుగా సూచించే భాగం మామూలు క్రాస్వర్డ్ లలో ఉన్నంత స్పష్టంగా ఉన్నట్లైతే ఆనగ్రామ్తో అవసరమే ఉండదు కాబట్టి ఇది ఎంత అస్పష్టంగా ఉంటే ఆధారం అంత రక్తికడుతుంది. ఇక ఆనగ్రామ్ ను వీలైనంత సంక్లిష్టం చెయ్యడం, ఆనగ్రామ్ సూచనను ఇచ్చినప్పటికీ ఒక్కోసారి దాన్ని క్లూలోనో ఆనగ్రామ్ లోనో కలిపెయ్యడం ద్వారా లేనట్లు భ్రమింపజెయ్యడం కూర్పరులు పాటించే ట్రిక్స్.

(గమనిక: మామూలుగా ఐతే అనుస్వారం గుణింతంలో వస్తుంది కాబట్టి అక్షరం నుంచి విడదీయకూడదు, విడి అక్షరంగా లెక్కించకూడదు. ఐతే గళ్ళనుడికట్టు ఆధారాల్లో ఆనగ్రామ్ కోసం ఆ మాత్రం స్వేచ్ఛ తీసుకోవడం కద్దు.)

అడ్డం

 1. తలాతోకా లేని శ్రామికుడా, మాల సర్ది కడితే పండగౌతుందా? (4)
  ఇక్కడ తల అంటే ముందుభాగం, తోక అంటే వెనుకభాగం. “తలాతోకా లేని” అని ఉంది కాబట్టి ఆధారంలో ఎక్కడో మొదటి, చివరి అక్షరాలను తొలగిస్తే సమాధానమో ఆనగ్రామో వస్తుందన్నమాట. “సర్ది” అనేది ఆనగ్రామ్ సూచన. “మాల కడితే పండగౌతుందా?” అనేది సమాధానాన్ని నేరుగా సూచించే భాగం. పండగలప్పుడు సాధారణంగా మామిడాకుల తోరణం (మాల) కడతాం కదా? కాబట్టి సమాధానం మామిడాకు. “శ్రామికుడా, మాల”లో తలాతోకా తీసేస్తే మిగిలేది “మికుడామా”. దీన్ని సర్దితే వచ్చే “మామిడాకు” దీనికి సమాధానం. ఈ ఆధారంలో మాల అనే పదం ఆనగ్రామ్ లోనూ, ప్రధాన ఆధారంలోనూ భాగమై ద్విపాత్రాభినయం చేస్తోందన్నమాట.

 2. కంకారనిచ్చి చెదరగొట్టండి, పోయిందిపోగా మిగిలిందే కాగల కార్యం చేసేస్తుంది (3)
  ఇక్కడ “కాగల కార్యం చేసేస్తుంది” అనేది ప్రధానమైన ఆధారం. “చెదరగొట్టండి” అనేది ఆనగ్రామ్ సూచన. కాబట్టి “కంకారనిచ్చి”లో ఆనగ్రామ్ ఉందన్నమాట. “పోయిందిపోగా” అనికూడా ఉందికాబట్టి కొన్ని అక్షరాలను తొలగించాలి. సమాధానం “కారకం”.

 3. దేవభాషలో దండనాయకుడు ప్రథమపూజ్యుడు (4)
  దండనాయకుడు సైనిక విభాగానికి పెద్ద. ఈ విభాగాలనే సంస్కృతంలో గణాలు అంటారు. అన్ని దేవగణాలకూ నాయకత్వం వహించేవాడు గణ-పతి. మొదటిపూజలను అందుకునేది ఆయనే. దేవ అనే పదం అటు దండుకూ, ఇటు భాషకూ వర్తిస్తుంది.

 4. వలలుడు పసరులు తంతిలా మింగినా పలువరుస తప్పితే కలిసినట్లా కలవనట్లా?(6)
  “కలిసినట్లా కలవనట్లా?” అనే సందేహం ప్రధానమైన ఆధారం. “వరుస తప్పితే” అనేది ఆనగ్రామ్ సూచన. “వలలుడు పసరులు తంతిలా” అనేది ఆనగ్రామ్. “పలువరుస తప్పితే” అని ఉంది కాబట్టి ‘ప’,’లు’,’వ’,’రు’,’స’ అనే అక్షరాలను ఆనగ్రామ్ లోనుంచి తప్పించాలి. మిగిలింది “లడులుతంతిలా”. దీనికి ఆనగ్రామ్ తిలతండులాలు. తిలతండులాలు అంటే నువ్వులు, బియ్యం. ఆ రెంటినీ కలబోస్తే వేరుచెయ్యడం చాలా కష్టం. అలాగని రెండూ కలిసిపోయాయనీ చెప్పలేం. ఎందుకంటే నువ్వుగింజలేవో, బియ్యం గింజలేవో స్పష్టంగా కనబడుతూనే ఉంటాయి.

 5. క్లుప్తంగా కుటీరం నిర్మిస్తే ఫామిలీ ప్లానింగంటారేంటి? (2)
  ఇక్కడ ఫామిలీ ప్లానింగ్ అనేది అధారం. వార్తాపత్రికల్లో కుటుంబ నియంత్రణను కు.ని. అని పేర్కొంటారు. క్లుప్తంగా అంటే పొడి అక్షరాల్లో “కుటీరం నిర్మిస్తే” కాస్తా కుని అవుతుంది. అదే సమాధానం.

 6. వాడన పని చెడి కరువును తెచ్చింది (3,2)
  ఇక్కడ “కరువును తెచ్చింది” అనేది ప్రధానమైన ఆధారం. “చెడి” ఆనగ్రామ్ సూచన. మిగిలింది “వాడన పని”. దాన్ని సర్దితే వచ్చేది “పడని వాన” కరవుకు కారణమయ్యేది.

 7. సన్న్యసించినవారి మైత్రి పద్యపాదాల్లో (2)
  సన్న్యసించినవాళ్ళను యతి అంటారు. యతిమైత్రి పద్యపాదాల్లో ఛందస్సులో భాగంగా వస్తుంది.

 8. తెలుగువారి కర్ణాభరణంగా అమరే రాశి (2)
  చెవికి పెట్టుకునే ఆభరణం “పోగు”. రాశి అన్నా అర్థం పోగు (collection లేదా కుప్ప) అనే.

 9. కండగలవాడే మనిషోయ్ అన్నా ఆ కండల్లో ఉండాల్సింది ఇదే (3)
  ఆధారం నేరుగానే ఉంది.

 10. నీళ్ళపారకానికి రైతులు వాడే పనిముట్టు (2)
  చేలలో ఒక కయ్యలోనుంచి ఇంకో కయ్యలోకి నీళ్ళను మళ్ళించడానికి గట్లను మార్చడానికి వాడేది పార. “నీళ్ళపారకానికి” అనే పదంలోనే “పార” ఉంది.

 11. నీ అంతవారు లేరనే వంధిమాగధుల పొగడ్తలను తలకెక్కించుకునే పాలకులు (4)
  నీ అంతవారు లేరనే వంధిమాగధుల పొగడ్తలను తలకెక్కించుకునే పాలకులు నిరంకుశులు, నియంతలు ఔతారు. “నీ అంత” అనే పదం నియంతను సమాధానంగా సూచిస్తుంది.

 12. పాపని చిన్నగా సర్దుకోమనండి, పొద్దున్నే ఇల్లు శుభ్రం చేసుకోవాలి (4)
  “పొద్దున్నే ఇల్లు శుభ్రం చేసుకోవడం” ప్రధానమైన ఆధారం. సర్దుకోమనడం ఆనగ్రామ్ సూచన. “పాపనిచి” సర్దితే “పాచిపని”.

  21 తలలేని వనితల కారడివి (2)
  “కారడివి” ప్రధానమైన ఆధారం. “వనితల”లో “తల” తీసేస్తే మిగిలేది “వని”. అంటే అడవి.

 13. పచ్చికాయను చూస్తే బెరుకా? కరకరలాడే వరుగులు కూడా చేదేనా? (3)
  చాలామందికి కాకరకాయను చూస్తే దాని రంగు, రూపం రెండిటివల్లా విముఖత. “బెరుకా? కరకరలాడే”లో ప్రశ్నగుర్తుకు అటూ ఇటూ ఉన్న అక్షరాలను కలిపి చదివితే కాకర అని నేరుగా తెలుస్తుంది. కాకరకాయ చేదు తెలియకుండా కరకరలాడే వరుగులు చేసుకోవచ్చు.

 14. తిరుగు ప్రయాణంలో ఒరసి పారే చెడురక్తం (2)
  “పారే చెడురక్తం” అనేది ప్రధానమైన ఆధారం. “తిరుగు” అనేది ఆనగ్రామ్ సూచన. “తిరుగు ప్రయాణం” అంటే శరీరభాగాల నుంచి మలినమైన నెత్తురు గుండెకు తిరిగి వెళ్ళడం. ఆ వెళ్ళేది సిరల ద్వారా. “ఒరసి”ని తిరగేసి చదివితే దాంట్లోనే సమాధానముంది.

 15. శ్రుతైతే రెండోది. ఉపాయాల్లో మాత్రం మొదటిదే (2)
  శ్రుతి అంటే వేదం. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేదాల్లో రెండోది “సామ”వేదం. సామ, దాన, భేద, దండోపాయాల్ల్లో మొదటిది “సామ”.

 16. పాము రక్తం అక్ఖర్లేదు, విషం జర పిండుకోగలిగితే మందులోకి పనికొస్తుంది (3)
  రక్తపింజర అనే పాము విషాన్ని మందుల తయారీలో వాడతారు. రక్తం అక్ఖర్లేదు కాబట్టి “రక్త”ను తొలగిస్తే మిగిలేది “పింజర”. “జరపిండుకోగలిగితే” లో పింజర ఆనగ్రామ్ ఉంది.

 17. జనసమ్మర్ధంలో సులభంగా వ్యాపించే కండూతి (2)
  కండూతి అంటే “నస”, “నవ్వ” లేక “దురద”. ఫంగస్ లాంటి సూక్ష్మజీవుల ద్వారా కలిగే కండూతి ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తుంది. ఐతే “జనసమ్మర్ధం”లోనే “నస” ఉంది. కాబట్టి అదే సమాధానం.

 18. ధర్మం దీన్నిబట్టి మారుతుందంటారు (2)
  ధర్మం ఒక్కో యుగంలో ఒక్కోరకంగా ఉంటుందని అంటారు (కృతయుగంలో నాలుగుపాదాలమీద, త్రేతాయుగంలో మూడుపాదాలమీద, ద్వపరయుగంలో రెండుపాదాలమీద, కలియుగంలో ఒకేపాదమ్మీద నడుస్తుందని అంటారు).

 19. తెలంగాణ గొడవ (2)
  గొడవను తెలంగాణలో “లొల్లి” అంటారు.

 20. డిప్ప భలే కటువైనదని తలలు పేరిస్తే ఒకానొక హంసకు తోడైనవాడు (3)
  తల అంటే పదంలోని మొదటి భాగం/అక్షరం. ఈ ఆధారంలోని మొదటి మూడు పదాల్లోని మొదటి అక్షరాలను పేరిస్తే డిభక. హంస డిభకులనేవాళ్ళు పురాణపాత్రలు.

 21. పిల్లి లేని పినతల్లి వికారంతో కూడి వంగిపోయింది (3)
  “పినతల్లి”లో “పిల్లి” పోగా మిగిలేది “నత”. దానికి ముందు వి చేరిస్తే వినత. “వంగిపోవడం” అక్షరాల వరుస మారిందనడానికి సూచన.

 22. అడ్రెస్ జాన్తా హై సర్జీ? (2)
  ఆధారం హిందీలో ఉంది కాబట్టి సమాధానం కూడా పరభాషలోనే ఉంటుంది. అడ్రెస్ ను హిందీ/ఉర్దూలో పతా అంటారు. పతా అనే మాటకు జాన్తా (తెలుసు) అనే అర్థం కూడా ఉంది.

 23. కవనం వికసించేది ఇతడి తలలోనే (2)
  కవనం అంటే కవిత్వం. “కవనం వికసించేది”లోని “తల”లు కలిపినా కవి ప్రత్యక్షమౌతాడు.

 24. దేవభాషలో పరలోకవాసులు ఏమ్మనుషులు? (5)
  దేవభాష సంస్కృతంలో కిం అంటే ఏమిటి అని అర్థం. ఏం మనుషులు అంటే కిం-పురుషులు. దేవ, దానవ, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెరుల్లాగే వీళ్ళు కూడా ఒక పరలోక జాతి.

 25. విరూపాక్షుడి సాక్షిగా విజయనగరమిదే (2)
  విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి. హంపిలోని విరూపాక్ష ఆలయం చారిత్రకంగా ప్రసిద్ధి చెందినది.

 26. ఒకరకమయిన రాశి (3)
  పన్నెండు రాశుల్లో మకర రాశి ఒకటి. “ఒకరకమయిన”లో “మకర” అటుతిరిగి ఉంది గమనించండి

 27. చూరు పొట్టిదై వేడిగా గుచ్చబోయింది (2)
  ఒక పదం పొట్టిది కావడమంటే దాంట్లోని దీర్ఘాలు హ్రస్వాలు కావడం. “చూరు” పొట్టిదైతే “చురు” అవుతుంది. చురు/చుర్రు అంటే వేడి.

 28. ప్రలోపించిన ప్రపంచకమే సంపెంగా? (3)
  “ప్రపంచకం”లో ప్ర-లోపిస్తే పంచకం మిగుల్తుంది. దానికి ఆనగ్రామ్ చంపకం. అంటే సంపెంగ. ఆధారంలోని ప్రశ్నార్థకం, ఈ ఆధారంలో సమాధానం నేరుగా రాదని, కొంచెం శోధించవలసిన అవసరముందని తెలుపుతోంది.

 29. తడబడిన బాన గుటుక్కుమనుటే హాస్యాస్పదం (4)
  “హాస్యాస్పదం” అంటే నగుబాటు. అది ఆధారంలోని మొదటి నాలుగక్షరాలకు ఆనగ్రామ్.

 30. సంధ్యవేళ కనిపించే ఎరుపు రంగు (5)
  సంజ/సంజె అంటే సంధ్య, కెంపు అంటే ఎరుపు, చాయ అంటే రంగు. ఈ మూడు పదాలకు సంధి కలిపితే సంజకెంజాయ.

 31. వాద్ర తలం చలించి వాపోతే రాచతీగ (4)
  “వాద్ర”లో నుంచి వా-పోతే మిగిలేది ద్ర. దానికి తర్వాతి మూడక్షరాలు కలిసి “ద్ర తలం చ” అవుతుంది. “చలించి” అనేది ఇక్కడ ఆనగ్రామ్ సూచిక. ఆ నాలుగక్షరాలను సరిచేస్తే చంద్రలత చంద్రుడు = రాజు, లత = తీగ.

 32. దాయాదుల కసిలో దాక్కుని ఉంది (3)
  “దాయాదుల కసి”లో ఇట్నుంచి చూస్తే “కలదు” (=ఉంది) కనిపిస్తుంది. నేరుగా చూస్తే కనబడదు కాబట్టే “దాక్కుంది” అనడం.

 33. రామనాథపురం వెళ్ళాల్సిన నాగపురం రథం దారితప్పి ఇక్కడికొచ్చింది (6)
  “నాగపురం రథం” ఆనగ్రామ్ రంగనాథపురం. ఇది “రామనాథపురం” లా ధ్వనించే పేరు. “దారితప్ప”డం ఆనగ్రామ్ సూచన.

 34. వలకు యంత్రాన్ని జోడించి సర్దితే ప్రపంచమే పడుతుందా? (4)
  “వలకు యంత్రాన్ని”లోని మొదటి నాలుగక్షరాలు “వలకుయం”. సర్దితే – కువలయం = ప్రపంచం.

నిలువు

 1. తిరుమాడవీధుల్లో తిరిగొచ్చిన కోతి (3)
  “తిరుమా”డవీధుల్లో మొదటి మూడక్షరాలను తిరగేసి చదివితే “మారుతి” (= కోతి)

 2. ‘MOM’లోని మామ పెళ్ళిచేసుకుంటామంటే ఎర్రగా అడ్డుపడతాడే? (3)
  మామ్ (MOM = Mars Orbiter Mission) లోని మామ అంటే మార్స్ లేక అంగారకుడు లేక కుజుడు (సౌరకుటుంబంలో భూమాతకు సోదరుడు కాబట్టి మామ). ఇది ఎర్రని గ్రహం. జాతకాలను నమ్మేవాళ్ళ పెళ్ళిళ్ళకు కుజదోషం ఒక పెద్ద అడ్డంకి.

 3. అడ్డదారిలో దూరకు! కావిడిని రకాలుగా మార్చే కీకారణ్యం (3,3,4)
  “అడ్డదారిలో” ఆనగ్రామ్ సూచన. “దూరకు! కావిడిని రకాలు”కు ఆనగ్రామ్ “కాకులు దూరని కారడివి”.

 4. అసలువాళ్ళకు లేని బాధ కొసరువాళ్ళకు అవసరమా? (3,2,3,7)
  ఆధారం నేరుగానే ఉంది.

 5. నిగనిగలాడే ఖనిజం పుట్టిల్లు (2)
  ఖనిజం దొరికేది గనిలో. “నిగనిగలాడే” మధ్యలో గని ఉంది.

 6. మంత్రాలతో పనిలేని టక్కుటమార విద్య (3,3,2)
  ఆధారం నేరుగానే ఉంది.

 7. ఊరికే ఆత్రపడక ప్రధాని మేన దానం సరిగా గమనించు (4,3)
  “ప్రధాని మేన దానం” ఆనగ్రామ్ “నిదానమే ప్రధానం”.

 8. సంగీతప్రియుల యత్నంలో దాగిన మోసం (2)
  “లయ” అంటే మోసం. ఎవరైనా మోసకారితనంగా ప్రవర్తిస్తే “బో లయబడ్తండవే?”, “లయ బడాకు (పడవద్దు)” అనడం రాయలసీమ వాడుక. “సంగీతప్రియుల యత్నం” మధ్యలో “లయ” ఉంది. Rhythm అనే అర్థంలో లయ సంగీతసంబంధి.

 9. రెండురెమ్మల లతాంతం పాతి సరిగా పెంచితే డాష్ మీద DoT పడింది (2,3)
  “సరిగా” అనేది ఆనగ్రామ్ సూచన. “లతాంతం పాతి” అనేది ఆనగ్రామ్. దాన్ని సరిచేస్తే వచ్చేది “తంతితపాల” (P & T – Postal and Telegraph). తంతి అంటే టెలిగ్రాం సర్వీసు. టెలిగ్రాం సందేశాలు చుక్కలు-గీతల (డాట్ మరియు డాష్) ద్వారా ట్రాన్స్‌మిట్ అవుతాయి. ఐతే భారతదేశంలో సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా DoT (Department of Telecommunications) సేవలు విస్తృతం కావడం వల్ల టెలిగ్రాం సేవలతో అవసరం తీరిపోయి 2013లో దానికి డాట్ (ఫుల్ స్టాప్) పెట్టేశారు. DoT తో మూడు భిన్నమైన అర్థాలను స్ఫురింపజేయడం ఈ ఆధారంలో విశేషం.

 10. పలుగును సూటిగా విసిరినా, అడ్డదిడ్డంగా వాడినా ఎదుటిదానిమీద కనిపించే ప్రభావం (3)
  “అడ్డదిడ్డంగా” అనేది ఆనగ్రామ్ సూచన. పలుగును దేనిమీదైనా విసిరితే అది కాస్తా పగిలిపోతుంది లేదా కనీసం చీలిక (“పగులు”) వస్తుంది. మరి ఆనగ్రామ్ ఎక్కడుంది? పలుగే ఆనగ్రామ్ ఇక్కడ.

 11. లవా! తోక తెగినట్లుంది, వెనక్కి తిరిగి చూడు (2)
  “లవా” వెనక్కి తిరిగితే “వాల” = తెగిన తోక (వాలం).

 12. అచ్చులు వాడి చేసిన బొమ్మ (2,3,3)
  విగ్రహాలను అచ్చులో పోతపోసి చేస్తారు. అప్పుడది “పోత పోసిన విగ్రహం” ఔతుంది.

 13. స-రసాలెక్కువైన బస్తీ (8,3)
  ఎక్కువైన రసాలు “ఒలికి”పోతాయి. అదో సరసం :-). నవరసాలొలికించు నగరం.

 14. కన్నడిగుల పాపం తెలుగువాళ్ళకు ఎంత ముద్దొస్తుందో! (2)
  తెలుగులో ఉన్న ప్రథమావిభక్తి ప్రత్యయాలు “డు,ము,వు,లు” కన్నడంలో లేవు కాబట్టి “పాపం(పాపము)” కాస్తా “పాప” అవుతుంది. తెలుగులో పాప కంటే ముద్దొచ్చేదేముంది?

 15. నరసమాంబ తలలో మడతపడిన నాలుక (3)
  రసన అంటే నాలుక. “మడతపడిన” అనేది ఆనగ్రామ్ సూచన. “నరసమాంబ తలలో” అంటే “నరసమాంబ”లోని మొదటి మూడక్షరాలు “రసన”కు ఆనగ్రామ్.

 16. తెల్లటి పువ్వు వనకలేకపోయినా మన్మథబాణమే (2)
  మన్మథబాణాల్లో తెల్లనిది నవమల్లిక. వ,న,క పోగా మిగిలేది “మల్లి”.

 17. పాకిస్తాన్లో నగరం వంటదినుసా? (2)
  రావల్పిండిని క్లుప్తంగా పిండి అని కూడా అంటారు. పిండి ఒక వంటదినుసు.

 18. సగం పనిలోనే బుట్ట సర్దుతారా? (2)
  “సర్దుతారా” అనేది ఆనగ్రామ్ సూచన. “సగంపని” మధ్యలో “గంప” ఉంది.

 19. ఉండడానికి ఇల్లు లేదు, కానీ నీకో డోలెందుకోయ్ (3,4)
  ఆధారం నేరుగానే ఉంది.

 20. తగిన రసం తాగొచ్చు (2)
  సంస్కృతంలో చారు అంటే తగిన అని అర్థం. తమిళంలో రసం అన్నా చారే. ఈ చారును తాగొచ్చు.

 21. ఎలుక గుట్టుగా ఉండేచోటు (3)
  ఎలుక ఉండేచోటు కలుగు. గుట్టుగా అనేది ఆనగ్రామ్ సూచన. “ఎలుకగుట్టుగా”లోని “లుకగు” అనేది ఆనగ్రామ్.

 22. విడిపోయి చెడిపోయిన ఈ మహాచంద్ర విరాగుడి గాంధీ లేని ఆంగ్ల భారతం ప్రసిద్ధం (4,2)
  ఇక్కడ భారతం అంటే భారతదేశం (India). ఆంగ్లంలో India After Gandhi గ్రంథకర్త “రామచంద్ర గుహా”. “చెడిపోయిన” అనేది ఆనగ్రామ్ సూచన. “విడిపోయి” అని కూడా ఉంది కాబట్టి “మహాచంద్ర విరాగుడి”లో నుంచి వి,డి అనే రెండక్షరాలు తీసెయ్యాలి. అప్పుడది “మహాచంద్రరాగు” అవుతుంది. దీన్ని సరిచేస్తే “రామచంద్రగుహా”.

 23. గురుపుత్రుడి తల తొలిచిన క్రిమి (3)
  “గురుపుత్రుడి”లోని మొదటి మూడక్షరాలను తిరగేస్తే పురుగు (= క్రిమి).

 24. నారిని లోభిగా మార్చే కంప్యూటరు (2)
  కంప్యూటర్ = పి.సి.
  పిసి + నారి = పిసినారి = లోభి.

 25. చెడిన కలప (3)
  లక్షణంగా ఉన్న “కలప”లోని అక్షరాలు చెదిరి ఒక అర్థంలేని పదం “కపల” అయింది.

 26. చారానా కాదు ముప్పావలా (3)
  చారానా అంటే నాలుగణాలు (పావలా). ఆఠానా అంటే ఎనిమిదణాలు (అర్ధరూపాయి). బారానా అంటే పన్నెండణాలు.

 27. మేలిరకం సంబంధం పాడిపంటలకు లాభదాయకం (3)
  పంటల్లోనూ, పశువుల్లోనూ మేలిరకపు భిన్నజాతుల మధ్య “సంకరం” చేస్తారు. “మేలిరకంసంబంధం”లోని “రకంసం” ఆనగ్రామ్.

 28. తాటిముంజలలోని నీటిజాడ (2)
  జల అంటే నీటిజాడ. “తాటిముంజల” చివర జల ఉంది.

 29. మచ్చ మిగుల్తుందేమోగానీ నయంగానిదైతే కాదు (2)
  “గాయం” నయమైన తర్వాత మచ్చ మిగలొచ్చు. “నయంగానిదైతే”లోని “యంగా” ఆనగ్రామ్.