వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! — సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం

బాపుగారు మీ కథలన్నిటికీ బొమ్మలు వేశారు కదా! వేలుపిళ్ళైకి వేసిన బొమ్మ, లాంతరు వెలుగులో సెందామరై మొహం మీద కదలాడే వెలుగు నీడలు అద్భుతంగా కనిపిస్తాయి. అదే ముఖచిత్రంగా కూడా వేశారు ఆ పుస్తకానికి. పత్రికలో రమణగారు పని చేస్తున్నపుడు మీరు కథలన్నీ పత్రికకే రాశారు. బాపు రమణలతో మీ స్నేహం ఎలా ఉండేది?


వేలుపిళ్ళై (1955) – బాపూ

అవును, నేను ఆంధ్రపత్రికకు రాస్తున్నపుడు రమణ సంపాదక వర్గంలో ఉండేవాడు. అప్పుడే బాపుతో కూడా నాకు పరిచయం. ఆ స్నేహంతోనే ప్లాంటేషన్స్ లోని మా బంగ్లాకు వాళ్ళిద్దరూ వచ్చి కొద్ది రోజులుండేవారు. ఆ ప్రాంతాల్లో షూటింగ్ ఉంటే తప్పక వచ్చేవారు. ఒక్కోసారి ఇతర నటుల్ని కూడా తీసుకొచ్చేవారు. చిరంజీవి, బోనీ కపూర్‌లను కూడా బాపు రమణలు వారితో పాటు మా ఇంటికి తీసుకొచ్చారు.

గోరంత దీపం సినిమాకు సమర్పకులుగా మీ పేరు వేస్తారు సినిమాలో! మీరు నిర్మాతగా ఉన్నారా?

నా గురించి అన్నీ బాగా తెలుసుకుని మరీ వచ్చినట్టున్నారే! (నవ్వుతూ…) లేదు, బాపు రమణలతో ఉన్న స్నేహం కొద్దీ అలా సమర్పకుడిగా పేరు వేశారు తప్పించి, నేనేమీ డబ్బు పెట్టుబడి పెట్టింది లేదు.

సరే, మళ్ళీ మీ కథలకే వద్దాం. మీ కథల్లో పాత్రలన్నీ మీరు చూసినవేనా? సృష్టించినవి లేవా?

దాదాపుగా అన్నీ నేను స్వయంగా చూసినవే! సృష్టించి రాసినవేవీ లేవు. వాళ్లలో చాలామంది నా దగ్గర పని చేసిన వాళ్ళే.

సెందామరై, వేలుపిళ్ళై కూడానా?

వేలుపిళ్ళై నిజమైన వ్యక్తే! ఆ పెద్ద బజారు, అంగడి అవన్నీ నిజమే! వేలుపిళ్ళై ధర్మం అని రాసి కట్టిన వినాయకుడి గుడి కూడా ఇప్పటికీ అక్కడ ప్లాంటేషన్స్‌లో ఉంది.

వేలు పిళ్ళై జీవితంలో సెందామరై కూడా ఉందా?

(పెద్దగా నవ్వారు.) మంచి ప్రశ్న కదూ! సెందామరై కల్పిత పాత్ర. సెందామరై లేకపోతే వేలుపిళ్లై ఫలానా చోట గుడి కట్టించాడు అని రాస్తే కథ అవదు కదా! అందుకే సెందామరైని కల్పించి వేలుపిళ్లై పాత్రతో కలిపి కథ రాశాను.

సెందామరై ఆ కథలో కనిపించదు. కానీ కథ మొత్తం సెందామరై చుట్టూనే తిరుగుతుంది. అందుకే కథ పేరు సెందామరై అని పెడితే బాగుండేది అనిపించింది నాకు, నేను టెంత్ స్టాండర్డ్‌లో మొదటి సారి ఆ కథ చదివినపుడు.

(చాలా సేపు నవ్వారు. నవ్వుతూనే…) సెందామరై ఈజ్ డెడ్! ఆమె పేరు ఎలా పెడతాం?

ఏనుగుల రాయి కథలో కాడా జాతి మనుషుల గురించి, ఏనుగుల గురించి వివరంగా రాశారు కదా! అలాటి వాటికి ప్రత్యేకించి ఏమైనా స్టడీ చేశారా?


ఏనుగుల రాయి – బాపూ

అవసరం లేదు. వాళ్లంతా నాతో పని చేసి, నా చుట్టూ మసలిన మనుషులే! ఆ ఏనుగులు, అవన్నీ అక్కడ సాధారణంగా జరిగే విషయాలే. కథ వస్తువే మనకు కావలసింది. వాళ్లతో కలిసి పని చేయడం వల్ల వాళ్లకు సంబంధించిన విషయాలన్నీ మన గమనింపులోకి అప్రయత్నంగానే చేరి పోతాయి. నా కథల్లోని సంఘటనలు చాలా వరకూ ప్లాంటేషన్స్‌లో జరిగినవే! అంతెందుకు? గాళిదేవరు కథ కూర్గ్ ప్లాంటేషన్‌లో జరిగిన కథే! యదార్థ సంఘటన అది.

అవునూ, వేలుపిళ్లై కథలోని తమిళ కూలీలంతా తూర్పు గోదావరి జిల్లా యాస తెలుగు మాట్లాడతారేం?

(పెద్దగా నవ్వారు.) మనకు తెలిసింది ఆ తెలుగే గనక! నిజానికి వాళ్లెవరికీ తెలుగు రాదు. ఎలా వస్తుంది. తమిళ వాళ్ళు కదా! వాళ్లంతా తమిళంలో మాట్లాడిన మాటల్ని నేను తెలుగులో అందించాలంటే నాకు తెలిసిన తెలుగునే వాడితే పోదూ? నాకు తెలీని వేరే యాసల జోలికి పోవడం దేనికీ?

తెలుగు సాహిత్యం చదువుతున్నారా? ఇప్పుడు వస్తున్నవి కూడా చదువుతారా? అభిమాన రచయితలు ఎవరైనా ఉన్నారా ప్రత్యేకించి తెలుగులో కానీ ఇతర భాషల్లో గానీ?

అన్ని పుస్తకాలూ చదువుతాను. ఇప్పుడు వస్తున్నవి కూడా చదువుతాను. ప్రత్యేకించి ఒకరని కాదు గానీ, చాలా మంది అభిమాన రచయితలున్నారు. ఎక్కువగా ఆంగ్ల సాహిత్యం చదువుతాను.

ఆ ప్రశ్న అడగక్కర్లేదేమో నేను. కనిపిస్తూనే ఉన్నాయి కదా చుట్టూ అల్మైరాల్లో ఇంగ్లీష్ పుస్తకాలు. మరి మీ కథల్లో మీకు నచ్చే కథ ఏదైనా ఉందా?

నా కథలన్నీ నాకు నచ్చేవే. మీకు నచ్చే కథలేవి నా కథల్లో?

ఏనుగుల రాయి, వేలుపిళ్ళై బాగా ఇష్టం. ఇంకా కంపెనీ లీజ్ కథ కూడా నాకిష్టం! కడకరై ఏనుగులతో, ప్రకృతితో అలా స్నేహం చేయడం నాకు చాలా నచ్చుతుంది. పదో క్లాస్‌లో ఉండగా చదివాను ఆ కథ. పెద్దయాక నల్లతోలు కూడా కదిలించింది. పేట్ రావ్‌ను తలుచుకుంటే ఏదో కోపం, నిస్సహాయత వస్తాయి. అప్పటి పరిస్థితులవి అని సమాధానపడ్డాను. డంకన్ కూడా నిస్సహాయుడే మరి ఒకరకంగా.

మీరు రాసిన కథలన్నీ ఈ నాటికీ చెక్కు చెదరకుండా సాహిత్య సమాజంలో నిలిచి ఉన్నాయి. మరి ఆ కొద్ది కథల తర్వాత రాయడం ఎందుకు ఆపేశారు?

నాకంటూ జీవితంలో గుర్తింపు రావడం వల్లనేమో. ఇంటర్మీడియెట్ తర్వాత పై చదువుల కోసం మద్రాస్ వెళ్ళిపోయి టెన్నిస్ మీద దృష్టి పెట్టాను. టెన్నిసే జీవితంగా ఉండేదపుడు. ఆంధ్ర తరఫున టాపర్‌గా ఎన్నో టోర్నమెంట్స్ ఆడాను. ఛాంపియన్ షిప్స్ గెలిచాను! ఆ బిజీ లైఫ్‌లో రచనా వ్యాసంగాన్ని పూర్తిగా వదిలేశాను. విద్యార్థి జీవితం మొత్తం టెన్నిస్ తోనే గడిపాను. మహేష్ భూపతి నా తమ్ముడు జనార్థన్ భూపతి కొడుకే! జనార్థన్ కూడా టెన్నిస్ ప్లేయరని తెలుసు కదూ! టెన్నిస్‌తో మా కుటుంబానికి గట్టి అనుబంధమే ఉంది. మా అమ్మాయీ రమా రావు కూడా మంచి టెన్నిస్ ప్లేయర్.

ప్లాంటేషన్స్‌లో నాకు అసిస్టెంట్ మానేజర్‌గా ఉద్యోగం వచ్చిన కొత్తలో టెన్నిస్ కాకుండా ఇంకేదో ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని బాగా అనిపించేది. టెన్నిస్ వల్ల అక్కడ వచ్చిన గుర్తింపు నాకు సంతృప్తినివ్వలేదు. ఇంకా ఏదో ఒక ప్రత్యేకత కావాలి. అందుకే కథా రచనవైపు మళ్ళాను. ఆ ఏడు కథలూ అప్పుడు రాసినవే. ఆ తర్వాత మానేజర్‌గా, జనరల్ మానేజర్‌గా ఉద్యోగంలో ఎదిగాక, తీరిక ఉండేది కాదు. ముఖ్యంగా గుర్తింపుకీ కొదవ లేకపోయింది. ఇక ప్రత్యేక గుర్తింపు అవసరం అనిపించలేదు. బహుశా అందుకే రాయడం ఆపేశాను.

మీరు చెప్తుంది వింటుంటే క్లబ్ నైట్ కథ గుర్తొస్తోంది. ఆ కథలో విజయ్ పాత్ర రచయిత. అతను రాయడం మానేయడానికి కూడా ఇలాటి కారణమే చెప్తాడు. ఆ పాత్ర మీరేనా?

అవును, దాదాపుగా నాదే ఆ పాత్ర! ఉద్యోగ విరమణ తర్వాత రాసిందే ఆ కథ! ఆ కథలో ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్ల గురించి, గుర్తింపు కోసం పడే తాపత్రయం గురించి, గుర్తింపు ఇచ్చే తృప్తి గురించి కూడా ప్రస్తావన వస్తుంది.

మీ కథల్లో ఎక్కడా ఒక వాదం కానీ, సందేశాలు కానీ కనిపించవు. జీవితం, దాని చుట్టూ అల్లుకున్న సంఘటనలే ఉంటాయి. ఇతివృత్తానికి అనుగుణంగా వాతావరణం ఉంటుంది. అలాటి ఇజాల వైపు మీరు మొగ్గు చూపక పోవడానికి కారణమేదైనా ఉందా?

ఇౙమ్స్ గురించి, సందేశాలు ఇస్తూ, రాసే వాళ్లంతా వాటిని పాటిస్తారని హామీ ఏదీ లేదు. నా వరకూ నేను మానవ ప్రవృత్తిని, స్వభావాన్ని పరిశీలించడాన్ని చిత్రించడాన్ని ఇష్టపడ్డాను. మనుషుల సహజ స్వభావం ఎలా ఉంటుందో కథల్లో యదాతథంగా చిత్రించడానికే నా ప్రాధాన్యం. నేను రాసింది కూడా అవే!

అయితే అలాటి వాదనేపథ్యంతో కథనొక దాన్ని కావాలనే రాశాను, ఈ మధ్యనే! అంటే 2011లో. టీ ఎస్టేట్లో కూలీలకు యాజమాన్యానికి మధ్య జరిగే ఒక ప్రచ్ఛన్న సంఘర్షణ గురించి ఆ కథ. ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో పబ్లిష్ అయింది. దాని వెనక కథ చెప్తాను మీకు.

విశాలాంధ్ర వాళ్ళు నూరేళ్ళ తెలుగు కథ సంకలనం వేసినపుడు నా కథ ఒక్కటీ అందులో లేదు. ఆ సంపుటి సంపాదకుడు కేతు విశ్వనాథరెడ్డితో నాకు కొంత పరిచయం ఉంది. ఆయనను అడిగితే, ఆ 108 కథలూ సమాజ కేంద్రక దృష్టిని ప్రధానంగా ఉంచుకుని ఎన్నిక చేసిన కథలని ‘వైయక్తిక మానస చిత్రణ’ ఉన్న కథలు తీసుకోలేదని, అన్నారు. వారి అభిప్రాయం అలా అని నేను సరిపెట్టుకున్నాను. కానీ, అలా ఒక వర్గపోరాట దృక్పథంతో మాత్రమే ఎన్నుకున్న కథలు మాత్రమే తెలుగులో ఈ నూరేళ్ళలో వచ్చిన గొప్ప కథలు అని నమ్మించబోవడం నాకు నచ్చలేదు. ఎలానూ తెలుగులో తెలంగాణ కథలు, కళింగ కథలు, రాయలసీమ కథలు ఇలా ఎన్నో సంకలనాలు వస్తున్నాయి. ఈ సంకలనానికి తెలుగులో వర్గపోరాట కథలు 1910-2000 అని పేరు పెడితే నిజాయితీగా ఉండేది అని అనుకున్నాను. మానసిక ప్రపంచం సమాజ కేంద్రకంగా ఎందుకు సరిపోదో, పనికిరాదో నాకు అర్థం కాలేదు. సరే నేనూ అలాటి ఒక కథ రాసి వారిని నమ్మిద్దామని నిర్ణయించుకుని సామికుంబుడు రాశాను. నా అంచనా నిజమైంది. మధురాంతకం నరేంద్ర వేసిన కథా వార్షిక-2011లో ఈ కథను చేర్చారు.

ఆ తరువాత సామికుంబుడు కథను కథ-నేపథ్యం సంకలనంలో ప్రచురిస్తూ, ఆ కథకు నేపథ్యం రాయమన్నారు నన్ను. అప్పుడు ఈ వివరాలన్నీ రాశాను. (వెళ్ళి ఆ పుస్తకం పట్టుకొచ్చి ఇలా రాశాను చూడండి అని చూపించారు) ఆ కథ గురించి చివరిలో ఇలా అన్నాను:

“ఇది వర్గ పోరాట కథ అని మభ్య పెట్టదల్చుకున్నా, ఇందులో నేను చెప్పదల్చుకున్న మరో ముఖ్యాంశం ఉంది. కండక్టర్ అరుళ్ దాస్, పరిస్థితుల వల్ల ఎదిగి చండశాసనుడని తాను భయపడిన మానేజర్‌కి ఏది తప్పో ఏది రైటో చెప్పగలిగిన ధైర్యాన్ని పుంజుకున్నాడు! ఇది సమాజ కేంద్రక దృష్టి కిందికి వస్తుందా?”

హ్మ్… అయిదేళ్ళయింది కదా సామి కుంబుడు రాసి? మరో కథ ఎప్పుడు రాస్తారు?

రాయనని చెప్పలేను. కానీ ఎప్పుడు రాస్తానో తెలీదు. రాయాలని అనిపించిన క్షణం తప్పక రాస్తాను.

ప్లాంటేషన్ ఉద్యోగం, లైఫ్, రచనా వ్యాసంగం, టెన్నిస్ — ఈ మూడింట్లో మీరు బాగా ఇష్టపడేది, ఎంజాయ్ చేసేది ఏది?

నిజానికి ఈ మూడింటి కంటే నేను బాగా ఇష్టపడింది, ఎంజాయ్ చేసింది, చేస్తున్నది గాల్ఫ్ ఆడటం! రోజుకు ఆరు గంటలు చొప్పున వారానికి ఆరు రోజులు ఆడతాను. గాల్ఫ్ కోర్స్‌లో కార్ట్ కూడా వాడను. హోల్ టు హోల్ నడిచే ఆడతాను. తొమ్మిది కిలోమీటర్లు నడుస్తాను.

ఇంకా ఏమి చేస్తుంటారు? రోజూ ఎలా గడుస్తుంది గాల్ఫ్ కాకుండా?

(‘గాల్ఫ్ కాకుండా’ అని ఆ మాటని రిపీట్ చేసి నవ్వారు.) పుస్తకాలు చదువుతాను, ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఆహ్వానిస్తే సాహితీ సమావేశాలకు వెళ్తాను. షేర్ మార్కెట్ చేస్తాను. ఇప్పుడు అదే నాకు ఆదాయం.

(మళ్ళీ నవ్వు ఎంతో ఉత్సాహంగా!)వేలుపిళ్ళై (విశాలాంధ్ర, 1955)

మాటలు ఎన్నటికీ ముగియవు రావుగారితో! మాట్లాడుతున్న కొద్దీ వస్తూనే ఉంటాయనిపించింది. అప్పటికే నేను వచ్చి రెండు గంటలు దాటి పోవడంతో సెలవు తీసుకుని కిందికి దిగి వస్తుంటే నాతో పాటే దిగి వచ్చి, భార్యను పిలిచి సరోజవల్లి అని పరిచయం చేశారు. అరుస్తున్న కుక్కపిల్లను మందలిస్తూ పరుగున వచ్చిన ఆమెను చూసి మళ్ళీ ఆశ్చర్యం, ఇంత ఉత్సాహం ఎలా నింపుకుని ఉన్నారో వీరు జీవితంలో! అని.

వాకిలి ముందు ఒక అందమైన క్లిష్టమైన తెలుగు వాకిళ్ళ మెలికల ముగ్గు! దాటి ఇవతలికి వచ్చాను. వీధి చివర నిలిపిన నా కారు వరకూ నాతో పాటే వద్దు వద్దంటున్నా వినకుండా వచ్చి, కారు డోర్ వేసి, కారు కదిలాకే తిరిగి ఇంటి వైపు నడిచిన రావుగారిని, కారు వీధి మలుపు తిరిగే దాకా చూస్తూనే ఉన్నా!

కర్నాటకలోని సకలేష్‌పూర్‌లో మా స్నేహితుడి కాఫీ ప్లాంటేషన్స్‌లో సెలవులు గడపడానికి వాళ్ల ఎస్టేట్‌కి వెళ్ళినపుడు, కాఫీ తోటల్లో గమ్ బూట్లు వేసుకుని తిరుగుతూ, పండిన కాయలేవో, ఎలా కోస్తారో అడిగి తెలుసుకుంటూ ఉన్నపుడు తరచూ వేలుపిళ్లై కథలు, ఆ కథల్లోని మనుషులూ గుర్తొచ్చే వారు.

ఈ సారి సకలేష్‌పూర్ వెళ్తే సెందామరై, మాంకూ మాత్రమే కాదు, రామచంద్ర రావుగారు కూడా తప్పకుండా గుర్తొస్తూనే ఉంటారు ఆ కాఫీ తోటల్లో తిరుగుతున్నంత సేపూ!

అక్కడి నుంచి కూర్గ్ వెళ్ళి గాళిదేవరెక్కడున్నాడో వెదుకుతానేమో!