గోపిని: చిల్లుల ముంత

రెక్కల కింద చేతులేసి ఎన్నిసార్లు ఎగరేశానో ఆ చందమామను
పదేళ్ళ కల ఒక్కసారిగా చేజారిపోయింది
ఎప్పుడో ఒకప్పుడు ఆకు రాలినంత నిశ్శబ్దంగా నేను రాలిపోతాను
లేదా
ముందు కప్పు, తర్వాత వాసాలు, గోడలు, ఎండకు ఎండి వానకు తడిసి,
చివరకు చెదలు తినేసి, కొంతకాలానికి చిన్నవ్వ గుడిసె ఆనవాలే
మిగలనట్టు నన్నూ కొంచం కొంచంగా
మన్ను తినేస్తుంది. ఎన్నో యుగాలుగా పొడిచి,
గూకే పొద్దు కూడా మండీ
మండీ మసై రాలిపోతుంది. వెన్నెల పొడిపొడిగా రాలిపోయి
నూనె అయిపోయాక
కాలుతున్న వత్తిలా చివరకు చంద్రుడు కూడా కమురు వాసన కొడతాడు
కొత్త చెరువులో బంకమట్టితో బొమ్మరిండ్లు కట్టి ఆటంతా
అయిపోయాక కాలితో
చెరిపేసినట్టు
ఈ సృష్టంతా చెరిగిపోతుంది.


సనసన్నగా కురుస్తున్న ఈ మంచుతెరకు ముందు పుట్టుక ఉంది
దుఃఖం ఉంది
ఆనందమూ ఉంది.
దృశ్యాదృశ్యాలూ వున్నాయి.
చలికాలంలో ఒకవైపు గడ్డకట్టే మంచు కురుస్తూ ఉంటే
వెచ్చవెచ్చగా శరీరాన్ని కాచుకోవడానికి చలిమంట ఉంది.
కడుపునిండా పచ్చిక మేసిన గొర్రెపిల్ల గొంతు
తడుపుకునేదానికి ఏరుంది!
ఏటిలో
చేపలు, కప్పలు, పాములు, ఒక ప్రపంచం ఉంటుంది
ఆకాశంలో ఎగిరీ ఎగిరీ కొమ్మ మీద వాలిన గువ్వకు గూడు ఉంటుంది
తోడు గువ్వ,
గూటినిండా పిల్లలు ఒక కుటూంబం ఉంటుంది
పైరు మీద వాలిన జీనిబాయి గువ్వలకు పాలకంకి ఊయల ఉంది
కోతిదీపల కాంతిని
వెదజల్లే చిల్లులముంత ఆకాశమూ ఉంది. రాత్రంతా ఏటిని
నెమరువేస్తూ వెన్నెలుంది.
గుక్కపట్టి ఏడ్చే పాపకు కడుపు నింపేదానికి పాలరొమ్ములున్నాయి.
లాలిపాటై
నిద్రపుచ్చేదానికి అమ్మ వొడి ఉంది
సనసన్నగా కురుస్తూ కదిలే మంచుతెరకి అటువైపు ఏముంటుంది?
వొట్టి శూన్యమేనా?
మిణూకుమిణుకుమంటూ ఆత్మలు వెలుగుతుంటాయా?
స్వర్గనరకాలుంటాయా?
ఎండ కాస్తూ వాన కురిసినప్పుడు
ఆకాశంపై వాలే సీతాకోకచిలుక మంచుతెరకు
ముందున్నప్పుడు,
అవతలివైపు తప్పకుండా ఏదో ఒకటి ఉండే ఉంటుంది.
నీటిలోకి వొంగిన చందమామను అలలు చెరిపేసినట్టు
అదంతా ఒక అస్పష్ట పద్యం


బుడిబుడి అడుగులేసే
నా పద్యాన్ని ఎత్తుకుని,
పాలుగారే బుగ్గల్ని చిదిమి
రెక్కల కింద చేతులేసి ఎన్నిసార్లు ఎగరేశానో!
ఎన్ని నవ్వుల్ని మూటగట్టుకున్నానో!
కలలో కూడా ఊహించలేదు కాకి తన్నుకుపోతుందని,
ఇంకా నా పద్యం
పరిపక్వం కూడా కాలేదు.