జంతువు

మనిషీ!
జంతువుకి నమస్కరించు

ప్రత్యేకించి
కోతిని కొలువు
నీ పూర్వులకు
తొలిమర్యాదలొనర్చు

విలంగు – కవి వైరముత్తు స్వరంలో

ప్రతి జంతువూ
నీ గురువు
నేర్చుకో
నేర్చుకున్నాక
తగ్గట్టు నడుచుకో


జంతువులు మనకంటేనూ
మానాభిమానాలు గలవి

ఏనుగు కాళ్ళమీద
మరొక ఏనుగు పడ్డట్టు
వర్తమానంలేదు
పిల్లికి ఎలుకలు
పల్లకీ మెయ్యవు
ఎలుగుబంటికి
జింకలు కాళ్ళొత్తవు

ఉంటే స్వాతంత్రపు ఆకాశం
లేదా మరణపు అగాధం
నట్టనడిమి జీవితం
జంతువులకు లేదు.


అడవిలో మూఢనమ్మకాల్లేవు

అక్కడ నిప్పుకోళ్ళు కూడా
నిప్పులగుండం తొక్కవు


మతమెక్కిన ఓ మనిషీ
జంతువులకు మతాలున్నాయా?
మదమెక్కిన ఏనుగు లాగా
మతమెక్కిన జంతువు ఉందా?

క్రైస్తవ కాకి – హిందూ ఎలుక
జైన జింక – బౌద్ధ పులి
సిక్కు సింహం – ముస్లిము పిల్లి

అడవిలో అలా విడదీసి చూపించగలమా?


మనిషీ!

మగవాడెంత అలంకరించుకున్నా,
పదివేళ్ళకూ ఉంగరాలు తొడిగినా,
మెరిసే పట్టుబట్టలు ధరించినా
మనలో అందం ఆడవారికే సొంతం
మగజాతిలో అందం ఎక్కడ?

జింకల్లో కొమ్ములు
ఏనుగుల్లో దంతం
నెమళ్ళలో పింఛం
కోళ్ళలో తురాయి
మగవాటివే కదా

మగజాతికి సౌందర్యం
జంతువుల్లోనేగానీ
మనుషుల్లో లేదు!
నగరంలో లేదు
అడవుల్లోనే!


కళలు నీకే సొంతమని
గర్వపడిపోకు
కళకి మూలం వెతుకు
ఈ భూమిలో

మొదటిపాట – గాలిపాడేపాట
రెండో పాట – కెరటాల పాట
మూడో పాట – కోయిల పాట
నాలుగో పాటే – నీ పాట

కోయిలని అనుకరిస్తూ
నువ్వు పాట నేర్చావు
గురువుని ధ్యానించే ముందు
కోయిలకు నమస్కరించు!


మనిషీ!

నువ్వు అంతమైతే
నీ కళేబరంతో ఏం చెయ్యగలం?

నీ కొవ్వుతో ఏడే ఏడు సబ్బులు చెయ్యవచ్చు
నిన్ను కాల్చిన బూడిదతో
తొమ్మిదివేల పెనిసిళ్ళు చెయ్యవచ్చు
నీలో ఉన్న ఇనుముతో
ఒకే ఒక మేకు చెయ్యవచ్చు

జంతువు వెల తెలుసా నీకు?
ప్రాణం విడిచి దేహం మిగిలున్నా –

పులిగోరు నగలో పతకమవుతుంది
కలంగా మారుతుంది పావురం ఈక
పాము తోలు చేతిసంచిగా అవుతుంది
వీర్యపుష్టినిస్తుంది ఖడ్గమృగం కొమ్ము
చెప్పులై మిగులుతుంది దున్నపోతు చర్మం

చనిపోయి కూడా ఉపయోగపడేది
ఒక జంతువేనన్న నిజం గ్రహించగలవా?


మనిషీ!

దేవుళ్ళ వాహనాలను గమనించావా?

ఒక దేవుడు – ఎద్దునెక్కాడు
ఒక దేవుడు – నెమలినెక్కాడు
ఒక దేవుడు – ఎలకనెక్కాడు
ఒక దేవుడు – గరుత్మంతుడనెక్కాడు

అన్ని దేవుళ్ళనీ
జంతువే మోసింది గానీ
మనిషి మోయలేదు

మనిషి మీదెక్కితే
అపహరించుకుపోగలడని
దేవుడికి తెలియదా?

మనిషి దేవుణ్ణి నమ్మినా
దేవుడు మనిషిని నమ్మలేదు!


బ్రతకడానికి పుట్టాం ఎలానూ
ఆ బ్రతుకు నడవడి కొంచం మార్చండి
ఒక చిన్న మార్పు చేసి చూడండి

మీరు కూసి ఒక కోడిని లేపండి
భుజంమీద ఒక రామచిలుకతో
ఉద్యోగానికి వెళ్ళండి
మీతో అల్లరి ఆటలాడే పిల్లితో కలిసి
ఒక మధ్యాహ్నం భోజనం చెయ్యండి

భాగస్వామికి ఎంతకాలమని పెడతారు
అదే పసలేని పాత ముద్దుని?
రేపట్నుండి కుందేలు కూనలను
ముద్దాడండి

మీ పరుపుపైన
మూడోదిండొకటి వేయించండి
దానిపై మీ అభిమానానికి అల్లాడే
కుక్కపిల్లని పడుకోనివ్వండి

శాసనసభలో
ప్రాణులు సమస్యల మీద
శాసన ప్రతిపాదన లేవనెత్తండి

ఆవు పొదుగుకు వారానికొకరోజు
ప్రభుత్వ సెలవుదినం ప్రకటించండి

సర్కస్ ఏనుగు బంతాటని బహిష్కరించండి
ఏనుగుజాతికే అది
అంతర్జాతీయ అవమానం.

జంతువుల్ని గౌరవించండి
అవి మారువేషంలో ఉన్న మనుషులు
జీవపరిణామక్రమంలో సోపానాలవి!

జంతువుల్ని ప్రేమించండి
అభిమానాన్ని ఆశించే శిశువులవి!

ఒకే ఒక ప్రశ్న
నిజాయితీగా చెప్పండి

మనుషులు పూజించేలా
కొన్ని జంతువులున్నాయి
జంతువులు పూజించేలా
మనుషులున్నారా ఇక్కడ?


(మూలం: తమిళ కవి వైరముత్తు, తమిళుక్కు నిఱముండు – 1995 (తమిళానికి రంగుంది) కవితా సంపుటి నుంచి విలంగు అన్న కవిత. మూల కవిత తెలుగు, తమిళ్ లిపిలో.)