నాకు నచ్చిన పద్యం: మాధవపెద్దివారి మధుర స్మృతికావ్యం

“Our sweetest songs are those that tell of saddest thought”

– To a Skylark, P.B. Shelley.

“విప్రలమ్భశృఙ్గారకరుణయోస్తు మాధుర్యమేవ ప్రకర్షవత్”

– ధ్వన్యాలోకం, ఆనందవర్ధనుడు.

పై షెల్లీ కవితావాక్యం ఆనందవర్ధనుడి శాస్త్రవచనానికి ప్రతిధ్వనిలానే వినిపిస్తుంది. ఆనందవర్ధనుడు చెప్పిన కరుణ పాత్రగతమైన రసం అయితే, షెల్లీ విషాదం వ్యక్తిగతం. తెలుగు భావకవులపై షెల్లీ ప్రభావమే ఎక్కువ. ఆనాటి కవిత్వంలో, అనుస్యూతంగా, అనేక రూపాల్లో, విషాదం తొంగిచూస్తూనే ఉంటుంది. అలాంటి రూపాల్లో ఒకటి స్మృతి కవిత్వం. ఇది కూడా పాశ్చాత్య కవిత్వ రూపమైన ఎలిజీ (elegy) నుండి దిగుమతి అయినదే. భావకవులు ప్రేయసి పైనే తప్ప భార్య గురించి కవిత్వం వ్రాయలేదన్న అభియోగం ఒకటుంది. కానీ అది వాస్తవం కాదు. అయితే, భార్యపై వ్రాసిన కవిత్వం చాలా వరకూ స్మృతికవిత్వమే కావడం ఒక పెద్ద ఐరనీ! ఏదేమైనా, షెల్లీ అన్నట్టు అది చాలా మధురంగా ఉంటుంది. అలాంటి మధురమైన స్మృతికవితలలో అతిమధురమై నా మనసుని తాకినది శ్రీ మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రిగారి సతీస్మృతి. అందులోని ఓ అందమైన పద్యం.

మ. ఒడినందుండినయట్టి మల్లెపువులందొక్కొక్కటిన్ దీసి వా
        ల్జడ యల్లించుకొనంగ దల్లికిడు వేళన్, వచ్చు నన్ గాంచి వె
        ల్వడగా నిల్వగ బాఱువోక మునిగాళ్ళన్ నిల్చు నానాటి నీ
        పడుచుం బ్రాయపు జిన్నె నా కనులకున్ బ్రత్యక్షమౌగావుతన్

సుందరరామశాస్త్రిగారికి నాదనామక్రియ అనే రాగం చాలా యిష్టమట. వారు పద్యాలను చాలా శ్రావ్యంగా చదివేవారట కూడా. ఇది స్వయానా వారి గురువైన శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు చెప్పిన మాట. నాదనామక్రియ రాగంలోని ఒకానొక మార్దవం, సున్నితత్వం సుందరరామశాస్త్రిగారి పద్యరచనలో – భావంలోనూ శైలిలోనూ కూడా, సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఈయన కవిత్వంతో నాకు మొదటి పరిచయం, ఆయన మృత్యుంజయ శతకం. అందులోని ఆర్ద్రత, సున్నితమైన హాస్యం, ఆత్మీయత నన్ను మంత్రముగ్ధుణ్ణి చేశాయి. అవే లక్షణాలు అతని పంచవటి, శబరి, శృంగార చాటువు, బృందావనం మొదలైన యితర రచనల లోనూ కనిపిస్తాయి.

సతీస్మృతి అన్న ఖండిక బృందావనం ఖండకావ్య సంపుటి లోనిది. ఈ స్మృతికావ్యమంతా నిండిన చిక్కని అనుభూతి హృదయాన్ని కరిగిస్తుంది. కవికి తన భార్యపైనున్న గాఢానురాగం ఆమె వియోగంలో అంతులేని ఆర్తిగా పరిణమించి మన మనసులని కూడా ఆర్ద్రం చేస్తుంది. సాధారణంగా స్మృతికవిత్వంలో ఆర్తితోబాటు తాత్త్వికత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మాత్రం ఆత్మీయత పాలే ఎక్కువ. ఇది సుందరరామశాస్త్రిగారి కవిత్వ జీవలక్షణం. స్మృతి అంటే – దుఃఖము, జ్ఞాపకము, అందులోంచి మళ్ళీ పుట్టుకువచ్చే దుఃఖమూ – అదొక సుడిగుండం. పొంగుకొచ్చే దుఃఖం లోంచి, తమ దాంపత్యపు జ్ఞాపకాలను తవ్వుకొంటూ పోయి, పెళ్ళినాటి ముచ్చట్లను గుర్తుకు తెచ్చుకొంటారు కవి. అలా పెళ్ళైన కొత్తలో జరిగిన ఒక ముచ్చటైన సన్నివేశాన్ని, మనోహరంగా చిత్రించే పద్యమిది.

బహుశా అవి పెళ్ళయి భార్య కాపరానికి వచ్చిన తొలినాళ్ళు. ఆమెతో పాటు అత్తగారు కూడా వచ్చారు. ఈయన పని మీద వెళ్ళి సాయంకాలానికి యిల్లు చేరుకొన్నారు. వాళ్ళింట్లో పెరడు, ఆ పెరటిలో ఒక మల్లె చెట్టూ ఉండేవి కాబోలు. మల్లెపూలు కోసుకొచ్చి, ఒడిలో పోసుకొని, తల్లి దగ్గర కూర్చొని ఉంది కొత్త పెళ్ళికూతురు. ఒకో పువ్వుని తల్లికి అందిస్తూ ఉంటే ఆమె కూతురికి చక్కని వాలుజడ అల్లుతోంది. ఈ లోపున ఈయన వచ్చారు. ఇంకా కొత్త కదా, సిగ్గూ బిడియం పోలేదు. ఆయన్ని అలా చూసేసరికల్లా ఆ నవోఢకు ఏం చేయడానికీ పాలుపోలేదు. దగ్గరకి వెళ్ళాలా, అలాగే ఉండాలా, సిగ్గుతో పారిపోవాలా – ఏమీ తెలియక, ఏదో చేయాలన్న తొందరలో, దిగ్గునలేచి మునిగాళ్ళపై నిలుచుండిపోయింది. అలా నిలుచుండిపోయిన ఆమె పడుచుప్రాయపు విలాసం తన కళ్ళముందు ప్రత్యక్షమైతే బాగుండునని కోరుకొంటున్నారు.

ఆ దృశ్యం ఎంత గాఢంగా ఆయన మనసులో నిలిచి ఉండకపోతే, ఇంత స్పష్టంగా పద్యంలో రూపుగట్టి మన కళ్ళముందు ఉంచగలుగుతారు! ఇలాంటి పద్యాలు చదివి అర్థం చేసుకోడం ఎంత సులువో, రచించడం అంత కష్టం. ఛందస్సులోని గణ నియమాలనూ, యతిప్రాసలనూ అనుసరిస్తూనే, భావంలోని సున్నితత్వానికి తగ్గట్టు ఎలాంటి భేషజం లేని భాషలో ఒక సన్నివేశం మొత్తాన్ని ఒకే పద్యంలో నిర్మించడానికి పద్యరచనపై చాలా పట్టు కావాలి. జాగ్రత్తగా గమనిస్తే, నా పై వివరణలో ప్రస్తావించిన స్థలకాలాదులు కానీ, భావాలు కానీ యేవీ నేరుగా పద్యంలో పేర్కొనబడలేదు. అయినా పద్యాన్ని చదువుతూ ఉంటే అవన్నీ స్ఫూరిస్తాయి, మనకి అనుభవానికి వస్తాయి. ఇది మంచి కవిత్వానికి గీటురాయి. మాధుర్యం అనేది కవితా గుణాలలో ఒకటిగా మన ఆలంకారికులు చెప్పారు. దీర్ఘ సమాసాలు లేకుండా శ్రుతికటువు కాని అక్షర సంయోజనంతో చేసే రచన మాధుర్య గుణాన్ని కలిగి ఉంటుందని నిర్వచనం. ఇది చిత్తద్రుతిని కలిగిస్తుంది, అంటే మనసుని కరిగిస్తుందన్న మాట. ఈ పద్యం దానికొక చక్కని ఉదాహరణ. అయితే, ‘మునిగాళ్ళపై నిలుచోవడం’ అనే సూక్ష్మతరమైన అంశాన్ని చిత్రించి ఆ సన్నివేశానికి సహజత్వాన్నీ సజీవత్వాన్ని కలిగించడం పద్యానికి ప్రాణం. ఇలాంటి పద్యం చెప్పాలంటే మనసు ఎంతో కొంత స్థిమితపడి ఉండాలి. బహుశా అలనాటి జ్ఞాపకాల దొంతరలు కవిని ప్రస్తుత వియోగవేదనకి కాస్త దూరంగా తీసుకువెళ్ళి ఉంటాయి, తాత్కాలికంగానే అయినా.

గాయమింకా పచ్చిగా ఉండి, ఉద్వేగోద్ధృతిలో వచ్చే కవిత్వం వేరేగా ఉంటుంది. అందులోని భావతీవ్రత పద్యరచనలోనూ ప్రతిఫలించి ఉవ్వెత్తున ఎగసివచ్చిన కెరటంలా మనసుని తాకుతుంది. వెళుతూ వెళుతూ కాళ్ళకింద యిసుకని కోసేసినట్లుగా ముగిసిపోతుంది. అలాంటి పద్యాలు కూడా యీ స్మృతికావ్యంలో ఉన్నాయి. మచ్ఛుకి ఒక పద్యం:

నిరుడే గన్నుల జూచుచుండగ జితాగ్నిజ్వాలికామాలికాం
తరతప్తంబొనరించి నీ తనుసువర్ణంబందు జెన్నొందు సుం
దరతర తేజంబు హరించి దైవము శ్మశానక్షోణిలో నిల్పె నా
కొఱకై బూది, హరించె వాయువదియున్ గోరంత లేకుండగన్

జీవితమంతా తనతో ప్రయాణించిన తోడు చితాగ్నిజ్వాలల్లో దగ్ధమైపోయే దృశ్యం కన్న విషాదం మరొకటుండదు. ఆమె పసిడి మేనిలోని సౌందర్య తేజాన్నంతటినీ ఆ అగ్నిశిఖలలో కాల్చేసి చివరకు దైవం తనకై ఆమె బూడిదని మాత్రం మిగిల్చాడు. అదికూడా చివరకు గాలిలో కలిసిపోయింది.

చివరికి మిగిలింది అతనిలో పదిలంగా దాచుకొన్న ఆమె జ్ఞాపకాలే!