రెండు కవితలు: ఆగిన పాట

1.

​విరగ గాచి
​కనులు మూసి
​వేచి ఉంటాను

పసిమి వన్నెల
కవిత గువ్వ
వచ్చి వాలి

గొంతు ఎత్తి
ఉండి ఉండి
పాట పాడితే
పులకలెత్తి
పూలు రాల్చాను

పాట మాని
ఊరికే అది
కొమ్మకొమ్మకి
దూకుతోంటే
కులాసాగా
పొడుస్తోంటే

పాట ఆగితే
నిద్ర లేచే
తలపోతలు
నాగుబాములు

పొంచి పొంచి
పాకి వచ్చి
ఒక్క పట్టున
మింగబోతే

పాము చెవుల
చిట్టి గువ్వ
వదిలి నన్ను
ఎగిరిపోతో

ఎన్నడూ ఇక
తిరిగి రానని
కేక వేసింది.

2.

మందారచెట్టు మీద
మబ్బుల పరుపు
వెలుగు రేకల
చీకటి దుప్పటీ
పక్కన
చిన్ని కంఠం
కూకూ పాట

వింటూ
వత్తిగిలితే
రెక్కలు సాచి
కూత పెడుతూ
తరుముకు
వచ్చేస్తో
గండభేరుండ పక్షి

ఉలిక్కి పడ్డాను
పడ్డాను
మంచం మీంచి

కిటికీ బయట
పాట మాని
రెక్కల్లో
తల దా​చి ​
చిట్టి పిట్ట

మా ఇంటి
పైన్నించి
ఎప్పటి​లాగే ​
​​గర్జిస్తూ
లంఘిస్తో
లోహ విహంగం.