నిశ్శబ్ద సమూహం

తాళం వెనుక తాళం తీస్తూ పోతే
తలపులలా తెరుచుకుంటూనే
వుంటాయి.

శూన్యమైన గది మూలల్లో
ముడుచుకున్న జ్ఞాపకాలు
మళ్ళీ తలలెత్తి చూస్తాయి.

హోరుమంటూ నిలవరించి నిశ్శబ్దం
ముందువెనుకలైన అడుగులను
పరామర్శించే ప్రయత్నం
చేస్తూనే వుంటుంది.

గాయంచేసిన గతమెప్పుడూ
తాళం దొరకని గదిలా
ప్రశ్నిస్తూనే వుంటుంది.

మూగపోయిన సమాధానాలు
ఉలికిపాటుతో కన్నీటి జాడల్ని
అయిష్టంగానే తడుముకుంటాయి.

ఉగ్గబట్టుకోలేని మనసు
ఆ గది ముందరే తచ్చాడుతూ,
ఎప్పటికీ యిలా… !

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సాహిత్య బోధన, రచన ప్రధాన వ్యాసంగాలు. ...