సత్య దర్శనం

ఏకాంత మందిరంలో యుధిష్టిరుడు మెల్లగా అటూ ఇటూ పచార్లు చేస్తూ నడుస్తున్నాడు. ఈ మధ్యన కృష్ణుడి గురించి ఏ సమాచారం తెలియక పోవడంతో మనసు అల్లల్లాడి కొన్నిరోజుల క్రితం అర్జునుణ్ణి ద్వారక పంపించాడు ఓ సారి ఆ లీలామానుషవిగ్రహుణ్ణి చూసి రమ్మని. పార్ధుడీపాటికి వెనక్కి తిరిగి వచ్చి ఉండాలి కానీ వచ్చినట్టు లేదు. ఏమైందో? ద్వారం దగ్గిరేదో చప్పుడైనట్టు అనిపించి అడిగేడు.

“ఎవరక్కడ? ఏమైనా సమాచారం తెల్సిందా?”

“లేదు మహారాజా, తెలిస్తే మీకు చెప్పకుండా ఉంటానా? మీరెంత ఆతృత పడుతునారో నాకు తెలియదా?” పిలుపు విని లోపలికి వచ్చిన భటుడొకడు చెప్పేడు సమాధానంగా.

భటుడు బయటకెళ్ళి తలుపులు మూసుకున్నాక, మెల్లమెల్లగా చిన్నప్పటిరోజుల దగ్గర్నుంచి అన్నీ గుర్తుకు రావడం మొదలు పెట్టాయి మహారాజుకి. మొదట్లో తామందరూ అడవుల్లో తండ్రితో జీవించడం. అసలు మహారాజై ఉండీ ఎందుకలా తన తండ్రి పాండురాజు అడవుల్లో బతికేవాడో తనకి ఆ వయసులో అర్ధమయ్యేది కాదు. తర్వాత రోజుల్లో తెలిసేసరికి ఏమీ చేయలేని పరిస్థితి. తండ్రి పోయాక తాము హస్తినాపురం వచ్చేసరికి తనకొక్కడికే విషయాలు అర్ధమౌతూ ఉండేవి, అదీ అక్కడక్కడాను. తమ్ముళ్ళందరూ చిన్నవాళ్ళు కనక తన వెనకే తిరిగేవారు. భీముడికి తినే అన్నంలో విషం పెట్టి గంగానదిలో పడేసే వరకూ అసలు ఈ ధుర్యోధన దృతరాష్ట్రులు ఇలా చేస్తారని కలలోనైనా ఊహించలేదు తాము కాని, తల్లి కుంతి కాని. రారాజు అనిపించుకున్న దుర్యోధనుడు మొదట్లో అసలు ఎందుకంతగా తమని ద్వేషించాడో అర్ధం కాదు.

దుర్యోధనుడి సంగతి అలా ఉంచితే జూదంలో ఓడిపోయి ఒప్పుకున్నట్టుగా అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించాక, తమ తండ్రి పాండురాజు భుజబలంతో సంపాదించిన ఈ రాజ్యంలో ఐదు ఊళ్ళిచ్చినా చాలు అన్నప్పుడు కూడా దుర్యోధనుడు ఒప్పుకోలేదు. మనుషులు చనిపోయినప్పుడు ఈ రాజ్యాలు కూడా వచ్చేవేనా? యమమహిషఘంఠికలు దగ్గర్లో వినిపించినప్పుడు ధర్మం ఒక్కటే కదా ఎవరి కూడానైనా వచ్చేది? అయినా దుర్యోధనుడు రాజ్యం పట్టుకుని వేలాడుతూ ఐదు ఊళ్ళు కాదు కదా సూది మొన మోపినంత మేర కూడా ఇవ్వనంటే తన పెత్తండ్రి నోరు ఎత్తలేకపోయాడు కొడుకు మీద వ్యామోహంతో. సాక్షాత్తూ కృష్ణుడే వెళ్ళి రాయబారం చేస్తే వినని వాళ్ళకి ఇంక ఏమి చెప్పి ప్రయోజనం? తననీ తన తమ్ములనీ అవమానించడం సరైనదే అనుకున్నా, ఏ తప్పూ లేని ద్రౌపదిని కౌరవ సభలో అందరిముందూ అంత దారుణంగా అవమానించడం కూడదని ప్రజలందరూ నోరెత్తుకుని చెప్పినా, ధర్మం తప్పుతున్నారని తెలిసినా, పుట్టినప్పట్నుంచీ కృష్ణుడు చేసిన అద్భుతాలు వినీ, పెత్తండ్రి కొడుకుని ఎలా సమర్ధించుకున్నాడో పరమేశ్వరుడికెరుక… ఛీ, ఛీ, అయినా నాకు ఇప్పటి వరకూ ఇటువంటి ఆలోచనలు రాలేదు కానీ ఇప్పుడు వస్తున్నాయేమిటో? కలి ప్రభావం కాదు కదా? కురుక్షేత్రంలో భీకర సంగ్రామం తప్పదని తేలిపోయాక తాను నమ్మిన ధర్మాన్ని మాత్రమే అంటిపెట్టుకుని కృష్ణుడొక్కడూ తోడు ఉంటే చాలు అనుకోవడమే మంచిదైంది. యతో ధర్మఃస్తతో కృష్ణః యతో కృష్ణఃస్తతో జయః అన్నదే నిజమైంది కదా చివరకి?

రాజులకి రాజులూ పోయారు, వంశాలకి వంశాలూ తుడిచిపెట్టుకుపోయాయి. తానేనా ఈ విధ్వంసానికి కారణం? సంగ్రామానికి ముందు రాయబారంలో సంజయుడు చెప్పినట్టూ యుద్ధం మానేసి భిక్షమెత్తినా బావుండేదా? కనీసం జరిగిన నరమేధం తప్పించగలిగి ఉండేవాడేమో? ధర్మరాజు కళ్లలో నీళ్ళు ఉబికి వచ్చాయి ఒక్కసారి. ధర్మజుడి ఆలోచనలు పరి విధాల పోతూండగా అంతరాత్మ ప్రశ్నించింది, క్షాత్రధర్మం – యుద్ధమా, భిక్షాటనా? అంటూ. పై కండువాతో తుడుచుకుని కళ్ళు మూసుకున్నాడు. ఎన్నిసార్లు తమని పక్షి తన పిల్లల్ని రెక్కల చాటున కాపాడినట్టు కాపాడాడు కృష్ణుడు? ఆనాడు అరణ్యవాసంలో దూర్వాసుడు వచ్చి తామందరికీ భోజనం పెట్టమంటే, అందరి భోజనాలు అయిపోయాయని ద్రౌపది దిక్కుతోచక ఒక్కసారి కళ్ళుమూసుకుని మనసులో తలుచుకున్న ఉత్తరక్షణంలో కృష్ణుడు గుమ్మంలో ప్రత్యక్షమవడం ఎలా మర్చిపోగలడు? అరణ్యవాసం వరకూ ఎందుకుగానీ జూదంలో తాను తమ్ములతో సహా అన్నీ పోగొట్టుకున్నప్పుడు ద్రౌపదికి సభాభవనంలో అందరి ఎదుటా వస్త్రాపహరణం జరుగుతూంటే ఎవరు ద్రౌపదిని రక్షించినది? ఉత్తరోత్తరా అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని కృష్ణుడు వారించి ఉండకపోతే తమ వంశం నిలబడి ఉండేదా, పరీక్షిత్తు బతికి బట్టకట్టగలిగేవాడా? ఇన్ని దేనికి, నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పైజల్లెడు వాడు మౌళి పరి సర్పిత పింఛము వాడు నవ్వు రాజిల్లెడు మోము వాడు లేకపోతే తాము ఏమైవుండేవారో?

సరే, ఇవన్నీ ఇప్పుడనవసరం. జరిగిపోయిన వాటి గురించి ఆలోచించుకోవడం వల్ల ఏమి ప్రయోజనం? ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తూ ఉంటే తమ కాలం అయిపోయినట్టే. చేతికి ఎదిగి వచ్చిన పరీక్షిత్తుకి పట్టం కట్టి తాము ఇంక వానప్రస్థానానికి వెళ్ళడమే మంచిదనిపిస్తోంది. అర్జునుడు తీసుకొచ్చే వార్త విని కృష్ణుడి దగ్గిరకి వెళ్ళి తన నిర్ణయం చెప్పాక ఆయనెలా చేయమంటే అలా చేయడమే. ఈ వయసులో తనకి కావాల్సింది ఇంక ఒక్కటే.

అరయన్ శంతనుపుత్రుపై విదురుపై నక్రూరుపైఁ గుబ్జపై
నరుపై ద్రౌపదిపైఁ గుచేలునిపయిన్నంద వ్రజ శ్రేణిపై
బరగం గల్గు భవత్కృపారసము నాపైఁ గొంతరానిమ్ము నీ
చరణాబ్జంబులు నమ్మినాఁడ జగదీశా! కృష్ణ! భక్తప్రియా!


రాత్రి గడిచినా అర్జునుడు రాకపోయేసరికి ధర్మరాజు మనసు తల్లడిల్లింది. వెంటనే ఓ సారి నకులుణ్ణి వెళ్ళి చూసి రమ్మంటే? అదే మాట తమ్ముళ్లతో చెప్పేసరికి ఒక్కసారి అందరూ కూడబలుక్కున్నట్టు మొహం మీదే నవ్వారు. భీముడైతే ఓ అడుగు ముందుకేసి, “అన్నా, పెద్దవాడివయ్యే కొద్దీ చాదస్తం ఎక్కువౌతోందా?” అనేశాడు. అవును కదా? ద్వంద్వ యుద్ధంలో సాక్షాత్తూ మహేశ్వరుణ్ణి నిలువరించి పాశుపతం గెల్చుకున్న అర్జునుడు ఇంకా ఎందుకు రాలేదో చూసి రమ్మని నకులుణ్ణి పంపడం ఎంత హాస్యాస్పదం? దిగులుగా ఉన్న ధర్మజుడికి రాత్రి బాగా పొద్దుపోయేవరకూ నిద్రలేదు.

ఆ తర్వాత మగతగా పట్టిన నిద్రలో ఏదో కల. మొదట్లో మసక మసకగా కనిపించిన బాల కృష్ణుడి రూపం ధగధగలాడుతూ పెద్దదౌతూంది. ఆయన వెనుకనే పూతన, కంసుడు, తమ తాత భీష్ముడు చిరునవ్వులు నవ్వుతున్నారు. ముందుగా నించున్న కృష్ణ రూపం మనోహరంగా నవ్వుతూంటే కనబడీ కనపడకుండా ఆయన వెనుకే శిశుపాలుడు, జయధ్రధుడు, కర్ణుడు, దుర్యోధనుడు, జరాసంధుడు, సంజయ విదురులూ, కంసుడి సేవకులైన అశేష రాక్షసులూ చిరునవ్వులు చిందిస్తున్నారు. వీళ్లలో చాలామందిని కృష్ణుడు స్వహస్తాలతో సంహరించాడు కాదూ? మిగతా వాళ్ళకి జీవితాంతం గుండెల్లో బల్లెమే అయ్యేడు కదా? ఇప్పుడు హాయిగా చిరునవ్వు నవ్వుతున్నారు, అదేమిటో? కలలో యుధిష్టిరుడి ఆలోచనలని అడ్డుకుంటూ మధ్య మంద్ర స్థాయిలో వినిపించే స్తుతి మొదలైంది.

సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వ సంభువమ్
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్
విశ్వతః పరమాన్నిత్యం విశ్వన్నారాయణం హరిమ్,
విశ్వమే వేదం పురుషస్త ద్విశ్వ ముపజీవతి
పతిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివమచ్యుతమ్

స్పష్టంగా వినిపించే వేదమంత్రాల మధ్య వెలిగే కృష్ణుణ్ణి పరీక్షగా చూడబోయేంతలో కృష్ణ రూపం కనుమరుగౌతోంది. ఆ రూపం వెనుకనే ఓ రాజు చేతులు జోడించి వేగంగా నడుస్తున్నాడు మరి కొంతమందితో. కానీ మిగతావారు అలా కృష్ణుణ్ణీ, ఆ వెనకే నడిచే రాజుని అందుకోలేక వెనకపడిపోతున్నారనేది తెలుస్తూనే ఉంది. నడిచే ఆ రాజు వెనకభాగమే కనిపిస్తోంది కానీ మొహం కనబడటంలేదు. లీలామానుషవిగ్రహుడు మరో అదృష్టవంతుడికి భవసాగరం దాటే అదృష్టం కల్పించాడు కాబోలు. కల కరిగిపోతూ కృష్ణుడి నవ్వూ, రూపం మాయమయ్యేసరికి నిద్రాభంగమై ధర్మజుడు ఒక్కసారి కళ్ళు తెరిచేడు. తెలతెలవారుతోంది అప్పుడే. మరోసారి తాను ఆచరించే ధర్మానికి ఆటంకం కలగకూడదని కృష్ణుణ్ణి వేడుకుంటూ రోజులో చేయబోయే కార్యక్రమాలన్నింటికీ ఉపక్రమించాడు పాండవాగ్రజుడు.


అర్జునుడు ఎంత త్వరగా వస్తే బాగుణ్ణని ధర్మజుడనుకున్నాడో దానికి ఎత్తుకి పైకెత్తు ఆలశ్యంగా హస్తినాపురం చేరాడు సవ్యసాచి. తనని చూడవచ్చిన అర్జునుణ్ణి ప్రశ్నలతో వేధించాడు యుధిష్టిరుడు, కృష్ణుడి కుశలం కోసం. చాలాసేపటిదాకా మాట్లాడలేక పోయిన అర్జునుడు కన్నీళ్ళతో తలపైకెత్తి చెప్పేడు కృష్ణుడు అవతారం చాలించాడని. కృష్ణుడు ఇక లేడనే నిజాన్ని జీర్ణించుకులేక మొదలు నరికిన చెట్టులా కూలిపోయేడు యుధిష్టిరుడు. ఇప్పటివరకూ జీవితంలో ఏదైతే తమకి ఆసరాగా నిల్చిందో ఆ ఆసరా ఇంకలేదు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి సమయం పట్టింది, ద్రౌపదికీ పాండవులకీ. పడవ ఆసరాగా ఉందనుకునే భరోసాతో నీళ్ళలో ప్రయాణించే వాడికి పడవ తిరగబడిపోతే పాతాళంలోకి దిగబడుతూ ఊపిరి కోసం ఉక్కిరిబిక్కిరయ్యే భావన. రోజులు భారంగా గడుస్తున్నాయి.

శ్రీకృష్ణ నిర్యాణం అందరికన్నా ఎక్కువ బాధించినది ద్రౌపదిని. ఎందుకంటే మొదటినుంచీ తనకి మాన సంరక్షణ చేసినవాడు కృష్ణుడు. ఆయన పోయాక పాపం ఆయన అష్టపత్నులెలా ఓర్చుకుంటున్నారో అనే ఆలోచనే ద్రౌపదిని ఒక్కచోట నిలువనీయడంలేదు. ఆ ఆలోచనల్తో యుధిష్టిరుడితో మాట్లాడడానికి బయల్దేరింది.

పాండవ మధ్యముడిది అందరికన్నా దారుణమైన పరిస్థితి. కృష్ణుడు అవతారం చాలించాక తాను – ఒక వారంలో ద్వారకానగరం సముద్రంలో మునుగుతుందని తెలిసీ – అక్కడి స్త్రీలనీ, పిల్లల్నీ హస్తినాపురం తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. దారిలో దొంగల గుంపు దాడి చేసినప్పుడు తనకి బ్రహ్మాస్త్రం కాదు కదా గాండీవం ఎత్తి మామూలు అస్త్ర ప్రయోగం చేయడానిక్కూడా ఏమీ చేత కాలేదు. పోనీ అస్త్రవిద్య గుర్తుకురాకపోయినా కత్తి ఎత్తి యుద్ధం చేద్దామనుకుంటే ఆ కత్తి ఎత్తడానికి శరీరం సహకరించలేదు. తననీ, తనకూడా ఉన్నవాళ్ళనీ మామూలు దారిదోపిడీ దొంగలు కొట్టి తన కళ్ల ఎదుటే అన్నీ దోచుకెళ్ళారు. మిగిలిన ఆడవాళ్ల ముందు వీరాధివీరుడైన తాను తలెత్తుకోలేకపోయాడు. తనకేమో సవ్యసాచి అని బిరుదు, ఒకానొకప్పుడు శివుణ్ణి నిలువరించి పాశుపతం గెల్చుకున్న తాను, ఉత్తర గోగ్రహణ సమయంలో మొత్తం కౌరవ సేనని ఒంటిచేత్తో జయించిన తాను, శపథం చేసినట్టే ఒక్కరోజులో కౌరవసేనని చీల్చి చెండాడి సూర్యాస్తమయం లోపుల ద్రోణ, కర్ణ, అశ్వత్థామలంతటి మహామహులు చూస్తూండగా జయద్రధుడి తలని, డేగ అలవోకగా పిచ్చుకని తన్నుకుపోయినట్టు ఎగరగొట్టి యమపురికి పంపిన తాను, మామూలు దారిదోపిడీ దొంగలని ఏమీ చేయలేకపోయేడు. కృష్ణుడు తనని నమ్మి రక్షించమని చెప్పిన ఆడవాళ్లనీ, పిల్లలనీ తాను రక్షించలేకపోయాడు. ఛీ, ఛీ తనదీ ఒక బతుకేనా? దారిలో వ్యాసభగవానులు చెప్పినదే సరై ఉండవచ్చు. తమ కాలం తీరిపోయిందనేది కంటి ముందు కనిపించే సత్యం. కృష్ణ నిర్యాణంతో తన శరీరంలో కుడిభాగం చచ్చుపడి పోయిందనుకుంటే ఆ తర్వాత దొంగల చేతిలో ఆడవాళ్ళ ముందు జరిగిన పరాభవం తన ఎడమ శరీరాన్ని కూడా చంపేసినట్టే. అన్నలతో మాట్లాడి ఇంక వానప్రస్థం స్వీకరించడం మంచిది. ఏదో నిర్ణయానికి వచ్చినవాడిలా యుధిష్టురుడి మందిరానికి బయల్దేరాడు.


తన దగ్గిరకి వచ్చిన ద్రౌపదినీ, అర్జునుణ్ణీ లోపలకి తీసుకెళ్ళేసరికి అక్కడే భీముడూ నకుల సహదేవులూ ఉండడం కొంత ఆశ్చర్యంగా అనిపించింది ధర్మజుడి దగ్గిరకి వచ్చిన ఆ ఇద్దరికీ. ఉపోద్ఘాతం ఏమీ లేకుండా ధర్మరాజు చెప్పేడు.

“జరిగినదంతా చూశారు కదా? కృష్ణుడే అవతారం చాలించాక ఇంక మనం రాజ్యం చేయడం అనవసరం అని నాకనిపిస్తోంది. పరీక్షిత్తు ఎదిగి వచ్చాడు కనక తనకి పట్టం కట్టి వానప్రస్థం స్వీకరించడం ఉత్తమం. ఇది మీకు నచ్చకపోతే నేనొక్కణ్ణే అయినా వానప్రస్థం తీసుకుని హిమాలయాలకి చేరుకుందామని నా స్వంత నిర్ణయం. మిమ్మల్ని బలవంతం చేస్తున్నానని అనుకోవద్దు సుమా. మీరు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళటం అనేది తధ్యం. ఇంతకాలం రాజ్యం చేశాం. మనకి ఇక్కడ బావుకోవల్సింది ఏముంది? మీరందరూ ఏమంటారు? ఇప్పుడు చెప్పినా సరే, ఆలోచించుకుని తర్వాత చెప్పినా సరే.”

మొదటగా నోరు విప్పినది ద్రౌపది. “మీరు చెప్పినదే నిజం. కృష్ణుడంతటివాడే అవతారం చాలించాక మన రాజ్యం చేయడం అనవసరం. నాకు రెండు కారణాలు కూడా తోస్తున్నాయి. మొదటిది మన దేహదారుఢ్యం క్షీణిస్తోందని మీకు తెలుసు కదా? జరుగుతున్న విషయాలు చూస్తూంటే మన తరం అయిపోయిందనే మాట వాస్తవం. రెండోది మీరు వనవాసం అన్నప్పుడూ, అజ్ఞాత వాసం అన్నప్పుడూ…”

“ద్రౌపదీ, నేనెంత చేతకాని వాణ్ణయ్యనో మరీ, మరీ వేలెత్తి చూపించక్కర్లేదు. కృష్ణ నిర్యాణం జరిగిననాడే నేను చచ్చినవాడితో సమానం,” అర్జునుడు తల వంచుకునే అన్నాడు.

“అయ్యో, నేను మీకు జరిగిన పరాభవాన్ని మనసులో పెట్టుకుని అన్నమాట కాదు. ఇన్ని సంగతులు దేనికీ? మీకు ఐదుగురికీ తెలియదా? నాకు ఈ విషయంలో ఆలోచించుకోవడానికీ నిర్ణయించుకోవడానికీ ఏమీలేదు. మీరు వనవాసం అన్నప్పుడూ, అజ్ఞాత వాసం అన్నప్పుడూ, తర్వాత యుద్ధం అన్నప్పుడూ ఎప్పుడూ మీ వెన్నంటే ఉన్నట్టే ఇప్పుడూను. మీరెప్పుడు బయల్దేరుదామంటే అప్పుడు నేను సిద్ధం. కాని కొంత సమయం ఇస్తే పరీక్షిత్తుకి పట్టం కట్టి వేదవిదులనీ, పండితులనీ సత్కరించడం, వాళ్ల ఆశీర్వాదాలు తీసుకోవడం లాంటి పనులన్నీ చక్కబెట్టుకుని బయల్దేరవచ్చు.”

నకుల సహదేవులకేసి ధర్మజుడు చూసేసరికి అడగక్కర్లేకుండానే సమాధానం మొహం మీదే ప్రతిబింబిస్తోంది. ఇక మిగిలినది భీముడు. “తమ్ముడూ, ఇంక నీదే ఆలస్యం మరి, చెప్పు నీ ఉద్దేశ్యం కూడా,” ధర్మజుడు అడిగేడు.

భీముడు వెంఠనే సమాధానం చెప్పాడు. “ఇంకా శంకించడం దేనికీ? ద్వైతవనంలో గంధర్వులు దుర్యోధనుడిమీద దాడి చేసినప్పుడు నువ్వు చెప్పినదే కదా, పరైః పరిభవైప్రాప్తే వయం పంచోత్తర శతం, పరస్పర విరోధేతు వయం పంచ శతంతుతే – బయటనుండి ఏ శతృవైనా దండెత్తివచ్చినప్పుడు మనం నూట ఐదుగురం మనమధ్య విభేధాలు వచ్చినప్పుడు వాళ్ళు నూరుగురు, మనం ఐదుగురం. పాండవులెప్పుడూ ఐదుగురే. వెంఠనే పరీక్షిత్తుకి పట్టం కట్టి బయల్దేరుదాం.”

అందరూ లేచారు. అందర్నీ వెళ్ళనిచ్చి భీముడు ధర్మరాజుని అడిగాడు, “అన్నా, ఇప్పుడీ జీవితం వదిలి మనం బయల్దేరుతున్నాం. మనకి ముందు ముందు ఎటువంటి గతి రాసిపెట్టి ఉందో? ద్రౌపదికి పుట్టినప్పట్నుంచీ కష్టాలే కదా? ఇప్పుడు కూడా మనతో వస్తే ఎటువంటి భాధలెదురౌతాయో? ద్రౌపదిని హస్తినాపురంలోనే వుంచితేనే బాగుంటుందేమో?”

చిరునవ్వు నవ్వేడు ధర్మజుడు, “తమ్ముడూ, ఇప్పుడు మనం జీవితంలో చరమాంకాన్ని చేరుకున్నాం. ఇప్పటివరకూ చేసిన పాప పుణ్యాలూ, ఆచరించిన ధర్మాధర్మాలు ఒక్కటే మన వెంటే వచ్చేవి. మనం ఐదుగురం అతిరధ మహారధులుగా ఉండీ వస్త్రాపహరణం సమయంలో ఏమి చేయగలిగాం? భగవంతుడైన కృష్ణుడు తన స్వంత కొడుకుగా పుట్టిన తర్వాత కూడా వచ్చి విడిపించేవరకూ దేవకీ వసుదేవులు కారాగారంలోనే కదా బతికినది? ఎవరి పుణ్యఫలం వారిది. చివరిదాకా నువ్వు బతికి ఉంటే మాత్రం ద్రౌపది కష్టాలు పడదని రూఢిగా చెప్పగలవా? ఇంతా చేసి ద్రౌపది మాటలు విన్నావు కదా? నువ్వు ఉంచుతానన్నా ద్రౌపది హస్తినాపురంలో మనం లేకుండా ఉండడానికి ఇష్టపడుతుందా?”

సంగతి అర్ధమైనట్టూ భీముడు బయటకి నడిచేడు.