ఆశనిరాశలు

“ఈ ఇల్లు మీ అన్నకే ఇచ్చేద్దాము. కొంతయినా అప్పు తీరుతుంది.”

“నీవే చూడు. మా అన్న దగ్గర ఈ ఇల్లు కొనడానికి డబ్బు ఉంది. అయితే ఆరోజు ఐదు వేలకు నాతో గొడవ పడ్డాడు. సరే, నీవు కొట్లో కూర్చో. నేనెళ్ళి పాపను తీసుకు వచ్చేస్తాను. ఎందుకో పాపను వదిలి ఉండబుద్ధి కావడమే లేదు.”

“పోనీ, మీకొక ఉద్యోగమన్నా దొరికితే బాగుండు. ఎంత కష్టపడినా అదీ కుదరట్లేదు. ఏ ఊరి కాలేజ్ లో దొరికినా సరే, ఇక్కడ ఉండేదే వద్దు. గంజినీళ్ళు త్రాగి బ్రతికినా చాలు.”

“సాగర్ కాలేజ్ లో రావచ్చు. భట్ గారు మాట్లాడి చూస్తానన్నారు.”

“ఏమండీ ఫోన్!”

“భట్ గారా, అలాగేనండీ. ఇల్లు మా అన్నకే అమ్మేసి ఒక వారంలో మీకిచ్చేస్తాను. హ హ మీరు రావొద్దు. నేనే వచ్చి ఇస్తాను.”

“ఔనండీ, అదే చేయండి. అప్పున్నప్ప్పుడు ఇల్లు పెట్టుకొని మాత్రం ఏం చేస్తాం? ఎవరికి ఇవ్వాలో అందరికీ ఇచ్చేయండి. ఎవరూ ఇంకా బాకీ ఉన్నామనకూడదు. ఉన్నదంతా పోతే పోనీ. అప్పు మాత్రం ఉండకూడదు.”


“మొత్తం మీద ఇల్లమ్మేసి అన్నీ కట్టేశాము. అన్నతో బాంక్ లోను సగం కడదామంటే నా పూచీకత్తు ఉందిలే అన్నాడు.”

“పోనీలెండి. అంతా బాగైంది. ఇంక మన బ్రతుకు బాగుపడితే అంతే చాలు. మీరు కొట్టుకెళ్ళండి. నేను పాపకు నీళ్ళు పోస్తాను.”

“సరే, నేను వెళ్తున్నా. తలుపేసుకో.”

“మధ్యాహ్నం త్వరగా వచ్చేయండి.”


“హాయ్ సురేశన్నా! ఏం కావాలి? ఇంకేంటి విశేషాలు?”

“మీ ఇల్లు మీ అన్న కమ్మేశారంట కదా! నిన్న మీ అన్న అన్నాడులే. మరి మీకెలా?”

“ఔనన్నా, కాస్త ఇబ్బందిగా ఉండింది…”

“మీకూ మీ అన్నగారికీ మధ్య పడట్లేదా? ఇద్దరూ ఒకే ఇంటివాళ్ళు కదా, అతనెలా తీసుకున్నాడు మీ ఇంటిని?”

“అదంతా ఇప్పుడెందుకు లేన్నా? నా మనసుకు కష్టంగా ఉంది.”

“సరే, భోజనానికి ఇంటికి వెళ్తున్నావా? వెళ్ళు, వెళ్ళు.”


“ఏమండీ? అలా చప్పబడిపోయి ఉన్నారు? ఏమైంది?”

“ఏం లేదు. చావు తప్పదు.”

“పాప…?”

“చూద్దాం. పాపను ఎక్కడైనా వదిలొద్దాము. లేకపోతే మనమే లేకుండా, దాన్నెందుకు అనాథలా ఎవరిదగ్గరో వదిలిపెట్టడం? ముగ్గురం కలిసే…”

“ఏమైంది? ఎందుకు మళ్ళీ ఈ నిర్ణయం?”

“మా అన్న ఇల్లు కొన్నానని అందరితో చెప్పుకున్నట్టున్నాడు. ప్రతివాళ్ళూ అడుగుతున్నారు… నేను బ్రతికీ చచ్చినట్టే.”

“సరే, అందరూ వెళ్ళిపోదాం. కానీ, పాపకు ఎలాగండీ? మనసు రావడం లేదు.”

“చూడూ, ఇంక వదిలేయ్. పాపను ఎవరిమీదో పెట్టి వెళ్ళిపోడం కన్నా ఇదే మేలు. ఈరోజే తీసుకుందాం. సాయంత్రం త్వరగా వంట చేయి. పాపకు అన్నంలో కలిపేయ్. లేకపోతే కష్టం అవుతుంది.”

“కొట్టు నుంచి త్వరగా వచ్చేయండి. మీకేమన్నా చేయాలా?”

“వద్దు. పాప జాగ్రత్త. పాపకేమన్నా కావాలంటే చేసి పెట్టు. కానీ, మనసేదోలా ఉంది. ఏవో పాత సంగతులు చుట్టూ తిరుగుతోంది మనసు. బంగారం మొత్తం అమ్మేయడం, ఆ సంగతి మామగారింట్లో తెలియడం, వాళ్ళ ముందు తలవంపులు, బిడ్డకు టాబ్ కొనివ్వలేక అబద్ధం చెప్పడం, ఖాళీ అయిన కొట్టు పరిస్థితి, పరువు పోయిన సందర్భం- వీటన్నింటి ముందూ గుర్తొచ్చే బంగారు పతకం, మార్కుల షీటు, సాహిత్య సంపద తెచ్చిన బహుమానం, పాఠాలు విన్న పిల్లలు అప్పుడప్పుడూ చేసే నమస్కారాలు, మనసంతా బరువెక్కింది.”


అంతరంగ మృదంగనాద…

“ఏమండీ, వస్తున్నారా? రండి మరి. ఎనిమిదవుతోంది. పాప పడుకుంటుందిక. నాకెందుకో మనసేం బాలేదు. దానికి మీరే తినిపించండి. నా వల్ల కావడం లేదు… ఏడుపోస్తోంది. మన జీవితం ముగిసే పోబోతుంది. నేనందరితో మాట్లాడుతాను. ఫోన్లో కొద్దిగా డబ్బు వేయించండి. అమ్మతో చాలా మాట్లాడాలి. ఇదే లాస్ట్. కదా? మీరూ మీ ఇంటికి ఫోన్ చేయండి. ఫోన్ పెట్టేస్తున్నా.”


“పాపా, తలుపు తియ్యమ్మా!”

“నాన్నా, టాబ్ తెచ్చావా మరి?”

“లేదమ్మలూ, రేపు తెస్తానుగా.”

“బీరువాలో ఉన్న బాటిల్ తీసుకో. ముందు పాపకు కలిపి పెట్టేయ్. కొంచెం… చక్కెర కలుపు. చేదుగా ఉంటుందేమో. తర్వాత మనమూ తీసుకుందాం.”

“ఎవరు లోపల? కొంచెం తలుపు తీస్తారా?”

“రండి, కృష్ణన్నా. రండి. ఈ మధ్య ఇటువైపు రానే లేదు!”

“ఔను, ఏదీ తీరనే లేదు. ఔనూ, ఏమిటి ఇల్లమ్మేశావా? మీ అన్నే కొన్నాడట కదా, చెప్పాడు. దాని బదులు ఆయన నీకు డబ్బే ఇచ్చి ఉండవచ్చు కదా, మీ ఇంటివాళ్ళకు మరీ ఇంత స్వార్థం పనికిరాదు. నీవు ఎలాగోలా ఒక ఉద్యోగం సంపాదించుకోగూడదా? ఇంత చదువుకొని ఇక్కడకు రాకుండా ఉండాల్సింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ప్రయత్నించు.”

“ఔనన్నా, నేనెన్నో సార్లు చెప్పి చూశానీయనకు. ఊరికే కాలహరణం చేశారు. ఉద్యోగానికి పోనన్నారు. ఇప్పుడదీ లేదు, డబ్బూ లేదు. దిక్కులేని వాళ్ళమయినాము.”

“కాలమే అట్లుందమ్మా. అయినా మనమే బలహీనపడిపోతే మిగతావారూ బరువనుకుంటారు. ఇప్పుడేమైంది. మేమంతా ఉన్నాము మీకు. సహాయం చేయకపోము. ఒక నిర్ణయం తీసుకోండి. వస్తానింక పదవుతోంది.”


“పాప పడుకొని నిద్రపోయింది. భోజనమే చేయలేదు. ఏంచేద్దామంటారు? ఇప్పుడు లేపినా తినదు. దానికి పెట్టకుండా మనము…?”

“ఉండనీలే. ఇప్పుడు లేపినా తినలేదు. రేపు చూద్దాం లే. పండగ వస్తోంది. దానికీ సామానుకి డబ్బులేమీలేవు. అంతలోపల వెళ్ళిపోదాం. ఛ, ఏం జీవితమో, విసుగ్గా ఉంది. ఎన్ని సమస్యలో!”

అంతరంగ…

“హలో! ఔనా, అలాగా సర్! చాలా సంతోషం సర్! నా జీవితమే మారిపోతుంది సర్! మీ ఋణం ఎలా తీర్చుకోగలను? చాలా చాలా థాంక్స్ సర్! రేపు మీ ఇంటికి వస్తాను. ఉంటానండి.”

“ఈ రోజు చూసే భాగ్యం ఇంకా ఉంది మనకు. ఏంటండి ఫోన్లో విషయం? ఎవరు చేశారు?”

“అదే, ఆ భట్ గారే!”

“ఔనా, ఏమన్నారు? ఉద్యోగం దొరికే వీలుందంటనా?”

“అది కాదే, దాల్పేట్ కాలేజ్ లో ఉద్యోగం ఖాయమైంది. త్వరగా వెళ్ళి చేరమన్నారు. నాకెంత సంతోషంగా ఉందో తెల్సా!”

“అబ్బ! ఏమండీ, ఇన్నాళ్ళకైనా మన కష్టాలు తీరబోతున్నాయన్నమాట. ఆ దేవునికి ఇప్పటికైనా మన మీద దయ కలిగింది. ఇల్లూ, బంగారం పోతే పోయాయి. కనీసం పాప అయినా దక్కింది. మా అమ్మకు ఒక ఫోన్ చేస్తాను.”

“ఇన్నాళ్ళకు హాయిగా నిద్ర వస్తోంది. పరుపులు వేద్దాం. మనం ఇతరులకు చేసిన మేలు ఈరోజు మనలను కాపాడింది. పోన్లే, మన ఇంటివాళ్ళందరూ బాగుండనీ. నిజంగా… చావడం అంత సులభం కాదుకదా!”