ఆశనిరాశలు

“పాపా రామ్మా, నాన్న నిన్ను తాతగారింట్లో వదిలేసి వస్తారు. కొత్త బట్టలేసుకుందుగాని, రా. అక్కడ మొండి చేయద్దేం! మామతో పోట్లాడకు. చక్కగా బుద్ధిగా ఉండాలి. ఏమన్నా కావాలని అల్లరి చేయకు. అక్కడే బడిలో చేర్పిస్తాము. ఏడవకూడదు. అమ్మ, నాన్న కావాలని మొండిపట్టు పట్టకూడదు. సరేనా?”

“అమ్మా, నేనక్కడే ఉండాలా? నేను నాన్నను వదిలి ఉండలేను. నాన్నే గుర్తొస్తారమ్మా. నాకేడుపు వస్తుంది. నాన్నతో వెళ్ళి మళ్ళీ రేపే వచ్చేస్తా. అక్కడే ఉండాలంటే మాత్రం ఉండను. అమ్మా, నాన్న నాకు టాబ్ కొనిస్తారు కదా?”

“కొనిస్తారమ్మా. కానీ నీవు అక్కడుంటేనే కొనిస్తారు. ఇక్కడైతే లేదు.”

“నాన్నా, పోదామా? బస్ వచ్చింది.”

“పాపా, పరికిణీ పైకి పట్టుకోమ్మా, కాలికి అడ్డం పడుతోంది. అల్లరి చేయకుండా ఉండాలి. ఏం? ఏమండీ, త్వరగా వచ్చేయండీ.”

“అలాగే, కానీ భట్ గారు కానీ, ఇంకెవరైనా వస్తే రేపు కలుస్తానని చెప్పు. త్వరగా వస్తాలే.”


“ఎక్కడ? ఎక్కడున్నాడు?”

“ఆయన సాగర్ వెళ్ళారండి. వచ్చేస్తారు సాయంకాలం.”

“సాయంకాలం రానీ, రేపు రానీ. నేనిక్కడి నుంచి కదలను. నాకు డబ్బు కావాలి. కావాల్సిందే ఇవాళ. నిన్ననే ఫోన్ చేశాను. కావాలనే తప్పించుకున్నట్టున్నాడు.”

“అయ్యో, లేదండీ. మా పాపకు బాలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఔను, మీరు ఫోన్ చేశారని నాతో అన్నారు కూడా. మాదగ్గర బొత్తిగా… ఏమీ లేదు. కొంత సమయమివ్వగలరా?”

“నాకు నా డబ్బు కావాల్సిందేనమ్మా. లేదంటే మీ ఇంటికే వచ్చి కూర్చుంటాను. మీ దగ్గర లేదూ అంటే మీ ఇల్లు మీ వాళ్ళే అడుగుతున్నారుగా, అమ్మేసి ఇవ్వచ్చుగా?”

“అలాగేనండీ. ఏదో విధంగా ఏర్పాటు చేస్తాము. కొంచెం సమయమివ్వండి దయచేసి.”

“సమయమివ్వచ్చమ్మా. అయితే ఎవరైనా పూచీ పడాల్సి ఉంటుంది. మీ బావ నడిగితే నాకే సంబంధమూ లేదంటారు. అందుకే ఇంత కటువుగా ఉండాల్సొచ్చింది.”

“అలాగేనండి. బావగారిటొస్తే నేనే మాట్లాడుతాను. ఇల్లమ్మయినా సరే మీ డబ్బు కట్టేస్తాం.”

“సరే, ఇప్పటికి వెళ్తున్నా. మళ్ళీ వచ్చేవారం వస్తాను. అప్పుడు ఇవ్వకపోతే ఇక్కడే ఉండిపోతాను.”


“హలో! ఏమండీ! భట్ గారు వచ్చి వెళ్ళారు. చాలా మాటలన్నారు. ఇల్లమ్మి డబ్బిచ్చేయచ్చు కదా అన్నారు. మీ అన్న, ఇల్లు తాను తీసుకుంటానన్నారంట. అతనికి అమ్మి నాకు డబ్బు ఇవ్వండి అన్నారు. ఏమైనా సరే మీరు వచ్చేటపుడు విషం సీసా కొనుక్కొని రండి. ఇంక ఉండి చేసేదేముంది? వెళ్ళిపోదాం మనం.”

“అంతే అంతే. తెస్తాను. పాప ఇక్కడ బాగానే ఉంది. వీలైనంత త్వరగా వచ్చేస్తాను.”


“హలో! అమ్మా! పాప ఎలా ఉంది? బయట ఎండలో తిరగనివ్వకమ్మా. ఏమైనా అల్లరి చేస్తుందేమో, దాన్నేమీ అనకమ్మా. కొట్టబోకు.”

“లేదే, పాప చక్కగా ఉంది. ఇప్పుడే భోంచేసింది. ఆడుకుంటోంది. నీవు కంగారుపడకు.”


“తలుపు తీస్తావా? నేను వచ్చేశా. ఏంటి కరెంట్ లేదా? ఏం చేస్తున్నావు?”

“వస్తున్నా, వంటింట్లో ఉన్నా. ఇంతకీ తెచ్చారా?”

“ఊఁ… ఎందుకో మనసేం బాలేదు. పాపే గుర్తొస్తోంది. వదలి వస్తూంటే త్వరగా రా నాన్నా అని పదేపదే చెప్పింది. నాకు కన్నీళ్ళాగలేదు. గుండె రాయి చేసుకొని వచ్చాను.”

“నాకూ ఏడుపొస్తోందండీ, ఇంకేం చెప్పొద్దు. మన జీవితాలు ఇవాళ్టితో ముగిసే పోతున్నాయి కదా.”

“పోనీ, ముగిసిపోనీ. భోజనమయ్యాక తీసుకుందాం. పాప తో ఒకసారి మాట్లాడదాం. నాకేమిటో ఎలాగో ఉంది.”

“భోజనాలు చేసి అన్నీ ముగించుకొని ఫోన్ చేస్తా. నాకుమాట్లాడాలంటేనే జంకు గా ఉంది. మన బ్రతుకు ముగిసిపోయింది. అమ్మాయినైనా దేవుడు చల్లగా చూడాలి.”

“ఆ,ఆఁ… ఏడవకే, ఏడవకు. జీవితంలో వేసారిపోయాను. నా తలరాత ఎటూ బాలేదు. నాతో పాటు నీ జీవితాన్నీ నాశనం చేశాను. నీవు సుఖంగా పెరిగినదానివి. పోనీ చూడు నీకు చనిపోవాలని ఉందా? ఆలోచించు… లేకుంటే…”

“అంటే, మిమ్మల్ని పోగోట్టుకొని నేను మాత్రం బ్రతికేదా? చస్తే కలిసే, బ్రతికితే కలిసే. నాకూ ఈ బ్రతుకు మీద విరక్తి పుట్టింది. డబ్బే సర్వస్వం అని నమ్మే ఈ ప్రపంచం నాకూ వద్దు. అందరికీ మనం భారం అయిపోయాం. సరే, పదండి భోంచేద్దాం.”

“ఇది మన ఊరి ప్రక్క వంట. బాగా వేసుకొని తిను. ఈరోజుతో తిండికీ మనకూ ఋణం తీరింది.”

“ఏమండీ, నాకొక్క సారి మీ ఒళ్ళో తల పెట్టుకొని తనివిదీరా ఏడవాలని ఉంది. ఇంక ఈ బంధం స్వర్గంలోనో నరకంలోనో, మీరు… మీరేడవకండి. మీరు మారాజులు. మీ కంట్లో నీరు రాకూడదు. ఇప్పుడు మీరేడిస్తే ఎలా? మీ అమ్మ పోయేటపుడు ఏమన్నారో గుర్తుందా? ఎవరిముందూ తల దించవద్దని చెప్పలేదూ? మర్చిపోలేదుగా? ఏడవకండి.”

“నిన్న అక్కను కొంత డబ్బిమ్మని అడిగాను. మేమే అప్పుల్లో ఉన్నామంది.”

“వాళ్ళివ్వలేదని తప్పుగా అనుకోకండి. మన ఖర్మ బాలేనపుడు దేవుడు వాళ్ళ నోటినుండి అలా అనిపిస్తాడు.”

“పోనీ.

మాట ఇచ్చి తప్పలేను.
చేటు నెపుడు తలపెట్టను.
మాట కోసం పులిని చేరగ
పోదునే నా చిన్ని దూడా!

పాట గుర్తొస్తోంది.”

“ఏమండీ! నా ఫోన్ మ్రోగుతున్నట్టుంది!”

“హలో! హలో! ఆఁ.. అవునా? సరే, సరే, నేను రేపే వస్తాను.”

“ఎవరు చేశారు?”

“మీ అమ్మ. పాప అమ్మ, నాన్న కావాలని ఏడుస్తోందట. నేనిక్కడ ఉండనంటూ అన్నం కూడా తినలేదట.”

“ఇలా అయితే రేపు మనం చస్తే? ఎలా ఉంటుంది? దానిదే ఆలోచన అయిపోయిందండీ! దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదామంటారా?”

“వద్దొద్దు . ఈ రోజు తాగేది వద్దు. నాకు పాపే గుర్తొస్తోంది. రెండ్రోజులాగి ఆలోచిద్దాములే.”