మార్చ్ 2016

నిరంతరం ఎదురయ్యే అనుభవాలు, చిరపరిచితమనిపించే భావాలు మళ్ళీ మళ్ళీ చదివించే పద్యాలుగా సరికొత్తగా సాక్షాత్కరించేది కవిత్వమనే రసవిద్య పట్టుబడ్డ కవి చేతి చలువ వల్లే. ‘లిఖిత’ శ్రీకాంత్ ఆ రసవిద్య నేర్చిన కవి. మనిషి లోని సంఘర్షణని అలవోకగా కవిత్వం చేయగల నేర్పు శ్రీకాంత్ సొంతం. ఇతని కవిత్వం – సంకుచితం కాని చూపొక్కటీ చాలు, కవిత్వాన్ని, ఆ మాటకొస్తే ఏ కళనైనా ఉదాత్తంగా తీర్చిదిద్దుతుంది అని చూపడానికి నిలువెత్తు తార్కాణం. శ్రీకాంత్ కవిత్వం, లోకం లోను, మనుషుల లోతుల్లోను, మునుపెన్నడూ చూడని పార్శ్వాలను చూపెట్టడమా? లేదూ, మనం తెలుసుకున్న, తెలుసనుకున్న సంగతులనే సరికొత్తగా పరిచయం చేయడమా? ఏది ఉత్తమ కవిత్వ లక్షణం? అన్న ప్రశ్ననూ కలిగిస్తుంది; శ్రద్ధగా చదివే పాఠకులకు, బహుశా ఓ సమాధానమూ చూపెడుతుంది. నిప్పు కణికలా వెలుగులీనే నిజమూ, బాహ్యస్మృతి విముక్తులను చేసే సౌందర్యలోకాల ప్రస్తావనా, బాధల కొలిమిలో నిండా కాల్చి, మనలోలోపలెక్కడో స్వర్ణకాంతులీనే హృదయమొకటి ఉందని మరలా గుర్తు చేసే విషాదమూ — శ్రీకాంత్ కవిత్వాన్ని చదివి తీరాల్సిన కవిత్వంగా మార్చిన సుగుణాలు. వెన్నెల రాత్రులనీ, ఈరెండ ఉదయాలనీ తఱచుగానే కవితల్లో చూస్తూ ఉంటాం. కానీ, ఇవే ఉదయాస్తమయాలను మనిషిలోని భావసంచలనంతో సంధానించి కవిత్వం చెబితే ఎలా ఉంటుందో శ్రీకాంత్ అక్షరాల సాక్షిగా చూపించే చిరుపరిచయమిది. ఒక్క రోజులో మన మనసు ఎన్ని రంగులు మార్చుకుంటుందో, ఎన్ని వైవిధ్యాలను, ఉద్వేగాలను ఉగ్గబట్టుకుని క్షణాలను దొరలించుకుంటుందో, అన్ని ఛాయలనూ చాకచక్యంగా తన రెండు వేళ్ళ మధ్యా ఏ ఒత్తిడీ లేకుండానే ఒడిసి పట్టుకున్న కవి ఇతడు. ఒక కవిత చదవగానే, ‘ఇది శ్రీకాంత్ కవిత’ అని ఇట్టే గుర్తించగలిగేంత ప్రత్యేకమైన శైలిని సృజించుకుని, తెలుగు కవిత్వంలో తనదే అయిన దారిలో నడుస్తున్న శ్రీకాంత్ కవితలు మచ్చుకి ఐదు — కవిత్వం కాలాన్నిలా అలవోకగా అక్షరాల్లో బంధించగలదని నమ్మే వారి కోసమూ, నమ్మని వారి కోసం కూడా — ఈనెల ఈమాటలో, మరికొందరికి చేరాలన్న ఆశతో… [పరిచయకర్త: మానస చామర్తి.]


ఈ సంచికలో:

  • కథలు: ఏం జీవితం – కన్నెగంటి చంద్ర; సత్సంగం – ఆర్ శర్మ దంతుర్తి; కోటిగాని కతలు – శ్రీశైలంలో సన్యాసి – పాలపర్తి ఇంద్రాణి.
  • కవితలు: పద్యంలో ఉప్పెన – తః తః; తత్వం – శైలజామిత్ర; ‘లిఖిత’ ఐదు కవితలు: ఇక ఇదే ఉదయం ఇక ఇదే జీవితం, నా చీకటి, ఒక సాయంత్రం ఎలా అంటే, కాలంలో ఒక క్షణం నీతో-. ఒక మధ్యాహ్నం – కె. శ్రీకాంత్
  • వ్యాసాలు: ఉద్యోగపర్వము-రాయబారాలు – పొట్లూరి నారాయణ దాసు; రాగలహరి-శివరంజని – లక్ష్మన్న విష్ణుభొట్ల; వాసకసజ్జిక, విరహోత్కంఠిత – తిరుమల కృష్ణదేశికాచార్యులు.
  • శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: ఒక ఉన్మాది మనస్సినీవాలి – భైరవభట్ల కామేశ్వరరావు.
  • శబ్దతరంగాలు: విజయనగరం జ్ఞాపకాలు – పట్రాయని సంగీతరావు: సమర్పణ: పరుచూరి శ్రీనివాస్; మరి వేరే ఎవరు – కనకప్రసాద్; వల్లూరి జగన్నాథరావు – పరుచూరి శ్రీనివాస్.