సత్సంగం

ఊపిరి సలపనంత పనిలో ఉన్న రాజు దగ్గిరకొచ్చి చెప్పేడు సేవకుడు. “మన వేదాంతిగారు రాజవీధిలో అడ్డంగా పడుకుని పిచ్చి పిచ్చిగా వాగుతున్నారండి. జనాలందరూ ఒకటే నవ్వు. పెద్దాయన అయిపోయారు గదా అని మేము ఆయన వంటి మీద చేతులు వేయలేకపోతున్నాం. కానీ రాజాజ్ఞ అయితే ఏదో ఒకటి చేయవచ్చు.”

రాజు మంత్రికేసి సాలోచనగా చూసేడు. ఓ క్షణం ఆలోచించి చెప్పేడు మంత్రి. “ఇంక ఊరుకుంటే లాభం లేదు మహారాజా. ఈయన్ని వెలివేయడం ఒకటే మార్గం. పోనీ పెద్దాయన గదా అని ఇప్పటి దాకా చూసేం. ఈ పిచ్చి వదిలేది కాదు కనక ఎవర్నో ఒకణ్ణి తోడిచ్చి వదిలించుకుంటే మంచిది.”

“ఎక్కడకి పంపుదాం?”

“తెల్సిందే కదా? ఇలాంటి వాళ్ళందర్నీ దేశం లోకి రానిచ్చి మహామహులుగా కొలిచే దేశం ప్రపంచంలో ఒక్కటే ఉంది. ఆ భారత దేశానికి తోలేద్దాం. అక్కడ ఆయన బతుకు ఆయన బతుకుతాడు.”

బుర్ర బావున్న రోజుల్లో వేదాంతి ఘటికుడే. దేవుడి గురించీ, వేదాంతం గురించీ అనర్గళంగా ఉపన్యాసాలిచ్చి జనాల్ని మెప్పించగలిగేవాడు. కానీ ఇప్పుడో? చదవాల్సిన పుస్తకాలన్నీ చెడ చదివి మొదలేమిటో, చివరేమిటో తెలియకుండా బుర్రంతా పాడు చేసుకుని ఇలా తయారయ్యేడు. ఇప్పుడు నోట్లోంచి పిచ్చి వాగుడు తప్ప మరోటి రాదు. ఈ కలగాపులగంగా పుస్తకాలు చదవడం, చదివినది ఏదీ నిజంగా ఆచరణలో పెట్టకపోవడం వల్ల, రోజు ఓ గంటలో దేవుడున్నాడనీ రెండో గంటలో దేవుడు లేడనీ వాగడం అలవాటైంది. ఇప్పుడు నల్లమందో, మరోటో పడితే కానీ సరిగ్గా నోటమ్మట మాట రాదు వేదాంతికి.

రాజు సరేననడం, రాజాజ్ఞతో ఓ సేవకుణ్ణిచ్చి వేదాంతిగార్ని భారత దేశానికి పంపడం చకచకా జరిగిపోయేయి. అలా వెలివేయబడ్డ ఈ పర్షియన్ వేదాంతి, కూడా సామాను మోస్తూ వచ్చే బానిసతో పాటు అక్కడే ఉన్న అంగడి దగ్గిర ఆగాడు. బానిసల్ని లోపలకి వెళ్ళనీయరు కనక వాడు బయటే ఉండాల్సిన పరిస్థితి.

బానిసవాణ్ణి అక్కడే వదిలేసి వేదాంతి ఓ మందు సీసా తీసుకు రమ్మని, తాగడం మొదలెట్టాడు. మందు వంట్లోకి దిగి బుర్ర మీద పనిచేయడం మొదలెట్టేసరికి మళ్ళీ పిచ్చి వాగుడు మొదలైంది నోట్లోంచి. వినడానికి ఎవరున్నా లేకపోయినా బానిసకి మాత్రం తప్పదు కదా? అందుకే పరిసరాలు మర్చిపోయి వాడితోటే మొదలెట్టాడు కబుర్లు.

“ఒరే వెధవా, ఇంతా చేస్తే దేవుడున్నాడంటావా?”

బానిస తన మెడలో ఉన్న ఓ చిన్న చెక్క బొమ్మ చూపించి చెప్పేడు ధృఢంగా.

“ఎందుకు లేడూ? ఈ బొమ్మ చూశారా? మా ఆఫ్రికన్లూ అందరం ఈ చెట్టు దైవాంశ అని నమ్ముతాం. ఈ బొమ్మ ఆ చెట్టుతో చేసిందే. నేను పుట్టినప్పట్నుండీ ఇది నా మెడలో వేలాడదీసేరు మావాళ్ళు. పుట్టినప్పట్నుంచి ఇప్పటిదాకా నన్ను రక్షించేది ఈ దేవుడే. ఇదే లేకపోతే నా బతుకేమై ఉండేదో?”

మత్తు బాగా తలకెక్కిన పర్షియన్ వేదాంతి బానిస చెప్పింది విన్నాడో లేదో కానీ అక్కడే వీళ్ళిద్దర్నీ గమనిస్తున్న వాళ్లందరూ విన్నట్టున్నారు; ఆ గుంపులోంచి ఓ బ్రాహ్మడు ముందుకొచ్చి అన్నాడు.

“ఏం వాగుతున్నావురా? దేవుడంటే అనంతం కదా? అలా మెళ్ళో వేలాడదీసుకుని ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోయేవాడు దేవుడెలా ఔతాడు? ఒళ్ళు కొవ్వెక్కి నిజానిజాలు తెలియక మాట్లాడుతున్నావు కాబోలు. విను, దేవుడంటే మా బ్రహ్మ ఒక్కడే. ఆయనే ఈ సృష్టి అంతట్నీ సృజించి లయం చేస్తూ ఉంటాడు. ఆయన్ని గుర్తుంచుకోవడానికి అనేకానేక గుళ్ళూ, గోపురాలు కట్టాం. ఓ సారి గంగాతీరం పోయి చూసిరా. అక్కడ ఈ గుళ్లలో పూజలకీ పురస్కారాలకీ వేల ఏళ్ళ నుంచీ ఉన్నారు బ్రాహ్మలనబడే పూజార్లందరూను. యుగాలకి యుగాలు గడిపోయాయి ఇప్పటి దాకా, అయినా సరే మా బ్రహ్మ దేవుడు మమ్మల్నందర్నీ రక్షిస్తూనే ఉన్నాడు కదా? తెలియకపోతే నోరు మూసుకో అంతే గానీ నా మెడలో చెక్క బొమ్మే దేవుడు అని వాగకు మరి. అయినా నీ తప్పు కాదులే. నీ బానిస బతుక్కి అంతకన్నా ఏం తెలుస్తుంది?”

పక్కనే ఇదంతా చూస్తున్న యూదుడు అందుకున్నాడు వెంఠనే.

“బానే ఉంది సంబడం. ఈ వెర్రి బాగుల బ్రాహ్మలు గంగానది ఒడ్డున గుళ్ళూ గోపురాలూ కట్టేరుట, దేవుడేమో అక్కడే ఉంటాడుట. భావుంది. ఇప్పుడే కదా దేవుడంటే అనంతం, సర్వవ్యాపి అని శెలవిచ్చారు? ఇలాగే ఉంటాయండి ఈ హిందువుల వాదనలు. సర్వవ్యాపి అంటే గంగానది ఒక్కటే కాబోలు!

దేవుడుండేది గంగా నది ఒడ్డున కాదూ, దేవుడు ఈయన చెప్పినట్టు ఎవరికీ కనిపించని బ్రహ్మదేవుడూ కాదు. దేవుడంటే ఆబ్రహం, ఐజాక్, జాకబ్‌ల దేవుడు. మీ అందర్నీ ఇష్టం వచ్చినట్టూ రక్షించడు. ఆయన రక్షించేది నిజమైన యూదు జాతి ప్రజలనే. కావలిస్తే చరిత్ర పుస్తకాలు ఓ సారి తిరగేయండి. చూస్తూ ఉండండి ముందు రానున్న రోజుల్లో ఇజ్రాయిల్‌ని ఆయన ప్రపంచంలో అగ్ర సామ్రాజ్యంగా ఎలా నిలబెడతాడో!” వెటకారంగా నవ్వుతూ అన్నాడు యూదుడు.

అప్పటిదాకా చోద్యం చుస్తున్న కేధలిక్ పాస్టర్ అందుకున్నాడు.

“చూడండయ్యా, వీళ్ళు చెప్పేది. దేవుడు ఆ బ్రాహ్మడి హిందూ మతస్తులనీ, ఈయన యూదుల్నీ తప్ప మరెవర్నీ పట్టించుకోట్ట. భలే మంచి అవకాశవాదం కదూ ఎక్కడ్నుంచి ఎత్తుకొచ్చారో కానీ? మిగతా ప్రపంచం లో జనాలందరూ నరకానికి పోవాలా? ఇదంతా శుద్ధ అబద్ధం అని తెలుస్తూనే ఉంది కదా వీళ్ళ మాటల్ని బట్టి. నేను చెప్తున్నాను వినండి. దేవుడంటే మా సువార్తలో చెప్పిన జీసస్ ఒక్కడే. మనసా వాచా ఎవడైతే సువార్త చదివి అందులో చెప్పినట్టు జీవితంలో ఆచరిస్తాడో, వాడికే దేవుడి రక్ష లభించేది. మిగతావాళ్లకి కాదు. ఉత్తినే వీళ్ళ బూటకపు కబుర్లు విని బుర్ర పాడుచేసుకోకండి మరి.”

ఇదంతా వింటున్న ముసల్మాను అయిన అంగడి యజమాని విని కోపంగా ఇలా అన్నాడు:

“ఓహో వినండయ్యా, ఈయన కేధలిక్కూ, ఆయన యూదుడూ, ఆ వెర్రి బామ్మడు హిందువూను. క్రీస్తు పుట్టడానికి పన్నెండువందల ఏళ్ల క్రితమే మా మహమ్మదు మొదలుపెట్టాడు; మతం, స్వర్గం, నరకం అనేవి. సరిగ్గా విన్నారా? ఇరవై, ముఫ్ఫై ఏళ్ళు కూడా కాదు, పన్నెండు వందల ఏళ్ళు! ఇప్పుడు చూస్తున్నారు కదా? మా మతం చైనా, ఆసియా, ఐరోపా అంతా వ్యాపిస్తోంది. ఈ యూదులూ, జొరాష్ట్రియన్లూ, కేధలిక్కులూ చిన్నా చితకా జనాలు ఈ మధ్యనే తామర తంపర్లలా పుట్టుకొచ్చారు. వీళ్లనా నమ్మేది. దేవుడంటే మా మహమ్మదే దేవుడు. మా మతం వాళ్ళనే ఆ దేవుడు రక్షించేది. ఉత్తినే ఇక్కడకీ అక్కడకీ వేలం వెర్రిగా పరుగెట్టడం ఆపి మా మతం తీసుకోండి. మహమ్మదు ఒక్కడే ప్రవక్త.”

తాను బానిసతో ఏదో సరదాకి అడిగితే ఇంత రాద్ధాంతం అవుతుందనుకోలేదు పర్షియన్ వేదాంతి. ఈ జరిగినదంతా వినేసరికి వేదాంతి కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ కంగారుపడి ఏదో అనబోయేంతలో అక్కడే వినోదం చూస్తూన్న టిబెట్ నుంచి వచ్చిన లామాలు, నిప్పు ఒక్కటే దైవం అని భావించే జొరాష్ట్రియన్లూ, సిక్కులూ ఒకరి మీద ఒకరు ఇంతింతగా అరుస్తూ మేము గొప్ప అంటే మేమే గొప్ప అని వాదించుకోవడం మొదలుపెట్టేసరికి వేదాంతికి మతిపోయింది.

ఆ వాదోపవాదనలు అలా జరుగుతూంటే అంగడి యజమాని అక్కడే కూర్చుని ఇదంతా మౌనంగా గమనిస్తున్న ఒక చైనా కుర్రాణ్ణి చూసి అన్నాడు.

“మొదట్నుంచీ మేము వాదించుకోవడం వింటూనే ఉన్నావు కదా? నువ్వు చెప్పు నేను చెప్పిన మహమ్మదు మతం మంచిదో కాదో. ఇప్పటిదాకా నువ్వు నోరు విప్పలేదు దేని మీదాను. మౌనం అర్ధాంగీకారం అనుకుంటే నేను చెప్పినది నిజం అని నువ్వు అన్నట్టే కదా?”

ఇది విని “అవునవును, నువ్వు చెప్పవోయ్,” అంటూ మిగతా వాళ్లందరూ వాదించుకోవడం మానేసి చైనా కుర్రాడితో అన్నారు ముక్త కంఠంతో. ఏమో ఎటు తిరిగి ఎటు వస్తుందో అనుకున్నాడు కాబోలు నోరు మెదపలేదు చైనా కుర్రాడు.

కానీ వాళ్ళందరూ చైనా కుర్రాడికేసి చూసి, “మేమందరం తలో చెయ్యా వేసేం కనక నువ్వు చెప్తే వినాలని ఉంది,” అంటూ రెట్టించారు.

చైనా కుర్రాడు కన్ఫ్యూషియస్ వేదాంతం చదివి వంటబట్టించుకుని. ఇప్పుడు ఇలా దేశాలు చూడ్డానికి బయల్దేరాడు ప్రపంచ జ్ఞానం కోసం. కాసేపు మౌనంగా ఉన్నాక మెల్లిగా నోరు విప్పేడు.

“చూడండి అయ్యలారా, చూడబోతే మన అందరి మతాలు ఏదో విధంగా భగవంతుడికి గురించి చెప్తున్నా మనం అందరం నమ్మకం లేకపోవడం వల్లా, మితిమీరిన అహంకారం వల్లా ఎదుగూబొదుగూ లేని కుక్కతోకల్లా ఇలాగే ఉన్నాం. మీరు ఏమి అనుకోకపోతే ఓ కధ చెప్తాను వింటారా?”

అప్పటిదాకా, మా మతం గొప్ప అంటే మా మతం గొప్పదని తొడలు కొట్టిన వాళ్ళంతా హుషారుగా చెవులు రిక్కించి చైనా కుర్రాడితో అన్నారు, “తప్పకుండా.”

చైనా కుర్రాడు కధ చెప్పడం మొదలుపెట్టాడు.

“నేను ఇక్కడకి చైనా నుంచి ఇంగ్లీషు వాళ్లతో కలిసి స్టీమర్ మీద వచ్చాను సముద్రాలన్నీ దాటుకుంటూను. వచ్చేదారిలో సుమత్రా దీవుల్లో ఆగాము ఓ రోజు. అక్కడకి ఓడ చేరేసరికి మధ్యాహ్నం అయింది. దిగి ఒడ్డుమీద కొబ్బరి చెట్ల నీడలో తిరుగుతూ ఉంటే కళ్ళు కనిపించని ఓ పెద్దమనిషి వచ్చేడు. ఉత్తరోత్తరా మేము విన్నదాని ప్రకారం, అతను పుట్టు గుడ్డి కాదు కానీ, రోజూ సూర్యుడి కేసి చూసి చూసి అలా అయ్యాడుట. అసలు ఈ సూర్యుడంటే ఎవరూ, ఎందుకలా వెలుగుతాడు అనేది శోధిద్దామని ప్రయత్నం చేసి చూపు పోగొట్టుకున్నాడని చెప్పారు. మా దగ్గరకి వస్తూనే ఏమీ ఉపోద్ఘాతం లేకుండా ఇలా మాట్లాడ్డం మొదలుపెట్టాడు.

‘ఈ సూర్య రశ్మి అనేది నీటి లాంటి ద్రావకం కాదు. ద్రావకం అయితే ఓ గిన్నెలోంచి మరో గిన్నెలోకి పోసేయగలిగి ఉండాలి కదా? పోనీ అది నిప్పు అనుకుందామా అంటే నీటితో దాన్ని ఆర్పగలగాలి. దానితో సూర్యుడు నిప్పు కాదని తెల్సిపోతోంది. మరి కనిపించని ప్రాణమో, ఆత్మో అనుకుందామా అంటే కళ్ళకి కనబడుతోంది కదా? అయితే ఇదో పదార్ధమా? పదార్ధమైతే అటూ ఇటూ కదప గలిగి ఉండాలి. ఇలా తర్కం చేస్తూ పోతే సూర్యరశ్మి కానీ సూర్యుడు కానీ మనకి తెలిసిన ఇవేవీ కాదన్న మాట. మరైతే ఇదేమిటీ అంటే ‘ఏదీ కాదు’ అని సమాధానం చెప్పుకోవాలి అంతే.’

ఈ గుడ్డివాడి కూడా మన వేదాంతి గారికి ఉన్నట్టే ఒక బానిస ఉన్నాడు. వీళ్ళిద్దరూ అక్కడ నీడలో కూచునేసరికి మేమంతా వింటూండగానే గుడ్డివాడు బానిసతో అన్నాడు.

‘ఏవయ్యా, నేను చెప్పినదంతా నిజమేనా? సూర్యుడు లేడని నేను తర్కంతో చూపించి నిరూపించగలిగేను. నా కళ్లకి కనబడే ప్రపంచం అంతా కారు చీకటిగా ఉండడం తో నేను చెప్పినది నిజం అని ఒప్పుకుంటావా?’

దీనికి బానిస సమాధానం చెప్పేడు, ‘మీ తర్కం, గిర్కం అవన్నీ నాకెందుకండి? ఇక్కడ చీకటి పడబోతోంది, ఇక్కడున్న ఖాళీ బొండాం తీసుకుని అందులో చమురు పోసి దీపం వెలిగిస్తాను. ఏదైనా కావలిస్తే ఆ దీపం వెల్తుర్లో కనిపిస్తుంది. ఈ దీపమే నాకు సూర్యుడు. అంత మాత్రం చెప్పగలను.’

పక్కనే కూర్చున్న కాళ్ళులేని అవిటి ఆయన విన్నాడు కాబోలు ఈ మాటలు, పెఠేల్మని ఓ నవ్వు నవ్వేడు.

‘చూడు నాయనా నువ్వు చూడబోతే పుట్టు గుడ్డిలా ఉన్నావు. నీకు వినాలనుంటే నేను చెప్తున్నాను విను, సూర్యుడంటే ఒక మండే అగ్ని గోళం. ఆ గోళం తూర్పున పొద్దున్నే సముద్రం లోంచి ఉదయించి సాయంకాలం అదిగో ఆ కనబడే కొండల్లో అస్తమిస్తూ ఉంటుంది. నీకే కనక కళ్ళు ఉంటే చూసి ఉండగలిగే వాడివి.’

అక్కడే ఉన్న ఓ బెస్తవాడు వెంఠనే అందుకున్నాడు.

‘ఏవిటేమిటీ? సూర్యుడు అలా సముద్రంలోంచి పైకొస్తాడా? నీకే కనక కాళ్ళు ఉండి అవిటితనం లేకపోతే అలా అనగలిగి ఉండేవాడివా? నేను చేపలు పట్టడానికి పడవెక్కి సముద్రం అంతా తిరుగుతూ ఉంటాను. సూర్యుడు కొండల్లో అస్తమిస్తాడనే మాట వెర్రి మాట. సూర్యుడు ఉదయించేదీ అస్తమించేదీ కూడా సముద్రంలోనే. ఇది నాకళ్ళతో చూసిన నిజం.’

ఇదంతా విన్న అక్కడే ఉన్న ప్రతీ ఒక్కరూ జోక్యం చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ భారత దేశం నుంచి వచ్చినాయన అన్నాడు:

‘ఏమి చెప్తున్నారయ్యా కబుర్లు? సూర్యుడు నీళ్ళలోంచి ఉదయించి నీళ్లలో అస్తమిస్తే, ఆయనో అగ్ని గోళం అంటున్నారు కనక నీళ్ళలో ఆరిపోడూ? సూర్యుడూ అసలు అగ్నిగోళం కాదు. ఆయనో దేవత. సప్తాశ్వ రధమారూఢం, ప్రచండం కశ్యపాత్మజం, అంటే ఆయన సప్తాశ్వాలు పూనించిన రధం మీద బంగారు రంగున్న మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడని మా హిందూ మంత్రాలు – చెప్తున్నాయి. ఒక్కో సారి రాహు కేతువులనే గ్రహాలు ఈ దేవుణ్ణి గుటుక్కున మింగుతాయి. అప్పుడు కొంచెం సేపు గ్రహణ సమయంలో భూమ్మీద చీకటి వ్యాపిస్తుంది. కానీ రాహు కేతువులు మండే సూర్యుణ్ణి నోట్లో ఉంచుకోలేక కక్కేసాక మళ్ళీ అంతా మామూలుగా తయారౌతుంది. దీన్నే గ్రహణం అనీ, పట్టు విడుపులనీ చెప్తారు మావాళ్ళు.’

ఇదంతా వింటున్న ఈజిప్ట్ నావికుడందుకున్నాడు.

‘లేదు, లేదు ఈ సూర్యుడు దేవత అనేది నిజం కాదు. నేను సప్త సముద్రాలు చూసొచ్చిన వాడిని. సూర్యరశ్మి లేని ప్రాంతం ఈ భూమిలో లేదు దాదాపు. భారత దేశం లోనే సూర్యుడు ఉదయిస్తాడని చెప్పడం, మేరు పర్వతం చుట్టూ తిరగడం అనేవి సరికాదు. సూర్యుడూ ఉదయించేది బాగా తూర్పున – ఎక్కడో జపాన్ దేశం అవతల. అస్తమించేది ఇంగ్లాండ్ కి ఆవలనున్న పశ్చిమ తీరంలో. అందుకే జపాన్ లో నిహాన్ అనీ నిప్పన్ అనీ అంటూటారు – అంటే సూర్యుడు జన్మించడం అని. నేను నా కళ్లతో చూసినదాన్ని బట్టీ, ప్రపంచం అంతా ఒంటరిగా చుట్టి వచ్చిన మా తాత చెప్పీనదాన్ని బట్టీ ఇదంతా చెప్తున్నాను.”

ఈజిప్ట్ నావికుడింకా ఏదో చెప్పబోతూంటే ఇంగ్లీష్ నావికుడు అందుకున్నాడు.

‘మాది సూర్యుడస్తమించని సామ్రాజ్యం అని మీరందరూ విన్నదే కదా? సూర్యుడి గురించి ప్రపంచంలో మా ఇంగ్లాండ్ దేశం పరిశోధన చేసినంతా, చదివినంతా ఏ దేశం కూడా చేయలేదు. సూర్యుడు ఎక్కడా అస్తమించడూ, ఎక్కడా ఉదయించడూ. ఏ దేశం వెళ్ళినా మేము చూసిన సూర్యుడు ఒక్కలాగా కనపడ్డాడు. దీన్ని బట్టి మేమందరం సూర్యుడు ప్రపంచం అంతా చుట్టూ తిరుగుతున్నాడని నిర్ధారించాం.” అలా చెప్తూ ఏవో వృత్తాలు ఇసకమీద గీసి సూర్యుడెలా భూమి చుట్టూ తిరుగుతున్నాడో చెప్పడానికి ప్రయత్నం చేసాడు కానీ పూర్తిగా చెప్పలేక అన్నాడు ఆఖరికి, “నాకంతా బాగా చెప్పడం రావట్లేదు కానీ మా సరంగు నాకన్నా బాగా చెప్పగలడు ఆయన్నే అడుగుదాం,’ అంటూ ఓడ సరంగు కేసి చూసేడు.

అన్నీ విన్న సరంగు స్థిరంగా చెప్పేడు.

‘మీరందరూ మిడి మిడి జ్ఞానంతో గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ నాకు తెల్సినదీ నేను చూసినదీ చెప్తున్నాను వినండి. సూర్యుడు భూమి చుట్టూ తిరగడు. అలాగనీ ఓ దేశం – జపాన్ కానివ్వండి, ఈజిప్టు కానివ్వండి, పోనీ ఇప్పుడు మనం ఉన్న సుమత్రా కానివ్వండి – చుట్టూ కానీ, ఓ దేశంలోని మేరువు లాంటి పర్వతం చుట్టూ కానీ తిరగడు. భూమే, సూర్యుడి చుట్టూ ఇరవైనాలుగు గంటలకో సారి తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు కాంతినిచ్చేది ఒక్క భూమికే కాదు నవగ్రహాలక్కూడా. నేనూ, నా దేశం అనుకోవడం మానేసి ఓ సారి సువిశాలమైన అంతరిక్షంలోకి కళ్ళు సారిస్తే ఈ నిజాలన్నీ తెలుస్తాయి.'”

కథ చెప్పడం ఆపి చైనా కుర్రాడు అన్నాడు.

“విన్నారు కదా? అహంకారం వల్ల మనం ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుంటున్నాం. సూర్యుడి గురించి మనకి ఎలా తెలిసీ తెలియని జ్ఞానం ఉందో అలాగే భగవంతుడి గురించీను. మనలో ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమైన భగవంతుడూ, ప్రతీ దేశానికీ ప్రత్యేకమైన భగవంతుడూ ఉన్నట్టు చెప్పుకుంటున్నాం. ప్రతీ దేశం కూడా, దేవుడంటే మావాడే, ఇలాగే ఉంటాడు, ఇదేనోయ్ సత్యం, సత్యదర్శనమూనూ – అని చాటి చెప్పడానికి ప్రయత్నం చేస్తూంది. ఈ ప్రపంచం అంతా భగవంతుడు సృష్టించిన అందమైన దేవాలయం. మానవమాత్రులమైన మనం నిర్మించే ఏ గుడి కానీ, మసీదు కానీ, చర్చి గానీ ఈ ప్రపంచం అంత అందంగా ఉండగలదా? ఎన్ని గుళ్ళూ గోపురాలు కట్టినా సముద్రమంతటి అద్భుతం, సూర్యుడంతటి దీపం ఎప్పటికైనా చేయగలమా? మంచి మనసుని ఏ గుడితో పోల్చగలం? ప్రేమించే మనిషిని, అతని హృదయాన్ని ఎంత పెట్టి కొనగలం? అవ్యక్తుడైన భగవంతుడి గురించి ఎంతని చెప్పగలం? మన హృదయాలు ఎంతగా విస్తరిస్తూ ఉంటే మనం అంతగా భగవంతుణ్ణి తెలుసుకోగలం. ఎంత ఎక్కువగా మనం ఆయన్ని తెలుసుకుంటే అంత దగ్గిరగా ఆయనికి చేరువవ్వగలం. అందుకే భగవంతుడికి దగ్గిరగా ఉన్నవాళ్ళలో మంచితనం, ప్రేమా అంత ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే మనం ఒకరినొకరు వాదించుకోవడం మానేసి కలిసిమెలిసి ఉండాలి. మీకు భగవంతుడంటే నమ్మకం ఉన్నా లేకపోయినా సరే ఒకరితో ఒకరు కలహించుకోవడం మాత్రం కూడదు ఎందుకంటే మనలో ప్రతీ ఒక్కరూ కూడా అక్షరమూ, అనశ్వరమూ, శాశ్వతమూ అయిన ఆ భగవంతుడి అద్భుతమైన సృష్టే.”

చైనా కుర్రాడు ఇలా అనేసరికి, అప్పటిదాకా ఒకరితో ఒకరు పోట్లాడుకున్న వాళ్లంతా నోరెత్తలేకపోయేరు. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. నిజం, మౌనం అర్ధాంగీకారమే కదా?

(లియో టాల్ స్టాయ్: కాఫీ హౌస్ ఆఫ్ సూరత్, 1893.)