కోటిగాని కతలు: వీర భద్రుడి తల

పొద్దున్నే నిద్ర లేచాడు కోటి.

కానుగ పుల్లని నోట్లో పెట్టుకుని దొడ్లో గోడ మీదెక్కి తాపీగా నమలడం మొదలు పెట్టాడు.

మూలన అరటి చెట్లు గెలలతో చంటి బిడ్డలనెత్తుకున్న పడుచు తల్లుల్లా ఉన్నాయి.

దానిమ్మ చెట్టు, వేప చెట్టు, కరి వేప చెట్టు, నిమ్మ చెట్టు, కానుగ చెట్టు పక్కన్నే మూడు కొబ్బరి చెట్లు ఉన్నాయి.

ఆ పక్కనే ముద్ద మందారం, ఒంటి రెక్క మందారం, నంది వర్ధనం, గరుడ వర్ధనం ఉన్నాయి.

కిందన చేతికందే, గెడకందే ఎత్తులో ఉన్న పూలన్నీ పొద్దున్నే వాళ్ళమ్మ పూజలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆపైన ఎక్కడో ఆకాశంలో ఇంచుమించుగా మబ్బులని తాకుతున్నట్లున్నవి మాత్రం ప్రస్తుతం మిగిలి ఉన్నాయి.

రకరకాల కనకాంబరాలు, ఏ చిన్న గాలికీ వంగి వంగి దణ్ణమెట్టే బంతి, చామంతులున్నాయి.

తుమ్మెదలు, తూనీగలు, సీతాకోక చిలుకలు పువ్వుల మీద ఎగురుతున్నాయి.

తుమ్మెదలన్నా, అవి చేసే రొదన్నా కోటికి చిరాకు.

తేలిగ్గా ఎగిరిపోయే బుల్లి బుల్లి తూనీగలన్నా, రంగు రంగుల సీతాకోక చిలుకలన్నా పిచ్చిష్టం.

ఇవి రాత్రంతా ఎక్కడ పడుకుంటాయో అని ఆశ్చర్య పడ్డాడు.

చెట్ల మీద పడుకుంటాయేమో అనుకున్నాడు.

మెత్తగా బొంతల్లాగానో, సిల్కు దుప్పట్లలాగానో ఉండే పూల రెక్కల మీద బబ్బుంటాయేమో, అక్కడ చోటు దొరక్కపోతే మెత్తని సిరి చాపల్లాగా ఉండే ఆకు పచ్చ ఆకుల మీద కునుకు తీస్తాయేమోనని అనేసుకున్నాడు.

తులసి కోట ముందు అమ్మ కడిగి ముగ్గు వేసి పూజ కూడా చేసేసింది.

నత్తలు అప్పుడే ఆ పిండి ముగ్గుని తినడం మొదలు పెట్టాయి.

కోటి ఆ నత్తలని, చెట్టు మీద కాకులని చూస్తూ పళ్ళు తోమడం తీరుబడిగా పూర్తి చేసేసి ఇంటోకి వచ్చాడు.

వాడికిప్పుడు పన్నెండేళ్ళు.

నీకెన్నేళ్ళురా? అని ఎవరైనా అడిగితే మాత్రం ఓ పదేనేస్కో అనేసి పోతాడు.

వంటిట్లోకెళ్ళి గోడకి జాగిలపడి వాళ్ళమ్మ గ్లాసునిండా పోసిచ్చిన కాఫీ తాగడం మొదలు పెట్టాడు.

పాలు తాగమని వాళ్ళమ్మ ఎంత బతిమిలాడినా, వాడికి ఇంట్లో పెద్ద వాళ్ళలాగా కాఫీయే కావాలి.

ఇప్పుడు ఎండాకాలం సెలవలు మొదలయ్యాయి కాబట్టి వాడు హాయిగా వాడి ఇష్టం వచ్చినట్టు స్నేహితులని వెంటేసుకుని గట్ల వెంటా, పుట్ల వెంటా తిరగడానికి ప్లాన్లు వేసుకుని అమలు చేస్తున్నాడు.

వాడి స్నేహితులు యథా ప్రకారం ఇంటిముందుకొచ్చి ఈల వేసి కోటి కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. కోటిగాడు అమ్మ ఇచ్చిన కాఫీ పూర్తి చేసి ఒక తువ్వాలు తీసుకుని స్నేహితులు పక్కింటి మల్లిగాడు, ఎదురింటి వెంకిగాడు అటుపక్కా ఇటు పక్కా వెంట నడుస్తుండగా కాలవ దగ్గరికి బయలుదేరాడు.

వాళ్ళు ఈత కొట్టేందుకు రెండు చోట్లున్నాయి. ఒకటి, మల్లన్న బావి. రెండు, పంట కాలువ.

పంట కాలువకే బయలుదేరారు అందరూ. అప్పటికే అక్కడ ఊళ్ళో ఉన్న ఇంకొద్దిమంది సావాసగాళ్ళు ఈతలు కొడుతున్నారు.

తువ్వాళ్ళు ఒడ్డున పెట్టుకుని నీళ్ళల్లోకి దిగి వాళ్ళతో కలిసి హాయిగా ఈతలు కొట్టేరు.

ఇంక చాల్లేరా, ఇంక పోదాం, అని మల్లిగాడంటే,

గంగమ్మ గంగమ్మ
నా పేరు కోటీ
నీ పేరు గంగమ్మ
నువ్వు వంకాయలు తెస్తే
నేను టెంకాయలు తెస్తా
నువ్వు వండి పెడితే
నేను మెక్కి తింటా!

అని కోటి గాడు పాడితే, అలాగే ఎవళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకుని మూడు మునకల పాట పాడుతూ మూడు మునకలేసి, నీళ్ళోడుతూ బయటికొచ్చి తువ్వాళ్ళతో తలలు, ఒళ్ళూ తుడుచుకొని ఇళ్ళకి బయలుదేరారు.

దోవలో రేయ్, గుజ గుజ బెల్లం చేద్దాంరా అన్నాడు మల్లిగాడు.

సరే రా అని అందరూ ఒకే మాటగా మల్లన్న బావి దగ్గర చింత చెట్టు కిందకి చేరారు. ఆ చింత చెట్టు ఎక్కే సులువు వాళ్ళందరికీ తెలుసు.

చకచకా ఎక్కిపోయి కొంచెం తెల్లగా, కొద్దిగా ఎర్రగా ఉన్న చింత పూతని శ్రద్ధగా కొమ్మలు విరక్కుండా చింత చిగురు నలక్కుండా కాయలు రాలకుండా గుప్పెళ్ళ నిండా కోసుకున్నారు.

అంతా ఓ తువ్వాలులో వేసి మూట కట్టి తడి బట్టలతోనే కోటి గాడి ఇంటికి బయలు దేరారు.

వాళ్ళింట్లో వేప చెట్టు ఎక్కి పండు వేప పళ్ళని అమిత శ్రద్ధగా కోశారు. కొన్ని మాంచి మాంచి పండు వేప పళ్ళు చెట్టు కింద రాలిపడి ఉంటే చూసి అయ్యో అనుకున్నారు.

తలా ఒక రాయి తీసుకుని,శుభ్రంగా తుడిచి చింత పూతని బాగా దంచేరు.

చెట్టు కింద బండని ఓసారి తుడిచి దాని మీద చింత చిగురుతో గుండ్రంగా గట్టు కట్టారు.

వేపకాయలను నొక్కుతూ పిచక్ పిచక్మని గింజలు,గుజ్జు మధ్యలో పడేటట్టు వేస్తూ తొక్కలు మాత్రం వాళ్ళ వెనక్కి పడేస్తూ భలే ఉషారుగా ఆ పని ముగించారు.

అప్పుడు మల్లి గాడు తప్ప అందరూ ఆ గుజ్జుతో కూడిన గింజల మీద ఒకళ్ళ అరచేతుల్ని ఇంకోళ్ళ అరచేతుల మీద పెట్టి అరచేతుల కొండ తయారు చేస్తే – దానిమీద మల్లి గాడు పిడికిలితో కొడుతూ,

“గుజ గుజ బెల్లం
గుజారు బెల్లం
… …” అని పాట పాట పాడ్డం మొదలు పెట్టేడు.

ఓ అయిదు నిమిషాలు అలా పాట పాడుతూ కొట్టడం.

పూర్తయ్యాక చేతులు తీసేసి, చింత పూత, వేప కాయాల గుజ్జుని బాగా ఓసారి కలిపి, భాగాలు చేసుకుని పంచుకున్నారు.

అందరూ పంచుకోగా కొంచెం బండ మీద మిగిలితే దాన్ని చిన్ని చిన్ని ముద్దలు చేసి, ఇది పిల్లి ముద్ద, ఇది కాకి ముద్ద, ఇది పిచ్చిక ముద్ద, ఇది కుక్క ముద్ద అని నాలుగు వైపులా విసిరేసి ఆ తర్వాత తినడం మొదలు పెట్టారు.

తింటూ ఉండగా ఉన్నట్టుండి నాన్న ఈ పూట అడవినించి వస్తారని గుర్తొచ్చింది కోటికి.

నడవదాటి ముందు గదిలోకి వెళ్ళేడు. అక్కడ నాన్న నిజంగానే వచ్చేడు. నాన్నతోబాటు నాన్న స్నేహితులూ ఉన్నారు. అడవినించి అప్పుడే వచ్చేరు. నట్టిల్లంతా మాటలతో మహా సందడిగా ఉంది.

కోటీ నాన్నకి, గ్రామం పక్కన ఉన్న అడవి కొట్టిన పిండి.

అప్పుడప్పుడూ తన స్నేహితులతో కలిసి, వెంట గోతాల్లో బియ్యం,ఉప్పు,పప్పులు,ఇంకా అవి మోసే మనిషిని కూడా తీసుకుని అడవికి వెళ్ళి రెండు మూడు రోజులు గడిపి వస్తూ ఉంటారు. ఆయనకి చరిత్ర అన్నా, పురావస్తు పరిశోధన అన్నా ఎంతో ఇష్టం. ఆ పని మీదే అడవికి వెళ్ళేది. అడవిలో చెంచుల్ని కూడా వెంట బెట్టుకు వెళుతుంటారు.

ఈసారి వాళ్ళకి ఏవో నాణేలు దొరికాయి. వాటిగురించే మాట్లాడుకుంటున్నారు. కోటీ నాన్న వాటిని పురావస్తు శాఖ వారికి ఇచ్చేస్తారట.

అడవిలోనే చెట్టు కింద శిధిలావస్థలో దొరికింది ఓ విగ్రహం తల.

వీరభద్రుడట. గోతాంలో ఉన్నాడు. ఆటవికులెవరో పూజలు చేయడం మానేసి వదిలిపెట్టిపోయిన విరిగిపోయిన విగ్రహం తాలూకూ తల అని నిర్ణయించారు వాళ్ళు. చివరికి వాళ్ళింటిలోనే పూజ గదిలో ఉంచాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా నలుగురూ కలిసి మోసుకు వెళ్ళి పూజగది ముందు ఉంచి ఇంక వెళ్ళొస్తామని వెళ్ళిపోయారు.

వీరభద్రుడా? పేరే భయంకరంగా ఉందే అనుకున్నాడు కోటి. వీరభద్రుడు శివుని ప్రమథ గణాలకు అధిపతి అని, శివుడు వీరభద్రుని పంపి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడని నాన్న చెబుతుంటే వీర తాండవం చేస్తున్న ఉగ్రరూపం రూపుకట్టింది వాడి కళ్ళ ముందు.

వామ్మో అనుకున్నాడు.