ఫ్యూగ్ (Fugue)

ఆలెక్స్ నుంచి ఈమెయిల్ తన ఇంటికి డిన్నర్‌కి పిలుస్తూ. “ఎంతో మంది ఉండరు. చిన్న పార్టీ. నీకు పరిచయం చేశాను చూడూ, టెరీసా, ఆమే నువ్వూ, మీ ఇద్దరే డాక్టర్లు. మిగతా ఎవరూ కారు.”

నిసీ వెంటనే తన సంగీతం టీచర్, ఆలెక్స్ రూబెన్ ఈమెయిల్ కు సమాధానం ఇచ్చింది. “నన్ను పిలిస్తే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను తినకూడని పదార్ధాలు చాలా ఉన్నయ్. మెన్యూ ఖచ్చితంగా తెలిస్తే తప్ప, నేనేం తినలేను, తాగలేను.”

“నిసీ! నిన్ను పోయిజన్ చెయ్యాలని పిలవటం లేదు. భోజనానికి పిలుస్తున్నా. నువ్వు బ్రాహ్మిన్ విడో వా?”

“నువ్వు విలేజ్ ఇడియట్‌వా? ఆలెక్స్! నీ సన్నాసి ఇండియన్ కల్చర్ పరిజ్ఞానం నా దగ్గర చూపక. నాకు చాలా రకాల ఫుడ్ ఎలర్జీలు ఉన్నాయి. ఆ డాక్టర్ టెరీసా గారు నీ కెప్పటి నుంచో ఫ్రెండ్ కదా. క్లారినెట్ కూడా వాయిస్తుంది గదా. ఆమెను అడుగు. కొంచెం నీ కర్ధమయే భాషలో, క్లారినెట్ వాయిస్తూ చెపుతుంది.” నిసి ఈ మెయిల్.

వెంటనే రిప్లై. “నిసీ! నేనొక ప్రొఫెసర్ సుమా. ఇది కాలేజి వాళ్లు తనిఖీ చేసే ఈమెయిల్. ప్రైవేట్‌గా శుంఠ, దద్దమ్మ అని పిలుస్తావనుకో. పబ్లిక్‌లో మర్యాదిచ్చి మాట్లాడలేవా?”

“నోప్. నేను ఎవరి ఉద్యోగిని కాను. నాకు మీ రూల్స్ అక్కర లేదు. మీ కాలేజ్ కోసం, నువ్వు ఏ గడ్డి పెడితే అది తిని చచ్చిపోటానికి తయారుగా లేను. నీ ఫ్యునరల్ మార్చ్, వేరే వాళ్ల కోసం, ప్లే చెయ్యి ఆలెక్స్!”

“నువ్వు రావాలి. పువ్వులలో పెట్టి చూస్తా. హెల్ప్ మి! నీకేం కావాలో చెప్పవూ.”

ఆమె అప్పుడు నవ్వుకుని, తను ఏవి అసలు తినకూడదో అతనికి తెలియచేసింది. అతడు వెంటనే తన ఇంటి అడ్రస్, ఏ రోజు, ఏ సమయానికి రావాలో సమాచారం, ఆమెకు పంపాడు.


నిసి ఆలెక్స్ ఇంట్లో ఇచ్చిన విందుకి చాలా సంతోష పడింది. అతడు అంత బాగా వంట చెయ్యగలడని ఆమె అనుకోలేదు. ఆరుగురే విందుకు వచ్చింది. అందరికీ తనే డ్రింక్ లందించాడు. ఆమెకు ఏదో నానా రకాల పళ్లు, ఆకులూ అలములూ ఉన్న సాఫ్ట్ డ్రింక్ ఇవ్వబోతే ఆమె అతని చెయ్యి తోసేసి, నీ కున్న వాటిలో మంచి వైన్, మంచి వైన్ గ్లాస్‌లో ఇవ్వు అంది. అతడు రెండు వైన్ బాటిల్స్ తెరిచి, రెండు గ్లాసుల్లో కొంచెం, కొంచెం వంపి ఆమెకు అందించాడు. ఆమె రుచి చూసి ఒకటి ఎంచుకుంది. ఆమె గ్లాస్ నింపి, అతిధులను ఒకరి కొకరిని పరిచయం చేసుకోమని అక్కడి నుండి కిచెన్ లోకి వెళ్లి పోయాడు.

నిసికి సోనియా ముందుగానే తెలుసు. మ్యూజిక్ స్కూల్లో సోనియా పాడితే వింటానికి, ఎంతో ఉత్సాహంతో వెళుతుంది. ఆమె ఆహ్వానించిన గాత్ర సంగీత విద్వాంసులను వేరే వారిని, వింటానికి కూడా ఇష్టపడి వెడుతుంది. ఆరకంగా ఆమెకు ఆపెరా సంగీతంలో ఆసక్తి పెరిగింది. నిసి సంగీతం పాఠం చెప్పించుకునేప్పుడు, సోనియా అప్పుడప్పుడూ స్టూడియో లోనికి వస్తుంది. ఆలెక్స్, సోనియా ఆమె ముందు ఎడాపెడా పోట్లాడుకుంటారు.

“ఆలెక్స్! నువ్వు కాలేజ్‌లో కచేరిలు సరిగా ఏర్పాటు చెయ్యటం లేదు. అన్ని రకాల వాయిద్యాలకు సమమైన ప్రాధాన్యత ఇవ్వవు. పైగా గాయకులు, పాటలు అసలు అనవసరం అనుకుంటావు. పియానో ఒక్కటే వాయిద్యం అనుకుంటావు. సంగీతం అంతా పియానో ఒక్కటే తయారు చెయ్యదు. నిసి నడుగు, మనిద్దరి లోఎవరు గొప్పో.” అంటుంది.

నిసి, “నీ గాత్రం, ఆ సంగీత వాయిద్యాలన్నిటి కన్నా బాగుంటుంది.” అంటుంది వెంటనే.

ఆలెక్స్ ఊరుకోడు. “నువ్వు నిసి మాటలు నమ్ముతావు. నీ గాత్రం అంతా వాయిస్ బాక్స్, వోకల్ కార్డ్స్ నుండి మాత్రమే రాదని కూడా తెలియదు తనకి. ఆమె దేశం గాయకులు అలా, గొంతులోంచి పై పైన తీగలు తీస్తూ మాత్రమే పాడతారు. వారు ఫుడ్ పైప్, డయాఫ్రమ్, పొట్ట కొంచెం కూడా ఉపయోగించరు. అతి నాజూకు. అదీ ఒక పాటేనా? డాక్టర్ నిసి గారికి కవిత్వం పై మోజు. అందుకని సాహిత్యం మీద అభిమానం చూపించి, వారి మాటల్లోని అర్ధాలను, ఇమోషన్స్ని సంగీతంలోకి అనువదించుకునే షూల్మన్, షూమన్, షూబర్ట్ లను వింటానికి ఉత్సాహం చూపిస్తుంది. ఆమెకు ఆ పాత కాలపు లవ్ పొయట్రీలు, టి.వి. స్క్రీన్ ల మీద చదువుకుంటూ, ఆడా మగా ఒకరంటే ఒకరు పడి చచ్చిపోవటాలు, ఆ రొమాంటిక్ నాన్సెస్ మీద ఆధారపడి, వాటికి తోకలలాగా వేళ్లాడుతూ, మెలికలు తిరిగే సంగీతం అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తుంది.

నేను ప్రేమ పిచ్చిగాణ్ణి కాను. భక్తి పిచ్చిగాడిని కాను. నాకు మాటలు ఉత్త సోది. సంగీతానికి మాటలు అనవసరం. ఐనా గాని నిసికి వోకల్ ఇష్టమైతే, నాకు ఉత్తరం రాసి బతిమాలుకుని, నా దగ్గిర పియానో పాఠానికి ఎందుకు జేరింది?” అన్నాడు.

ఆలెక్స్ రూబెన్ మాట్లాడేప్పుడు స్వరం చాలా సమ స్థాయిలో ఉంచుతాడు. ఆ కంట్రోల్డ్ కంఠస్వరం వింటే, నిజానికి నిసికి, వోకలిస్ట్‌ల ఎన్నో హెచ్చు తగ్గుల సంగీతం విన్నదాని కన్నా, ఎక్కువ కాంక్ష రేగుతుంది. ఆ సంగతి వారిద్దరికీ చెప్పదు ఆమె.

అతడు ఒక కాన్సర్ట్ పియానిస్ట్‌గా, ఎంత స్టయిలిష్‌గా, చక్కగా ప్రారంభించి, ప్రోగ్రాం మధ్య భాగాలన్నీ సమర్ధతతో నిర్వహించి, చివరకు ఒక క్లయిమాక్స్‌కి తీసుకు రావటం, ఆ టైమ్ సెన్స్ – సుజ్ఞానమంతా ఆ డిన్నర్ సర్వ్ చెయ్యటంలో కూడా చూపాడు. నిసి – తమ ఇంట్లో వాళ్లు కలిసినపుడు, ఇప్పటికీ, ఒకరి మీద ఒకరు పడిపోతూ, కంగాళీగా, అరుస్తూ, కొన్నిసార్లు ఆడవాళ్లు వంటిల్లు సొంతం చేసేసుకుని, మగవాళ్లను బైటికి తోసేసి, రభస చేసి, ప్రతి డిన్నర్‌నీ ఒక రణరంగంలా ఎలా మారుస్తారా, భోజనం తిన్న ఆనందం ఇంత కూడా ఉండదు కదా, అనుకుంది.

డిన్నర్ పార్టీలో నిసితో ముందుగా చొరవ తీసుకుని మాట్లాడింది, టెరీసా. ఆమె చనువుగా, ఆలెక్స్ రూబెన్ ఇల్లు నిసికి చూపింది. గోడల మీద బీథొవెన్, లిజ్స్ట్, బొమ్మలున్నాయి. చేతి వ్రాతలో ఉన్న మ్యూజిక్ కాంపొజిషన్ లున్నయి. అవి చదివే పరిజ్ఞానం ఇంకా నిసికి లేదు. ఎప్పటికీ రాకపోవచ్చు. కాని, ఆలెక్స్ ఇంట్లో పెయింటింగ్స్ తను కొనిపించినవని టెరీసా చెప్పినపుడు, ఇల్లు అలంకరణలు తను చేసినట్టూ, ఆలెక్స్ ఏదో మ్యూజిక్ సిడి గురించి, చెప్పినపుడు టెరీసా వెంటనే లోపలి గది లోకి వెళ్లి తీసుకు రావటం నిసి చూసింది. అందువల్ల ఆలెక్స్‌కీకీ, టెరీసాకీ, బహుశా గురువు, విద్యార్ధిని కన్నా ఎక్కువ సంబంధం ఉన్నదేమో అనుకుంది.

వచ్చిన అతిధులలో ఇద్దరు భార్యా భర్తలు. అతడు సొంత ఇంటర్నెట్ బిజినెస్ ఉన్నవాడు. అతని భార్య, కాలక్షేపానికి న్యూట్రిషన్ కోర్సులు తీసుకుంటున్నది. వారిద్దరి మాటల బట్టీ, ఆమె జ్యూయిష్ వనిత అనీ, అతడు కేధలిక్ అనీ, వారిద్దరిదీ రెండో పెళ్లి అనీ, వారి ఇల్లు ఆ దగ్గర లోనే ఉందనీ నిసికి తెలిసింది.

అందరూ ఏవో లోకల్ కబుర్లూ, వారి యాత్రల కబుర్లూ, పాలిటిక్స్ మాట్లాడుకుంటూ తింటున్నారు. మాటల మధ్యలో ఆలెక్స్ టెరీసాని, “నువ్విప్పుడు ఊరు మారి, కొత్త కార్డియక్ ఫెలోషిప్ చేసి సాధించే దేమిటీ”? అన్నాడు.

నిసితో తను వెళ్లబోయే చోట ఉన్న లేటెస్ట్ పెట్ స్కాన్‌లూ, ఎమ్.ఆర్.ఐ. ఎక్విప్‌మెంట్ గురించి చెపుతున్న టెరీసా, ముందు పట్టించుకోలేదు. కాని మళ్లీ ఎగతాళిగా, “నువ్వు ఇప్పుడు ఇంకో ఊరెళ్లి పొడిచేదేంటీ,” అని ఆలెక్స్ రెట్టిస్తే, ఒక్కసారిగా టెరీసా బేలన్స్ తప్పింది. ఆమె గట్టిగా అరిచింది.

“నాకు ఎమర్జెన్సీ రూమ్ లంటే ఇష్టం. అక్కడ రొప్పుకుంటూ, ఊపిరాడకుండా ఉన్న వాళ్లను చూస్తే నాకు కిక్ వస్తుంది. వాళ్లకు ఇ.కె.జి.లు తియ్యటం, ఎకోలు తియ్యటం, అటూ ఇటూ హడావిడిగా పరిగెత్తటం నాకు ఎక్సయిటింగా ఉంటుంది సరేనా, యు ఆర్ సో స్టుపిడ్ ఆలెక్స్!” అని గట్టిగా కేకలేసింది.

ఆమె చేతిలో వైన్ గ్లాస్ పగిలి, ఎర్ర వైనంతా బల్ల మీద ఒలికిపోయింది.

ఒక్క క్షణం, ఆ సంభాషణ ఎటు పోతున్నదో తెలియక అందరూ అయోమయంలో పడ్డారు. నిసి, టెరీసా, గాజు పెంకులు ఎత్తసాగారు.

సోనియా – గాజు పగిలితే అనర్థం అంది, కొంచెం అదేదో జరిగితే బాగుంటుందన్నట్టు. అవి అలా వదిలెయ్యండి. మీ చేతులు తెగుతాయి, నేను తీసేస్తానన్నాడు ఆలెక్స్. గ్లవ్స్ ఇస్తే చాలంది నిసి. అందరి పళ్లాలూ, గ్లాసులూ మార్చెయ్యమని ఆర్డర్ జారీ చేసింది, ఆలెక్స్ ఆ పని చేస్తుండగా టెరీసా బాత్రూమ్ లోకి మాయం అయ్యింది. గ్లవ్స్ డబుల్ చేసి వేసుకుని, నిసి, ఆ గాజు పెంకులు ఎత్తేసి, బల్ల క్లీన్ చేసేసింది. టెరీసా బాత్రూమ్‌లో మరీ ఆట్టే సేపు తీసుకోకుండా తిరిగి వచ్చింది. నిసి పక్కన వచ్చి కూర్చుని, తన ఫర్నిచర్, ఇతర వస్తువులు అన్నీ పంపించి వేసినట్టూ, తనూ రెండు పగ్స్, మరుసటి రోజు ప్లేన్‌లో, తన కొత్త ప్లేస్‌కు వెడుతున్నట్టు చెప్పింది.

అందరూ సర్దుకుని షెర్రీ తాగుతూ డిసర్ట్ తిన్నారు. కాని నిసికి ఆలెక్స్ రూబెన్ ఎగతాళి నచ్చలేదు. ఎంతైనా ఆమె డాక్టర్. పై చదువు చదవాలనుకునే ఇంకో డాక్టర్ని, ఆఫ్టర్ ఆల్ ఒక పియనిస్ట్ ఎగతాళి చెయ్యటం ఆమెకు నచ్చలేదు. ఊరుకోకుండా, “ఆలెక్స్! నీకెప్పుడైనా, గుండె లయ తప్పిందా. చాలా ఎక్కువ వేగంతో ఎట్లా పడితే అట్లా కొట్టుకుందా. నువ్వు అతి వేగంతో పియానో వాయిస్తావు. కాని నీ గుండె ఎప్పుడైనా పిచ్చి పిచ్చిగా కొట్టుకుందా?” అంది.

“ఊహూఁ, లేదు. నా కెప్పుడూ అలా జరగలేదు.”

“నాకు జరిగింది. చాలా అన్ కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఎంత తొందరగా, ఎవరైనా సరి ఐన రిథమ్‌కి మారుస్తారా అని అల్లాడి పోయాను. నువ్వు మ్యూజిక్‌తో గుండెను లయ తప్పిస్తావేమో కాని, మామూలు రిథమ్‌కి తేలేవు. నీకంత శక్తి లేదు. టెరీసా చెయ్యగలదు. నువ్వెవరివి ఒక డాక్టర్ని లేటెస్ట్ టెక్నాలజీ తెలుసుకోకుండా ఆపేందుకు?”

ఆలెక్స్ చల్లారి పోయాడు. “అదేదో ఈ ఊళ్లోనే చెయ్యగూడదా అనే నేనడిగేది,” అన్నాడు.

“అన్నీ ఉన్న ఊళ్లో దొరికితే, మరి నీ దగ్గరకు వేరే దేశం నుంచీ వచ్చి ఎందుకు చదువుకుంటున్నారు. చైనా, కొరియా, బ్రెజిల్ నుండి, నువ్వెందుకు వాళ్లను విద్యార్ధులుగా ఒప్పుకున్నావ్. నువ్వు ప్రతి కొన్ని నెలలకూ వేరే దేశం పోయి కాన్సర్ట్స్ ఎందుకిస్తావ్?”

“ఓ.కే. ఐ యామ్ రాంగ్, వెన్ ఐ యామ్ రాంగ్!” అని, ఆలెక్స్ టెరీసా వైపు చూస్తూ, “టెర్రీ! చదువు చక్కగా సాగాలని నే ఆశిస్తున్నా. గత కొన్నేళ్లుగా సంగీతం కాలేజికి ఇచ్చిన విరాళాలకూ, ముఖ్యంగా నా స్టూడెంట్ల ఆలనా పాలనా చూస్తూ, వారికి చదువులోనూ, వైద్య సహాయం అవసరమైనప్పుడు, ఆ హెల్ప్ అందించినందుకూ థేంక్స్!” అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టి ఛీర్స్ అన్నారు. డిసర్ట్, కాఫీ ముగించుకుని, మెల్లగా ఒకరి దగ్గర ఒకరు సెలవు పుచ్చుకుని, అతని ఇల్లు విడిచి వెళ్లి పోయారు.

ఆ సంఘటన తర్వాత, అప్పటికి, ఇదివరకు ఆలెక్స్, టెరీసా సంభాషణలన్నీ కలుపుకుని నిసికి దాదాపు విషయం అర్ధం అయింది. టెరీసా అండర్ గ్రాడ్యుయేట్‌గా, షికాగోలో, మ్యూజిక్ కోర్సులు ముందు తీసుకుంది. ఆమె మొదటి మొగుడికి పిల్లల్ని కంటూ, అతని ఎంకరేజ్‌మెంట్‌తో మెడికల్ స్కూల్ వెళ్లింది. అతనితో ఆ పైన ఎందుకో సరిపడలేదు. విడాకులు తీసుకుంది. చెడిన వివాహం వేదన నుండి బైట పడటానికి, ఆమె చుట్టాలకు దగ్గర్లో ఉంటానికి ఫ్లారిడా వచ్చింది. ఆమెకు కొత్తగా డయాగ్నోజ్ చేసిన వాస్క్యులార్ డిసీజ్ మూలాన కూడా, ఆమె చలి ప్రదేశం నుండి బైట పడాలనుకుంది. అన్నిటికీ థెరపీగా మళ్లీ, మ్యూజిక్‌ని ఆశ్రయించింది. తద్వారా మ్యూజిక్ స్కూల్లో డాక్టర్ రూబెన్‌ని కలిసి, అతని మీద ఆకర్షణ కలిగి అతనితో పరిచయం పెంచుకోటానికి పియానో మొదలెట్టింది. ఆలెక్స్, టెరీసాలు ఒకరంటే ఒకరు ఆకర్షితులౌటంలో ఆశ్చర్యం లేదు. ఆలెక్స్‌కి స్త్రీల మీద పురుషుల చెలాయింపు అసలు గిట్టదు. తను అందరి మగవాళ్ళలా కాదు అని అతనికి నమ్మకం. ఎవరైనా స్త్రీ ఇతర మగవాళ్లను గురించి తన దగ్గర ఏడుసుకుంటే అతని గుండె కరిగి పోతుంది. టెరీసా ఆ పని బాగా చెయ్యగలదు.