రెండు కవితలు

1. తొమ్మిదింబావు

అద్దపు చెక్కిటి
చెరువున ఊగే
కలువల రేకుల
అంచులని

మంచు దుప్పటి
కప్పుకు కునికే
చలిమంటల
చిరు కులుకులని

ముని చీకటి
కాటుక అలదిన
అంచుల వెనక
మాటలు దాచిన
సరసులని

గేలం వేసే
చేపలని

చేపల చిక్కి
గంటనించి
కొట్టుకులాడే
తెలిమబ్బు
కలలన్నీ

చక్రాల్
గాల్లో తేలే
పచ్చ బస్సులో
వదిలేసి

దిగిపోయాను

కళాశాలకు
వేళయిందని.

2. ​ఆ మాట

దారంతో పువ్వు కుడుతోంటే
చిక్కు ముడి పడ్డట్టు
ఎగురుకుంటూ వెళుతోంటే
కళ్ళల్లో నలుసు పడ్డట్టు
షికారుగా పోతోంటే
జోడు ఒకటి తెగినట్టు
అప్పుడు గబుక్కున
నువ్వన్న ఆ మాట
నీ గొంతులో విసురు
మైసూరు పాకులాంటి
నా మనసు​ను ​
​కసుక్కున కోస్తుంది.