ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ

క్రీస్తుశకం 1509 – 1524 సంవత్సరాల మధ్య శ్రీకృష్ణదేవరాయల ప్రాభవం జగద్విదితంగా ఉండిన రోజులలో ధూర్జటి కృతికర్తృత్వం సాగినట్లు కనబడదు. అల్లసాని పెద్దన, నంది తిమ్మనాదులకంటె కొంత ఆలస్యంగా ఆస్థానప్రవేశం చేసి, అక్కడి విలాసాలకు అలవాటుపడి, అదే సమయంలో రాయల కొలువులోని స్థితిగతులను పరిశీలిస్తూ, కావ్యరచనకు ఆవశ్యకమైన సాధనసామగ్రిని సమకూర్చుకొనే ప్రయత్నంలో ఉన్నాడేమో అనిపిస్తుంది. శ్రీకాళహస్తిమాహాత్మ్యము ఆశ్వాసాంతగద్యలో తన కవితాలక్షణాలను ప్రస్తావింపక నిర్విశేషంగా ‘భవపరాఙ్ముఖ ధూర్జటి ప్రణీతంబైన’ అని మాత్రం చెప్పి ఊరుకొన్నాడు. రాయల ఆస్థానంలో ఉన్న తరుణం ఈ భవపరాఙ్ముఖత్వానికి అనుకూలించిన తరుణమై ఉండదు.

శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తుశకం 1509లో రాజ్యానికి వచ్చాడు. 1530 దాకా పరిపాలించాడు. రాజ్యానికి వచ్చింది మొదలు 1516లో కళింగదేశం విజయనగర మహాసామ్రాజ్యంలో విలీనమైనంత వరకు ఘోరయుద్ధాలతో తీరిక లేకుండా ఉన్నాడు. 1517లో నంది తిమ్మన పారిజాతాపహరణమును అందుకొన్నాడు. అందులో భువనవిజయ సభాభవనం ప్రశంస ఉన్నది. ఆ తర్వాత 1519-1520 నాటి అల్లసాని పెద్దన స్వారోచిష మనుసంభవము (మనుచరిత్ర) లోనూ, తదితరకావ్యాలలోనూ ఉన్నది. 1524 ప్రాంతాల రాయల ఆముక్తమాల్యద రచన జరిగింది. 1518లో కొడుకు తిరుమలరాయలు జన్మించాడు. 1524లో ఆ పిల్లవాడి హత్య జరిగింది. 1524 నుంచి 1530 వరకు రాజ్యమంతా కుట్రలతో కూహకాలతో నిండి, తాడును చూసి పామనుకొనే దుఃస్థితిలో జీవచ్ఛవంగా కాలం గడిపాడు. అనుమానంతో తిమ్మరుసును చెరపట్టాడని పాశ్చాత్య చరిత్రకారులు వ్రాసినది నిజమే అయివుంటుంది. భువనవిజయంలో మళ్ళీ కొలువుతీరినట్లు కనబడదు. సంకుసాల నరసింహకవి వంటి కవులు తమ కావ్యాలను రాజుకు అంకితం చేద్దామని నెలల తరబడి వేచి ఉండి, నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయిన కాలం అది.

1530లో కృష్ణరాయల మరణానంతరం విజయనగర సామ్రాజ్యం కుక్కలు చింపిన విస్తరి అయింది. అప్పటికే తిమ్మరుసు ప్రాభవం అంతరించి అయిదారేళ్ళు దాటింది. కన్నులు పోయాయి. ఆయన చుట్టపక్కాలకూ ప్రాపకాలు తప్పాయి. రోజులు గడవటం కష్టమయింది కాబోలు, 1533లో పాపం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిలో అంతవరకు అనుభవిస్తుండిన తన ప్రసాదస్వామ్యం హక్కులను సర్వభుక్తంగా తాళ్ళపాక అన్నమాచార్యుల కొడుకు పెద తిరుమలాచార్యులకు అమ్ముకొన్నాడు. ధూర్జటిని ఆదరింపగల స్థితిలో లేడు. ధూర్జటి వేరే రాజులను ఆశ్రయించినట్లు లేదు. కృష్ణరాయల తర్వాత అచ్యుతదేవరాయలు సింహాసనం ఎక్కాడన్నమాటే గాని రాచరికానికే తీరని మచ్చతెచ్చిన పరామకిరాతకుడు. అల్లసాని పెద్దన అంతటివాడు ‘కృష్ణరాయల తోడ దివి కేఁగలేక, బ్రదికియున్నాఁడ జీవచ్ఛవంబ నగుచు’ అని పరితపించిన రోజులవి. ధూర్జటికి ఆ మాత్రపు అదృష్టమన్నా దక్కినట్లు లేదు. జీవచ్ఛవానికన్నా దయనీయంగా గడిపిన రోజులవి. రాజశబ్దమంటేనే అసహ్యం పుట్టింది. ‘ఛీ! జన్మాంతరమందు నొల్లను జుమీ, యీ ‘రాజ’ శబ్దంబు’ అని చీదరించుకొన్నాడు. తన వర్తనపై తనకే పశ్చాత్తాపం ఉదయించింది. శ్రీకాళహస్తీశ్వర శతకంలోని రాజనింద అంతా అక్షరాక్షరం ఆ అచ్యుతరాయలకు వర్తిస్తుంది. అందువల్ల 1535కు దరిదాపుల శతకరచన జరిగినదని పెక్కుమంది విమర్శకుల విశ్వాసం. ఏ సంగతీ నిర్ధారణగా చెప్పలేము. వైరాగ్యం అలవడి, మనస్సును చిక్కబట్టుకోగలిగినట్లు కనబడదు. శతకంలో ‘విరక్తుఁ జేయఁగదవే’ అని స్వామిని పదే పదే వేడుకొన్నాడు. కావ్యం విషయానికి వస్తే, శ్రీకాళహస్తిమాహాత్మ్యములో మనస్సు కొంత నిలకడతో ఉన్నట్లు కనబడుతుంది. విజయనగర సామ్రాజ్యోన్నతి నాడు పొందిన ఆనందపు ఛాయలేవీ అందులో అగుపించవు. అసలు కృష్ణరాయల రాజ్యప్రస్తావనమే లేదు. 1523 – 1524 ప్రాంతాల రచన మొదలై, కృష్ణరాయలకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన 1525 – 1530ల నడిమి కాలంలో పూర్తయి ఉండవచ్చునని అనిపిస్తుంది. లేక, 1523 నాటికే మొదలుపెట్టాడో. చతుర్థాశ్వాస పర్యంతం అప్పటికి పూర్తయినట్లున్నది. కృష్ణరాయలు అప్పటికింకా స్తిమితంగా ఉన్న 1524 ప్రాంతంలో ఎప్పుడో భువనవిజయంలో తన కావ్యగానం చేసే అవకాశం వచ్చి ఉంటుంది. ఆ గానమాధురికి రాయలు ముగ్ధుడై, ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ, యతులితమాధురీమహిమ?’ అని ప్రశ్నించటమూ, అప్పుడు తెనాలి రామకృష్ణుడు సమాధానం చెప్పటమూ భావ్యమే.

మరి ఆ కాలంలో తెనాలి రామకృష్ణుని స్థితేమిటి? అప్పటికింకా ‘రామకృష్ణుడు’ కాలేదని, ఇంకా ‘రామలింగడు’ గానే ఉన్నాడని మనకు తెలుసు. క్రీస్తుశకం 1530 ప్రాంతాల ఉద్భటారాధ్య చరిత్రము రచన జరిగింది. అప్పటికి రామలింగడు గానే ఉన్నాడు. 1530 తర్వాత అచ్యుతరాయల సంస్థానంలో ఈ కథాసన్నివేశం జరిగినదని అనుకొన్నా, అప్పటికీ రామలింగడు గానే ఉన్నాడు. 1550 – 65 ప్రాంతాల కందర్పకేతు విలాసము, హరిలీలా విలాసము కావ్యాలను చెప్పాడు. 1560 – 65 లకు నడిమికాలంలో ఎప్పుడో వైష్ణవం పట్ల మొగ్గుచూపాడు. భట్టరు చిక్కాచార్యుల సన్నిధిని సమాశ్రయణం సిద్ధించిన సమయం అది. 1575లో పాండురంగ మాహాత్మ్యము రచన జరిగింది. 1575 – 1580లకు మధ్య ఘటికాచల మాహాత్మ్యము రచన. అప్పటికి డెబ్భై సంవత్సరాలనుకొంటే 1510 ప్రాంతాల జన్మించి ఉండాలి. అప్పటికి ఎనభై సంవత్సరాలనుకొంటే 1500 ప్రాంతాల జన్మించి ఉండాలి. ఎటుచూసినా 1524 ప్రాంతాల ధూర్జటి వంటి మహాకవిపై పరిహాస చంద్రహాసాన్ని ఝళిపించేందుకు 14 కంటె 24 ఏళ్ళ ప్రాయపువాడై ఉండటం సమంజసం. అందువల్ల, 1500 – 1580 అన్నది రామకృష్ణుని జీవితకాలం అన్నమాట.

1524 నాటికి తెనాలి రామకృష్ణకవి ఇంకా తెనాలి రామలింగకవి గానే ఉన్నందువల్ల కథావిషయాన్ని ఇదమిత్థంగా నిర్ధారించేందుకు తగిన సాధనసంపత్తి లేదని కాబోలు, బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, ‘కృష్ణరాయలు ధూర్జటికవి కవనశక్తినిఁగూర్చి పద్యరూపమునఁ బ్రశ్నింపఁగా నొకకవి పూరించిన పూరణము’ అని ఈ చాటువును కృష్ణదేవరాయల ఆస్థానంలో ‘ఎవరో కవి’ చేసిన పూరణగా తమ చాటుపద్యమణిమంజరిలో (1988 నాటి ముద్రణలో 127-వ పద్యం శీర్షిక) ఉదాహరించారు.

శైవ వైష్ణవ నామాంకనాలలో విభేదం ఉన్నంత మాత్రాన ఈ పద్యపూరణను ఎవరో కవి చేసిన పూరణ అని భావింపనక్కరలేదు. రామలింగకవి శైవుడుగా ఉన్న రోజులలో చేసినప్పటికీ, ఆ తర్వాత ప్రసిద్ధిలోకి వచ్చిన రామకృష్ణ నామాన్ని బట్టి జనులు దీనిని రామకృష్ణకవి రచనగా భావించటం అసంభావ్యమేమీ కాదు.

ఈ పూరణను నిర్వహించిన తర్వాత కొద్ది కాలానికే రామకృష్ణకవి ఉద్భటారాధ్య చరిత్రమును పూర్తిచేశాడు. అందులో తన కవిత్వాన్ని గురించి కృతిపతి ఊరదేచమంత్రి సహజసాహితీమాధురీసంయుతాత్ముఁడవు అని చెప్పినట్లుగా వ్రాశాడు. భక్తాగ్రేసరుడైన బమ్మెర పోతనగారి సహజపాండిత్య కవితావైచిత్రిలోని ప్రాణశక్తి, పరమమాహేశ్వరుడైన ధూర్జటిగారి కవనంలోని భగవన్ముఖీనమాధుర్యలక్షణం మనస్సును లోగొన్నందువల్ల కాబోలు, ఉద్భటారాధ్య చరిత్ర అవతరణికలో ఆ సహజపాండిత్యాన్ని, ఈ సుభగమాధురీమహిమను మేళవించాడని అర్థం. ధూర్జటి గారి అపూర్వమైన ‘మాధురీమహిమ’ ఇంకా ఆయన గుండెలకు హత్తుకొని ఉన్నదన్నమాట.

పద్యభావం: పునరవలోకనం

జాగ్రత్తగా పరిశీలిస్తే రామకృష్ణకవి కృష్ణరాయల ప్రశ్నను అమేయమైన ప్రతిభతో వక్తవ్యానికి అనుగుణంగా మలిచి చెప్పాడని అర్థమవుతుంది. ధూర్జటి కృష్ణరాయల సభలో చదివిన శ్రీకాళహస్తి మాహాత్మ్యము చతుర్థాశ్వాసంలోని మాణిక్యవల్లి కథ ప్రసక్తికి వచ్చిందని, ఆ కథాసంగతమైన ఉదంతాన్ని రామకృష్ణుడు ఉభయార్థద్యోతంగా చమత్కరించాడని తెలుస్తుంది.

దక్షిణదేశంలోని మధురాపురంలో మాణిక్యవల్లి అనే వేశ్యకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. గణికాజనానికి ఉచితమైన వాతావరణంలో పెంచినా, వారు శివభక్తికి నోచుకొని చిన్ననాడే వైరాగ్యాన్ని అలవరచుకొంటారు. కులవృత్తిని వీడరాదని ఆమె వారికి చెవిలో ఇల్లుకట్టుకొని వారకాంతల విధివిధానాలను నూరిపోస్తుంది. వారు –

“అమృతము గ్రోలు జిహ్వ చవియంచుఁ దలంచునె తేనె? నింటిలో
నమరమహీరుహం బుదయమైన నరుం డవనీశు వేఁడునే?
యమిజనభాగ్యరూప మగు నాదిమతత్త్వముఁ గాళహస్తిదై
వము భజియించు మానసము వారవధూమదసౌఖ్య మెంచునే?”

అని ఆమె పలుకులను తిరస్కరిస్తారు. అమృతాన్ని ఆస్వాదించటానికి నోచుకొన్న నాలుకకు వట్టి తేనె రుచి అవుతుందా? పెరటిలో కల్పవృక్షం నెలకొన్న భాగ్యశాలికి రాజును ప్రార్థింపవలసిన ఆవశ్యకత ఉంటుందా? ఇంద్రియాకర్షణలకు లోనుగాక నిగ్రహం అలవరచుకొన్నవారి పుణ్యవశాన నేలకు దిగివచ్చిన స్వామిని, సర్వతత్త్వాలకు ఆద్యప్రకృతి అయిన శ్రీకాళహస్తిదేవుని పూజించేవారి మనస్సు వారకాంతలతోడి పొందును కోరుకొంటుందా? మేము మాంసలసుఖాన్ని ఆశించే మానవభుజంగులతోడి సౌఖ్యానికి తావీయము. జగన్నాయకుడైన పరమేశ్వరుని సన్నిధికై ఉవ్విళ్ళూరుతున్నాము – అని అంటారు. కుమార్తెల ఆ వైరాగ్యభావనకు వేశ్యమాత ఎంతగానో చింతిస్తుంది. ఆమె ఒత్తిడిని భరింపలేక వారు శ్రీకాళహస్తిక్షేత్రంలో శివుని సన్నిధికి వెళ్ళిపోవాలనుకొంటారు. దారిదొంగలు వారికి అపకారం చేయవచ్చునని సందేహించి ఈశ్వరుడే వారికి మానవరూపంలో సాక్షాత్కరించి శ్రీకాళహస్తికి తీసుకొనివెళ్తాడు. ఆ మోహనక్షేత్రములో వారు నత్కీరుని శతకపద్యాలతో పరమేశ్వరుని సన్నుతిచేస్తూ, అపూర్వమైన పారవశ్యాన్ని పొందుతారు. ఈశ్వరుడు సతీసమేతుడై వారికి ప్రత్యక్షమై తన సన్నిధి రూపమైన పెన్నిధిని వారికి అనుగ్రహిస్తాడు. ఆకాశవాణి వారి భక్తిపారమ్యాన్ని పురజనులకు వినిపించి, శివుని అనుగ్రహానికి నోచుకొన్న ఉదంతాన్ని వివరించి, వారి పేరిట ఆ పుణ్యక్షేత్రంలో మహేశ్వరలింగాలను ప్రతిష్ఠించాలని ఆదేశిస్తుంది.

మహాకవి ధూర్జటి శైవభక్తిపారమ్యానికి, తమిళంలో సీకాళత్తిపురాణంలో ఉన్న స్థూలచిత్రణకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఆయన భంగీభణితికి, సాటిలేని మాధురీమహిమకు ఉదాహరణీయమైన కథ ఇది.

వారవనితా జనత – అంటే ఆ మాణిక్యవల్లి కుమార్తెలు. వారి పలుకులు ఎన్నో జన్మల అనుభవతాపాన్ని హరింపజేసే మాధుర్యసుధారసధారలు. శివుని యందలి అఖండాకారమైన అనురక్తి, పరమప్రేమ, సర్వసమర్పణభావం, పారమార్థికత, విషయవాసనల పట్ల అనాసక్తి, తత్ఫలమైన వైరాగ్యం వారికి పుట్టుకతోనే అలవడటం వారి భాగ్యవిశేషం. శివార్చనానియమసంగతి తప్ప వారికి అన్యబంధాలు లేవు. పరమేశ్వరుడు వారి భక్తినిష్ఠను గుర్తించి, సన్నిధిని అనుగ్రహించి, తానే వారి వెన్నంటి నడిచి, తాను స్వయంవ్యక్తుడై వెలసిన పుణ్యక్షేత్రానికి తానే తీసికొని వెళ్ళాడన్న కథను పోలిన కథ సాహిత్యంలో వేరొకటి లేదు. తాము అనునిత్యం సేవించుకొంటున్న ఆరాధ్యదైవతం కనుల మ్రోల నిలిచి తమను ఆత్మాభిముఖంగా నడిపిస్తున్నాడన్న అభిజ్ఞానం లేని ఆ బాలికలు మధురాపురం నుంచి చిదంబర నటరాజు వెలసిన పుణ్యక్షేత్రం దారిని మూడు నాలుగు రోజుల ప్రయాణంలో ఆ ‘ఘనతాపహారి’ యొక్క ‘సంతతమధురాధరోదితసుధారసధారలను’ ఆస్వాదించే మహాపుణ్యానికి నోచుకొన్నారు. జన్మించినది ఆదిగా శివారాధనం తప్ప వేరొకటి యెరుగని ఆ పుణ్యవతుల ఘనతాపహారి = జన్మజన్మల తాపశాంతికర ‘సంతతమధురాధరోదితసుధారసధారలను’ మనోమందిరంలో నిలుపుకొన్న ధూర్జటి పవిత్రవాక్కులకు లౌకికకవుల వాగ్విశేషాలతో ఔపమ్యానికి అందని మాధుర్యమయప్రాణశక్తి అందివచ్చింది. అమోఘమైన ఆ వాగ్ధారలో ఓలలాడిన రాయలవారికి ఆ అతులితమైన మాధురీమహిమ అచ్చెరువు గొలిపింది. తత్పూర్వం ఎన్నడూ యెరుగని పారవశ్యాన్ని పొందాడు.

మహాభక్తురాండ్రైన మాణిక్యవల్లి కుమార్తెలు నత్కీరుని శతకపద్యాలను స్తోత్రం చేసి పరమశివుని సన్నిధిని పొందిన ఈ చతుర్థాశ్వాస కథకు మునుపు తృతీయాశ్వాసంలో సాక్షాత్తు మహాకవి నత్కీరుని కథే ఉన్నది. పాండ్యరాజు కొలువుకు ఒక హరద్విజుడు వచ్చి సుందరేశ్వరస్వామి తనకిచ్చిన పద్యాన్ని చదివి వినిపిస్తాడు. ఒక ప్రియుడు తన ప్రియురాలి ధమ్మిలబంధము యొక్క గంధాన్ని మించిన సుగంధం ఉంటుందా? అని ఒక తుమ్మెదను అడగటం ఇతివృత్తం. నత్కీరుడు హరద్విజుడు చెప్పిన పద్యంలో లోకరీతి, కవిసమయం రెండూ తప్పాయని ఆక్షేపిస్తాడు. అప్పుడు సుందరేశ్వరుడే స్వయంగా వచ్చి సభలో కూర్చొని, అందులో తప్పేమిటో చెప్పమని అడుగుతాడు:

“ఈ రాజన్యుని మీఁద నేఁ గవిత సాహిత్యస్ఫురన్మాధురీ
చారుప్రౌఢిమఁ జెప్పి పంప, విని, మాత్సర్యంబు వాటించి న
త్కీరుం డూరక తప్పువట్టెనఁట, యేదీ! లక్షణంబో? యలం
కారంబో? పదబంధమో? రసమొ? చక్కం జెప్పుఁడీ త” ప్పనన్.

అని అడుగుతాడు. ఆ తర్వాత సాక్షాత్తు సుందరేశ్వరునితోడి వాదంలో పార్వతీ ధమ్మిల్లబంధమైనా సరే, దానికి సహజగంధం ఉండదని తెగవేసి చెప్పిన నత్కీరునికి లౌకిక పాండిత్యగర్వభంగం, ఆ తర్వాత శాపకలనం, తత్కారణాన పశ్చాత్తాపం, పాపవిముక్తికీ మనశ్శాంతికీ పరమేశ్వర పుణ్యతీర్థసేవనం, ఆ తర్వాత అతను శివసాయుజ్యాన్ని పొందిన పర్యంతం తృతీయాశ్వాస కథ కొనసాగుతుంది.

పరమేశ్వరుడు తన కవితలో ‘సాహిత్యస్ఫురన్మాధురీ చారుప్రౌఢిమ’ ఉన్నదని చెప్పినప్పటి ఆ అమోఘమైన సన్నివేశం రాయల వారి మనస్సులో నిలిచిపోయి ఉండాలి. దానినే ధూర్జటి కవితకు అన్వయించి,

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ
యతులితమాధురీమహిమ?”

అని సదస్యులతో తన ఆనందాన్ని పంచుకొన్నాడు. ఆ మహానందాన్ని, ఆ సన్నివేశం పూర్వాపరాలను గుర్తించిన రామకృష్ణకవి అందుచేతనే భక్తి శృంగారాలను మేళవించి –

“… హా! తెలిసెన్; భువనైకమోహనో
ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం
తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”

అని ఆయన మనోగతాన్ని తన మనోధర్మానుసారం మనోహరంగా పరిపూర్ణించాడు. మహాశివుని భక్తురాండ్రైన పుణ్యాంగనల జీవితగాథను ధూర్జటి నిజోదంతంతో సమన్వయించాడు.

ఈ పూరణను విన్న రాయలు రామకృష్ణకవికి ఏ బహుమానం సమర్పించుకొన్నా అది తక్కువే అవుతుంది.

తన కావ్యోక్తిమాధురికి ప్రాణంపోశాడని నిండుమనస్సుతో ధూర్జటి గారు ఆ రోజు యువకవి శిరస్సుమీద ఎన్ని దీవెనలు కురిపించాడో!

సభవారంతా ఎంత మురిసిపోయారో!

[తొలుత ‘మాలిక పత్రిక‘లో వెలువడిన తన రచనను పునఃపరిష్కరించి రూపొందించిన పరివర్ధితవ్యాసపాఠమని వ్యాసకర్త తెలియజేశారు. -సం.03/01/2016.]

ఏల్చూరి మురళీధరరావు

రచయిత ఏల్చూరి మురళీధరరావు గురించి: ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి "తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం" అన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. ...