ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ

రాజు ‘ఏల కల్గె?’ అని ప్రశ్నింపక ‘ఎట్లు కల్గె? అని ప్రశ్నించి ఉన్నట్లయితే, ‘ఎట్లు’ అన్న అవ్యయానికి ‘ఏ ప్రకారంగా’ అన్న అర్థంతోపాటు ‘ఏల కల్గె?’ అన్న ప్రశ్నకూడా అంతర్భావిగా లేకపోలేదు. అయితే, రాయలు ‘ఎట్లు కల్గె?’ అని ప్రశంసాపూర్వకంగా అమితాదరంతో అడిగినప్పుడు అందుకు పూరయితృకవి ఆ మాధురీమహిమ ఎట్లా వచ్చినదీ చెప్పాలి గాని – కేవలం వాక్యపూర్ణతాసంపాదన నిమిత్తం ఆ సందర్భానికి తగని పరిహాసంతో కూడిన సమాధానం చెప్పి ఉండటం భావ్యం కాదు. పరిహాసం పవిత్రతను గుర్తించదని; తెనాలి రామకృష్ణుడు అపహాస్యానికి గాక చమత్కారానికి మాత్రమే ఆ పూరణను చేశాడని – మనము వాదంకోసం అంగీకరించినా, రాజు అపూర్వమైన పారవశ్యాన్ని పొంది తెలుసుకొనగోరిన ‘ఎట్లు కల్గె?’ అన్న ప్రశ్నకు రామకృష్ణకవి చేసిన పూరణలో ఆ మాధురీమహిమ ఏ గురూపదేశలబ్ధంగా, ఏ మహాకృషిసమాసాదితంగా, ఏ జన్మాంతరసంస్కారగతంగా, ఏ భగవద్వరప్రసాదఫలంగా వెల్లివిరిసిందో కవిత్వపరంగా వివరించే సముచితమైన సమాధానం రాలేదని కూడా మనము గుర్తుంచుకోవాలి. అది రాజు స్వస్థితికి, ధూర్జటి సుస్థితికి అనువైన పరిణామం కాదు.

కనుక పద్యపాఠాన్ని మరింత జాగరూకతతో పరిశీలించి అర్థనిర్ణయం చేయాలని వేరే చెప్పనక్కరలేదు. ఆ నేపథ్యంతో ఆలోచించి, తెనాలి రామకృష్ణకవి ప్రతిపాదించిన పద్యార్థం ఏమిటో సరిచూద్దాము.

రామకృష్ణకవి పూరణ

పద్యాన్ని ‘హా! తెలిసెన్’ అన్న ఉపక్రమణికతో మొదలుపెట్టడంతోటే రాజుకు, సదస్యులకు రామకృష్ణకవి చెప్పబోతున్నదేమిటో తెలిసిపోయి ఉండాలి. అయితే, నలుగురూ ఊహించలేని అపూర్వమైన అర్థసంగతితో చెప్పటమే మహాకవి ప్రతిభావిశేషం కదా. అందువల్ల ప్రతీతమైన పద్యార్థాన్ని, ప్రతీయమానమైన అర్థాన్ని పరిశీలిద్దాము:

హా! తెలిసెన్ = అసలు సంగతి తెలిసిందండోయి! అని భావం. ఏమి తెలిసిందో చెప్పబోయే ఆ ఉదంతానికి ‘హా!’ అన్న ప్రతిపదోక్తం ఆశ్చర్యార్థకంగానూ ఉన్నది; ఆక్షేపసూచకంగానూ ఉన్నది. చెప్పబోతున్నది ఆశ్చర్యం వల్ల చేస్తున్న పొగడ్తో, ఆక్షేపణపూర్వకమైన తెగడ్తో ఊహించటం కష్టం.

ఇంతకీ తెలిసిందేమిటి? భువనైకమోహన – భువన + ఏక + మోహన = పధ్నాలుగు భువనాలను ఒక్క తీరున సమ్మోహింపజేసే; ఉద్ధత = ఔద్ధత్యాన్ని వహించిన (గర్వాన్ని కలిగిన); సుకుమార = కోమలులైన; వారవనితా + జనతా = వేశ్యకాంతల; ఘన = అధికతరమైన; తాపహారి = (విరహిజనుల యొక్క) మన్మథతాపార్తిని హరింపజేసేది అయిన; సంతత + మధుర = నిత్యమధురమైన; అధర + ఉదిత = క్రిందిపెదవినుంచి ఉట్టిపడే; సుధారసధారలు = అమృతరసప్రవాహాలను; క్రోలుటన్ + చుమీ = ఆస్వాదించటం వల్లనే సుమండీ! అని.

సాకూతమైన సమాధానం

రాయలు తెలుసుకొనగోరిన రహస్యానికి సమాధానంగా రామకృష్ణకవి చేసిన పూరణ మనోహరంగా ఉన్నది. రాయలు మహాపండితుడు. మాధుర్యౌజఃప్రసాదాలనే కావ్యగుణాలలో ఒకటైన మాధుర్యాన్ని ‘మహిమ’ అన్న విభూతివిస్తారకమైన ఐశ్వర్యభావనతో జోడించి ‘మాధురీమహిమ’ అన్న పదబంధాన్ని సరిక్రొత్తగా సృజించటంలోనే ఆయన పాండిత్యవైభవం వెల్లడయింది. ధూర్జటిగారి కవిత్వాన్ని మనన చేసినకొద్దీ ఆ మాధుర్యం ఊటలువారి ఆయనపైని గౌరవం మరింత మరింతగా పెరుగుతుందని చెప్పటానికి ‘స్తుతమతి’ అయిన ధూర్జటి కవి అన్న నిర్దేశంతో వాక్యోపక్రమం చేశాడు. ‘ఆంధ్రకవి’ అన్న బిరుదాంకనంతో ఆ గౌరవాతిశయాన్ని ఉన్నతోన్నతంగా ధ్రువీకరించాడు. భక్తికవిత్వానికి మాధురీమహిమను ప్రతిపాదించటమూ ఆయనకు గల లక్షణజ్ఞానానికి నిదర్శకంగానే అమరింది.

‘మాధుర్యము’ అంటే – బహుశో యచ్ఛ్రుతం వాక్య ముక్తం వాపి పునః పునః, నోద్వేజయతి యస్మాద్ధి త న్మాధుర్య మితి స్మృతమ్, అని నాట్యశాస్త్ర నిర్వచనం. ఎన్నిమార్లు విన్నా, మళ్ళీ మళ్ళీ విన్నా – మనస్సుకు వైముఖ్యమూ, ఉద్వేజనమూ కలుగకపోగా, తీయదనమే ఊటలువారుతుండటం అన్నమాట. అవ్యాహతం మనః పుంసాం మృదుత్వజనకం తతః, హరత్యన్యపదార్థేభ్యో మధురం వస్తు కీర్తితమ్ – అని దీనినే భావవివేకం పర్యాయోక్తంగా వివరించింది. తాపతప్తమై ఉన్న మనస్సును చల్లబరిచే మహాశక్తి అది. శీతలీక్రియతే తాపో యేన త న్మధురం స్మృతమ్ – అని భావప్రకాశంలో శారదాతనయుడు. ఈ మాధుర్యం కావ్యగుణాలలో ఒకటి. ఈ గుణం లలితకోమలపదావళితో కూడినప్పుడు శబ్దగుణమని, శబ్దార్థం మనసుకెక్కిన తర్వాత కలిగే వైచిత్రితో కూడినప్పుడు అర్థగుణమని నాట్యశాస్త్రవ్యాఖ్యలో అభినవగుప్తుల వారన్నారు. వాక్యరచన కోమలమై విలసిల్లాలి. రసభావం మనను ఆ మధురస్రవంతిలో ముంచెత్తివేయాలి. లలితై రక్షరై ర్యుక్తం శృఙ్గారరసరఞ్జితం, శ్రావ్యం నాదసమోపేతం మధురం ప్రమదాప్రియమ్ – అని సోమేశ్వరుడు మానసోల్లాసంలో చెప్పనే చెప్పాడు కదా. ఇది శబ్దగుణమైనప్పుడు పృథక్పదత్వం (విడివిడి పదాలతో కూడిన సుబోధమైన శైలి) వల్ల కలుగుతుందని కావ్యాలంకారసూత్రవృత్తిలో వామనుడన్నాడు. అనతిదీర్ఘసమాసత్వం (దీర్ఘసమాసాలు లేకపోవటం), స్థాన ప్రయత్నాది సామ్యం వల్ల, అనుప్రాసాది వర్ణవిన్యాసం వల్ల కలిగే శ్రావ్యత అన్నవి దీని లక్షణాలు. ఇది అర్థగతమైనప్పుడు మసృణత్వం, ఉక్తివైచిత్రి వల్ల కలిగే ప్రాణశక్తి దీని లక్షణాలు. అర్థోచితవచోబన్ధో మాధుర్య మభిధీయతే – అని ప్రకాశవర్షుని రసార్ణవాలంకారం. మధురమైన అర్థానికి తగిన మధురమైన శబ్దాన్ని నిబంధించటమే మాధుర్యమనే రసధర్మమని ఆయన ఉద్దేశం. ఆహ్లాదకత్వం మాధుర్యం శృఙ్గారే ద్రుతికారణమ్, కరుణే విప్రలమ్భే తచ్ఛాన్తే చాతిశయాన్వితమ్ – అని మమ్మటుని కావ్యప్రకాశం. మనస్సుకు ద్రుతిని కూర్చే (చిత్తాన్ని ద్రవింపజేసే) హ్లాదనం ద్వారా రసాన్ని ప్రవహింపజేసే గుణవిశేషం ఇది. ఆత్యంతికమైన తీవ్రావేశం కలిగినప్పుడు సైతం తొట్రుపాటు లేని హృదయధర్మం మాధుర్యమని సాహిత్యమీమాంసలో మహాలంకారికుడు మంఖుకుడన్నాడు.

ఇటువంటి లక్షణవిషయాలన్నీ ప్రస్తావనకు రాగలవని తెలిసిన రామకృష్ణకవి తదనుగుణంగానే తన పూరణను నిర్వహించాడు. శృంగార వేదాంతాలను సామ్యభావంతో పరిష్కరించాడు.

రాయలు అడిగిన ప్రశ్న పద్యపూర్వార్ధంలో ఉన్నంత మాత్రాన అది పూర్వపక్షార్థం కాదు. పూర్వపక్షాశ్రయమైన సిద్ధాంతవిరోధకోటి లోనిది కాదు. అది ప్రశంసాపూర్వకమైన వాక్యోపక్రమం. అందువల్ల రామకృష్ణకవి యోగ్యయోగసామర్థ్యంతో, సిద్ధాంతానుకూలమైన తర్కంతో వాస్తవాన్ని నిర్ధారణ చేయవలసివచ్చింది.

రాయలు మాధురీమహిమ ఎట్లు కలిగెను? అని వ్యక్తీకరించినది సందేహం. దానికి హేతువుగా రామకృష్ణకవి అధరసుధారసాస్వాదనను ప్రతిపాదించాడు. ఆ అధరముయొక్క ధర్మవైశిష్ట్యాన్ని అమృతరసస్యందితగా నిరూపించాడు. ‘క్రోలుటన్ చుమీ’ అన్న నిశ్చయంతో అదే అసలు హేతువు అని ముగించాడు.

ఎట్లు కల్గెను? అన్న ప్రశ్నలోనే, ఏల కల్గెను? అన్న మరొక సందేహం కూడా అంతర్భావిగా ఉన్నది కదా. దానికి కూడా సమాధానం చెప్పాలి కనుక శ్లేషానుప్రాణితంగా సాదృశ్యహేతుకమైన అన్యార్థాన్ని నిక్షేపించాడు.

రెండు అర్థాలలో ఏది ప్రధానం? అంటే, ఎవరి సంస్కారాన్ని బట్టి వారు ప్రధానార్థాన్ని గ్రహిస్తారన్నమాట.

తీయదనానికి ఆశ్రయమైనది వారవనిత క్రింది పెదవి. సుధారసధారలు చిప్పిల్లటానికి విషయభూతంగా కవి స్వీకరించిన వస్తువిశేషం అది. ఆ రసాస్వాదనం ధూర్జటి కవిత్వానికి తీయదనాన్ని అలవరించినదని చెప్పటం కవితాత్మకమైన భావన.

భువనైక + మోహన

భువనైకమోహన అన్నప్పుడు రామకృష్ణకవి పూరణలో అర్థాంతరస్ఫురణ కూడా ఉన్నది. ‘మోహనము’ అన్నది మన్మథుని శస్త్రశక్తులలో ఒకటి. ఆ ప్రకారం ‘లోకాలన్నింటిని వశపరచుకొనే మన్మథుని సమ్మోహనశక్తియొక్క ఉద్ధతిని కలిగినప్పటికీ మిక్కిలి కోమలులైన వారవనితల ఘనతాపహారి – సంతతమధురాధరోదిత – సుధారసధారలు’ అని పద్యాన్ని అన్వయింపవచ్చును.

ఘన + తాపహారి, ఘనతా + అపహారి

ఇందాక చెప్పుకొన్న అర్థానికి మారుగా, భువనైకమోహనో, ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి అన్న సమాసాన్ని పుంలింగంగా గ్రహించి, దానిని ధూర్జటికి అన్వయించి, భువనైకమోహన = ఈరేడు లోకాలను సమ్మోహింపజేసే, ఉద్ధత = ఔద్ధత్యాన్ని వహించిన (గర్వాన్ని కలిగిన); వారవనితాజనతా = వేశ్యాంగనల; ఘనతా + అపహారి = గర్వాతిశయాన్ని పోగొట్టేవాడైన ధూర్జటిగారిచే; (వారవనితల యొక్క) సంతత మధురాధర ఉదిత సుధారసధారలు క్రోలుటన్ చుమీ – అని మరొక అన్వయం కూడా సాధ్యమే.

వారవనితాజనతా ఘనతా + అపహారి అన్న విరుపులో వారవనితా జనతకు అంతకాలమూ ఉన్న ఘనత (పరువు) కూడా ధూర్జటి వాళ్ళ ఇంటికి వెళుతుండటం వల్ల తొలగిపోతుందనే వెక్కిరింత లేకపోలేదు. ఘనతా + అపహారి = ఇటువంటివాడు ఇంటికి వచ్చిపోతూ వాడవదినెలకు ఉన్న పరువును కూడా తీస్తున్నాడన్నమాట.

ఇదీ వ్యంగ్యార్థంలో భాగమే కాని, రామకృష్ణకవికి అనభిమతార్థం కాదు.

ఉద్ధత > ఉద్యత

భువనైకమోహనో, ద్ధతసుకుమార అన్నప్పుడు ‘ఉద్ధత’ అన్న ఆ విశేషణానికంటె ‘ఉద్యత’ అన్న అనుసంధేయార్థం కూర్పబడి ఉంటే పద్యాన్వయం ఇంకా సులభంగా ఉండేది. ప్రతిపాద్యార్థమూ మరింత ప్రశంసనీయంగా ఉండేది.

“…హా, తెలిసెన్! భువనైకమోహనో
ద్యతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం
తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”

అన్నప్పుడు, భువనైకమోహన = సమస్తభువనాలను ఒక్క తీరున (సౌందర్యాదిభిః ముగ్ధతాకరణే) సమ్మోహింపజేసేందుకు, ఉద్యత = పూనుకొన్న, వారవనితాజనతా = వేశ్యాంగనలయొక్క, ఘన + తాపహారి = (విరహిజనుల) అధికతరమైన మన్మథార్తిని హరింపజేసే, సంతత మధుర = నిత్యమధురమైన, అధర = క్రిందిపెదవినుంచి, ఉదిత = ఉదయించిన, సుధారసధారలు = అమృతరసప్రవాహాలను (ప్రథమకు ద్వితీయార్థం); క్రోలుటన్ + చుమీ = ఆస్వాదించటం వల్లనే సుమండీ!

అని స్పష్టమైన అర్థప్రతీతి సాధ్యమయ్యేది. వ్రాతప్రతులలో అటువంటి పాఠం ఉన్నదేమో పరిశోధించాలి.

పద్యపూరణ: ప్రామాణ్యవివేచన

రాయల కొలువులో ధూర్జటి కవిత ప్రశంసకు పాత్రమై, రాయలు పూరణీయంగా అడిగిన ఈ పద్యపాదం కథ కేవలం జనశ్రుతులలో వినబడే కట్టుకథ కాదని, పద్దెనిమిదవ శతాబ్ది తొలిపాదం నాటికే ఇది ఈ నోట ఆ నోట నాటుకొని ఉన్నదని ధూర్జటి వంశీయుడైన కుమార ధూర్జటి క్రీస్తుశకం 1710 ప్రాంతాల తన కృష్ణరాయ విజయము అవతారికలో (1-29) కృతిభర్త తనతో పలికిన వాక్యంగా గ్రంథస్థం చేసిన విషయాన్ని బట్టి తెలుస్తున్నది:

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో
యతులితమాధురీమహిమ” నా మును మీ పెదతాత చాల స
న్నుతిఁ గనెఁ గృష్ణరాయల మనోజ్ఞసభన్; విను, మీవు నట్ల – మ
త్కృతబహుమానవైఖరులఁ గీర్తి వహింపుము ధాత్రిలోపలన్!”

ఇందులో కుమార ధూర్జటి కృష్ణరాయల వాక్యాన్ని యథాతథంగా పేర్కొని ఉండటం వల్ల పై కథోదంతమంతా సత్యమేనని భావించటానికి వీలవుతున్నది. కృష్ణరాయవిజయం కృతిభర్త ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో, యతులితమాధురీమహిమ నా మును మీ పెదతాత చాల స, న్నుతిఁ గనెఁ గృష్ణరాయల మనోజ్ఞసభన్’ అనటం వల్ల కృష్ణదేవరాయలు అడిగినది ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో, యతులితమాధురీమహిమ’ అనే గాని, ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల గల్గెనో, యతులితమాధురీమహిమ’ అని కాదని వెల్లడవుతున్నది. అయితే, ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో, యతులితమాధురీమహిమ’ అన్న పాఠానికంటె ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గె – నీ, యతులితమాధురీమహిమ’ అన్న పాఠం మేలని అనుకొన్నాము. కుమార ధూర్జటి ఈ పాఠభేదాలను గమనించి ఉండకపోవచ్చును. లేదా, ఆ పాఠం తన అవతారిక సందర్భంలో ఇమడదని ఆయన అనుకొని ఉండవచ్చును.

రాజసభలో సమస్యను తెనాలి రామకృష్ణుడు ఒక్కడే పూరించాడో, పరిపరివిధాలైన ఇతరుల పూరణలు కూడా ఉండినవో తెలుసుకోవటానికి ఆధారాలు లేవు.

పద్యరచనా కాలం

ధూర్జటి కృతులుగా మనకు లభిస్తున్నవి మొత్తం రెండు కృతులు. 1. శ్రీకాళహస్తి మాహాత్మ్యము, 2. శ్రీకాళహస్తీశ్వర శతకము. సాహిత్యచరిత్రకారులు వీటి రచనాక్రమం ఇదేనని భావిస్తున్నా, వీటిలో ఏది మొదటిదో, ఏది తర్వాతిదో నిర్ధారించటానికి ప్రకటమైన ఆధారాలు లేవు. రెండింటి రచనాకాలాన్ని నిరూపించే ప్రామాణికమైన ఆధారమేదీ బయల్పడలేదు.

ధూర్జటి కృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవిసమాజంలో ఒకడని కథాశ్రవణమే కాని, అందుకు సమకాలిక చారిత్రికాధారాలేవీ గురజాడ శ్రీరామమూర్తి గారు ఈ కథను చెప్పినప్పుడు వెల్లడి కాలేదు. ఒకానొక రోజున కాళహస్తిమాహాత్మ్యాన్ని తెనిగించిన ధూర్జటి అనే కవీశ్వరుడొకడు రాజాస్థానానికి విచ్చేసి, కృష్ణరాయలతో తన గ్రంథాన్ని గురించిన ప్రశంస కావించాడని, అప్పుడు రాయలు ఆ గ్రంథాన్ని తెప్పించి సావధానంగా పరిశీలించాడని, ఆ కవి వాక్చమత్కృతికి ముగ్ధుడై పండితులను ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ, యతులితమాధురీమహిమ?’ అని అడిగాడని ఆయన కథనం. ధూర్జటి రాయాస్థానంలో లేడని ఆయన కథనం. అయితే, కొండవీటి దండకవిలెలోని అష్టదిగ్గజ కవుల పట్టికలో ధూర్జటి పేరున్నది. ఉన్నది. అదేమంత ప్రామాణికమైన సాక్ష్యం కాదు. విశ్వనాథ స్థానాపతి రాయవాచకంలో ధూర్జటి పేరు లేదు. జనశ్రుతి మాత్రం ఆయన అష్టదిగ్గజకవులలో ఒక్కడనే.

కుమార ధూర్జటి పైని చెప్పిన ‘కృష్ణరాయల మనోజ్ఞసభన్’ అన్న ప్రమాణం గాక, ఆ కుమార ధూర్జటి కొడుకు లింగరాజకవి చెప్పిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యములో ఈ పద్యం ఉన్నది:

“శ్రీకాళహస్తిగౌరీనాథపదపద్మసద్భక్తియుక్తి నిశ్చలతఁ గాంచి
సారసుధాసారసరసోక్తిగుంభనఁ గాళహస్తిమాహాత్మ్య(?మహత్త్వ)కథ నొనర్చి
కృష్ణరాయకిరీటకీలితమణిగణార్చితపదాబ్జద్వయశ్రీ వహించి
యాసేతుకాశీతటావనీఖ్యాతసత్కీర్తివిస్ఫూర్తిఁ జాల వెలసి

ధరణిఁ జెలువొందె నే కవీశ్వరవతంస
రత్న మ మ్మహనీయు, ధూర్జటిసుధీంద్రుఁ
దలఁతు జలనిధివీచికా కలకలాను
కారిభూరికవిత్వవాక్పటిమ గులుక.”

ఇందులో చెప్పినట్లు కృష్ణరాయలు ధూర్జటి పాదాలకు సకిరీటంగా వంగి నమస్కరించిన సందర్భం ఎప్పటిదో లింగరాజకవి వర్ణించలేదు. చెప్పిన సందర్భాన్ని బట్టి మాత్రం ధూర్జటి కృష్ణరాయల ఆస్థానవిద్వాంసులలో ఉన్నాడనే అనుకోవాలి. అయితే కృష్ణరాయల పాలనాకాలానికి సుమారు రెండు శతాబ్దాల తర్వాత ఆయన ఉన్నాడు. ఎన్ని వివరాలను ఎంతవరకు తెలుసుకొన్నాడో చెప్పలేము.