జనవరి 2016

!!!ఈమాట రచయితలకూ పాఠకులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

ఈమాట సజీవంగా సగర్వంగా 17వ ఏడులోకి అడుగు పెట్టింది. మీ సహాయసహకారాలు ఆదరాభిమానాలు లేకుండా ఇది ఎంతమాత్రమూ సాధ్యమయేది కాదు. అందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు అర్పిస్తున్నాం. అయితే ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నడవవలసిన దారి అంతా ముందే ఉన్నది. అందువల్ల, మారుతున్న కాలంతో పాటు మారుతూ కొత్త తరాల రచయితలనూ, పాఠకులనూ ఈమాట సాహితీప్రయాణంలో సహగాములను చేయడానికి, ఈమాట అందరికీ మరింత చేరువ కావడానికీ ప్రయత్నిస్తున్నాం. అదే సమయంలో సాహిత్యాన్ని సాహిత్యంగానే మననీయాలనే మా ఆశయాన్ని, మేము నమ్మిన సాహిత్యపు విలువలను కాపాడుకోవడానికి, సాహిత్యధోరణుల పాతకొత్తల మేలు కలయికగా ఈమాటను నడపడానికీ కృషి చేస్తున్నాం. సాహిత్యస్పందన తక్షణమూ, తాత్కాలికమూ అయి ఆవేశకావేషాలు రగిలించే జాతిమతవాద రాజకీయధోరణుల ప్రాబల్యానికి పనిముట్టు కాదనీ కారాదనీ మా నమ్మకం. ఆహ్లాదాన్నీ ఆలోచననీ కలిగించే సృజనాత్మక సాహిత్యంతో పాటు, విశ్లేషణాత్మక విమర్శావ్యాసాలను ప్రోత్సహించడం ద్వారా సాహిత్య చర్చలకు దోహదం చేయాలనీ, ఈమాట అందుకు ఒక చక్కటి వేదిక కావాలనీ మా కోరిక, మా ప్రయత్నమూ. ఈ దిశగా ఈమాట ప్రయాణం మీ తోడ్పాటు, ప్రోత్సాహం లేకుండా ఇప్పటిదాకా జరగలేదు. ఇకముందూ జరగదు. మీ ఆశీస్సులు, మీ సహకారం ఇకముందూ ఈమాటకు ఉంటాయని ఆశిస్తూ, ఉండాలని ప్రార్థిస్తూ, ఈమాట నిర్వహణలోనూ, ఆశయాలలోనూ ఏమాత్రమూ రాజీ పడమని హామీ ఇస్తూ, మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.


ఈ సంచికలో:

  • కథలు: ద్వైతం – తాడికొండ శివకుమార శర్మ; ధీర – టి. శ్రీవల్లీ రాధిక; మా ఆవిడ-మంగళ సూత్రం – బులుసు సుబ్రహ్మణ్యం; వారఫలాలు – ఆర్. శర్మ దంతుర్తి; మనుషులపై మదుపు – కోల్లూరి సోమశంకర్; రాంగ్ నంబర్ – లక్ష్మీదేవి; సంపాదకుని తిరస్కరణ లేఖ – గోపాలుని గోవిందరావు; ఫ్యూగ్ – లైలా యెర్నేని; కోటిగాని కతలు: వీరభద్రుని తల – పాలపర్తి ఇంద్రాణి.
  • కవితలు: ఫాల్ – వైదేహి శశిధర్; రెండు కవితలు – పాలపర్తి ఇంద్రాణి; అట్టు నా ఆదర్శం – మాగంటి వంశీ.
  • వ్యాసాలు: ప్రాకృత కవనము: సేతుబంధకావ్యము – రవి; అక్కరలు – జెజ్జాల కృష్ణ మోహన రావు; సాహిత్యంలో వేశ్యావృత్తి – ఎస్.జె. కల్యాణి.
  • ఇతరములు: మా మహారాజుతో దూరతీరాలు: పుస్తక పరిచయం – రాజా పిడూరి. నాకు నచ్చిన పద్యం: లీలామోహనుని ముగ్ధసౌందర్యం – భైరవభట్ల కామేశ్వరరావు; ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ – ఏల్చేరు మురళీధరరావు.
  • శబ్ద తరంగాలు: గేయపినవీరభద్రీయము – తిరుమల కృష్ణదేశికాచార్యులు; అజంతా రెండు కవితలు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారి సాహితీయాత్ర – సమర్పణ: పరుచూరి శ్రీనివాస్.