రాంగ్ నంబర్!

రాత్రి ఒంటిగంట కొట్టగానే తీర్థయ్యకు ఠక్కున మెలకువ వచ్చింది. టెలిఫోన్ మ్రోగుతోంది. అర్ధరాత్రి ఫోన్ గంట మ్రోగితే ఎందుకింత భయం వేస్తుంది?

“హలో! ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నామండి… మీ పేషెంట్ ఇప్పుడే చనిపోయారు. హలో!”

“మా పేషెంటా? మా పేషెంట్ ఆసుపత్రిలో ఎవరూ లేరండి.”

“మీ నెంబర్!?”

“రాంగ్ నంబర్! ఫోన్ పెట్టేయండి.”

ఎందుకిలా రాంగ్ నంబర్‌కు చేస్తారో, ఏమిటో ఖర్మ! తీర్థయ్య ఫోన్ పెట్టేశాడు. భయమేస్తుంది. చాలా భయమేస్తుంది.

“ఉన్నట్టుండి ఫోన్ ఎందుకు మ్రోగుతుంది? ఇన్ని రాంగ్ నంబర్లెందుకు వస్తాయి?” సవిత అడుగుతోంది.

చాలా రోజులనుంచీ సవిత గానీ తీర్థంకరుడు గానీ రాత్రులు పొద్దు పోయేదాక నిద్రపోరు. సరిగ్గా పన్నెండింటికి తీర్థంకరుడు అదే తీర్థయ్య ఒక నిద్రమాత్ర వేసుకుంటాడు. వేసుకుని, కళ్ళు మూసుకొని పడుకుంటాడు. చింతల నుండీ, చీకాకుల నుండీ మనస్సును కాస్సేపైనా తప్పించాలనుకుంటాడు.

కానీ, కుదరనే కుదరదు. ఎంత ప్రయత్నించినా మనస్సులో నిండిన వేదను దూరం చేయలేడు. సుషుప్తీ మెలకువల మధ్య పొరల వంటి గోడలేవో… ఆ గోడల మీద అంటించబడిన రకరకాల పోస్టర్లు!

దీపంకరుని ఫోటోలు – చిన్నప్పటి దీపంకరుడు, క్షౌరం చేసిన జుట్టు. అదుగో అమాయకమైన ముఖం. మెట్రిక్ చదివే దీపంకరుడు, గ్రాడ్యుయేట్ దీపంకరుడు! పొడుగ్గా ఎదిగిన సన్నటి శరీరం, భావాలెన్నో దాచుకున్న ప్రశాంతవదనం!

దీపంకరుడు, తీర్థంకరునికి ఒకే ఒక్క కొడుకు. సంతానం! సంతానం! ఎందుకు సంతానం పట్ల ఇంతటి మోహం! సంతానాన్ని ఎందుకింతగా ప్రేమిస్తారు? తీర్థయ్య ఈమధ్య ఈ ప్రశ్న రోజూ వేసుకుంటాడు.

తర్వాత, కాసేపటికి నిద్రలోకి జారుకుంటాడు. గాఢంగా… కానీ ఏదో భయం, ఏదో ఆదుర్దా ఉన్నట్టే ఉంటుంది. సవిత ఇంకా నిద్రపోయినట్టు లేదు. ఎవరి ఫోన్ అని అడుగుతోంది.

“రాంగ్ నంబర్.”

“ఎక్కడి నుంచీ?”

“ఆసుపత్రి నుంచి”

“ఆఁ! ఆసుపత్రినుంచా? ఒకవేళ మనకే చేశారేమోనండీ…!”

“అర్థం లేకుండా మాట్లాడకు సవీ! దీపూ, నీరేన్ దగ్గరున్నాడని మరిచావా? నీరేన్‌ను దిల్లీలో చేర్పించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాడు, కదా! అన్నీ తెలిసే ఏంటీ వాగుడు?”

“నీరేన్ దగ్గరుంటే దీపూ ఉత్తరం వ్రాయకుండా ఎందుకుంటాడు? నీరేన్ ఉత్తరం వ్రాయకుండా ఎందుకుంటాడు? ఏంటి, నేను ఏడ్చి గోల చేస్తాననుకుంటారా మీరంతా? వెంటనే నీరేన్ దగ్గరికి బయల్దేరతాననుకుంటారా?”

“సవీ! ఆవేశపడకు.”

“నాకెందుకో దీపూ అక్కడ… నీరేన్ దగ్గర లేడనిపిస్తుంది. నీరేన్ కావాలనే మనతో ఏమీ చెప్పకుండా ఉన్నాడు.”

“ఇంక చాలు. ఊరుకో సవీ! ఏడవకు. జరిగేదంతా మంచికేనంటారు. దీపూ పారిపోయేంతగా ఇక్కడ ఏ సమస్యా ఎప్పుడూ లేదని నీకూ తెలుసు.”

“మరెందుకండీ… రాడు, వాడు!”

“సవీ! నీకీ మధ్య ఆరోగ్యంతో పాటు బుద్ధి కూడా చెడినట్టుంది. కాలాలు బాగులేవు. ఇక్కడ మన ప్రాంతాలు కూడా ఆట్టే ప్రశాంతమైనవి కావు. అందుకే వాడు రాడు.”

సవిత మళ్ళీ ఏడవడం మొదలుపెడుతుంది. చిన్నగా… వినీవినపడనట్టు… వెక్కుతోంది. అలా ఏడుస్తూ ఎప్పటికో గాని కళ్ళు మూతలు పడవు. ఇంక తీర్థయ్య నిద్ర చెడిపోయింది.

ఏమైంది ఈ దేశానికి? రోగంతో ఆసుపత్రిలో ఉన్నవాడు చనిపోతే… ఫోన్ చేసి తెలుపమంటున్నారా జనాలు? రాంగ్ నంబర్! రోగి బంధువులు.వాళ్ళ మనసెలా ఒప్పుతుంది?

అసలు మనసుండదా, బాధుండదా? ఈ మధ్య కాలంలో అందరూ కురుక్షేత్రం నాటి అర్జునులై పోయినారా? మృత్యువు పట్ల అంత భావరహితంగా, వైరాగ్యభావనతో ఉంటున్నారా? శవాలు ఆసుపత్రుల మంచాల మీద అలా పడి ఉంటాయా వాళ్ళొచ్చేవరకూ?! డబ్బులు ఖర్చవుతాయని అందరూ అలా వదిలేసి వెళ్ళుంటారా? మళ్ళీ వచ్చుంటారా లేదా అసలు? లేక ఏ ఎయిర్ కండిషన్డ్ మార్చురీలో పడి ఉంటాయా శవాలు! వాటిని చూడడానికి వచ్చేవాళ్ళు కూడా ఉండరా?

తీర్థయ్యకు మనసులో భయం! కారణమే లేకుండా… ఏదో భయం! ఈ కలకత్తా, తానుండే ఈ పశ్చిమ బెంగాల్ లోని ఈ ఊరు… ఇంకేదో ఊరేమోననిపిస్తుంది. వేరే ఇంకొక కలకత్తానేమో అనిపిస్తుంది. చూడడానికి అదే ఊరు, అదే పెద్ద మైదానం, అవే భవనాలు, అదే భవానీ పూర్, అలీపూర్, అదే చడ్ కడాంగా రోడ్డు. ఆషాఢంలో అవే రథయాత్రలు, చైత్రంలో కాళీఘాట్లో అదే జనం, మాఘంలో శివరాత్రి వేడుకలు!

కానీ… కాదు! ఇదా ఊరు కాదు. ఇదేదో తప్పు ఊరు! రాంగ్ సిటీ! తప్పు బండెక్కి తప్పు ఊరుకు వచ్చేసినట్టు!

లేకపోతే… సవితకు చెప్పిన బుద్ధులన్నీ తానే మరచిపోయి తీర్థయ్య మళ్ళీ ఆలోచించసాగాడు. …లేకపోతే, దీపూ ఉత్తరం ఎందుకు వ్రాయడు? నీరేన్ ఎందుకు దీపు గురించి ఏమీ చెప్పడు?

ఎందుకు? ఎందుకు మనిషి సంతానం కోరుకుంటాడు? ఎందుకు కొడుకుని ప్రేమిస్తాడు? కూతుర్ని ప్రేమిస్తాడు? చస్తే కొరివి పెడతాడనా? రాంగ్ నంబర్! బ్రతికున్నంత వరకూ తీర్థయ్య కూడా సంతానాన్ని ప్రేమిస్తూనే ఉంటాడు. నీవు నా దగ్గరే ఉండు. నా కళ్ళ ముందే ఉండు. నా బాధ పంచుకో, నా తపనను నీవు పంచుకో, నా భాగ్యం పంచుకో. నా ప్రతిరూపంగా, నా ప్రతిబింబంగా ఉండు.

“రాంగ్ హోప్!”

ఇక్కడెక్కడైనా టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఉందా ఏం? ఉన్నట్టు, అక్కడినించీ ఎవరో చెప్తున్నట్టు తీర్థయ్యకు అనిపిస్తోంది, వినిపిస్తోంది.

“రాంగ్ నంబర్! రాంగ్ సిటీ! రాంగ్ హోప్!”

ఎవరు? ఎవరది? ఆ అదృశ్య ఆపరేటర్ ఎక్కడ? ఎవరూ కనబడరేం?

తెలియకుండా నిద్రపట్టేసింది. ఇలాగే జరుగుతుంది. పగటి నుంచి రాత్రికి, సోమవారం నుంచి ఆదివారానికి, పొద్దుట్నించి సాయంకాలానికి పొద్దు జరుగుతుంది. తీర్థయ్యకు రాత్రులంటే భయం, ఎందుకంటే నిద్రలో గోడల మీద కనిపించే గీతలు, గీతలపైన గీతలు!

ఆ గోడలమీద దీపంకరుని ముఖం అచ్చుపడి ఉంటుంది. నిద్రలో తీర్థయ్య ఆలోచిస్తాడు… మనోజ్ దగ్గరికి ఒకసారి వెళ్ళివస్తే! మనోజ్ చిన్ననాటి మిత్రుడు. అతడు మనస్తత్వవేత్త. మానసికరోగాలకు చికిత్స చేస్తాడు. నిస్సందేహంగా తీర్థయ్య పాలుమాలినవాడే.

“నీకు అనారోగ్యం ఉన్నమాట నిజమే.”

తీర్థంకరుని పాలిపోయిన ముఖం, చూపుల్లోని బెంగ, మాటిమాటికీ నుదుటి చెమట తుడుచుకొనే ప్రయత్నం అన్నీ గమనించిన మనోజ్ చెప్పాడు.

“ఏమనారోగ్యం?”

“నరాల జబ్బు”

“నా నరాలకేమైంది? లక్షణంగా ఉన్నాయిగా?”

“నీకున్న చింతలు విచిత్రమైనవి.”

“విచిత్రమైన చింతలా?”

“నీవేమేం చెప్పావో, నీవే విను. ఇదిగో.”

మనోజ్ టేప్ ఆన్ చేశాడు. ఎప్పుడు రోగులు తమ గురించి చెప్పుకుంటారో అప్పుడే మనోజ్ ఆ విషయాలన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. అవి మళ్ళీ విని ఆలోచించి చికిత్స చేస్తాడు. తీర్థయ్య టేప్ రికార్డర్ వంక చూశాడు. అంతలోనే లోగొంతుకతో తన స్వరం వినిపించింది.

“నాకేమనిపిస్తుందంటే, నా యిల్లు నాది కాదనిపిస్తుంది. తలుపు తట్టినపుడు ఎవరూ తలుపు తెరవరనీ, ఎందుకంటే నేను రాంగ్ అడ్రస్‌కు వచ్చాననీ అనిపిస్తుంది. దార్లో నడుస్తున్నప్పుడు ఇది కలకత్తా కాదనీ, అలా మిగలలేదనీ అనిపిస్తుంది. అన్ని యిళ్ళు వాకిళ్ళు, పెద్ద మైదానాలు, భవనాలు, స్మృతిమంటపాలు అన్నీ వేరే ఏదో ఊరి చేతిలో పెట్టి కలకత్తా ఎక్కడికో పారిపోయిందనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఎ రాంగ్ సిటీ అని తరచూ అనిపిస్తోంది. అవసరం లేకపోయినా కేవడాతల్లాకు వెళ్ళాను ఒకసారి, ఇది కలకత్తానే అని నమ్మకం కలుగుతుందేమో అని. అక్కడ గోడల మీద వ్రాసినది చదివి నేను తప్పు స్థలానికి వచ్చానని అర్థమైంది. ఆరోజు నాకు కల…

మనోజ్ టేప్ ఆఫ్ చేశాడు. తీర్థయ్య వైపు చూసి “చెప్పు, ఆ రోజు ఏం కల వచ్చింది, తీర్థా?” అని అడిగాడు.

“ఏమో, చెప్పలేను.”