సంపాదకుని తిరస్కరణ లేఖ

డిసెంబర్ 31, 1937.

శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు (ఉరఫ్ శ్రీశ్రీ) గారికి,

మీరు పంపిన రాయలసీమ చాంతాడంత పొడుగాటి నవ్య కవిత, కవితా! ఓ కవితా! మాకు అందినది. మీరు మీ ఉత్తరానికి సరిపడినన్ని స్టాంపులు అంటించలేదు; సరిగదా, తిరిగి పంపటానికి సరిపడ తపాలా బిళ్ళలు అంటించిన కవరు కూడా పంపలేదు.

ఒక విశేషం. మీ కవితలో అక్కడక్కడ అసాధారణ ప్రతిభ కనిపిస్తున్నది సుమా అని భ్రమ కలిగించే మెరుపులు కొన్ని ఉన్నాయని మా సహసంపాదకులు ఒకరిద్దరు భావించి నాకు నమ్మిక కలిగించటం వలన మీకు జవాబు రాయవలసిన బాధ్యత నాపై పడినది.

ఈ మధ్యకాలంలో వస్తున్న తెలుగు కవితల గురించి మీకు ఒక విషయం గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది. ‘ఇది తెలుగు పద్యం’ అని పేరుపెట్టి, కేవలం సంస్కృతంలో రాసి పారేసే జనం పుట్టగొడుగుల్లా పెరిగి పోతున్నారు. అటువంటి కవితలు మాకు రోజూ తంబలుతంబలుగా వస్తున్నాయని మీకు తెలుసు. మీకూ వారికీ నలుసంత కూడా భేదం లేదని చెప్పటానికి నాకు ఏమాత్రమూ సంకోచము లేదు. మేము సాధారణముగా మా పత్రికలో ఇరవై-ఇరవై ఐదు లైనులకు మించిన కవితలని అచ్చు వెయ్యము. మా పత్రికలో మొదటి పేజీలో కవిత అచ్చయితే, ఆ కవితకి, రాసిన కవికీ పద్ధెనిమిది క్యారెట్ల బంగారు పతకాలు ఇచ్చి సన్మానించే సంస్థలు, స్వాములు, పీఠాధిపతులూ, ఉన్నారని మీకు తెలుసు.

ఇక మీ కవితా! కవితా! అన్న మకుటంతో మాకు పోస్టేజీ డ్యూతో వచ్చిన కవిత గురించి:

ఈ కవితలో మీరు సుమారు నాలుగు వందల మాటలు వాడారు. కలగా పులగంగా సమాసంలో కలిపేసిన మాటలని ఒక మాట గానే లెక్క పెట్టాము. ఉదాహరణకి, లయాతీతం, నిఖిలగానం, రణన్నినాదం, శంఖారావం, రాక్షసరతి, పుంఖానుపుంఖం, వగైరా, వగైరా. ఆ సమాసాలని విడదీసి రెండు గానో, కొన్ని చోట్ల మూడు గానో లెక్కిస్తే మీ కవితలో మాటల మొత్తం దరిదాపుగా ఆరువందల పైచిలుకే! ఇకపోతే, ఈ నాలుగు వందల మాటలలో సుమారు రెండువందల మాటలు ప్రాచీన సంస్కృత భాష లోనివి. మిగిలిన దేవభాష మాటలకి మీరు, నా, నీ, నూ, లా, అని కొన్ని పొల్లు అక్షరాలు (వీటిని విభక్తులనాలని చిన్నయసూరి ఏనాడో చెప్పాడు!) తగిలించి, అవి తెలుగు మాటలే సుమా అనే భ్రమ కలిగించారు. మీకు శ్రీనాథుని శ్రీహర్షచరిత్ర ‘అనువాదం’ గురించిన కథ తెలిసే వుంటుంది. సంస్కృత పండితులు, ‘అయ్యా! మీ డు,ము, వు,లు, మీరు మీ దగ్గిరే ఉంచుకొని మా సంస్కృతం మాకు వదిలెయ్యండి,’ అన్నారట! సరిగ్గా, మీ కవితా! ఓ కవితా! కవితలో, మీ నా, నీ, నూ, లా లన్నీ తీసేస్తే మీ కవిత పూర్తిగా సంస్కృత కవిత అని చెప్పవలసి వస్తుంది. నిజం చెప్పాలంటే అది అప్పుడు కవితగా పరిగణింప బడదు. రెండవ తరగతి సంస్కృత వచనముగా లాక్షణికులు అంగీకరించవచ్చునేమో!

మీరు వాడిన సంస్కృతపదాలకి ఖచ్చితమయిన అర్థం తెలిసే వాడారా? లేకపోతే, జనానికి మస్కా కొట్టటానికి వాడారా? మచ్చుకి కొన్ని ఉదాహరణలు ఇస్తాను.

నవపేశలం అంటే మీఉద్దేశంలో కొత్త కోకిలా, కొత్త రోకలా?

గీతావరణం అంటే పాటల మూత అనా?

స్యందనము అంటే కారటం అనా లేక రథము అనా?

సినీవాలీ అంటే మీకు సరైన అర్థం మీకు తెలుసా? చంద్రకళకనిపించే అమావాస్యని సినీవాలీ అంటారు. లేదా మీరు పార్వతి అన్న అర్థంలో వాడారా?

లోహశ్యేనమా? అంటే ఇనుప డేగ అనా? అంటే అర్థం ఏమిటి?

నిమిషాలందు, నిషాలందు అంటే ఏమిటి?

ఫిరంగిలో జ్వరం ఏమిటి?

ఇది రాస్తున్నప్పుడు మీరు ఏ ఏ పానీయాలు పుచ్చుకుంటున్నారు? అని మా ఉపసంపాదకుడు ఒకడు (కొవ్వూరు సంస్కృత పాఠశాలలో ఆరు సంవత్సరాలు సంస్కృతం అభ్యసించిన కుర్రాడు) ఆశ్చర్య పడుతున్నాడు. ఇలా రాసుకోపోతే, మీ కవిత మొత్తం ఆక్షేపించవలసి వస్తుంది.

మీకు ఝడిపించే మాటలు అర్థం పర్థం లేకండా వాడటంలో చాకచక్యం ఉన్నదని రుజువవుతున్నది. ఉదాహరణకి చూడండి:

దీక్షా శిక్షా తపస్సమీక్షా — గుహలో, కుటిలో, చీకటిలో — శంఖా రావం, ఢంకా ధ్వానం, ఘూకం కేకా, భేకం బాకా
— హాహాకారం! ఆర్తారావం! — బలవత్ ఝరవత్,– అమోఘ, మగాధ, మచింత్య, మమేయం,
— ప్రక్షాళిత మామక పాపపరంపర — తారా నివహపు ప్రేమ సమాగం — నానుడి, నీగుడిగా
— నాగీతం నైవేద్యంగా, హృద్యంగా — కవనఘృణీ! రమణీ!– అనుపమితా! అపరిమితా!
— విసరిన రస విసృమర — రసధుని! మణి ఖని!

ఇలాగ ప్రాసలు, అనుప్రాసలు, అంత్యానుప్రాసలు, యమకాలు, గమకాలు, చమకాలు కోకొల్లలు, మీకవిత నిండా!

రాసిన తరువాత కనీసం ఒక్కసారైనా చదువుకొని చూసుకున్నారా? ఏమిటి, వికారంగా ఈ మాటల గడబిడ? రకరకాల శబ్దాల అల్లికతో శయ్య చేసి ఎవరిని భయపెడదామనుకున్నారు? ఎవరిని మోసగిద్దామనుకున్నారు? దయ చేసి చెప్పండి. మీరు కవితని, ఒక అధిష్టాన దేవతగా (పాశ్చాత్యుల భాషలో Muse అని అర్థం) ఒక్కొక్కతూరి దైవాంశసంభూతస్త్రీగా సంబోధించారు. మీరు పరమ నాస్తికులని మా సహసంపాదకుడు ఒకడు వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి నొక్కి చెపుతున్నాడు. ఇది నిజమేనా?

ఇక పోతే ఛందస్సు విషయం. ఇది చాలా ముఖ్యం. మీకు ఛందస్సు సర్పపరిష్వంగంలా అడ్డుపడినదని అంటున్నారు. మా కొవ్వూరు పండితుడు, ఛందస్సులో కాకలు తీరిన స్రష్ఠ. మీ కవితలో దగ్గిర దగ్గిర అరవైనాలుగు ఛందస్సులు నిబిడీకృతంగా ఉన్నాయని సవాలు చేస్తున్నాడు. ఒకటి కాదు, రెండుకాదు, అరవైనాలుగు! చతుష్షష్టి కళల్లా!

మీకవితలో కొన్ని మెరుపులు కనిపించాయని నేను ముందుగా చెప్పాను. ఆ విషయం ప్రస్తావిస్తాను. మీకు, మీ స్వానుభవంలో, తాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన, పడుపుకత్తె రాక్షసరతి, ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం, సమ్మెకట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చిచ్చుల హాహాకారం, ఆర్తారావం — వాటికి తోడుగా ఒక లక్షనక్షత్రాల మాటలు, ఒక కోటిజలపాతాల పాటలు, వినిపించాయి, కనిపించినాయి అని అంటున్నారు. ఈ కన్నవీ విన్నవీ పద్యంలో పెడదామనుకుంటే, మీకు శ్మశానాల వంటి నిఘంటువులు, వ్యాకరణాల సంకెళ్ళు అడ్డం వచ్చాయి. అది కదా, క్లుప్తంగా అసలు విషయం. శబాష్! అవన్నీ కలిపి, ఒక చక్కని వచన పద్యం తెలుగుభాషలో ఇరవై ఐదు – ముప్ఫై లైనులకి మించకూడా రాసి, తిరిగి పంపించండి. (లేదా ఆపని మా ఉపసంపాదకులు చేస్తే, మీకు అభ్యంతరం ఏమాత్రమూ లేదని ఒక పోస్ట్ కార్డ్ పంపండి!) ఇక మిగిలిన సంస్కృత భేషజం గందరగోళానికి శాశ్వతంగా బై బై చెప్పండి. కావాలంటే ఆడియోస్, అమీగోస్ అనండి. అప్పుడు, మీజాతి జనులు (వీళ్ళెవ్వళ్ళో మా సంపాదకవర్గానికి ఇంతవరకూ అంతుబట్టలేదు!) మంత్రంలా మ్రోగించి పాడుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను.

మీ కవితా! ఓ కవితా! కవితని యధాతథంగా మా పత్రికలో ప్రచురించలేమని మీకు తెలియ పరుస్తున్నాను.

ఆఖరిగా ఒక సలహా. మీకు జంతుశాస్త్రంలో పట్టా ఉన్నదని తెలిసినది. మీకవితలో సదరు ప్రతిభ ప్రతిబింబిస్తున్నది. ఈ రకమయిన కవిత్వం రాయటం మానుకొని, మీ పట్టాని సద్వినియోగపరచుకొనండి.

శలవు.

గోపాలుని గోవింద రావు ( గోగోరా)
ముఖ్య సంపాదకుడు,
బై-రతి.
తెలుగు సాహిత్య మాస పత్రిక.