మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం

న్యూయార్క్ నగరాన్ని గురించి వర్ణిస్తూ: ‘ఒక తుఫాను లాంటిది, ఉరుముతుంది, మెరుస్తుంది, హింస పెడుతుంది. చూడటానికి కళ్ళు నెప్పెడతాయి. అయినా చూడకుండా ఉండలేం. అసాధ్యం,’ అని కురుమెళ్ల వారు వ్రాసిందాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. రోడ్లు, బిల్డింగులు, 70 లక్షల జనాభాతో ఇసుక వేస్తే రాలకుండా నిరంతరం రద్దీగా ఉన్న ఆ నగరం ఒక మహా అరణ్యం లాగా కనిపించిందట. అంతా అయోమయం, చెవులు బద్దలయ్యే గోల. ఎలక్ట్రిక్టక్ లిఫ్ట్ లను, ఎస్కలేటర్లని చూసి అమితాశ్చర్యపడ్డారట. అమెరికన్ల జీవితాల్ని చూసి వీళ్ళ జీవితాల్లో స్పీడ్ తప్ప స్థిమితత్వం లేదనీ, అమెరికా వెళ్ళి ఏం చూశావు అని అడిగితే తక్షణం వచ్చే జవాబు – అడ్వర్టైజ్మెంట్లు అనీ – కళ్ళు తెరిచినా మూసినా, ప్రతి పత్రికలోనూ మూడు వంతుల పైగా, నివసించే గదిలో వస్తువుల పైనా, గోడల మీదా, రోడ్ల మీదా, స్తంభాల మీదా, బస్సుల్లో, రైళ్ళల్లో అవి లేని స్థలం ఒక్క అంగుళం కూడా ఉండదనీ; పగలు రంగురంగుల అడ్వర్టైజ్మెంట్లు ‘కళ్ళకి గుచ్చుకుంటాయ’నీ వింతపడుతూ వ్రాశారు.

నయాగరా జలపాతం పైన ఇనుముతో కట్టిన ఒక అరప (మంచె) మీద నిలబడి చూసినప్పటి అనుభూతిని, సముద్రాన్ని తలపించే మిషిగాన్ సరస్సుకి పైగట్టు మీద ఇంకో సముద్రంలా కనిపించే కార్ల సముదాయాన్ని చూసినప్పుడు కలిగిన విభ్రమాన్ని వర్ణించారు. చికాగో నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి రైల్లో మూడు రోజులు, మూడు రాత్రుళ్ళు ‘ఏకటాకీన’ చేసిన ప్రయాణాన్ని – రైల్లో రాత్రి పక్కకోసం వేసిన చక్కటి పరుపులన్నీ తెల్లారి కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో మాయమైపోయి మెత్తని సోఫాలు ప్రత్యక్షమవడం లాంటి వాటిని – ఉత్సాహంగా వర్ణించారు. అలాగే ఇంకొక వింత ఏమిటంటే శాన్ ఫ్రాన్సిస్కో చేరే ముందు ఓక్‌లాండ్‌లో రైలు మార్గం అంతమైపోవడం వల్ల తాము ప్రయాణం చేస్తున్న రైలు ఆ పళంగా ఒక స్టీమరు మీదకు ఎక్కిపోవడం, ఓక్‌లాండ్‌కీ శాన్ ఫ్రాన్సిస్కోకి మధ్య ఉన్న గల్ఫ్ దాటి అవతల గట్టుకు చేరగానే మళ్ళీ స్టీమర్ లోంచి రైలు బండిని భూమి మీదకి లాగించెయ్యడం – ఇదంతా ప్రయాణీకులకి ఏ మాత్రమూ కుదుపూ శ్రమా లేకుండా జరగడమూ – అమిత అబ్బురంగా రాసుకొచ్చారు. డెన్మార్క్ నుంచి స్టాక్‌హోంకి పోయేటప్పుడు కూడా మళ్ళీ ఇలాగే జరిగిందట.

మహాసముద్ర గర్భాలలో, ధ్రువప్రాంతాలలో కూడా రైలు మార్గాలు వేసుకోగలిగే పరిజ్ఞానం ఉన్న ఈ కాలంలో ఇలాంటి అనుభవం ఎక్కడైనా దొరుకుతుందేమో తెలియదు.

న్యూయార్క్‌కీ, శాన్ ఫ్రాన్సిస్కోకీ హస్తిమశకాంతరమనీ, అక్కడక్కడా కొంచెం పెద్ద భవనాలు కనపడుతున్నా న్యూయార్క్‌లో మాదిరి ‘స్కైస్క్రేపర్లు గానీ, వెర్రిజనం గానీ’ శాన్ ఫ్రాన్సిస్కోలో కనపడలేదని రాసుకొచ్చారు కురిమెళ్ళవారు. ఇంగ్లీషు సినిమాల గురించి, హాలీవుడ్ గురించి, కురుమెళ్ళ వారికీ, లేఖలు అందుకున్న పెమ్మరాజుగారికీ చాలా అసక్తీ, పరిజ్ఞానం ఉన్నాయని తెలుస్తుంది. తను కాలిఫోర్నియాలో ఉండగా నార్మాషేరర్ ప్రసవించడమూ, మాన్ ఆఫ్ తౌజండ్ ఫేసెస్ అన్న పేరున్న లోన్ షేనీ (Lon Chaney) మరణించడమూ, అతని అంతిమ యాత్రకు కలలో కూడా ఊహించనంత పెద్ద ఊరేగింపు జరగడమూ, శవం మీద కప్పిన పూలచక్రాలు మోయడానికి పది లారీలు, వెనక మూడు వరసలలో అభిమానుల మోటారు కార్ల బారులు కొన్ని మైళ్ళ పొడవున నడవడమూ, ఏ మహారాజుకీ, ఏ చక్రవర్తికీ జరగని గౌరవం ఒక సినిమా స్టార్ పొందడమూ – మొదలైన విషయాలూ, ఇంకా అక్కడి సినిమా రంగపు విశేషాలూ వివరంగా, ఆసక్తికరంగా వర్ణించారు. మిత్రులిద్దరికీ సినిమా పిచ్చి తగుమాత్రం కంటే ఎక్కువే ఉందని తెలుస్తుంది దీనివల్ల.

క్రిస్టీ స్టుడియోలో తిరుగుతూ, మేకప్‌లో లేకపోయినా ముఖంలోని ఫీచర్స్ చూసి ఒక వ్యక్తిని ‘హెరాల్డ్ లాయిడ్’ అని గుర్తుపట్టి అతనితో మాట్లాడారట. ఆయన, నా పిక్చర్స్ ఏం చూశావు? అని అడిగితే తను చూసిన ఆయన సినిమాలు ఏకరువు పెట్టారట. చార్లీ చాప్లిన్ పిఠాపురం రాజావారితో మాట్లాడేటప్పుడు జోక్స్ విసరడం, విరగబడి నవ్వడం, వాళ్ళిద్దరూ కలిసి ఫోటో తీసుకోవడం లాంటి విషయాలని కూడా ఆయన తన లేఖల్లో వ్రాశారు. అలానే యూనివర్సల్ స్టుడియోలో ఒక కారు, ఫైర్ ఇంజన్ ఢీకొని ఒక బహుళ అంతస్తు భవనం కూలిపోయే సీన్ షూటింగ్‌ని నిబిడాశ్చర్యంతో రాసుకొచ్చారు. ఆ రోజుల్లోనే హాలీవుడ్‌లో ఇండియన్స్ కూడా కనిపించారట. ఒకాయన సినేరియో రైటర్ననీ, ఇంకొకాయన టెక్నీషియన్ననీ చెప్పుకున్నారట.

ఇక్కడ ఇంకో చిన్న విశేషం ఉంది. బొంబాయిలో ఓడ ఎక్కడానికి ముందే కురుమెళ్ళవారు పెమ్మరాజువారికి ఒక ఉత్తరం రాస్తూ, ఊహించని విధంగా ప్రపంచపర్యటనకి మహారాజువారి పార్టీతో కలిసి తను వెళుతున్నాననీ, పాస్పోర్ట్, వీసాల కోసం హడావుడిగా వెళ్ళిపోయొచ్చేయాల్సిందనీ, స్నేహితులెవరికీ చెప్పకుండా వచ్చేసినందుకు క్షమించమనీ వ్రాశారు. లండన్ హోటల్లో దిగీదిగిన వెంటనే వ్రాసిన ఉత్తరంలో తన అడ్రస్‌ (కేరాఫ్ థామస్ కుక్ అండ్ సన్స్ వారిది) పెమ్మరాజు వారికి ఇచ్చారు. దాని వల్ల పిఠాపురం నుంచి పెమ్మరాజుగారు రాసిన ఉత్తరాలు కురుమెళ్ళవారు ఏ దేశంలో ఉన్నా (ప్రపంచ పర్యటన చేస్తుండగానే) అందుకోవడానికి వీలు కలిగింది. అంటే ఇ-మెయిల్ లాంటిది కాకపోయినా ఒక మాదిరి ‘ఇంటరాక్టివ్ మెయిల్’ నడిచిందన్నమాట మిత్రుల మధ్య ఈ ఆరు నెలల కాలంలో.

లండన్‌కి రెండు వందల మైళ్ళ దూరం లోని లీడ్సు అనే పట్టణంలో ఉన్న పెమ్మరాజు వెంకట్రావుగారి ‘కలం స్నేహితురాలిని’ కురుమెళ్ళవారు కలుసుకోవడం, ఆమెతో టీ త్రాగిన కొంచెం సేపట్లోనే ఆమె పెమ్మరాజువారి గురించి ‘ఓ యాభై ప్రశ్నలు’ వేయడం – వీటి గురించి స్నేహితుడికి వ్రాశారు. అలానే కురుమెళ్ళవారు హాలీవుడ్ వెళ్ళబోతున్నారని తెలిసి పెమ్మరాజుగారు తన అభిమాన హాలివుడ్ తారలు మారీ పిక్‌ఫర్డ్, లారెటా యంగ్ లని తప్పక చూడమని రాశారట. ప్రపంచయాత్ర చేస్తున్న సమయంలోనే మిత్రులిద్దరూ కమ్యూనికేట్ చేసుకోగలగడం వల్ల ఇవి సాధ్యపడ్డాయి.

అటు అమెరికాలో లాగా బ్రహ్మాండమైన భవనాలు, ఇటు ఇంగ్లండ్‌లో లాగా చక్కని అందమైన బంగళాలూ లేకుండా ఎక్కడ చూసినా ఇళ్ళన్నీ పెద్ద పెద్ద గోడౌన్ల లాగా ఉన్నాయని జర్మనీ గురించి వ్రాశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో (అప్పటికది ఇంకా ‘పెద్దయుద్ధ’మే వ్యావహారికంలో) మద్రాసు రేవు గుండా ప్రవేశించి హైకోర్టు మీదకి గుండు పేల్చిన ఎమ్డన్ సబ్‌మెరైన్ ని తయారు చేసిన జర్మనీని గురించి ముందు ఎంతో గొప్పగా ఊహించుకున్నా, చూసిన తర్వాత అంత మంచి అభిప్రాయం కలగలేదట. అలానే బెర్లిన్ లోని ఒక ఇండియన్ రెస్టారెంటులో కొంతమంది భారతీయ విద్యార్థుల అసభ్య ప్రవర్తన, వియన్నాలో, ప్యారిస్‌లో వ్యభిచారుల విచ్చలవిడితనాన్ని గురించి వ్రాసి బాధపడ్డారు.

తను చూసిన వాటిని మిత్రునితో పంచుకోవాలన్న ఉబలాటం, కొన్ని సంగతులు వ్రాస్తున్నప్పుడు తాము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న వాటితో కలుపుకుని గుర్తు చేసుకోవడం, కృష్ణశాస్త్రి కవిత్వపు ప్రభావంతో వచ్చిన భావుకత కూడా ఈ లేఖల్లో అక్కడక్కడా కనిపిస్తాయి.

స్విట్జర్లాండులో బంగారు జలతారు తలపాగాలూ వెండి టోపీలు ధరించిన కొండలనీ, ఆకాశాన్నంటే పైన్ వృక్షాల మహారణ్యాలనీ చూసి – ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అన్న వాళ్ళ మాష్టారి (దేవులపల్లి) గీతాన్ని గుర్తు చేసుకున్నారు. పెద్దయుద్ధంలో తటస్థంగా ఉండిపోయి ఒక్క ఆకైనా రాలకుండా తన సౌందర్యమంతా తనే ఉంచేసుకున్న స్విట్జర్లాండ్ గురించీ, జెనీవాలోని లీగ్ ఆఫ్ నేషన్స్ కార్యాలయ భవనాన్ని దర్శించడాన్ని గురించీ వ్రాసుకున్నారు.

‘ఇటలీలో ఎక్కడికైనా వెళ్ళు, ముస్సోలినీ అనే నియంత ఫోటో లేని ఇల్లు గాని, హోటలు గాని, గది గాని లేదు. అయితే ఆయన పేరుని బయటికి ఎవరూ ఉచ్చరించకూడదట!’ అని వ్రాశారు ఇటలీ గురించి చెప్తూ. వాటికన్‌లో పోప్ నివాసం చూసేటప్పుడు – పోప్ వద్ద రెండు పెద్ద తాళంచేతులు ఉంటాయనీ, ఒకటి స్వర్గానికీ రెండోది నరకానికీ అని వాటిని చూపించి చక్రవర్తులతో సహా అందరినీ భయపెట్టేవాడనీ – పిఠాపురంలోని వాళ్ళ హిస్టరీ మాష్టారు చిన్నప్పుడు బడిలో చెప్పడం గుర్తుకు వచ్చిందట.

ఈయన రోమ్‌లో ఉన్నప్పుడే అక్కడ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ జరిగింది. దానికి ప్రపంచ రాజ్యాలన్నింటినించీ ప్రతినిధులు వచ్చారనీ, భారతదేశం నుంచి విజయరాఘవాచారి అనే ఆయన వచ్చారనీ, ఆ సందర్భంగా జరిగిన విందుకి విచ్చేసిన అతిథులని ముస్సోలినీయే స్వయంగా రిసీవ్ చేసుకున్నాడనీ – కనీసం ఓ వెయ్యిమందితోనేనా కరచాలనం చేయడం చూశానని వ్రాశారు.

ఫ్రాన్స్‌లో షాంపేన్ గురించీ, ఐఫిల్ టవర్ ఎక్కినప్పుడు కలిగిన అనుభూతుల గురించీ, ఫాలీస్ బెర్ జేర్ ప్రదర్శనశాలలో బాలే డాన్స్, స్టేజి మీదే సరోవరాలు, అలలు, తుఫానులు సృష్టించబడటం వల్ల కలిగిన సంభ్రమాన్ని వర్ణించారు.

పువ్వుల ప్రదర్శనలు, ఆహారపుటలవాట్లు, వస్త్రధారణ, ఫ్యాషన్లు, పుస్తక భాండాగారాలు, పొలాలూ గొర్రెలకాపరులతో కూడిన జానపద జీవితం, జేబులో పెట్టుకునేంత చిన్నవీ, పెద్ద గాడిదలంత పెద్దవీ అయిన కుక్కలు పాల్గొన్న డాగ్ షోలు, ఎండ నెత్తి మీదకి రాకుండా సూర్యుడు ఒక ప్రక్కగా ఉదయించి ఇంకో ప్రక్కగా అస్తమించేయడం లాంటి వాతావరణపు విచిత్రాలు, టాక్సీ డ్రైవర్లగా పనిచేసే ఆడవాళ్ళు, అంతర్జాతీయ పౌల్ట్రీ కాంగ్రెస్ అనే బ్రహ్మాండమైన కోళ్ళ షోలు, పిచ్చిగా జూదం ఆడే క్యాసినోలు, క్యాబరేలు – ఇలా తను చూసిన ప్రతి విశేషాన్నీ – కొన్నింటిని క్లుప్తంగా కొన్నింటిని వివరంగా- మిత్రుడికి తెలియచేశారు.

ఆఖరి ఉత్తరంలో విదేశీయుల నించి నేర్చుకోదగినవి చాలానే ఉన్నా (కాలం వృథా పుచ్చక ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, నిజాయితీ, స్త్రీలు మన దేశంలో లాగ బానిసల్లా దుర్భరమైన జీవితం గడపక కొంతవరకూ మెరుగుగా ఉండడం మొదలైనవి) మన సంప్రదాయాలు, సంస్కృతులు, సంస్కారాలు, అక్కడి వాటికన్నా ఉత్తమమైనవనే నమ్మకం కలుగుతోందని రాశారు. విదేశాలలో అక్షరాస్యుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా ‘అక్కడ ఉన్న ఒక మధ్య తరగతి సామాన్యుడిని మన దేశంలో ఉన్న వాడితో పోలిస్తే మనవాడే మెరుగనిపిస్తాడు చాలా రకాలుగా’ అని నిదానించారు. ‘ఎంత సంపద ఉన్నప్పటికీ కుటుంబంలోను, సంసార జీవితంలోను మనవాళ్ళ కంటే వాళ్ళు ఎక్కువ సుఖం అనుభవిస్తున్నారనే నమ్మకం కలగదు’ అని ముక్తాయించారు. రకరకాల యాత్రాస్థలాలు పైపైన చూసేసి సంగతులు ఏకరువు పెట్టేయకుండా, కొంత లోతైన పరిశీలనా శక్తితో అవగాహనతో వ్రాసిన ఉత్తరాలివి అని అనిపిస్తుంది – ఇలాంటి వ్యాఖ్యలు చూస్తే.

మనకి స్వరాజ్యం వస్తే మనం కూడా సైన్సెస్ లో కృషి చేసి, ఫ్యాక్టరీలు కట్టుకుని – మాంచెస్టర్ నుంచి గుడ్డలు, జర్మనీ నుంచి లోహాలు, చైనా నుంచి సిల్కులు దిగుమతి చేసుకోనవసరం లేకుండా – సకల సంపదలతో తులతూగుతాం అన్న ఆశాభావాన్ని చివరి లేఖలో వెలిబుచ్చారు. ఇంకో వారంలో బయల్దేరుతున్నానని రాస్తూ, జగతి యందు కలదె నాదు జన్మభూమి వంటిది – అన్న పాటని గుర్తు చేసుకుని – మళ్ళీ మన జన్మస్థలం పిఠాపురం, మన కుక్కుటేశ్వర స్వామి దేవాలయం, మన కుంతీ మాధవస్వామి కోవెల, మన సూర్యారాయ పుస్తక భాండాగారమున్నూ, మనమున్నూ – అన్న వాక్యాలతో ముగించారు.

ఈ పుస్తకంలోని ఇంకో విశేషం – సంప్రదాయ వాతావరణంలో పెరిగి కవిత్వంలో, సాహిత్యంలో అంతో ఇంతో ప్రవేశం సంపాదించిన 1920-30 ల నాటి మధ్యతరగతి తెలుగువారిలో సాధారణంగా కనిపించే ‘పాతకాలపు చాదస్తం’ ఈ లేఖల్లో అసలు కనిపించకపోవడం. చూసిన ప్రదేశాలలోని సాంఘిక పరిస్థితులను వీలైనంతవరకూ చక్కటి వ్యాఖ్యానంతో కలిపి వర్ణించారు. అప్పుడప్పుడూ అక్కడి పరిస్థితులతో మన దేశంలోని వాటిని పోల్చి – ఎక్కువ ఆవేశకావేషాలకూ, సెంటిమెంట్లకూ లోను కాకుండా నిదానించారు. బ్రహ్మసమాజ స్థాపకుడైన రాజారామమోహన్ రాయ్ (రాయల వారు అని ప్రస్తావించారు) సమాధిని ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ నగరంలో దర్శించినప్పుడు మాత్రం కొంత సెంటిమెంటుకి లోనయినట్లు అనిపిస్తుంది – ఈయన బ్రహ్మసామాజికుడు కాబట్టి. లేఖలలో జాగ్రఫీ, హిస్టరీల ప్రస్తావన కొంచెం ఎక్కువగానే ఉన్నా, మొత్తం మీద చాలా ఆసక్తికరమైన పుస్తకం.

ముక్తాయింపు: నాకు ఈ పుస్తకం గురించి చెప్పి దాన్ని సంపాయించి పెట్టమని సతాయించిన మా అమ్మ (ఈ లేఖలు అందుకున్న పెమ్మరాజు వెంకటా్రవుగారి కూతురు) శ్రీమతి పిడూరి సీతమ్మగారి వల్ల నాకు ఈ పుస్తకం గురించి తెలిసింది. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారి పుణ్యమా అని ఆయన దయ వల్ల 2013లో కడప లో సి.పి. బ్రౌన్ గ్రంథాలయం పట్టునే నేను ఓ పదిహేను రోజుల పాటు ఉండి, అక్కడ ఉన్న చాలా పుస్తకాలని ఆవురావురుమంటూ చూడగలిగాను. ఆ చూసిన వాటిల్లో కొన్నింటిని చదవగలిగాను. వాటిల్లో ఇదొకటి. వేరే ఎక్కడైనా ఈ పుస్తకం లభిస్తుందేమో తెలియదు.