మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం

పిఠాపురం – వెంకట్రావుల ప్రపంచ పర్యటన

తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న పాత తరం వారిలో కొద్దిమందికైనా కురుమెళ్ళ వెంకట్రావుగారి పేరు తెలిసే ఉంటుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కవితాపరివారంలో ఆయనకి ఒక ముఖ్య అనుయాయుడిగా, బ్రహ్మసామాజికుడిగా ఈయన ప్రసిద్ధుడు. అంతకు మించి చాలా మందికి తెలియని విషయం – చలంగారి జీవితంలో, ఆదర్శ స్త్రీ అన్వేషణ అనే అధ్యాయంలో – ఓ రకమైన లాంగ్ సాగా – ప్రముఖ పాత్ర పోషించిన లీలగారికి చలం రచనలు పరిచయం చేసిన వారు ఈయనే. ఈయన లీలగారికి బాల్యమిత్రుడు. చలం రచనలు చదివి వినిపించి – ఇలాంటి రచనలు చేసే వ్యక్తి భూమ్మీద ఒకడు నిజంగా ఉంటాడా అన్న భావాలు ఆమెకి కలగడానికి దోహదపడినవారు. ఒక రకంగా చలం జీవితంలో ఈవిడ ప్రవేశించడానికి ఈయనే కారకులు.

సాహిత్య, విద్యా రంగాలలో పిఠాపురం రాజా (సూర్యారావు బహద్దూర్) గారి కృషి, వితరణ గురించి చాలా మంది వినే ఉండవచ్చు. సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణంలో, మొట్టమొదటి తెలుగు టైపురైటర్‌ని కమిషన్ చేయించడంలో, కాకినాడలో వీరి నాన్నగారు (గంగాధర రామారావు బహద్దూర్) స్థాపించిన కళాశాలను అభివృద్ధి చేయడంలో ఈయన ప్రధానపాత్ర పోషించారు. (19వ శతాబ్దంలో ప్రచురింపబడిన అనేక అరుదైన ప్రతులతో సహా ఈ కాలేజీ లైబ్రరీలో ఎనభైవేలకి పైగా పుస్తకాలు ఉన్నాయనీ, నిర్వహణ చాలా బాగుంటుందనీ ఈ మధ్యనే చదివాను).

కురుమెళ్ళ వెంకట్రావుగారు 1930లో జరిపిన ప్రపంచయాత్ర గురించిన, మా మహారాజుతో దూరతీరాలు లేఖల పుస్తకాన్ని పరిచయం చేయడం ఈ వ్యాసం ఉద్దేశం.

తెలుగు సాహిత్యంలో ట్రావెలాగ్స్, లేఖాసాహిత్యం చాలానే ఉన్నా ఈ పుస్తకానికి కొంత ప్రత్యేకత ఉంది. అప్పుడప్పుడే మన తెలుగు సమాజంలో వేళ్ళూనుకుంటున్న ఇంగ్లీషు చదువులూ, పాశ్చాత్య సంస్కృతుల (సినిమాలు, అలవాట్లు, సౌకర్యాలు వగైరా) ప్రభావం ఉన్న విద్యావిధానంలో చదువుకున్న ఒక యువకుడు (బహుశా ఎగువ మధ్యతరగతికి చెందినవారు) కురుమెళ్ళ వెంకట్రావుగారు. ఈయనకి హఠాత్తుగా ప్రపంచం చుట్టే అవకాశం లభించడం, యాత్రలో జరిగిన అనుభవాలనన్నింటినీ ఆయన సరళమైన తెలుగులో పిఠాపురంలో ఉన్న తన మిత్రుడు పెమ్మరాజు వెంకట్రావుగారికి ఆయా దేశాల నుండే లేఖలుగా రాయడం – ఇవన్నీ చెప్పుకోదగ్గ విశేషాలు. పెమ్మరాజుగారు వాటినన్నింటినీ భద్రంగా దాచి పెట్టడం వలన మూడున్నర దశాబ్దాల తర్వాత ఆ లేఖలన్నింటినీ కురుమెళ్ళవారు పుస్తకంగా ప్రచురించారు.

పిఠాపురం మహారాజావారు తమ కుటుంబ సమేతంగా ప్రపంచయాత్రకి వెళుతూ, మహారాణి, యువరాజావార్లు సిఫారసు చేయడం వల్ల కురుమెళ్ళ వెంకట్రావుగారిని కూడా తమతో పాటు 1930 మే నుంచి నవంబరు దాకా ప్రపంచయాత్రకి తీసుకువెళ్ళారు. ఇంగ్లాండు, ఐర్లాండు, స్కాట్లాండు, అమెరికా ఇంకా యూరప్ లోని ఇతర ముఖ్య దేశాలనన్నింటినీ చూసి వచ్చారు. తను గమనించిన ఆనాటి సంగతులన్నీ కురుమెళ్ళ వెంకట్రావుగారు ఆసక్తికరంగా, కొండొకచో సాహితీ విలువలు కలిగిన వర్ణనలతో రికార్డు చేసి పెట్టారు. ఈ లేఖలు అందుకున్న మిత్రుడు పెమ్మరాజు వెంకట్రావుగారు ఈ పుస్తకం లోని ముందుమాటలో వ్రాసినట్లు, మనమూ ఇవి చదువుతూ ప్రపంచ ప్రదక్షిణ చేస్తున్నట్లు భావిస్తాము. ‘ఇవి కేవలం ఉబుసుపోకకు వ్రాసుకున్న లేఖలు కావు; సాహిత్యపు విలువలిందులో ఇమిడి ఉన్నాయనే అభిప్రాయంతోనే వీటిని భద్రంగా దాచి ఉంచి ఇచ్చాను,’ అన్న పెమ్మరాజుగారి పాత్ర కూడా ఈ పుస్తకం వెనక ఉంది.

ఈనాటి ఆధునిక (ప్రపంచంలోని అన్ని దేశాల విశేషాలూ ఒక్క క్లిక్‌తో మనముందు నిలబెట్టే సాంకేతికత ఉన్న) సమాజంలో పెరిగిన ఈ తరం తెలుగు వాళ్ళకి ఈ పుస్తకం చదవడం ఆసక్తికరంగా ఉంటుంది. వృత్తి రీత్యా ఎన్నో దేశాలు తిరుగుతూ ఎంతోకొంత ఎక్స్‌పోజర్ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోదగిన విషయాలూ ఉన్నట్టున్నాయి ఈ పుస్తకంలో. సరే, చారిత్రిక విలువ – ఆనాటి వ్యావహారికభాషాధోరణి, ప్రదేశ విశేషాలు వగైరా – ఎలానూ ఉంది.

తను చూసిన విశేషాలన్నింటినీ ఆసక్తికరంగా, కొంత చమత్కారంతో వర్ణిస్తారు కురుమెళ్ళవారు – ఆనాటి తెలుగు సమాజపు మధ్యతరగతి యువకుడికి కలిగిన అద్భుతాశ్చర్యభావాలను మేళవిస్తూ. తను 1930 మే 2న బొంబాయిలో, వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనే స్టీమర్ ఎక్కి ప్రయాణం ప్రారంభించి, ప్రయాణంలోనే ఉత్తరాలు వ్రాయనారంభించారు. మొదటి ఉత్తరంలో – ఓడలో జీవితాన్నీ, అక్కడి వినోదాలూ కాలక్షేపాల గురించీ – వివరంగా చెప్పారు. పంతొమ్మిదివేల టన్నుల బరువు, ఎనిమిది అంతస్తులు, ఇంకా తను ఉంటున్న ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లోని స్ప్రింగ్ మంచాలు, మెత్తని పరుపులు, తూలికలతో నింపిన తలదిండ్లు, రగ్గులు – ఆ సౌకర్యాలు, శుభ్రత, అందం, వైభవం ‘ఇంద్రుడి వైజయంతానికైనా’ ఉంటాయా అనిపించిందిట. తన సీ సిక్‌నెస్ గురించి వ్రాస్తూ మగవాళ్ళు వేవిళ్ళు పడటం లాగుందన్నారు. ఓడలో ఉండే లైఫ్ బోట్లూ, ఇన్ఫర్మేషన్ బ్యూరో, పోస్టాఫీసూ, రోజు రోజుకీ పశ్చిమానికి ప్రయాణిస్తూ ఉండటం వల్ల ఎంత టైమ్ మార్చుకోవాలో ఓడలో బోర్డు మీద నోటీసు పెట్టడం, ముఖ్య వార్తలన్నీ వైర్లెస్ ద్వారా తెలుసుకోవడం (ఉప్పు సత్యాగ్రహం వార్తలు రోజూ చూస్తూనే ఉన్నాం) – ఇలా అన్నీ వివరంగా వ్రాశారు.

సూయజ్ కెనాల్ని దాటుతున్నప్పుడు చిన్నప్పుడు బడిలో చదువుకున్న పాఠాలను స్నేహితుడికి గుర్తు చేస్తూ తను ఇప్పుడు చూస్తున్న దానిని వర్ణించారు. పక్కనే ఆఫ్రికా తీరంలో కనబడే పెద్ద మేడలు, ఇసక ఎడారులు, రోడ్డు మీద అక్కడక్కడా కనపడే మోటారు కార్లు, నీటి అలల తాకిడికి గట్లు కోసుకుపోతాయని ఓడలు వేగం తగ్గించుకోవడం, కాలువ పొడవు వంద మైళ్ళు అయినా కొన్ని చోట్ల వెడల్పు రెండు వందల అడుగులకి తక్కువగా ఉండటం (మన నిడదవోలు కాలువ అంత ఉంటుంది), వెడల్పు తక్కువ కావడం వల్ల పెద్ద నౌకలు ఎదురుపడితే పక్కనే కాలువతో కలుపుతూ తవ్విన ఉప్పునీటి సరస్సుల దగ్గర క్రాసింగ్ చెయ్యడం లాంటి వివరాలన్నీ ఎంతో ఆసక్తికరంగా పొందుపరిచారు.

ఓడలో డెక్ మీదకు వెళ్ళి చూసిన దృశ్యాలని – నల్లటి నీటి నుంచి లేచి తెల్లగా విరిగిపడే కెరటాల మీద సూర్యకిరణాలు పడినప్పుడు బంగారం పొంగినట్లుండడం, చుట్టూ ఆకాశం వంగిపోయి సముద్రంలో దూరంగా కలిసిపోవడం, విశాలమైన సముద్రం మీద బ్రహ్మాండమైన వెండి కప్పు బోర్లించినట్లుండడం, రాత్రుళ్ళు చంద్రకిరణాలు పడినచోట నీటిలోని వెలుతురు బాట, సముద్రాన్ని చీల్చుకుని వేగంగా పోతున్న స్టీమరు నీటి మధ్యలో తెల్లని రోడ్డు వేస్తున్నట్లుండటం – లాంటి వాక్యాలతో వర్ణించారు.

బొంబాయి నుంచి పది రోజులకి పైగా ప్రయాణించి మార్సేల్సు చేరి అక్కడ నుంచి ‘ఫ్రాన్స్ దేశానికి అడ్డంబడి’ ఇంగ్లాండుని చేరి లండన్లో సెవాయ్ హోటల్లో బస చేశారట. ఇది కోటీశ్వరులైన అరిస్టోక్రాట్స్, భారతదేశంలో ఉన్న చిన్న స్వతంత్ర రాజ్యాల మహారాజులలాంటి వారు మాత్రమే బస చేయగల ఖరీదైన విడిదిట. ఆ వైభవానికి మరీ ‘అదిరిపడిపోకుండా’ లండన్ బొటానికల్ గార్డెన్స్‌లో తను చూసిన గులాబీల సౌందర్యం, ఆక్స్‌ఫర్డ్ కాలేజీలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి లెక్చర్ వినడం, ఆండ్రూస్ ఇంకా సర్ రాధాకృష్ణన్ గార్ల దర్శనం చేయడం లాంటి విశేషాలు వ్రాశారు.

కొన్నాళ్ళు సెవాయ్ హోటల్లో ఉన్నాక లండన్‌కి పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న మోర్డన్ అనే ఊళ్ళో ప్రత్యేకంగా ఒక బంగళా అద్డెకి తీసుకున్నారట పిఠాపురం రాజావారు. చెల్డెన్‌హామ్ లోని వింటర్ గార్డెన్స్‌లో జరిగిన ఒక పోటీలో (ప్రపంచంలో ఉన్న స్మూత్ ఫాక్స్ టెరియర్ అనే జాతి కుక్కల్లో మేలిమి కుక్కని నిర్ణయించడానికి జరిగిందట ఈ పోటీ!) పిఠాపురం మహారాజా వారి కుక్కకి ప్రపంచ ప్రధమ బహుమతి – బంగారు కప్పు లభించిందట! అక్కడ ఉన్నప్పుడే బ్రిటీష్ చక్రవర్తి కొందరు అతిథులను పిలిచి వాళ్ళకి దర్శనం ఇచ్చాట్ట. దీని పేరు కింగ్స్ లెవీ. మహారాజావారు, యువరాజావారు వెళ్ళారు. కురుమెళ్ళ వెంకట్రావుగారు కూడా వెళ్ళారు – కాని గేటుదాకా మాత్రమే!

ఇలా స్వాతంత్ర్యానికి పూర్వం మన దేశంలో ఉన్న బుల్లి రాజుల వైభవం, వారి సంగతులూ పరోక్షంగా కొంత తెలుసుకోవచ్చు ఈ పుస్తకం వల్ల.

లండన్ నగరాన్ని గురించి వ్రాస్తూ – ఒక దరీదాపూ లేని మేడల సముద్రం లాగా ఉండడం, సిటీలో పొగచూరి పాతబడినట్లున్న మేడలూ గోడలూ, ప్రతి పనీ తొందరగా జరుగుతున్నట్లుండడం, నడిచేవాళ్ళు సావకాశంగా నెమ్మదిగా పదిలంగా నడవకుండా అవతల ఏదో మించిపోతున్నట్లు పరుగులెత్తడం – లాంటి వర్ణనలు చేశారు. అయితే ఒక్కటి మాత్రం ఉందిట; ఎవరైనా మాట్లాడిస్తే మాత్రం ఎంతో సొగసుగా, మర్యాదగా, ఆదరంగా మాట్లాడతారుట అందరూ.

మాడమ్ టుస్సాడ్స్ ఎగ్జిబిషన్‌లో ‘ప్రిన్సెస్ ఇన్ ద డార్క్ ఛాంబర్’ టాబ్లోని చూసినప్పుడు, తాము థర్డ్ ఫారమ్‌లో హిస్టరీ పుస్తకంలో చదువుకున్నవిషయాలు గుర్తొచ్చి కలిగిన దుఃఖం, జీవం ఉట్టిపడే అనేక మైనపు బొమ్మలని చూసినప్పుడు కలిగిన విభ్రమం గురించి ఎంతో హృద్యంగా వ్రాశారు. బ్రిటీష్ మ్యూజియంలోకి ప్రవేశించడం తోనే ఆయన కంటబడినవి మన గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి తెచ్చిన అపురూప పాలరాతి శిల్పాలు. వీటిని చూసి ‘కొంచెం గర్వపడ్డాను. కాని అమూల్యమైన వీటిని మన దేశం ఎప్పటికైనా వెనక్కి రప్పించుకుంటుందా?’ అని వేదన పడ్డారు.

టవర్ ఆఫ్ లండన్‌ని చూస్తూ – ఎందరో రాజుల్ని, వారి అనుయాయుల్నీ చంపేసిన పాత చరిత్ర జ్ఞాపకాల్లో పడి మహారాజావారి పార్టీ నుంచి కురుమెళ్ళవారు తప్పిపోయారట. జనం రద్దీ వల్ల వాళ్ళని కలుసుకోలేకపోయారు. తన దగ్గర కొంచెం డబ్బు ఉండటం వలన ఓ పోలీస్ కానిస్టేబుల్ సహాయంతో దగ్గరలో ఉన్న అండర్ గ్రౌండ్ ట్రైన్ స్టేషన్‌కి వెళ్ళడమూ, ఆ స్టేషన్ లో ఉన్న విశేషాలు, దాని ‘శృంగారము’ అంతా వర్ణించారు. కానిస్టేబుల్ గురించి చెప్తూ, ‘వీళ్ళు మనవాళ్ళలాగా కాదులే, ఎంతో మర్యాదగా మాట్లాడమే కాక చాలా సహాయకారులుగా కూడా ఉంటారు,’ అని వ్రాసుకొచ్చారు – చదువుతున్న వాళ్ళకి ‘కన్యాశుల్కం’ గుర్తొచ్చేలా… లండన్ భూగర్భంలో వల లాగా ఈ ట్యూబ్ రైళ్ళు అల్లుకుపోవడమూ, రైలు కమ్మీలకే కరెంట్ ఉండటమూ, రైలు పెట్టెల తలుపులు వాటంతట అవే తెరుచుకుని మూసుకుపోవడమూ వగైరాలన్నీ సంభ్రమాశ్చర్యాలతో వివరించారు.

పిఠాపురం రాజావారు తన మిత్రుడైన ఒక పార్లమెంట్ మెంబర్‌కి ఏదో కబురు పంపవలసిన అవసరం వచ్చి కురుమెళ్ళగారిని ఆయన దగ్గరకి పంపారట. అప్పుడా పార్లమెంట్ మెంబరు కురుమెళ్ళగారికి హౌస్ ఆఫ్ కామన్స్‌నూ, లార్డ్స్‌నూ స్వయంగా చూపించారట. (అప్పుడు సమావేశాలు జరగడం లేదు.) ‘ఏమండీ, ఈ సీట్లు చాలా పాతబడి మాసిపోయినట్లు, సావకాశంగా కూర్చోవడానికి వీలు లేనట్లు ఉన్నాయే! కొత్తవి చేయించరా?’ అని అడిగితే ‘ఏవో చిన్న చిన్న రిపేర్లు చేయిస్తాం కాని మేం పూర్వ సంప్రదాయాలని పాటించే వాళ్ళమని తెలియదా!?’ అన్నాట్టాయన. మూఢాచారాలలో, సంప్రదాయాలను పట్టుకుని వ్రేళ్ళాడటంలో వీళ్ళూ మనకి దగ్గర వాళ్ళే అంటూ వ్యాఖ్యానించారు కురుమెళ్ళవారు.

లండన్ షాపుల్లో అసలు సరుకు కన్నా వెలుపలి ప్యాకేజింగ్ ఎక్కువ ఆకర్షణీయంగా ఉండటం, డిస్కౌంట్ బేరాలు, టిప్స్ (సంభావన అన్న పదం వాడారిక్కడ) కోసం వంగి వంగి సలాములు కొట్టడం ఇవన్నీ చాలా వివరంగా తమ లేఖల్లో వారు వ్రాశారు.

రాచరికపు మనుషులతో వెళ్ళినా కొద్దో గొప్పో కురుమెళ్ళ వారికున్న సామాజిక పరిశీలన కూడా అక్కడక్కడా ఈ లేఖల్లో కనిపిస్తుంది. లండన్‌లో సాధారణ జనజీవనం ఎలా ఉంటుందో చూద్దామని అక్కడ రాజావారు ఏర్పాటు చేసుకున్న మోటారు కారు డ్రైవరు ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ వాతావరణం గురించి వ్రాశారు. నెలకి పది పౌనులు – అంటే ఆనాటి భారతీయ కరెన్సీలో నూటయాభై రూపాయలు – తెచ్చుకునే వాడు కూడా లండన్లో ఎలా దారిద్ర్యం అనుభవించాలో – అక్కడున్న బీదరికం, చాలీచాలకపోవడం, పేద ప్రజల ఇళ్ళూ ఒళ్ళూ అపరిశుభ్రంగా ఉండటం మొదలైనవన్నీ వ్రాశారు.

ఈ లేఖలలో గాంధీగారి ప్రభావం, 1930ల లోని స్వాతంత్ర్యోద్యమపు ప్రస్తావనలు కూడా కనిపిస్తాయి. ఎడిన్బరోకి దగ్గరగా ఉన్న గ్లాస్గో పట్టణానికి మహారాజావారు వెళుతున్నా- ‘గ్లాస్గో బట్టలని బహిష్కరించమని గాంధీగారు చెబుతున్నప్పుడు ఆ ఊరు మనం వెళ్ళడం భావ్యం కాదని మానేశా’రట కురుమెళ్ళవారు! అలాగే వాళ్ళు జాతీయ జెండాకి ఇచ్చే గౌరవాన్ని చూసి ‘మనకీ ఒక జాతీయ పతాకం ఉండకూడదా, మహాత్ముడి కాంగ్రెస్ జెండా మన జాతీయజెండాగా ఎప్పటికైనా మారుతుందా’ అన్న భావం కలిగిందట. ఎడిన్బరోని దర్శిస్తూ బారిష్టర్ పార్వతీశం రాసిన మొక్కపాటి వారినీ, ఇంకా పిఠాపురంలో ఉన్న ఎవరో ఒక ‘పప్పు వారినీ’ గుర్తుచేసుకున్నారు – వారిద్దరూ ఇక్కడే చదువుకున్నారు కదా! అని రాస్తూ…

ప్రముఖ వ్యక్తులు తనకి తారసపడిన సందర్భాల గురించి కూడా వ్రాశారు. లండన్‌లో ఉంటున్న బారిష్టర్ నరసింహంగారు వాళ్లింటికి పిల్చి పీట వేసి కూర్చోపెట్టి ఉసిరి ఆవకాయతో అన్నం వడ్డించడం, రైట్ ఆనరబుల్ శ్రీనివాసశాస్త్రి కనపడితే ఆటోగ్రాఫ్ తీసుకోవడం, తాము ఇంగ్లండ్ నుంచి న్యూయార్క్‌కి వెళ్ళే ఓడ ప్రయాణీకుల లిస్ట్‌లో హెన్రీ ఫోర్డ్ పేరు చూసి కుతూహలపడడం లాంటివి అందులో ఉన్నాయి. (ఓడలో అందరితోనూ హెన్రీ ఫోర్డ్ కలివిడి గానే తిరిగాడట)

అమితాశ్చర్యం కొలిపే ఇంకో విషయం ఏమిటంటే పిఠాపురం రాజావారు వారి పరివారంతో కాలిఫోర్నియాలో దిగ్గానే ఒక స్వామీజీ, వారి భక్తులు వీరికి స్వాగతం పల్కడం! (‘మన తోటపల్లి శాంతి ఆశ్రమం ఓంకార స్వాములవారే!’) దీనివల్ల మన లోకల్ స్వామీజీలు అప్పటికే విదేశీ భక్తులని సంపాదించుకోవడమే కాకుండా, అమెరికా పర్యటనలు చేయడం కూడా ప్రారంభమైందని తెలుస్తుంది, 1930 ల్లోనే! స్వామీజీ, ఆయన శిష్యులు, శిష్యురాళ్ళు కాలిఫోర్నియాలో ఉన్నన్ని రోజులూ మహారాజావారిని విడవకుండా ఉండటం, ప్యాలస్ లని తలదన్నే ఒక ఇంట్లో (బెవర్లీ హిల్స్ లోని ఒక భక్తురాలి ఇల్లట) ఊదువత్తుల మధ్యలో సిల్కు దిండుల మీద ఆశీనులై ఉన్న ఈ స్వాముల వారిని అక్కడి వాళ్ళంతా ఒక దేవుడిని చూసినట్లు చూడటం, ఆ భక్తురాలి ఇంట్లో పని చేసే ఒక నల్ల అమ్మాయి చేత స్వామీజీ హరేరామ హరేకృష్ణ భజన పలికించడం, ‘కృష్ణ’ అనడానికి ఆ అమ్మాయి సతమతమైపోవడం లాంటి విషయాలని ఆసక్తికరంగా వ్రాశారు.

న్యూయార్క్‌లో వీళ్ళు ఉన్న హోటల్లో క్లర్క్‌గా పనిచేసే అమ్మాయి కురుమెళ్ళవారికి ఒక వీడ్కోలు బహుమతి ఇచ్చిందిట. అది ఒక ఉప్పు పొట్లం. ‘ఇండియాలో మీరు ఇప్పుడు ఉప్పు కోసమే కదా పోరాటం చేస్తున్నారు! మీ దేశంలో ఉప్పు కరువు కదా, అందుకే ఇచ్చా’నందట ఆ అమ్మాయి. ఈ ఉద్యమం వెనక ఉన్న పన్నుల వ్యవహారాన్నంతా వివరించి, ఉప్పు సత్యాగ్రహం గురించి ఆమెలో ఉన్న తప్పు అభిప్రాయాలని కొంతవరకూ తగ్గించగలిగారట కురుమెళ్ళవారు.