ఐదు కవితలు: నాలుకపై వానచుక్క

పిల్లలమంతా మళ్ళీ రెక్కలు విప్పుకున్న
సీతాకోకచిలుకలమవుతాము
కట్టుతాళ్ళు విప్పుకున్న లేగదూడలమల్లే బయటికురుకుతాము
నోళ్ళు తెరుచుకుని ఆఖరి వానచుక్కలు అందుకుంటూ…
మా కాగితప్పడవలూ, కర్రముక్కలూ,
కాళ్ళూ, చేతులూ వగైరా సరంజామాతో సిద్ధమై
మాపనిలోకి దిగిపోతాం…

వాననీళ్ళన్నీ మాకందకుండా పారిపోవాలని చూస్తుంటాయి
పాడుకుంటూ పారిపోతూ
చిట్టి చిట్టి పాయలై, కలిసి చిన్నకాలువలై
మట్టిని కోసుకుంటూ, రాళ్ళను మీటుకుంటూ…

చెరువూ, పెద్దకాలువా నిండు చూలాళ్ళవుతాయి
ఊరంతా తలస్నానం చేసి ఎండతువ్వాలు వెతుక్కుంటున్నట్లుంటుంది
తడిసిన పావురాలొక్కటొక్కటే గుడిగోపురానికి చేరుకుంటాయి
రెక్కలారబెట్టుకుంటూ…
ఎండావానా ఆటలో దొరికిన దొంగల్లా
చిన్నా పెద్దా ముద్దగా తడిసి ఇళ్ళకు చేరుతుంటారు
పొలాలనుంచి బురద చెప్పులేసుకుని-
‘అదుగో’ అనేంతలో వరదగుడిని చెరిపేసి
పొద్దు కొండల్లోకి జారిపోతుంది

మేమా మట్టిని వదల్లేనట్లే
ఇళ్ళల్లోనుంచి వచ్చే పొగకూడా బెంగగా
వూరిని చుట్టేసుకుని వుంటుంది ఆ మునిమాపువేళ…
పెద్దాళ్ళ పిలుపులు కేకలై
మాలో ఒక్కొక్కరినీ లాక్కెళుతుంటాయి
ఆ మెత్తటి మట్టినీ, చల్లటి నీళ్ళనూ
అయిష్టంగానే అక్కడే వదిలేసి
గుడ్డివెలుతురులో ఇళ్ళు చేరతాం…
అయిష్టంగానే… …

(18/03/1997)

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...