ఈమాట నవంబర్ 2015 సంచికకు స్వాగతం!

ఈమాట పాఠకులకు కన్నెగంటి చంద్రను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కథయినా, కవితయినా, చంద్ర పేరు చూడగానే చేస్తున్న పనులన్నీ ఆపేసి వెంటనే చదివే పాఠకులం ఎందరమో. అలాంటి చంద్ర, అక్షరం మనసు తెలిసిన చంద్ర, తన రచనల నుంచి ఏమీ ఆశించకుండా నిరాపేక్షగా చావో బతుకో వాటి మానాన వాటిని వొదిలిపెట్టే చంద్ర, ఒకానొకప్పుడు పృథివ్యాపస్తేజోవాయురాకాశములైన పంచభూతాల వంటి ఐదు కవితలు రాశాడు తెలుసాలో – మట్టి, వాన, మంట, గాలి, మబ్బులు, అంటూ! ఆ కవితలు చదివి వేలూరి అందరినీ, ఇప్పుడైనా చూడండి చంద్ర ఎందుకు మంచి కవో అని చెప్తూచెప్తూనే, తెలుసా ఆర్కైవుల్లో ఆ ఐదు కవితలూ వెతుక్కుని చదువుకుని దాచిపెట్టుకున్నాం కూడానూ. ఆతర్వాతెప్పుడో చంద్ర కవితలను వాన వెలిసిన సాయంత్రం అనేసి హడావిడిగా పుస్తకం చేసినప్పుడు వేలూరి ఈమాటలో వాటి గురించి మరోసారి గుర్తు చేశారు కూడానూ. ఏమైతేనేం, ఆ ఐదు కవితలూ మీకు పరిచయం చేయడం కోసం, పోనీ ఆ సాకుతో మీతో కలిసి మేమూ మరోసారి చదవడం కోసం ఈ సంచికలో ప్రచురిస్తున్నాం.


ఈ సంచికలో:

  • కథలు: ఎందుకంత దూరం – రాధ మండువ; మునులేం చేస్తారు నాన్నా? – తః తః; ప్రేమ ఉన్న చోటే భగవంతుడు – ఆర్. శర్మ దంతుర్తి; అప్పా – సాయి బ్రహ్మానందం గొర్తి.
  • కవితలు: ఐదు కవితలు: నాలుకపై వానచుక్క, మట్టివాసన, అగ్నిస్పర్శ, మబ్బుల్లో బొమ్మలు, గాలి రొద – కన్నెగంటి చంద్ర.
  • వ్యాసాలు: ఆనందం అర్ణవమైతే-రత్నాల సరములు – జెజ్జాల కృష్ణ మోహన రావు; మను చరిత్రము-మాఘములలో పురస్త్రీ విలాసముల పోలిక – రవి; బొమ్మల కొలువు – కోలవెన్ను మలయవాసిని.
  • శీర్షిక: నాకు నచ్చిన పద్యం: చక్రవర్తి కావ్యం చేసిన సామాన్యుల జీవనం – భైరవభట్ల కామేశ్వరరావు.
  • శబ్దతరంగాలు: ప్రార్థన: నువ్వేనేనవ్వు-2వ భాగం – పాలపర్తి ఇంద్రాణి; రాచశైలిలో అక్షరాలే ఆయుధాలు-రావిశాస్త్రి రచనలపై బీనాదేవి ప్రసంగం; బాలానందం-రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య – పరుచూరి శ్రీనివాస్.