ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు

పరిచయము

నవీనయుగములో మాత్రా ఛందస్సుకు ఒక గొప్ప స్థానము నిచ్చి కవితావ్యవసాయమును చేసినవారిలో గురజాడ అప్పారావు తఱువాత శ్రీశ్రీ అగ్రగణ్యుడు. శ్రీశ్రీ మహాప్రస్థానం[1] తెలుగు భాషలో ఒక నూతన కవితాశైలికి నాందీవాక్యమును పలికినదన్న విషయములో అతిశయోక్తి లేదు. ఇందులో ఎన్నో గేయములలో ఎన్నో రకములైన మాత్రాఛందస్సులను శ్రీశ్రీ వాడినాడు. ఈ వ్యాసములో నేను అట్టి ఛందస్సులలో నొక దానిని గురించి చర్చిస్తాను.

మహాప్రస్థానంలో ఈ ఛందస్సులో ఐదు గేయములు ఉన్నాయి, అవి – అద్వైతం (అ), ఋక్కులు (ఋ), దేశచరిత్ర (దే), నవకవిత (న), పేదలు (పే).

ఈ ఛందస్సు ప్రత్యేకత ఏమనగా – ఇందులో ప్రతి పాదములో 14 మాత్రలు ఉంటాయి. అవి 6, 8 మాత్రలుగా విఱుగుతాయి. రెండవ భాగములోని ఎనిమిది మాత్రలు సామాన్యముగా రెండు చతుర్మాత్రలుగా ఉంటాయి. కొన్ని సమయములలో రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్ర కూడ వాడబడినది. కన్నడ, తెలుగు భాషలలోని దేశి ఛందస్సులో వర్జించబడిన లగారంభమగు ఎదురు నడకను కవి స్వీకరించాడు. అందువలన ఈ కవితలలో మనకు ఎదురు నడక కూడ అక్కడక్కడ గోచరిస్తుంది. ఈ యెదురు నడక ఆఱు మాత్రల పూర్వ భాగములో, ఎనిమిది మాత్రల ఉత్తర భాగములో, రెంటిలో కూడ ఉన్నాయి. కాని ఉత్తరార్ధములో రెండవ చతుర్మాత్రకు ఈ యెదురు నడక లేదు. ఈ 14 మాత్రల ఛందస్సును సరిగా ఉపయోగిస్తే ఇది నిజముగా అందమైన దన్న విషయములో సందేహము లేదు. హిందీ భాష యందలి మాత్రాఛందస్సులో 6, 8 మాత్రల విఱుపుతో ఛందస్సు ఏదియు లేదు. మిశ్రగతి లయతో భామినీషట్పదివలె అమర్చబడిన ఛందస్సును అప్పారావు ముత్యాలసరము అని పిలిచినట్లు, శ్రీశ్రీ ఈ 14 మాత్రల ఛందస్సుకు ఏ పేరు పెట్టినట్లు లేదు. దీనికి నేను ఆనందార్ణవము అని పేరును పెట్టాను. మిరియాల రామకృష్ణ ఇట్టి ఛందస్సు చతురస్రగతి యని తెలిపారు[2]. నా ఉద్దేశములో అది సరికాదు. వీటిలోని మాత్రల విఱుపు నిస్సందేహముగా ఆఱు, ఎనిమిది మాత్రమే.

ఆనందార్ణవము

ఈ ఆనందార్ణవఛందస్సును ఎన్ని విధములుగ కల్పించ వీలగును అనే ప్రశ్నకు జవాబును పరిశీలిద్దాము. ఆఱు మాత్రలు 13 విధములుగా సాధ్యము. అందులో పది షణ్మాత్రలకు (UIUI, UIIU, UIIII, IIIUI, IIIIU, IIIIII, UUII, IIUU, UUU, IIUII) ఎదురు నడక లేదు, మూడింటికి (IUIU, IUUI, IUIII) ఉన్నాయి. రెండవ భాగములోని మాత్రాగణములు చతుర్మాత్రలు అయిన పక్షములో, ఈ చతుర్మాత్రలు 5 విధములుగా సాధ్యము. అందులో నాలుగింటికి (UU, IIU, UII, IIII) ఎదురు నడక లేదు, ఒక దానికి (IUI) గలదు. పూర్తిగా షణ్మాత్రలను, చతుర్మాత్రలను ఉపయోగిస్తే ప్రతి పాదమును 13*5*5 = 325 విధములుగా వ్రాయ వీలగును. అందులో 78 విధములను శ్రీశ్రీ పై ఐదు కవితలలో నుపయోగించాడు. ఇందులో కొన్ని తప్ప మిగిలిన అధిక భాగము ఏ లాక్షణిక గ్రంథములో లేదు. వాటినన్నిటిని కూలంకషముగా పరిశోధించి లక్షణ లక్ష్యములను నేను ఈవ్యాసంలో తెలియబఱచినాను. ఇవిగాక రెండవ భాగములో అష్టమాత్ర ఉపయోగించబడిన 10 వృత్తములకు కూడ లక్షణములను ఇచ్చాను.

గేయములలో పదచ్ఛేదయతి

ఒక విధంగా చూసినట్లయితే, గేయములు నిజముగా ఏకపాద వృత్తములు! ఈ విషయము ఆశ్చర్యకరముగా కనిపించవచ్చును కాని ఇది ముమ్మాటికి నిజము. మఱొక ముఖ్య విషయము. ‘ఛందస్సు సర్పపరిష్వంగము’ నుండి విముక్తుడనయ్యానని చెప్పుకొన్న శ్రీశ్రీ ఎన్నో ఛందస్సు విధివిధానాలను పాటించాడు. తెలుగులో (కన్నడములో కూడ) వృత్తములకు పాదాంత యతి లేదు, అనగా పాదము ఒక పదముతో అంతము కానక్కరలేదు. ఒక పదము ఒక పాదము చివర ఆరంభమై మఱొక పాదములో అంతము కావచ్చును. కాని సంస్కృతములో పాదాంతయతి పాటించబడుతుంది. గేయము అనగా పాడదగినది. పాటలలో ఏ పంక్తి ఆ పంక్తికి అంతమయితే మాత్రమే గానానుభూతిని పొంద వీలవుతుంది. లేకపోతే చెవులకు బాధాకరముగా ఉంటుంది. అదే విధముగా సంస్కృతములో శార్దూలవిక్రీడితము, స్రగ్ధరలవంటి వృత్తములకు పాద మధ్యములో కూడ పదముల విఱుపు ఉంటుంది. దీనినే ఆ భాషలో యతి అంటారు. తెలుగు భాషలోని పద్యములకు పదపు విఱుపుకన్న అక్షరసామ్యత లేక వడి ముఖ్యము. గేయ రచనలో శ్రీశ్రీ పాదమధ్యములో, పాదాంతములో పదచ్ఛేదయతిని తప్పక ఉపయోగించాడు. ఈ ఆనందార్ణవ ఛందస్సులో కూడ ఆఱు మాత్రలవద్ద పదముల విఱుపు, అదే విధముగా పాదాంతములో కూడ పదమును అంతము చేసి గేయమును వ్రాశాడు. ఉదాహరణమునకు ‘ఆనందం అర్ణవమైతే’ అనే పాదమును తీసికొన్నప్పుడు, ఇందులో ఆనందం – ఆఱు మాత్రల పదము, అర్ణవ – నాలుగు మాత్రల పదము, మైతే – నాలుగు మాత్రల పదము. ఆఱు మాత్రలవద్ద, ఆనందం పదము అంతమయినది, తరువాత ఏడవ మాత్రవద్ద ఒక క్రొత్త పదము ఉపయోగించబడినది. అదే విధముగా 14వ మాత్ర వద్ద పదము అంతమయినది. తరువాతి పాదము ‘అనురాగం అంబరమైతే’ క్రొత్త పదముతో ప్రారంభమవుతుంది. ఈ సంస్కృత ఛందస్సు నియమములు గేయములలో శ్రీశ్రీ రసానుభూతికోసం వాడాడు. అంతే కాక పదములను ఈ14 మాత్రల చట్రములో ఇమిడించుటకై హ్రస్వములను దీర్ఘముగా చేయుటకు వెనుకంజ వేయలేదు, ఉదా. ‘రగులుకొనే రాక్షసి బొగ్గూ.’ బొగ్గు అంటే మూడు మాత్రలే, కాబట్టి బొగ్గూ అని పదమును పొడిగించాడు.

ఖ్యాత వృత్తములలో ఆనందార్ణవపు నడక

శ్రీశ్రీకి ఇలాటి ఛందస్సు ఉపయోగించవలెననే ఆలోచన ఎలా వచ్చి ఉంటుంది? సంస్కృత ఛందస్సులో ఇంతకు ముందు చెప్పినట్లు ఇట్టి వృత్తములు కొన్ని ఉన్నా, అవి సామాన్యముగా ఉపయోగములో లేనివి. కాని వైతాళీయములలో ఇట్టివి ఉన్నాయి. ఆపాతలిక అనే అర్ధసమ వైతాళీయ వృత్తములో బేసి పాదములలో పూర్వ భాగములో ఆఱు మాత్రలు, ఉత్తర భాగములో చతుర్మాత్రలైన భ-గణము, గగము ఉండును. సరి పాదములలో ఎనిమిది మాత్రలు, భ-గణము, గగము ఉండును. అనగా ఆపాతలికపు బేసి పాదములలో శ్రీశ్రీ ఉపయోగించిన 6, 8 మాత్రల విఱుపుతో అమరిక ఉన్నది. అదే విధముగా వైతాళీయములో మాత్రల సంఖ్య (బేసి 6, సరి 8) ఇట్టిదే. కాని ఉత్తర భాగములోని గణములు ర-లగ, అనగా రెండు చతుర్మాత్రలు కాని ఒక అష్టమాత్ర. క్రింద వీటికి ఉదాహరణములను ఇచ్చాను.

ఆపాతలిక – బేసి పాదములు – 6 మాత్రలు – భ-గగ // సరి పాదములు – 8 మాత్రలు – భ-గగ

మానిని నీ – మాధవుఁ డేడే
మానసమందున – మాయల ఱేఁడే
తేనియవలెఁ – దీయఁగఁ బల్కున్
కానఁగ మెల్లఁగఁ – గల్లలఁ జిల్కున్

వైతాళీయము – బేసి పాదములు – 6 మాత్రలు – ర-లగ // సరి పాదములు – 8 మాత్రలు – ర-లగ

గోదావరి – గుండెలో సదా
ఖేదము మోదము – కేళి యాడుఁగా
గోదావరి – గొంతులో సదా
నాదము బ్రహ్మా-నంద మీయుఁగా

ఛందోగ్రంథములలో వివరించబడినా కూడ, వైతాళీయము, ఆపాతలిక తెలుగులో ఉపయోగించబడలేదు. కావున 14 మాత్రల గేయమునకు స్ఫూర్తిని మఱెక్కడైనా వెదకాలి. చంపకోత్పలమాలలలో, శార్దూల మత్తేభవిక్రీడితములలో ఇట్టి అమరికలు గలవు. అట్టి పద్యములను చదివినప్పుడు అక్కడక్కడ ఈ అమరికలు ధ్వనించి ఉండవచ్చును. శ్రీశ్రీ మేధస్సులో అతనికి తెలియకుండ ముద్రితమైన ఈ మూసలు ఈ ఛందోనిర్మాణమునకు దారి తీసినదేమో?

ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U

ఉత్పలమాలలో ఆఱు అమరికలలో 14 మాత్రల అమరికలు గలవు. అందులో చివరి దానిలో ఉత్తర భాగములో రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్ర ఉన్నది. ఇది చంపకమాలకు కూడ అన్వయిస్తుంది, ఎందుకంటే ఈ రెండు వృత్తముల భేదము – చంపకమాలలోని మొదటి రెండు లఘువులు ఉత్పలమాలలో ఒక గురువు అవుతుంది.

శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U

శార్దూలవిక్రీడితములో కూడ ఆఱు అమరికలకు 14 మాత్రలు ఉన్నాయి. అందులో రెండవ, ఐదవ, ఆఱవ అమరికలకు ఉత్తరార్ధములో రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్ర ఉన్నది. ఇది మత్తేభవిక్రీడితమునకు కూడ అన్వయిస్తుంది, ఎందుకంటే ఈ రెండు వృత్తముల భేదము – శార్దూలవిక్రీడితములోనిలోని మొదటి గురువు మత్తేభవిక్రీడితములో రెండు లఘువులు అవుతుంది.

[పై అమరికలలో న/జ/భ/లగ (చంపకమాల మొదటి 11 అక్షరములు) గణములతో సుమ అను వృత్తపు లక్షణములను కలిగిన పాదములు (అ-27: వలయములై చలించినపుడే, అ-28: విలయములై జ్వలించినపుడే), స/స/జ/గ (చంపకోత్పలమాలలలోని చివరి 10 అక్షరములు) గణములతో సహజా అను వృత్తపు లక్షణములను కలిగిన పాదములు (దే-46: పడిపోయెను పేక మేడలై, దే-60: అణగారిన ఆర్తులందరూ, న-03: పులి చంపిన లేడినెత్తురూ) ఈ గేయములలో ఉన్నాయి. వలయములై చలించినపుడే – పడిపోయెను పేక మేడలై, అనే కాల్పనిక పాదము యతిలేని ఒక చంపకమాల పాదము.]

మాలావృత్తములకు, విక్రీడిత వృత్తములకు కొన్ని 14 మాత్రల అమరికల ఉదాహరణములను క్రింద ఇస్తున్నాను –

అర్ధసమవృత్తము అతిగంధము –
బేసి పాదములు – చంపకమాల పూర్వార్ధము (1-11) – న/జ/భ/లగ IIIIU – IUI IIU
సరి పాదములు – చంపకమాల ఉత్తరార్ధము (12-21) – స/స/జ/గ IIUII – UIUIU

ప్రతిమగ రా – వరించఁ ద్వరగా
నతిగంధపు – హ్లాదనమ్ముతో
ప్రతి క్షణమున్ – బ్రతీక్షణములే
బ్రతుకెప్పుడు – బంధనమ్ములే

పై అర్ధసమవృత్తము అతిగంధపు రెండు పాదములను కలిపి వ్రాస్తే ఇలాగుంటుంది –

ప్రతిమగ రా – వరించఁ ద్వరగా – నతిగంధపు – హ్లాదనమ్ముతో
ప్రతి క్షణమున్ – బ్రతీక్షణములే – బ్రతుకెప్పుడు – బంధనమ్ములే

ఇప్పుడు ఇవి చంపకమాలలోని రెండు పాదములుఅవుతుంది. కాని ఈ పాదములను చదివినప్పుడు మనకు చంపకమాలను చదివినట్లు అనిపించదు!

అర్ధసమవృత్తము పుష్పరాశి –
బేసి పాదములు – మత్తేభవిక్రీడితము (1-10) – స/భ/ర/ల IIUU – IIU IUI
సరి పాదములు – మత్తేభవిక్రీడితము (11-19) – స/త/త IIUU – UIUUI

వనమందున్ – వర పుష్పరాశి
మనమందున్ – మందహాసమ్ము
వనమందున్ – స్వర పుష్పరాశి
మనమందున్ – మౌన గీతమ్ము

పై అర్ధసమవృత్తము పుష్పరాశిని కలిపి వ్రాస్తే ఇలాగుంటుంది –
వనమందున్ – వర పుష్పరాశి మనమందున్ – మందహాసమ్ము
వనమందున్ – స్వర పుష్పరాశి మనమందున్ – మౌన గీతమ్ము

ఇప్పుడు ఇవి మత్తేభవిక్రీడితములోని మొదటి 19 అక్షరముల రెండు పాదములుఅవుతుంది. కాని ఈ పాదములను చదివినప్పుడు మనకు మత్తేభవిక్రీడిత వృత్తపు ధార కనిపించదు!

అర్ధసమవృత్తము కోరకము –
బేసి పాదములు – శార్దూలవిక్రీడితము (2-11) – త/జ/భ/ల UUII – UIUIII
సరి పాదములు – శార్దూలవిక్రీడితము (12-19) – మ/య/లగ UUU – IUUIU

చిత్తమ్మున – శ్రీధరుం డెపుడు
మత్తిల్లన్ – మనోజ్ఞమ్ముగా
నృత్తమ్మును – నిత్య మాడుఁ గద
చిత్త మ్మా – శివమ్మౌనుగా

రెండేసి పాదములను కలిపి వ్రాసి చదివితే మనకు ఇది శార్దూలవిక్రీడితపు నడకగా ధ్వనించదు.

ఉత్పలమాల (4-13) ర/న/భ/గ UIUI – IIU IIU

రాగవీణ – రవముల్ వినఁగా
సాఁగి రమ్ము – స్వర యోగములో
నూఁగి పొమ్ము – యొగి మోదముతో
భోగమన్న – భువిలో నిదియే

శార్దూలవిక్రీడితము (6-14) ర/న/మ UIUI – IIU UU

లోక మెల్ల – రుచులన్ దోఁచెన్
నాక మెల్ల – నవమై పూఁచెన్
నాకు నీవు – నవమే కాదా
నీకు నేను – నెనరే కాదా