నాకు నచ్చిన పద్యం: చక్రవర్తి కావ్యం చేసిన సామాన్యుల జీవనం

తారీఖులు దస్తావేజులు ఇవి కావోయి చరిత్రకర్థం,
మతలబులూ, కైఫీయతులూ ఇవి కావోయ్ చరిత్రసారం

అన్న శ్రీశ్రీ మాటలు చరిత్ర పుస్తకాలని మాత్రమే దృష్టిలో ఉంచుకొని చెప్పినవని అనుకోవాలి. ఎంచేతనంటే, అతనన్న ‘సామాన్యుని జీవనం’ ఆయా కాలాలలో వచ్చిన సృజనాత్మక సాహిత్యంలో అంతో ఇంతో ప్రతిఫలిస్తూనే ఉంటుంది. దేశి సాహిత్యంలో అది విస్తృతంగా కనిపిస్తే, మార్గ సాహిత్యంలో పరిమితంగా కనిపిస్తుంది. తెలుగులో భారత, భాగవతాలవంటి పురాణాలలో కొంత సమాజ చిత్రణ కనిపించినా, శైవసాహిత్యమూ, శ్రీనాథుని కావ్యాలూ సామాన్య జనజీవనాన్ని మరింత ఎక్కువగా ప్రతిఫలిస్తాయి. అయితే, ఆ తర్వాత వచ్చిన ప్రబంధాలు మాత్రం పూర్తిగా ఊహాలోకాలలోనే విహరించాయన్న అభిప్రాయం ప్రచారంలో ఉంది. అందులో కొంత నిజమూ ఉంది. కాని, ఏ కావ్యమైనా సమకాలీన సమాజ పరిస్థితుల ప్రభావం నుంచి పూర్తిగా తప్పించుకోలేదు. కాబట్టి ఏదో ఒక రూపంలో ప్రబంధాలలో కూడా ఆ కాల స్వభావం వ్యక్తమవుతూనే ఉంటుంది. అయితే విస్తృతంగానూ, చాలా ప్రస్ఫుటంగానూ, సామాన్య మానవుల జీవనాన్ని అద్దంపట్టే ప్రబంధాలలో ఆముక్తమాల్యదది అగ్రస్థానం. ఒక రాజు రచించిన కావ్యంలో అతి సామాన్యుల బ్రతుకులు చిత్రింపబడడం విశేషమే. అలా చేయడానికి అతను ఎన్నుకొన్న మార్గం మరింత విశేషం!

ప్రబంధ లక్షణాలలో ప్రధానమైనవి అష్టాదశవర్ణనలు. అందులో ఋతువర్ణన ఒక ప్రత్యేకాంశం. సాధారణంగా ఋతువర్ణనలు అనగానే ప్రకృతిలోని మార్పులూ, వాటి చుట్టూ అల్లబడిన ఊహలూ కల్పనలూ మాత్రమే ఉంటాయి. అలాంటి అద్భుతమైన కల్పనలు ఆముక్తమాల్యదలో కూడా ఎన్నో ఉన్నాయి. కాని రాయలవారు వాటితో సరిపెట్ట లేదు. ఋతువులకి అనుగుణంగా, మానవ జీవితంలో వచ్చే మార్పులని కూడా అనేక కోణాలలో దర్శించి, మనకి దర్శింపజేసారు. పూర్వకాలం మనిషి జీవితం ప్రకృతితో మమేకమైనది. భారతీయ జీవన విధానంలో అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తినే తిండి, వేసుకొనే బట్ట, చేసే పనులు, జరుపుకొనే పండగలు, యిలా వ్యక్తిగత జీవితం మొదలుకొని సాంఘిక వ్యవహారాల వరకూ అన్నీ ప్రకృతిపై ఆధారపడినవే. వివిధ ఋతువర్ణనలలో రాయలవారు వాటిని మన కళ్ళకు కట్టిస్తారు. అలాంటి ఒక సజీవదృశ్యం యీ పద్యం:

సీ. ఇల్లిల్లు దిరుగ నొక్కింతబ్బు శిఖి యబ్బె
              నే నింటిలో బూరి యిడి విసరక
      రాజదు రాజిన రవులుకోల్ వాసాల
              గాని కల్గదు మఱి దాన గలిగె
      నేని కూడగుట మందైన బెన్పొగ సుఖ
              భుక్తి సేకూర దా భుక్తి కిడిన
      బ్రాగ్భోక్తలకె తీఱు బహుజనాన్నము దీఱ
              నారుల కొదవు బునఃప్రయత్న

తే. మాజ్యపటముఖ్య లయ మెన్న రాలయాంగ
      దారు లయ మెన్నరంతిక కారజనిక
      పచన నాంధోగృహిణి రామి బడుక మరుడు
      వెడవెడనె యార్ప నొగిలి రజ్జడిని గృహులు

పల్లెటూళ్ళలో ఇల్లాళ్ళ వానాకాలపు యిక్కట్లను చిత్రీకరించే పద్యమిది. రాయలవారి పద్యాలు, అవి సంస్కృతభూయిష్టమైనా, అచ్చ తెలుగులో ఉన్నా, సాధారణంగా ఒక పట్టాన అర్థం కావు. పైగా అతనికి పద్యం నడకపై ఏమాత్రం దృష్టి ఉన్నట్టుగా అనిపించదు. పద్యాన్ని సొగసుగా ధారగా నడిపించాలన్న పట్టుదల అతనికి లేదు. దానివల్ల చాలా పద్యాలు ముక్కలుగా విడగొట్టుకొని, వచనంలా చదువుకోవలసిందే. ఈ పద్యం కూడా అలాంటిదే. అయితే దీన్ని పద్యంగా మలచడంలో ఒక నిర్మాణ విశేషాన్ని, ఒక బిగింపుని రాయలవారు చూపించారు. అదేమిటో తర్వాత చూద్దాం. ముందుగా, యీ సీసపద్య పాదాల్లోంచి వాక్యాలని వెలికితీయాలి.

ఇల్లిల్లు దిరుగ ఒక్కింత అబ్బు శిఖి. అబ్బేనేని, యింటిలొ పూరి యిడి విసరక రాజదు. రాజిన, రవులుకోల్ వాసాలగాని కల్గదు. మఱి దాన కలిగెనేని, కూడు అగుట మందు. ఐన, పెన్పొగ సుఖభుక్తి సేకూరదు. భుక్తికి ఇడిన, ప్రాగ్భోక్తలకె తీఱు బహుజనాన్నము. తీఱ, నారులకు ఒదవు పునఃప్రయత్నము. ఆజ్యపట ముఖ్య లయము ఎన్నరు. ఆలయ అంగ దారు లయము ఎన్నరు, అంతికకు. ఆరజనిక పచన నాంధస్ గృహిణి రామి, పడుక మరుడు వెడవెడనె ఆర్పన్ నొగిలిరి ఆ జడిని గృహులు.

వాక్యాలు ఒక పాదంలోంచి మరొక పాదంలోకి యిలా చొచ్చుకుపోయి ఉండే సీసాన్ని ‘గునుగు సీసం’ అంటారు. వాటిని విడగొట్టుకొన్నాక కొంత అర్థం అవడం మొదలుపెడుతుంది. కాని, రవులుకోల్, మందు, ప్రాగ్భోక్తలు, మొదలైన పదాలు ముందుకు సాగకుండా అడ్డుపడుతూ ఉంటాయి. వీటన్నిటినీ దాటుకు వెళ్ళినా, ఎత్తుగీతి కొరుకుడుపడడం చాలా కష్టం. ఇందులో ఉన్నవన్నీ చాలావరకూ అచ్చతెనుగు పదాలే. అయినా ఇది నారికేళపాకం! దానికి కారణం రాయలవారికే ప్రత్యేకమైన పదాల పోహళింపు, వాక్యనిర్మాణం. బహుశా ఇది సంస్కృతవాక్య నిర్మాణ ప్రభావంతో, అదే తరహాలో తెలుగువాక్యాలని నిర్మించడం వల్ల వచ్చిన అన్వయక్లిష్టత అని నా ఊహ. అచ్చతెనుగు, సంస్కృత శబ్దాల మధ్య అంతగా అలవాటులేని అతికింపులు కూడా మరొక కారణం. ఉదాహరణకి, ఇల్లిల్లు దిరుగ ఒక్కింత అబ్బు అనే అచ్చతెనుగు వాక్యం చివర శిఖి అనే వాడుకభాషలో లేని సంస్కృత శబ్దాన్ని అతికించారు. ఆజ్యపటముఖ్య లయము అనే సంస్కృత సమాసంతో ఎన్నరు అనే అచ్చతెనుగు క్రియని అతికించారు. ఈ చిక్కుముడులన్నీ విప్పుకొంటూ వెళితే కాని అసలు తాత్పర్యం బోధపడదు. మన అదృష్టవశాత్తూ ఆ పని ఇప్పటికే కొందరు పండితులు చేశారు. సంజీవని అనే పేర వేదం వేంకటరాయశాస్త్రిగారు, సౌందర్యలహరి అనే పేర తుమ్మపూడి కోటీశ్వరరావుగారు, ఆముక్తమాల్యదకి చక్కని వ్యాఖ్యానాలు రచించారు. వారి సౌజన్యంతో పద్య తాత్పర్యంలోకి నడకసాగిద్దాం.

వానాకాలంలో ఇల్లాళ్ళకు పొద్దుననుండి రాత్రిదాకా వంటపని తోనే సరిపోయేది. వారి అవస్థ ఏమిటో వివరంగా చెప్పారీ పద్యంలో. ఇల్లిల్లు తిరిగితే కానీ కాస్తంత నిప్పు దొరకదు. ఒకవేళ దొరికినా ఆ నిప్పుని మంటగా రాజెయ్యాలంటే గడ్డి పెట్టి విసరాలి. అదెక్కడనుంచి వస్తుంది? ఇంటి కప్పునుంచి (పూరిగుడిసెలే కాబట్టి.) దానివల్ల కొద్దిగా నిప్పు రాజుకుంటుంది కాని, అది వంటంతా అయ్యేంత రగులుకోవాలి (రవులుకొను అనే క్రియకి నామరూపం రవులుకోల్) అంటే గడ్డి సరిపోదు. కట్టెలు కావాలి. అవి కూడా పాపం ఇంటి వాసాలనుంచే! వాసాలు అంటే ఈ కాలంలో చాలామందికి తెలియదు. అందులోనూ, వంటకట్టెల కోసం తీసేసేంత వీలున్న వాసాలు పూరి గుడిసెల్లోనే కనిపిస్తాయి. అలా ఇంటి వాసాలు పీకి వంట చేయడం మొదలు పెట్టినా, కూడు పూర్తిగా (అంటే అన్నం, కూర వగైరా) అవ్వడం చాలా కష్టం (మందు అంటే దుర్లభం అని యిక్కడ అర్థం). ఒకవేళ ఏదో అయ్యింది తిందామన్నా, సగం సగం మండే పొయ్యి నుండి వచ్చే పెద్ద పొగ వల్ల, సుఖంగా కూర్చొని తినడం కుదరదు. సరే అలాగే తినడానికి వడ్డించినా, చాలామందికని వండిన అన్నం (బహుజనాన్నము), మొదటి పంక్తిలో కూర్చున్నవారికే (ప్రాక్ + భోక్తలకె) అయిపోతుంది. దానితో, ఆడవాళ్ళకి (నారులకు) వంట ప్రయత్నం మళ్ళీ మొదలవుతుంది! అంతిక అంటే పొయ్యి. పొయ్యి మళ్ళీ రాజెయ్యాలి. ఆజ్యపటము అంటే నేతిలో తడిసిన వస్త్రం. ఆలయ అంగ దారు-లు అంటే ఇంటిలో భాగమైన కట్టెలు (అంటే మళ్ళీ వాసాలే!) నేతిలో తడిపిన గుడ్డలు, ఇంటి కొయ్యలు, మొదలైనవన్నీ పొయ్యి రాజెయ్యడానికి లయమైపోతాయి. అలా, ఆరజనిక – అంటే రాత్రయినా కూడా, వంట (పచన) చేస్తూ చేస్తూ, ఆ గృహిణులు నాంధస్ గృహిణులు-గా మిగిలిపోతారు. అంధస్ అంటే అన్నం. న అంధస్ అంటే అన్నము లేని అని అర్థం. గృహిణులు రాత్రిదాకా వంట పనులతో తీరికలేక అన్నం కూడా లేకుండా ఉండిపోతారు.

ఇలా పద్యమంతా వానాకాలంలో గృహిణుల యిక్కట్లని వర్ణించి, కొసమెరుపుగా ఆఖరి పాదంలో ఒక అనుకోని ముక్తాయింపునిచ్చారు. పద్యానికి అసలు బిగింపు దాని ముగింపులో వేశారన్న మాట! ఒక పక్క రాత్రయినా ఇంటిపనులతో సతమతమవుతూ తిండికూడా తినకుండా ఇల్లాళ్ళు ఉంటే, మరో పక్క తమ భార్య యింకా పడకగదికి రాలేదని మగరాయళ్ళు మన్మథబాధతో వేదనపడుతూ ఉంటారట! ఇలాంటి ఊహించని ముగింపు పద్య నిర్మాణంలో ఒక శిల్పం. మామూలు గద్య రూపంలో యీ మెరుపు ఇంతగా మెరవదు.

వానాకాలంలో సామాన్య ప్రజల సంసారాలలో ఉండే పాట్లు స్వయంగా తెలుసుకోడమే కాకుండా అంతే సహజంగా కావ్యవర్ణనలో చిత్రించడం శ్రీకృష్ణదేవరాయలవారికే చెల్లింది! అతనిక్కడ చేసింది సమాజ చిత్రణ మాత్రమే, సామాజికవ్యాఖ్య కాదు. ఈ సన్నివేశాన్ని ఎవరి బుద్ధిని అనుసరించి వారు వ్యాఖ్యానించుకోవచ్చు!

సమాజ చిత్రణే కాదు, మానవ స్వభావాన్ని కూడా చిన్న చిన్న దృశ్యాలలో అద్భుతంగా దర్శింపజేయగల నేర్పు రాయలవారికుంది. ఈ వర్షర్తు వర్ణనలోనే వచ్చే మరొక పద్యం దానికి మంచి ఉదాహరణ.

రయమున వృష్టికై యొదిగి రచ్చలపై, విధియింతు రుగ్రతన్
హయపతిమీద దంతపతి నాతనిపై నృపతిం, గజాది ని
ర్ణయముల మొత్తులాడుదురు, మ్రబ్బొక యింతయు విప్ప, విచ్చుమొ
గ్గయి మఱి పాసిపోదురు సమస్తదిశాగతులైన యధ్వగుల్

అధ్వ అంటే బాట, దారి. అధ్వగులు అంటే ప్రయాణికులు, బాటసారులు. అధ్వాన్నము అనే పదం అధ్వ+అన్నము నుంచి వచ్చింది. ప్రయాణాలలో తిండి సరిగా ఉండదు కాబట్టి, ఆ పరిస్థితిని వర్ణించే పదం క్రమేపీ అర్థ వ్యాకోచం పొంది పాడైపోయిన… మొదలైన అర్థాలు సంతరించుకొంది. ఈ పద్యంలో రాయలవారు వానాకాలంలో అధ్వగుల తీరుని చిత్రిస్తున్నారు. హఠాత్తుగా కురిసే వానవల్ల తోవలో వెళుతున్న బాటసారులందరూ తొందరతొందరగా రచ్చబండ పైకి చేరి, ఒదిగి నిలుచుంటారు. అలా చేరినవాళ్ళు ఊరికే ఉంటారా! ఏవో చర్చలు మొదలుపెడతారు. హయపతి (అశ్వసైన్యం ఎక్కువ ఉన్న ఒక రాజు) గొప్ప అంటే కాదు, గజపతి గొప్ప అనీ, కాదు వాళ్ళిద్దరి కన్నా మరొక నృపతి గొప్ప అనీ వాదులాడుకోవడం మొదలుపెడతారు. అది తీవ్రరూపం దాలుస్తుంది. ఏనుగులు, గుఱ్ఱాలు మొదలైన చతురంగ బలాలలో ఎవరు ఎక్కువంటే ఎవరెక్కువ అని దెబ్బలాడుకొనేంత దాకా వస్తుంది! ఈ లోపున మబ్బు కాస్తంత తెరపి యిస్తుంది. అంతే, వెంటనే ఆ రచ్చని విడిచిపెట్టి, ఎవరి దోవన వాళ్ళు విచ్చుమొగ్గ-లా వెళ్ళిపోతారు. విచ్చుమొగ్గయి- అన్న జాతీయానికి చెల్లాచెదరైపోవు అన్న అర్థం ఉంది. మొగ్గ రేకులు విచ్చిపోవడం (చీలిపోవడం) అనే అర్థంలో అనుకొంటాను. అయితే యిక్కడి సందర్భంలో మరొక అర్థం కూడా తీసుకోవచ్చు. మొగ్గ విచ్చుకొని పూవు ఎప్పుడవుతుందో మనం సాధారణంగా గమనించలేము. ఆ రోజు దాకా మొగ్గగా ఉన్నది హఠాత్తుగా ఒక ఉదయం చూసేసరికల్లా పువ్వుగా విచ్చుకొని ఉంటుంది. అలాగే ఇక్కడ మబ్బు కాస్తంత తొలగేసరికి, హఠాత్తుగా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అని అర్థం చేసుకోవచ్చు. ఈ పద్యంలో నాకు కనిపించిన మరొక భాషా చమత్కారం “సమస్తదిశాగతులైన” అనే పదం. ఇది “అధ్వగు”లకు విశేషణంగా రాయలవారు ఉపయోగించారు. ఈ పదాన్ని “సమస్తదిశా + ఆగతులైన” అని విడగొట్టుకోవచ్చు, “సమస్తదిశా గతులైన” అని కూడా విడగొట్టుకోవచ్చు. రెండూ ఇక్కడ అన్వయిస్తాయి! వాన మొదలైనప్పుడు “సమస్తదిశా ఆగతులు”, అంటే నానా దిక్కులనుండీ వచ్చినవారు. వాన తెరపి యిచ్చాక వాళ్ళే “సమస్తదిశా గతులు”, అంటే నానా దిక్కులకి (ఎవరి దిక్కున వాళ్ళు) వెళ్ళిపోయారు!

ఋతువర్ణనలో భాగంగా ఇంత చక్కగా మానవ స్వభావాన్ని (ఇది మన తెలుగువాళ్ళకే ప్రత్యేకమేమో నాకు తెలీదు! :-)) కళ్ళకి కట్టించడం రాయలవారికే సాధ్యమయింది. ఈ ఆధునిక యుగంలో, అంతర్జాల ప్రపంచంలో కూడా అవే రచ్చబండలూ, అవే గాలివాటపు వాదులాటలూ, మనందరికీ బాగా పరిచయమే కదా!