గుప్పెట్లో తూనీగ

ఇక్కడ ఒకడుగు
అక్కడ రెండడుగులు
నేలమీద నేను
నేలా నింగీ తను
పరుగుల పందెం

రెక్కల్లా చేతులు చాచి
తనకోసం పరుగెడుతూ నేను.
రెక్కల వేగంతో నాకందకుండా
పూలకోసం తను
మా ధ్యాసలే వేరు.

పారాణి అంటినట్టు కాళ్ళు
పసుపు నలుగెట్టినట్టు రెక్కలు
రెట్టింపు అందంతో
పుప్పొడి నింపుకున్న
పూవు రెక్కపై నిలిచి తను.

పట్టుకోవాలన్న ఆశతో
చాచిన రెండువేళ్ళకూ
చేస్తున్న తప్పు తెలిసేలా
గుచ్చుకొన్న ముళ్ళతీగ.

తువ్వాయిలా ఇంకో
పువ్వుకై ఎగురుతూ
స్వేచ్ఛగా తను.
తనతోనే ఉరుకుతూ
ఆనందంగా నేను.
మా ధ్యాసలు ఒకటే.

అంతలో బలంగా సుడిగాలి
విలవిలా జారిన తను
ఆదుర్దతో చేతులు చాచి నేను.
పదిలంగా నా గుప్పిటిలో తను.
కుదుట పడ్డ రెండు ప్రాణాలు
వింతగా కోరిక తీరిన నేను.