ఈమాట జులై 2015 సంచికకు స్వాగతం!

డా. పుల్లెల శ్రీరామచంద్రుడు (24 అక్టోబర్ 1927 – 24 జూన్ 2015): సంస్కృతాంగ్లాంధ్రహిందీ భాషలలో, వేదాంత వ్యాకరణ అలంకారశాస్త్రాలలో అద్వితీయమైన పాండిత్యప్రతిభతో నూటయాభైకి పైగా పుస్తకాలు వ్రాసి, సంస్కృతభాష నుండి ఎన్నో క్లిష్టమైన రచనలను తెలుగు లోకి అనువాదం చేసిన కవి, రచయిత, లాక్షణికుడు, విమర్శకుడు, అలంకారికుడు, వైయాకరుణి, నైఘంటికుడు, సంస్కృతాంధ్ర భాషాసాహిత్యాలకు ఇతోధికంగా సేవ చేసిన మహనీయుడు, డా. పుల్లెల శ్రీరామచంద్రుడు ఇక లేరు. 1927లో జన్మించిన శ్రీరామచంద్రుడు హిందీ, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీలను, సంస్కృతంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టాను సాధించారు. ప్రతిపదార్థాలతో, విశ్లేషణాసహితంగా వాల్మీకి రామాయణానికి చేసిన పది సంపుటుల చక్కటి తెలుగు అనువాదం ఆయన ప్రతిభకు ఒక చిన్న నిదర్శనం మాత్రమే. ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకం, భరతుడి నాట్యశాస్త్రం, ఉపనిషత్తులు, రాజశేఖరుడి కావ్యమీమాంసా, పతంజలి యోగసూత్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం, మమ్మటుడి కావ్యాదర్శం, బ్రహ్మసూత్ర శంకరభాష్యం, ఇలా ఎన్నో సంస్కృత గ్రంథాలను అందరికీ అర్థమయేలా అనువాదం చేసి శ్రీరామచంద్రుడు తెలుగువారికి ఎనలేని మేలు చేశారు; అలంకారశాస్త్ర చరిత్ర, ప్రాకృతభాషాసాహిత్యచరిత్ర వంటి గ్రంథాలతో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. వైజ్ఞానికశాణ్ముఖమ్, కో వై రసః, పాశ్చాత్యతత్వశాస్త్రేతిహాసః, పారసీకలోకోక్తయః, తదితర సంస్కృత రచనల ద్వారా దేశవ్యాప్తంగా గౌరవం అందుకున్న పండితుడు, సంస్కృతాంధ్రభాషాభివృద్ధి కోసం జీవితాంతమూ కృషి చేసిన మహామహోపాధ్యాయుడు అయిన శ్రీరామచంద్రుడికి 2011లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చి కేంద్రప్రభుత్వం సత్కరించింది. నిగర్వి, సహృదయుడు అయిన ఆయన మరణం తెలుగుసాహిత్యం పూడ్చుకోలేని ఒక పెద్ద లోటు.


ఈ సంచికలో:

  • కథలు: ఎడారి అంచున – శారద; ఘోస్ట్ సైకిల్ – సాయి బ్రహ్మానందం గొర్తి; నల్ల బెలూన్ – మమత; ఒంటరితనం – లక్ష్మీదేవి; టీచింగ్ మూమెంత్స్ – లైలా యెర్నేని; మొట్టమొదటి సారాకాపు – ఆర్. శర్మ దంతుర్తి.
  • కవితలు: తోపులో పిల్లలు – పాలపర్తి ఇంద్రాణి; వేడికోలు – సమవర్తి; గుప్పిట్లో తూనీగ – సాంఘిక; జారిపోయిన కాలం – అపర్ణ తోట; రెక్కిటికి – తః తః; పెదిమలు, తలుపులు – హెచ్చార్కె.
  • వ్యాసాలు: సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము (రెండు భాగాలలో) – ఏల్చూరి మురళీధరరావు; ప్రధానసంఖ్యలలో కవలలు – వేమూరి వేంకటేశ్వరరావు.
  • శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు – భైరవభట్ల కామేశ్వరరావు.
  • శబ్ద్రతరంగాలు: స్వరార్చనం – కనకప్రసాద్; దీక్షిత దుహిత – తల్లావఝ్ఝల శివశంకర శాస్త్రి, సమర్పణ: పరుచూరి శ్రీనివాస్.