ఒంటరితనం

ఏళ్ళతరబడి ఉన్న అలవాటు, ఈరోజు కూడా ఐదు కాగానే మెలకువ వచ్చేసింది. అయినా లేవలేదు. కళ్ళు మూసుకొని మేలుకునే ఉన్నాడు. అటూ ఇటూ దొర్లుతూ మళ్ళీ నిద్రపోవాలని ప్రయత్నించాడు. కుదరలేదు. లాభం లేదని మంచం మీదే లేచి కాళ్ళు జారవేసి కూర్చున్నాడు. తల తిప్పి తూర్పు దిక్కు చూశాడు. తెల్లారుతుంది ఇకనో ఇప్పుడో. ఆకాశం ఎఱ్ఱబడింది. సూర్యుడు రాబోతున్నాడు. అటుచూడ్డం మానేసి మళ్ళీ నడుం వాల్చాడు. లక్ష్మి మంచం నిలబెట్టి ఉంది. ఆ మంచాన్నలా చూడలేక మళ్ళీ లేచి కూర్చున్నాడు. ఈ సారి మంచం మీద అటువైపు కూర్చున్నాడు తూర్పుకు అభిముఖంగా.

తూర్పు ఎరుపురంగునుంచి పసుపు రంగులోకి మారుతోంది. ఆలోచనలో పడ్డాడు. ఏం లోకం ఇది? పొద్దు పొడుస్తుంది, పొద్దు మునుగుతుంది, చీకటి పడుతుంది, మళ్ళీ పొద్దు పొడుస్తుంది, మళ్ళీ పొద్దు, మళ్ళీ రాత్రి… సుఖం, దుఃఖం, ఎండ-నీడ… అంటే ప్రతిదీ మారుతుంది, మారుతూనే ఉంటుంది. ఒకనాటి మాట – ఒకనాడు ఏంటి? నిన్న మొన్న జరిగినట్టుంది. గడవడానికైతే యాభయ్యేళ్ళయింది గానీ నాలుగైదు రోజులక్రిందటి మాటన్నట్టుంది. అవి పెళ్ళైన కొత్త రోజులు. లక్ష్మి కొత్తగా ఇంట్లో అడుగు పెట్టిన రోజులు. అబ్బ, ఏం రోజులవి! లక్ష్మితో మాట్లాడాలంటే ఎంత సిగ్గేసేదో! పెళ్ళై ఐదురోజులైతే అయింది గానీ ఎంత తనకు తాను ధైర్యం చెప్పుకున్నా లక్ష్మితో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. ‘ఆడపిల్లనల్లరి పెడతావా? సిగ్గు లేదా’ – చేయి తగలగానే గట్టిగా అరిస్తేనో? ఆరేడు రోజులయ్యాక్కదా మాట్లాడగలిగాడు! ఆ రాత్రి కూడా ఒక కథలో లాగా జరిగింది. గదిలోకెళ్ళేసరికి లక్ష్మి రోజూలాగే రగ్గు కప్పుకొని ఉన్నది దిగ్గున లేచి కూర్చుంది. దగ్గరకెళ్ళగానే లక్ష్మి…

ఆలోచనలాగిపోయాయి. మళ్ళీ తూర్పుగా చూశాడు. ఎఱుపురంగును తగ్గిస్తూ పసుపురంగు వచ్చినట్టే, ఇప్పుడు పసుపు రంగుపైన తెలుపురంగు ముదురుతూ ఉంది. సూర్యుడు ఉదయించాలని తొందరపడుతున్నట్టున్నాడు. అదో ఎఱ్ఱెఱ్ఱని గోళం… కనీకనిపించకుండా!

మళ్ళీ మంచం మీద వాలాడు. కీళ్ళనొప్పులవల్ల చిన్నగా మూలిగాడు. హుఁ, ఇంకొక రోజు మొదలైంది, ఎంత తొందరగా ఇలా ఒక్కొక్కరోజూ గడిచిపోతూనే ఉంది కదా అనిపించింది. లక్ష్మి లేకుండా ఒక్కరోజు కూడా బ్రతకలేననుకునేవాడు. కానీ బ్రతికే ఉన్నాడు. ఎనిమిది రోజులు గడచిపోయాయి. ఈ రోజప్పుడే తొమ్మిదోరోజు. తింటున్నాడు, తాగుతున్నాడు, నిద్దరపోతున్నాడు, మేలుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అన్నీ! భార్యాబిడ్డలతో తన కొడుకులు ముగ్గురూ ఐదోరోజే బయల్దేరారు. సర్కారు నౌకర్లం అన్ని రోజులు శలవు దొరకదు, దినాలప్పుడు మళ్ళీ వస్తామన్నారు. నడిపోడు మొదట మొదలుపెట్టాడు.ఇంక అందరూ వరుసపెట్టారు. ఎలా మొదలు పెట్టాలోననే అందరికీ ఆరాటం. ఒక్కొక్కరూ అలా ముగ్గురుకొడుకులూ వెళ్ళిపోయారు. కూతురూ సాయంకాలం బండిలో బయల్దేరింది. పిల్లల బళ్ళు తెరిచారట. పిల్లల చదువు మూలబడుతోందన్నారు.

అందరూ వెళ్ళిపోయాక ఒక్కడే మిగిలాడు. ఒక్కడే! వెళ్ళినవాళ్ళు వచ్చేవరకూ ఏం నమ్మకం? వాళ్ళొస్తే లక్ష్మి ఇక్కడే ఎక్కడో ఉందని, ఉంటుందని అనిపిస్తుంది. బయటో, లోపలో ఉండే ఉంటుంది. కళ్ళు దించుకొని మెల్లమెల్లగా అడుగులు వేస్తూ వచ్చి ఎదుట నించుంటుంది. వచ్చి నిలబడకపోతే మానె. అసలు లక్ష్మిని మళ్ళీ ఎవరు తీసుకు రాగలరు? ఎవరు తిరిగి వచ్చారు ఇంతవరకూ? ఎవరైనా తీసుకొని రాలేరు. అసలిప్పుడు వాళ్ళకు అమ్మ ఎందుకు? వాళ్ళు పెళ్ళాల సొంతమైపోయారు. కంటతడి కూడా పెట్టనేలేదు. నెలనెలా ముప్ఫై రూకలు పంపడమే వాళ్ళకు గగనమైనట్టుంది. ఇంకా కన్నీళ్ళు కూడా పెడతారా? వీళ్ళా కొడుకులు? తన తల్లి పోయినపుడు గోడకు తల కొట్టుకొనీ కొట్టుకొనీ రక్తసిక్తం చేసుకోవడం గుర్తుంది. బాబాయ్ ఎలా అయిపోయాడన్నారందరూ. ఏడుస్తూ ఏడుస్తూ నవ్వేవాడు. నవ్వుతూ నవ్వుతూ ఏడ్చేసేవాడు. నిద్రపట్టినా మెలకువగానే ఉన్నట్టుండేది. మెలకువ వచ్చినా నిద్రమబ్బు వీడనట్టుండేది. ఆకలనేది చచ్చిపోయినట్టు కడుపులో రాయి పెట్టినట్టుండేది. అరె, వీళ్ళూ కొడుకులేనా? మహేశ్, రామ్, సతిందర్. లక్ష్మి ప్రాణం పెట్టేది వీళ్ళందరిపైనా. అలాంటి లక్ష్మి పోతే వీళ్ళకు చీమకుట్టినట్టైనా లేదా? కనీసం కళ్ళు చెమ్మగిల్లలేదు. హ్మ్! వీళ్ళు ఏడ్చినా, ఏడవకపోయినా ఇప్పుడు ఒరిగేదేం లేదని తెలుసు. కానీ ఒకటైతే నిజం కదా! తనకు ఆమే కదా తోడుండింది! కలిసి ఏడవడానికీ, నవ్వడానికీను! ఆ భాగ్యమూ దూరమైందిప్పుడు. వాళ్ళదేం పోయింది? పాడై, చినిగిన చెల్లని నోటు పోయినట్టుందంతే వాళ్ళకు! కానీ దేవుడా! అంతా నీ లీల! నిన్ను మించినవారెవరు? నీ ముందు నేనేపాటి…

మళ్ళీ లేచి కూర్చున్నాడు. క్రమంగా ఎండెక్కుతూ ఉంది. అంగీ లోపలికి చేయిపెట్టి ఎడమప్రక్క నిమురుకున్నాడు కాసేపు. ఎందుకో గుండెల్లో నొప్పిగా అనిపిస్తోంది. తల అయితే నొప్పితో పగిలిపోయేటట్టుంది.

దేవుడా! మంచం మీంచి లేచాడు. అలాగే నిలబడి ఇప్పుడేం చేద్దామని ఆలోచించి మళ్ళీ అక్కడే కూర్చుండిపోదామనుకున్నాడు కానీ కూర్చోలేదు. పరుపు చుట్టి గది లోపల వాల్చి ఉన్న మంచంమీద పారేసి, అక్కడే కూర్చుండి పోయాడు. కళ్ళద్దాల లోంచి పొగచూరిన జ్ఞాపకాలవైపు చూపు సాగిపోయింది.

నిజం! రాత్రికి లక్ష్మి చనిపోతుందని అనిపించనేలేదసలు. ఏమాత్రం అనుమానం వచ్చినా నిద్రపోయేవాడే కాదు తను. ఆ రోజు కూడా అర్థరాత్రి వరకూ మేలుకునే ఉన్నాడు. లక్ష్మి కాళ్ళు వత్తుతూనే ఉన్నాడు. లక్ష్మి గొంతులో మూలుగులతో పాటు చిన్నగా వెక్కుతున్న శబ్దం కూడా వినిపించినట్టైంది. ఏమంటే అంటుందీ – నా జన్మ వ్యర్థమయిందండీ. ఈ వయస్సులో మీతో కాళ్ళు పట్టించుకుంటున్నాను. నాకు నరకంలోనైనా చోటుంటుందా? అని. ఏమీ మాట్లాడలేకపోయాడు తను. కళ్ళద్దాలు తీసి కళ్ళతడి తుడుచుకొని లక్ష్మి నిద్రపోయాక మంచం మీంచి లేచాడు. ప్రక్కనే ఒక మంచం వాల్చుకొని పడుకున్నాడు. చాలాసేపు నిద్ర పట్టనే లేదు. తర్వాతెప్పుడు కళ్ళుమూతలు పడ్డాయో!

నొప్పి మళ్ళీ రావడంతో ఛాతీ నిమురుకుంటూ పడుకున్నాడు. పాపం, లక్ష్మి పోయేముందు ఎంతసేపు బాధపడిందో! చీకటి కూడా! దీపం వెలిగించడం లాంటిదో , కనీసం ఏదో ఒకటైనా చేయలేకపోయాడు. పొద్దున లేచి చూసేసరికే లక్ష్మి చనిపోయి ఉంది. వెఱ్ఱి కేక వేసి ఏడుస్తూ లక్ష్మి శవం మీద పడిపోయాడు తను. జనాలు గుమిగూడడం మొదలైంది. తరువాత… కళ్ళద్దాలు తీసి కళ్ళు తుడుచుకుని మళ్ళీ పెట్టుకున్నాడు. కళ్ళు పై కప్పు వైపే చూస్తున్నాయి.

రెండువైపులా పద్ధెనిమిది దంతెలు, మధ్యలో దూలం ఉంది.మళ్ళీ మళ్ళీ ఎంచుతూ ఉన్నట్టుండి అనిపించింది. ఇవెన్నో ఈమధ్యే తెలిసింది తనకు. ఎందుకు? మొదటెప్పుడూ ఎంచలేదిలా. ఇరవై ఏళ్ళ నుంచీ ఈ ఇంట్లో ఉంటున్నాడు. ఎప్పుడు పైకప్పులో ఉన్న దంతెలను లెక్కపెట్టలేదు. తల పైకెత్తి చూడలేదని కాదు కానీ ఎంచాలనుకోలేదెప్పుడూ. అంత ఖాళీ ఎప్పుడూ లేదేమో. ఈ మధ్యే ఒక ఆరేడేళ్ళనుంచీ ఇద్దరిలో మొండితనం ఎక్కువైంది. ఇద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒక చిన్నమాట మీద అలిగితే ఇంక అంతే. నాలుగైదు గంటల వరకూ బ్రతిమాలేదీ, ఒప్పించేదీ లేదు. చిన్న పిల్లలలాగా మంకుపట్టు. రోజుకు రోజూ అలా అలగడం భలే మజాగా ఉండేది. తర్వాత లక్ష్మి ఎంత బాగా సముదాయించేదంటే… కళ్ళద్దాలు మళ్ళీ తీసి కళ్ళను గట్టిగా నులుముకున్నాడు. ఈరోజూ అలిగితే… ఎవరిమీద అలుగుతాడు? ఎవరు సముదాయిస్తారు? అలక తీర్చేవాళ్ళు లేనప్పుడు ఎవరు మాత్రం అలుగుతారు? మళ్ళీ ఇంకోసారి కళ్ళు తుడుచుకున్నాడు.


ఒక్కగంట సేపట్లోనే రెండు సార్లు పెద్దగా ఉరిమి చినుకులు పడినా ఇంత పెద్దవాన వస్తుందని అనుకోలేదు. ఆకాశంలో మబ్బులు కూడా ఏమంత ముసురుపట్టి లేవు. అందుకే పదీ పదిన్నరకు ఇంటినుంచి బయటపడేటప్పుడు పెద్దగా పట్టించుకోలెదు. ఇంట్లో ఎంతసేపని ఒక్కడే కూచోగలడు? అయినా లక్ష్మి పోయాక, ఇల్లు ఒక పాడుబడ్డ గుడి లాగా అనిపిస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకూ బయటే గడుపుతున్నాడు. ఇంట్లో ఉంటే లక్ష్మి చనిపోయిందని, ఇంక తను ఒంటరివాడినని, ఇంట్లో తాను తప్ప ఇంకెవ్వరూ లేరని మాటిమాటికీ గుర్తొస్తుంది.

బయటుంటే మనస్సును వేరే వేరే విషయాలవైపు మళ్ళించవచ్చు. అందుకే రెండుసార్లు చినుకులు పడినట్టనిపించినా బయల్దేరిపోయాడు, ఇప్పుడు వాన ఎప్పుడు ఆగుతుందాని చూస్తూ బజార్లో మూసిన ఒక దుకాణం చూరు క్రింద తలదాచుకొని గంటన్నర దాటుతోంది. ఎప్పుడో బయల్దేరినప్పుడు రామూ కొట్లో టీ తాగివచ్చాడు. టీ తో రెండు బ్రెడ్ ముక్కలు. అదే టిఫినీ. తాగాక బజారంతా రెండు రౌండ్లు తిరిగొచ్చాడు. ఇట్నించటు, అట్నించిటు, మళ్ళీ ఇట్నించటు, అట్నించిటు, ఇట్నించి… ఇంతలో ఉరుములు మొదలైనాయి భయంకరంగా. ఊతకఱ్ఱపై గట్టిగా చేయి ఆన్చి ఆకాశం వైపు ఒకసారి చూశాడు. ఎక్కడ చూసినా మబ్బులే. త్వరగా నడవడం మొదలుపెట్టాడు. గట్టిగా ఇరవై అడుగులు వేశాడో లేదో వాన ఒక్కసారిగా జోరుగా కురవడం మొదలైంది. ఒక్కక్షణం అసహాయంగా అక్కడే ఆగిపోయాడు. కఱ్ఱ ఊతంగా ఎడమప్రక్కనున్న ఈ కొట్టు క్రిందకి చేరాడు. ఈ గంటాగంటన్నరలో విసుగొచ్చి నాలుగుసార్లన్నా లేచి, ఇంకో నాలుగుసార్లు కూచొని ఉంటాడు. మాట కలపడానికి కూడా దగ్గరలో ఎవరూ లేరు. కొట్లన్నీ మూసేసి ఉన్నాయి. ఎవరూ లేరెక్కడా. చూరు మీద టపటపా చప్పుడు, నేలమీద నీటి బుడగల చప్పుడు. అంతే వేరే ఏ శబ్దమూ లేదు. రోజంతా ఎంత సందడిగా ఉండే బజారిది? ఈ రోజు శలవైతే మాత్రం ఇలా ఉందేం, ఏదో మహమ్మారి ఊరిని మింగేసినట్టు, ఒకరిద్దరు తప్ప అందరూ చచ్చినట్టు…

ఎదురుగా నేలమీద పడుతున్న చినుకుల్ని చూస్తూ అలానే కూర్చున్నాడు. యాభై, యాభైఐదేళ్ళక్రిందటి ఒక వానజ్ఞాపకం మదిలో మెరిసింది.

అప్పటికి లక్ష్మితో మనువు కుదిరి మూడునెల్లయింది. కుదిరిన రోజునుంచీ ప్రతీరోజూ మనస్సులో గట్టిగా అనుకునేవాడు, ఈరోజు ఎట్లాగైనా సరే లక్ష్మి వాళ్ళ ఊరికి వెళ్ళి లక్ష్మిని ఒక్కసారి చూసి రావాలని. ఎట్లుంటుందో! అమ్మెప్పుడూ చెప్పేది, నీ పెండ్లాం వెన్నెలమ్మలా వుంటుందిరా అని. కానీ ఒక్కసారైనా చూడాలి కదా! ప్రతీసారీ అనుకొని ఆగిపోయేవాడు. ఒకటిరెండు సార్లయితే వాళ్ళ ఊరి పొలిమేర దాకా కూడా వెళ్ళి వచ్చాడు. ఎవరేమనుకుంటారోనని సంకోచం. రాజమల్లు దౌరా మనుమడు, హరిదత్తమల్లు దౌరా కొడుకు కాబోయే భార్యను చూడ్డానికి వాళ్ళ ఊరి చుట్టూ తిరుగుతున్నాడంటే విన్నవాళ్ళేమనుకుంటారు? వద్దొద్దు. ఆ ఊరివైపు తొంగి కూడా చూడకూడదింక అని అనుకున్నాడు గానీ, ఒకరోజు తెల్లారకుండానే కోడి తొలికూతకే లేచిపోయి లక్ష్మి ఊరిబాట పట్టాడు. అవీ ఈ శ్రావణమాసపురోజులే. అప్పటికే రాత్రి తుంపర్లు పలకరించి వెళ్ళాయి. పడడం లేదు గానీ వాన పడేటట్టే ఉంది. సగం దూరం వెళ్ళాడో లేదో చినుకులు మొదలైనాయి. నడక వేగం పెంచాడు. కాస్సేపటికి చినుకులూ ఆగిపోయాయి.

పొలిమేరలకు చేరుకున్నాక బాగా ఆలోచించి అక్కడున్న బావి దగ్గరే కొంచెం దూరంగా ఎక్కడైనా కూర్చొని లక్ష్మి కోసం వేచి చూద్దామనుకున్నాడు. సరీడు వాళ్ళతో కలిసి నీళ్ళకు వస్తుంది. చూసెయ్యాలి. వాళ్ళిల్లు కూడా ఈ బావికి దగ్గర్లోనే ఎక్కడో ఉందని అమ్మ అన్నది.

కానీ ఇక్కడే అసలు సమస్య. తాను లక్ష్మిని గుర్తు పట్టేదెలాగ? ఒక్కటే మార్గం. వచ్చినవాళ్ళు ఒకరినొకరు పేర్లతో పిలుచుకుంటారు కదా! అప్పుడు విని తెలుసుకోలేడా ఏం?

సరిగ్గా అప్పుడే ఉరుములు, మెఱుపులతో పెద్ద వర్షం మొదలయింది. పరుగెత్తాడు. కానీ ఎక్కడికెళ్ళగలడు? బట్టలు తడిసి ముద్దయ్యాక తెలిసొచ్చింది ఎక్కడో ఓచోట తల దాచుకోక తప్పదని. పక్కసందు లోకి పరుగు తీశాడు, అంతా బురదగా ఉంది. ధోవతి కట్టేవాడు కాదప్పుడు. మాంఛి వయస్సులో ఉన్నాడు. తెల్లటి ఖద్దరు పంట్లాం, బంగారు రంగు గుండీల చొక్కా వేసుకుని, జుట్టుకు నూనె రాసి దువ్వుకొని మరీ వెళ్ళాడారోజు. తలుపులు మూసున్న ఒక ఇంటి కప్పు క్రింద ఆగవచ్చని చూసి అక్కడకు చేరుకున్నాడు. అక్కడ ముంగిట్లో ఒక నల్ల కుక్కపిల్ల కూడా ఉండింది. తనను చూసి, లేచి ఒక్కసారి వళ్ళు విదిలించుకొని దగ్గరకొచ్చిందది. వాన ఎప్పుడు ఆగుతుందాని కలసి ఎదురుచూడ్డం గుర్తుంది. సుమారు అర్ధగంట గడిచాక ఇంటి తలుపులు తెఱచుకొన్నాయి. కొంచెం సర్దుకున్నాడు తను. కళ్ళూ ముక్కు చక్కగా, ఎఱ్ఱగా బుఱ్ఱగా ఉన్న ఒక పిల్ల తలుపు తీసింది. నోరు తెరవబోయేంతలో లోపలికి వెళ్ళిపోయింది. కాస్సేపటికి నడివయసాయన ఒకాయన లోపలి నుంచీ వస్తూ కనిపించాడు. ఆయన… ఆయన మామే. మామే వచ్చాడు బయటికి. ఒక్కనిముషం ఆగకుండా పరిగెత్తిపోయాడు తను, బావి దగ్గరకు చేరేవరకూ పడుతున్న వానను కూడా లెక్క చేయలేదు. పూర్తిగా తడిసిపోయినా ఆగలేకపోయాడు. తనను మామ గుర్తుపడితే ఇంకేమన్నా ఉందా!

వాన ఆగింది. కూర్చొనీ లేచీ జారిపోయి ఉన్న పంచెను తీసి నీళ్ళల్లో తడవకుండా కొంచెం పైకి కట్టుకున్నాడు. లావుపాటి కళ్ళద్దాలను తీసి తడి చొక్కా అంచుతో తుడుచుకొని మళ్ళీ పెట్టుకున్నాడు. కొట్టు బయటకు వచ్చి చౌరస్తా వైపుకు అడుగులేశాడు ఆలోచనల్లో తడిసిపోతూనే.

“చాచా! రామ్ రామ్!”

యాభైఏళ్ళ దూరం నుండి ఒక్కసారిగా విసిరేసినట్టుగా ఈలోకం లోకి వచ్చిపడ్డాడు. సదర్ బజార్లో వున్నాడు తను. రామ చౌదరీ పెద్దకొడుకు దౌలత్ అక్కడున్న కొట్లో కూచొని చూస్తున్నాడు. పిలిచింది వాడే. రోడ్డు దాటి కొట్టువైపు వెళ్ళాడు. రామ చౌదరీ అతనితో పాటు పెరిగి పెద్దయినవాడు, అంతేకాదు, పాకిస్తాన్ నుంచి వచ్చేసేటపుడు కూడా ఒకేరోజు ఒకే లారీలో కలిసే వచ్చారు. పాకిస్తాన్ నుంచి హిందూస్తాన్‌కు వచ్చి పదిహేనేళ్ళ తరువాత ఒకరోజు ఇదే కొట్లో పాన్ అమ్ముతూ కనిపించాడు. ఎంత బాధ కలిగిందో! అక్కడి రామ్ చౌదరీ ఎక్కడ! పాన్ అమ్మే ఇక్కడి రామ్ చౌదరీ ఎక్కడ! హ్మ్, రెండేళ్ళ ముందు రామ్ చౌదరీ పోయిన రోజు… ఎంత ఏడ్చాడో తను. మహరాజు లాంటివాడు!

“దౌలతూ, ఎట్లున్నావురా?”

“ఏదో బాబాయ్! ఏదో జరిగిపోతున్నది. నీవూ… ఒక్కడివే అయిపోతివి కదా బాబాయ్!”

“ఒక్కడినే ఉండలేకే ఇటొచ్చినా రా!”

“రా, కూర్చో బాబాయ్! ఇదో, సిగరెట్ తాగు,” అంటూ దౌలత్ సిగరెట్ అందించాడు.

ఒక్కక్షణం ఆలోచించి, సిగరెట్ అందుకున్నాడు. కొట్టు ముందు వేలాడేసిన నిప్పుతాడు దగ్గరికి వెళ్ళాడు. చేతికఱ్ఱ జాగ్రత్తగా పట్టుకుంటూ సిగరెట్ పెదాల మధ్య ఉంచుకొని కాసేపు ఆలోచించాడు. తాగనా వద్దా? ముప్ఫయ్యేళ్ళ క్రిందట విడిచిపెట్టిన ఈ పాడలవాటు మళ్ళీ చేసుకోడమా? తాగేదా, వద్దా? సరే, తాగుదాం. ఏమో, దీంతో కొంచెమన్నా మనశ్శాంతి దొరుకుతుందేమో. లక్ష్మి ఈ వయస్సులో ఒంటరివాడిని చేసి ఎంత మోసం చేసింది? ఒక్కడూ ఎక్కడికని వెళ్ళగలడిప్పుడు? గుండె బరువెక్కింది. అంటించుకుని మెల్లగా సిగరెట్ తాగసాగాడు. సిగరెట్ తాగడం తొందరగా మొదలు పెట్టకపోతే వెక్కివెక్కి ఏడవడం మొదలు పెడతానేమో అనిపించింది.

దౌలత్ కొట్టుకొచ్చిన వాళ్ళకు పాన్‌లు కడుతున్నాడు. చేతి కఱ్ఱ సాయంతో పక్కగా నిలబడి సిగరెట్ రెండు మూడు దమ్ములు పీల్చాడు. ప్రతీసారీ దగ్గు వచ్చింది. అయినా ఆపలెదు.

దౌలత్ కూచున్న చోటుకు పక్కగా వున్న అద్దం మీదకు చూపు మళ్ళింది. తనను తాను అద్దంలో చూసుకొని నమ్మలేకపోయాడు. ఇంత ముసలివాడయ్యాడా తాను? ఈ ముసలితనం గురించి అంత పెద్దగా ఎప్పుడూ ఆలోచించలేదు. దృష్టి తగ్గింది కానీ, కీళ్ళనొప్పులూ ఎప్పుడూ ఉంటుంటాయి కానీ, జుట్టు, గడ్డం, మీసాలు, కనుబొమ్మలు తెల్లబడినాయి కానీ! వయస్సూ… 1899… ఇప్పుడు 1975. డెబ్భైయారేళ్ళు అవుతున్నది; అయితే ఎప్పుడూ అనిపించనే లేదు ముసలివాడు ఐనానని. ఇప్పుడు… ఈరోజు, ఈ అద్దంలో చూస్తే అనిపిస్తున్నది ప్రపంచంలో అందరికంటే ముసలివాడు, బలహీనుడు తానేనని.

అద్దం వైపు నుంచి చూపులు మళ్ళించుకున్నాడు. “పోయొస్తా బేటా,” దౌలత్‌తో చెప్పి బయల్దేరాడు. అసలు విషయమేమంటే అద్దంలో తన రూపాన్ని చూసి భరించలేకపోయాడు. చిన్నప్పుడు తనను పక్కలో పడుకోబెట్టుకొని కథలడిగినప్పుడు చెప్పే అవ్వ గుర్తొచ్చింది. ‘అనగా అనగా ఒక అడవి ఉండేది. కారడవి, చిమ్మచీకటి. ఆ అడవిలో ఒక ముసలివాడుండేవాడు. ప్రపంచంలోనే అందరికన్నా పెద్దవాడు. వెయ్యేళ్ళతనికి. జుట్టు, గడ్డం, మీసాలు, కనుబొమ్మలు అన్నీ తెల్లబడి పోయినాయి. అతడు తన జీవితంలో ఇంకొక మనిషిని చూడనేలేదు. ఒకరోజేమయింది తెలుసా! వాడు నిద్దరోయేటపుడు…’

దౌలత్ తనమాటకు జవాబిచ్చాడో లేదో ఏమన్నాడో వినలేదు. లేదా చెవుల్లో పడినా తలకెక్కలేదేమో. చేతికఱ్ఱను టకటకలాడిస్తూ నెమ్మదిగా నడచి బాటమీదకొచ్చాడు. సిగరెట్ దమ్ము మధ్యమధ్యలో లాగుతూనే ఉన్నాడు. ఏదో తెలియని ఊరట ఇస్తున్నట్టుందది.

చౌరస్తా దగ్గరకొచ్చి ఎడమవైపు తిరిగాడు. అక్కడో పాన్ దుకాణం ఉంది. మిగిలిన సిగరెట్ ముక్క పక్క పడేసి, కొట్టుకెదురుగా నిలబడ్డాడు. కొట్లో కూర్చొని ఉన్న పిల్లాడిని చూసి సిగరెట్ పెట్టె ఎంత అని అడిగాడు. మొదటంతా ఇక్కడే సిగరెట్ తాగేవాడు.

“రూపాయిన్నర తాతా!”

“ఒక పెట్టె ఇటివ్వు, అలాగే అగ్గిపెట్టీ.”

ఆ పిల్లాడు సిగరెట్ పెట్టె, అగ్గిపెట్టె ఇయ్యగానే వాడి చేతిలో రెండు రూపాయలు పెట్టి సిగరెట్ ముట్టించాడు. ముట్టించుకున్నాక అవి జేబులో వేసుకున్నాడు. కొట్టబ్బాయి ఇచ్చిన చిల్లర కూడా అదే జేబులో వేసుకొన్నాడు. కఱ్ఱ తాటించుకుంటూ మెల్లగా మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు.

(మూలం: మోంగా కథల సంకలనం ఉస్ కీ పహచాన్ నుంచి అకేలే మే అనే కథ.)