ఈమాట మే 2015 సంచికకు స్వాగతం!


వేదిక్ వాయిసెస్: ఇంటిమేట్ నరేటివ్స్ ఆఫ్ ఎ లివింగ్
ఆంధ్రా ట్రడిషన్ – డేవిడ్ నైప్.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2015.

కోనసీమని తలచుకుంటే ఇప్పటికీ కొబ్బరి తోటలు, కాలువలు, పచ్చని పొలాలు, ఇవే గుర్తొస్తాయి. ఇప్పటి నాగరికత ఈ కోనను తాకటానికి చాలా కాలం పట్టింది. ఈ సీమ నుంచి బయటపడి ఇంగ్లీషు చదువులు చదువుకుని పైకొచ్చిన వాళ్లు ఎందరో ఉన్నా కానీ, వేదపారాయణం చేసుకుంటూ నిత్యాగ్నిహోత్రం నడుపుకుంటూ పాత కాలపు పద్ధతుల్లోనే బ్రతుకుతూ వున్న అతి కొద్దిమంది బ్రాహ్మణులు ఈ ప్రాంతంలో వున్నారు. భమిడిపాటి వారు, బులుసు వారు, దువ్వూరి వారు, పుల్లెల వారు, తదితరులు. మూడువేల ఏడువందల సంవత్సరాల వేదపఠన పాఠనాన్ని దానితో పాటు వైదిక యజ్ఞాల్ని కూడా పరమ శాస్త్రోక్తంగా నిర్వహించుకుంటూ ఈ కుటుంబాల వాళ్లు ఆ సంప్రదాయాన్ని నిలబెట్టారు. ఇది మానవ జాతి చరిత్రలోనే అపూర్వమైన విషయం. ఈ కుటుంబాల గురించి, వారి యజ్ఞ క్రతువుల్ని గురించి క్షుణ్ణంగా పరిశీలించి సూక్ష్మమైన వివరాలతో సహా, విస్కాన్సిన్ విశ్వవిద్యాలయపు ఆచార్యుడు డేవిడ్ నైప్ (David M. Knipe) Vedic voices – Intimate narratives of a living Andhra tradition (2015) అనే ఒక పుస్తకం రాశాడు. కేరళ నంబూద్రి బ్రాహ్మణుల అతిరాత్ర అగ్నిచయన క్రతువుని ఫ్రిట్స్ స్టాల్ (Frits Staal)వివరంగా రెండు పుస్తకాలు, ఒక చలనచిత్రంగా భద్రపరిచాడు. ఇప్పటికీ వైదిక సంప్రదాయాన్ని గురించి పాఠాలు చెప్పే తరగతుల్లో వీటిని వాడుతూ వుంటారు. కానీ, కోనసీమలో మారుమూల వైదిక బ్రాహ్మణులు చేసే యజ్ఞాలకి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గుర్తింపు ఇప్పటిదాకా లేదు. నైప్ రాసిన పుస్తకం వల్ల ఆ సంప్రదాయాలు చాలా ప్రాచీనమైనవని ఇన్ని వేల ఏళ్లుగా మార్పు చెందనివని వివరంగా బోధ పడుతుంది. వేద సంప్రదాయాన్ని గురించి జ్ఞాపకాలు, పుస్తకాలు, పాఠాల ఆధారంగా రాసిన పుస్తకాలు చాలా వున్నాయి కానీ ఇప్పటి కాలంలో జీవించి వున్న వైదిక కుటుంబాల నిత్య జీవితాన్ని పరిశీలనగా గ్రహించి వివరంగా రాసిన పుస్తకం ఇదొక్కటే.


డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి (1944 – 2015): నరసింహ మూర్తిగారు చక్కటి సాహిత్య విమర్శకుడు, గొప్ప వక్త కూడా. ఇతర భారతీయ భాషల ఆధునిక నాటకాలతో పోల్చి, మూర్తిగారు రాసిన కన్యాశుల్కం – తులనాత్మక పరిశీలన అన్న బృహద్గ్రంథం వారికెంతో పేరు తెచ్చింది. ఔచిత్యప్రస్థానం, కథాశిల్పి చాసో, జయంత్ మహాపాత్రో ఒరియా కవితలకు అనువాదం, కవిత్వదర్శనం మొదలైన పుస్తకాలు ప్రచురించారు. ప్రతిష్ఠాత్మకమైన రబీంద్రనాథ్ టాగోర్ నేషనల్ ఫెలోషిప్ అందుకున్న ఏకైక తెలుగువాడు. ఇటీవలే పరమపదించిన ఈ సాహితీవేత్తకు ఈమాట శ్రద్ధాంజలులు.


ఈ సంచికలో:

  • అతిథి సంపాదకీయం: తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… – వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్.
  • కథలు: చేతన చేసిన పని – తాడికొండ శివకుమార శర్మ; సూరిగాడి కొలువు – అపర్ణ తోట; యద్భావం తద్భవతి – ఆర్. శర్మ దంతూరి; శేషు మామయ్య – ఆర్. దమయంతి; ప్రతీక – లైలా యెర్నేని; నాయుడు-రాయుడు – వేమూరి వేంకటేశ్వర రావు.
  • కవితలు: సంభాషణ – విన్నకోట రవిశంకర్; ఉదయం – సాంఘిక; వాన కడిగిన మధ్యాహ్నం… – రేణుక అయోల; పర్వతుడా! నీ పాదాలకు నమస్కారం – గరిమెళ్ళ నారాయణ; కాన్వాసుపై దృశ్యం – దాసరాజు రామారావు; వాన-గులాబీ-పాము – పాలపర్తి ఇంద్రాణి.
  • వ్యాసాలు, సమీక్షలు: కవికుల గురువు – కొంపెల్ల భాస్కర్; అష్టమాత్రావృత్తములు – జెజ్జాల కృష్ణ మోహన రావు; గ్రంథ పరిచయం: శ్రీవిజయుని కవిరాజమార్గం – రాళ్ళపల్లి సుందరం; పుస్తక పరిచయం: సరమాగో నవల ది ఎలిఫెంట్’స్ జర్నీ – వేలూరి వేంకటేశ్వర రావు.
  • పద్యసాహిత్యం: నాకు నచ్చిన పద్యం: అమరపతి చేత ఆవరసం త్రాగించిన కవిదిగ్గజం – భైరవభట్ల కామేశ్వరరావు; పాఠశాలకై పర్మిటు – తిరుమల కృష్ణదేశికాచార్యులు.
  • శబ్దతరంగాలు: తిల్లాన – కనకప్రసాద్; బాలవ్యాకరణావతారం – పరుచూరి శ్రీనివాస్ సమర్పణ.