అష్టమాత్రావృత్తములు

పరిచయము

పాటలలో, పద్యములలో చతుర్మాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రాకృతములోని గాథా, పజ్ఝటికా, సంస్కృతములోని ఆర్యా, కన్నడ తెలుగు భాషలలోని కందము, కొన్ని రగడలు, షట్పదులు చతుర్మాత్రా భరితమయినవి. ఉపగణములైన ఇంద్రగణములలో న-ల, భ-గణములు చతుర్మాత్రలు. చతుర్మాత్రలు ఐదు, అవి – IIII, IIU, UII, UU, IUI. ఇందులో చివరిదైన జ-గణము లగారంభమై ఎదురు నడకను కలిగియున్నది. సంస్కృత ఛందస్సులో ఉండే చతుష్చతుర్మాత్రా వృత్తములను గుఱించిన కొన్ని విశేషాలను క్రింద తెలుపుచున్నాను.

 1. 5 చతుర్మాత్రలతో మొత్తము వృత్తములు – 625.
 2. 5 చతుర్మాత్రలతో గుర్వంతమగు వృత్తములు – 250.
 3. 4 చతుర్మాత్రలతో ఎదురు నడక లేని వృత్తములు – 256.
 4. 4 చతుర్మాత్రలతో ఎదురు నడక లేక గుర్వంతమయిన వృత్తములు – 128.
 5. ఛందశ్శాస్త్రములో ఎదురు నడక లేక పేర్కొనబడినవి – 68 (ఇది నా గణన, ఇంక కొన్ని ఉండవచ్చును.)
  *అందులో లఘ్వంతములు – 9
 6. ఛందశ్శాస్త్రములో ఎదురు నడకగల జ-గణముతో పేర్కొనబడినవి – 15 (ఇది నా గణన, ఇంక కొన్ని ఉండవచ్చును)
  *అందులో లఘ్వంతములు – 1

(*నేను సృష్టించిన వృత్తములను ఇందులో కలుపలేదు.)

చాల ప్రసిద్ధమైన చతుష్చతుర్మాత్రా వృత్తములు విద్యున్మాలా, రుగ్మవతీ, మత్తా, దోధక, మోటనక, భ్రమరవిలసితా, తామరస, తోటక, మోదక, ప్రహరణకలితా, శశికలా, జలోద్ధతగతి, మౌక్తికదామ వృత్తములు. ప్రతి పాదమును రెండుగా విఱిచి మాత్రాగణములకు తగినట్లు పదములను వాడి, యతిని కూడ మూడవ మాత్రాగణముతో ఉంచినప్పుడు ఈ వృత్తములు గానయోగ్యములుగా ఉంటాయి.

ఒక అష్టమాత్రగా రెండు చతుర్మాత్రలు – చతుర్మాత్రలతో నిండిన కొన్ని పాటలలో, కొన్ని ఛందస్సులలో ఒక్కొక్కప్పుడు రెండు చతుర్మాత్రలకు బదులు మధ్య గురువుతో ఒక అష్ట మాత్రను కూడ వాడుతారు. చతుర్మాత్రలతో ఉండే కొన్ని జయదేవుని అష్టపదులలో అక్కడక్కడ అష్టమాత్రలను చూడవచ్చును, ఉదా.

మదన మహీపతి “కనకదండరుచి” కేసర కుసుమ వికాసే
మిళిత శిలీముఖ పాటల పటల కృతస్మర తూణ విలాసే – (అష్టపది 3.4)

గోప కదంబ నితంబవతీ ముఖ చుంబన లంభిత లోభం
“బంధుజీవ మధు”రాధర పల్లవ కలిత దరస్మిత శోభం – (అష్టపది 5.3)

ఇలాటి ఉదాహరణములు పాదమునకు నాలుగు చతుర్మాత్రలు గల మధురగతి రగడలో, పాదమునకు ఎనిమిది మాత్రలు గల హరిగతి రగడలో కూడ వెదికినప్పుడు ప్రత్యక్షమవుతాయి. క్రింద దీనికి ఉదాహరణములు –

శేషము వేంకటకవి శశాంకవిజయము, మధురగతి రగడ, 2-118:

“ఇంతి యెక్కడివె” – యీ కోరకములు
చెంతను నుండి-చ్చెద కోరకములు

తిమ్మావజ్ఝల కోదండరామయ్య అన్నమయ్య ఉదాహరణములో, హరిగతి రగడలోని చతుర్థీ విభక్తి కళిక:

పాయని యనురా”గమున రాగమున” – బాడెడు గాయక కవి గురువునకై
పెదతిరుమలకవి పేర గవిని గని – “పేర్మి జెందు బం”గారు కడుపుకై
సదమల కృతిచి”త్రముల నాదకవి” – “జరపినట్టి రం”గారు నిడుపుకై
కుల మెల్లను గవులును గాయకులను – “గొప్ప జెప్పికొన” నొప్పిన గురుకై

కంద పద్యములలోసరి పాదములలోని రెండవ, మూడవ (నల/జ గణము) చతుర్మాత్రలను లయకొఱకు ఐదు, మూడు మాత్రలుగా విఱుచుట సర్వసామాన్యము. ఉదా.

మగువా! నీ కొమరుఁడు మా
మగవా “రటు పోవఁ జూచి” – మంతనమునకుం
దగఁ జీరి పొందు నడిగెను
జగముల “మున్నిట్టి శిశువు” – చదువంబడెనే? – (పోతన భాగవతము, దశమ-పూర్వ-321)

ఎనిమిది మాత్రలతో వృత్తములు

ఈ వ్యాసములో నేను చర్చించబోయే విషయము, పాదమునకు 16 మాత్రలు కలిగి ఉండి, అందులో రెండు అర్ధ భాగములలో ఏ ఒక్కటిలోనైనను, లేక, రెండింటిలో కూడ రెండు నాలుగు మాత్రలు కాని ఎనిమిది చతుర్మాత్రలు ఉండే వృత్తములను గుఱించి. అనగా ఈ వృత్తములలోని పాదముల అమరిక క్రింది విధములుగా నుంటుంది –

 1. స్వాగత వర్గము – 8 / (4-4 )
 2. మాలతీ వర్గము – (4-4) / 8
 3. రథోద్ధత వర్గము – 8 / 8

ఈ వర్గములలో ప్రసిద్ధమయిన వృత్తముల పేరులను వర్గమునకు ఉంచినాను. వివిధ మాత్రా గణముల సంఖ్యను విరహాంక-హేమచంద్ర సంఖ్యలు (Fibonacci numbers) తెలుపుతాయి. దీని ప్రకారము 1 నుండి 8 వఱకు మాత్రల సంఖ్యలున్న మాత్రాగణములు 1, 2, 3, 5, 8, 13, 21, 34. అనగా 8 మాత్రలతో 34 మాత్రాగణములు గలవు. వీటిలో నాలుగు మాత్రాగణములను పక్క పక్కన ఉంచితే మనము 5×5=25 (నాలుగు మాత్ర గణముల సంఖ్య 5) పొందవచ్చును (ఉదా. IUIIUI, UIIIIU, ఇత్యాదులు). మిగిలిన తొమ్మిది అష్టమాత్రా గణములు వేఱు విధముగా వచ్చును. ఆ తొమ్మిది అష్ట మాత్రా గణములు – UIUIU, UIUUI, UIUIII, IIIUIU, IIIUUI, IIIUIII, IUUIU, IUUUI, IUUIII. ఇందులో మొదటి ఆఱు అష్ట మాత్రా గణములకు ఎదురు నడక (అనగా లగారంభము) లేదు, అందులో రెండు మాత్రమే గుర్వంతములు. ఈ ఆఱు అష్టమాత్రలతో ఏ విధముగా పాదమునకు 16 మాత్రలు గల వృత్తములను కల్పించ వచ్చునో అనే విషయమును ఇప్పుడు గమనిద్దాము.

అష్ట మాత్రాగణములు – UIUIU, IIIUIU, UIUUI, UIUIII, IIIUUI, IIIUII
చతుర్మాత్రా గణములు – UU, IIU, UII, IIU

[సూచన: పూ – పూర్వ భాగము, ఉ – గుర్వంతముగా ఉత్తర భాగము, * – నేను కల్పించిన వృత్తము]


1. స్వాగత వర్గము

మొదటి చిత్రము – స్వాగత వర్గము – పూ 8, ఉ 4/4 – మొత్తము 48 వృత్తములు (6x4x2)

వ్యాసములోని వృత్తములు – నిర్మేధా, శ్రేయ*, మాధురి*, పల్లవి*, కనకవల్లీ*, స్వాగతము, జాబిలి*, ద్రుతపదము, చంద్రవర్త్మ.


2. మాలతీ వర్గము

రెండవ చిత్రము – మాలతీ వర్గము – పూ 4/4, ఉ 8 – మొత్తము 32 వృత్తములు (4x4x2)

వ్యాసములోని వృత్తములు – దీపకమాలా, విరాట్, సీధు, ఉత్పలరేఖా$, నీలా, మాళవికా, మాలతీ, విరలా, అవిరలరతికా, శ్రావణ*, ఉపలేఖా, విరతప్రభా, వికలవకులవల్లీ, కమలదళము*.


3. రథోద్ధత వర్గము

మూడవ చిత్రము – రథోద్ధత వర్గము – పూ 8, ఉ 8 – మొత్తము 12 వృత్తములు (6×2)

వ్యాసములోని వృత్తములు – కర్ణపాలిక, మాధవ*, కనకమంజరి, సుకర*, రథోద్ధత, ఉపదారిక, వాక్ఝరీ*, ప్రియంవద, సురస*, అశోక*, ముకుళితకళికావళి, కుసుమకోమల*.

[($) – ఇక్కడ ఉత్పలరేఖను గుఱించి ఒక రెండు మాటలు చెప్పాలి. ఫేస్‌బుక్‌లో ఛందస్సు అనే ఒక కూటమి ఉన్నది. అందులో శ్రీ ధనికొండ రవిప్రసాద్‌గారు చంపకోత్పలమాలలో యతి స్థానమునుండి పాదాంతమువఱకు గల అక్షరములతో, అనగా UII UII UIUIU అమరికతో ఉత్పలరేఖ అను వృత్తమును కల్పించినారు. ఆ కల్పన నన్ను ఆకర్షించి ఈ పరిశోధనలకు దారి తీసినది. ఈ వర్గములకు చెందిన వృత్తములను తెలుగు కవులు అరుదుగా వాడినారు. నాకు తెలిసిన కొన్ని ఉదాహరణములను అక్కడక్కడ తెలిపినాను.]

స్వాగత వృత్తము

స్వాగత వృత్తము చాల పురాతనమైనది. ఇది దోధక వృత్తములో [దోధకము – 11 త్రిష్టుప్పు 439 భ/భ/భ/గగ UII UII – UII UU] మూడవ, నాలుగవ అక్షరములను తారుమారు చేయగా స్వాగత వృత్తము జనించినదని అమూల్యధన్ ముఖర్జీ (1) అభిప్రాయ పడెను. కాలిదాసాది కవులు ఈ వృత్తమును వాడిరి. రఘువంశమునుండి ఒక ఉదాహరణము –

కుంభపూరణభవః పటురుచ్చై
రుచ్చచార నినదోఽంభాసి తస్యాః
తత్ర స ద్విరదబృంహితశంకీ
శబ్దపాతినమిషుం విససర్జ – (కాలిదాసుని రఘువంశము, 9.73)

(తమసానదీజలముల నుండి కుండను నింపునప్పుడగు శబ్దమువలె ఒక గంభీర నాదము జనించినది. బహుశా అది ఏనుగులవలన జనించినదనుకొని ఆ దిక్కుగా దశరథుడు బాణమును ఎక్కుబెట్టాడు.)

ఇదే స్వాగతపు వృత్తములో నా అనువాదము –

నింపగా ఘటము – నీళ్లను లోతౌ
గంపనంపు సడి – గల్గును, మత్తే-
భంపు నాదమను – భావనతోఁ దా
బంపె నా దెసకు – బాణము నొండున్

స్వాగత వృత్తము ఏ విధముగా నుండినప్పుడు పద్యము శోభాయమానముగా నుంటుందో అన్న విషయమును క్షేమేంద్రుడు ఈ విధముగా తెలియజేసెను –

సాకారాద్యైర్విసర్గాంతైః
సర్వపాదైః సవిభ్రమా
స్వాగతా స్వాగతా భాతి
కవికర్మ విలాసినీ – (క్షేమేంద్రుని సువృత్త తిలకము, 2-15)

(స్వాగతా వృత్తమునకు ఆదిలో ఆ-కారము, అంతములో విసర్గము అన్ని పాదములలో ఉండినచో, అది మంచి నడక కలదై కవితావిలాసినిగా నుండును.)

తెలుగులో ఆదికవులయిన నన్నయభట్టు, నన్నెచోడుడు స్వాగత వృత్తమును ఉపయోగించారు. ఆ పద్యములు –

వేగవంతుఁ డను – వీరుఁడు సాంబున్
వేగవంతుఁడయి – వీఁకను దాఁకెన్
వేగ బాణపద-వీతతులన్ ది-
గ్భాగముల్ విశిఖ – పంజరములుగాన్ – (నన్నయభట్టు ఆంధ్రమహాభారతము – అరణ్యపర్వము 1.158)

ఆ గిరీంద్రసుత – హర్షముతో శై
వాగమోదిత వి-ధాయతితో సు
స్వాగతాభిమత – వాక్యములం ద
భ్యాగతోచిత స-పర్యలఁ దన్సెన్ – (నన్నెచోడుని కుమారసంభవము – 7.5)