నాకు నచ్చిన పద్యం: అమరపతి చేత ఆవరసం త్రాగించిన కవిదిగ్గజం

మ. కలలో వార్తలు విప్పిచెప్పెడు క్రియన్ గాథాపురాణార్థముల్
      దెలుపన్నేర్తురుగాని, నేరరుసుమీ! తీవ్రవ్రతాచారశ
      ష్కులులై యుండెడు ముండధారులును ముక్తుల్ డాయగా, జింతకా
      యలకజ్జాయముతోయ మింత చదరంబా! తత్పరిష్వంగముల్

ఈ పద్యంలో ఉన్న మాటల సూటిదనం, విచిత్రమైన అధిక్షేపం, ప్రాచీనకావ్యాలలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ కవిగారి కావ్యంలో మాత్రం పుస్కలంగా దర్శనమిస్తాయి. అదే యీతని విలక్షణత. కథాకల్పనలో, సంభాషణలలో, వర్ణనలలో, పదగుంఫనలో, అంతటా ఆ వైచిత్రి పరచుకొని ఉంటుంది. ఈ పద్యమున్న కథ కూడా విచిత్రమైనదే!

ప్రయుతుడు అనే మునికి అయుతుడు, నియుతుడు అనే ఇద్దరు కుమారులు. వాళ్ళిద్దరూ అగస్త్యమహర్షి శిష్యులు. చదువంటే చాలా శ్రద్ధ. అంచేత గురువుగారికి వీళ్ళంటే ప్రత్యేక అభిమానం. అందుకే వాళ్ళ చదువులు పూర్తయ్యాక స్వయంగా తానే వాళ్ళనో యింటివాళ్ళను చేయాలనుకుంటాడు అగస్త్యుడు. భూలోకంలో యువతులు వీళ్ళకు తగరని భావించి ఏకంగా బ్రహ్మ దగ్గరకి వెళ్ళి బ్రహ్మమానసపుత్రికలైన గాయత్రి, సావిత్రి అనే యిద్దరు కన్యలను తీసుకువచ్చి, శిష్యులను వివాహమాడమని చెపుతాడు. అయుతుడు నాకు పెళ్ళీగిళ్ళీ వద్దు మహాప్రభో అని గురువుగారి మాట కాదంటాడు. నియుతుడు మాత్రం ఒప్పుకొంటాడు. దానితో అగస్త్యుడు కోపంతో అయుతుడిని వెళ్ళగొట్టి, ఆ కన్యలిద్దరినీ నియుతునికే యిచ్చి పెళ్ళిచేస్తాడు.

అయుతుడు హిమాలయాలకు వెళ్ళి ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపశ్శక్తికి ప్రపంచం అల్లకల్లోలమవుతుంది. దేవేంద్రుడు దిగివస్తాడు. ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఎలాగయినా అయుతుడిని సంసారసాగరంలోకి దింపే ప్రయత్నం చేస్తాడు, మాటలద్వారా. అయుతుడు లొంగడు. ఇంద్రుడిక లాభం లేదని వెళ్ళిపోతాడు. పోతూపోతూ శుష్కించిపోయిన రూపంలో ఉన్న కామధేనువును వదిలిపెట్టి వెళతాడు. ఆ ఆవుని చూసుకొనే బాధ్యత అయుతునిపై పడుతుంది. దాని పోషణలో ఆ ఆవుపై మమకారాన్ని పెంచుకొని తపస్సుకు దూరమవుతాడు అయుతుడు. కొన్నాళ్ళు గడిచాక అతనికి తెలివి వస్తుంది. ఛీ యీ లంపటంలో యిరుక్కున్నానేమిటని చెప్పి, ఆ ఆవుని అడవిలోకి తరుముతాడు. ఆ ఆవు వాధూలుడనే ముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆ ముని తపస్సు చేస్తూ ఉంటే అతని చుట్టూ ఏర్పడిన పుట్టని కాస్తా మట్టేసి పోతుంది. దానితో ఆ వాధూలముని తపస్సు భగ్నమై, ఆ ఆవును తరుముకు వస్తున్న అయుతుణ్ణి చూసి, తన తపస్సుని భంగం చేసాడన్న కోపంతో కప్పవైపొమ్మని శపిస్తాడు. అయుతుడు అతని కాళ్ళపై పడి జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు వాధూలమునికి అతనిపై కరుణ కలిగి, భీమరథి నది ఒడ్డునున్న నరసింహస్వామిని పూజించు. మరో కప్పతో నీకు పెళ్ళై సంతానం కలిగాక అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుంది అని చెప్తాడు. అయుతుడు సరేనని భీమరథి నది వొడ్డునున్న పాండురంగని క్షేత్రమైన పండరీపురాన్ని చేరుకొని, అక్కడకి దగ్గరలో ఉన్న నరసింహస్వామిని సేవిస్తూ ఉంటాడు. కప్ప రూపంలో చాలా ఏళ్ళు విష్ణు సాన్నిధ్యంలో గడిపిన తర్వాత కన్యాకుబ్జ రాకుమార్తె తన చెలికత్తెలతో ఆ పుండరీక క్షేత్రానికి వచ్చి విహరిస్తూ అక్కడున్న ఈ కప్పని చూస్తుంది. వింత కాంతులతో ఉన్న ఆ కప్పని చూసి రాకుమార్తె దానితో సరదాగా ఆడుకోవాలని దాన్ని పట్టుకుంటుంది. తన చేతిలో కొంచెం సేపు ఆడిస్తూ, అల్లరి చేస్తూ, ఆ కప్పని తీసుకువెళ్ళి ఒక వృద్ధ బ్రాహ్మణుడి మీదకి విసురుతుంది. దానితో ఆ బ్రాహ్మణుడు కోపించి ఆ రాకుమార్తెని, చెలికత్తెలనీ కూడా కప్పలుగా మారిపొమ్మని శపిస్తాడు. వెంటనే అవి కప్పలుగా మారిపోతాయి. ఒక్క భార్య కూడా వద్దన్న అయుతుడికి యీ కప్ప రూపంలో ఆ ఆడకప్పలన్నీ భార్యలైపోతాయి! నీళ్ళల్లో ఈదడంతో పాటు సంసారంలో కూడా ఈదాల్సి వస్తుంది! ఆఖరికి అయుతునికి కప్ప సంతానం కలిగాక శాపవిమోచనమై, అంతకాలం విష్ణు సేవలో గడిపినందుకు ఫలంగా వైకుంఠాన్ని చేరుకుంటాడు.

ఇదీ కథ! ఇది తెనాలిరామకృష్ణుడు రచించిన పాండురంగమాహాత్మ్యం అనే కావ్యంలో వచ్చే చివరి కథ. రామకృష్ణుని వైచిత్రి పాత్రలకు పెట్టిన పేర్లతోనే మొదలవుతుంది. అయుత, నియుత, ప్రయుత అనే పదాలకు సంస్కృతంలో సంఖ్యావాచకాలుగా ప్రసిద్ధి. వ్యుత్పత్తిలోకి వెళితే, ‘యుత’ అంటే బంధమనే అర్థం వస్తుంది. అయుత అంటే బంధం లేనివాడు, నియుత అంటే బంధమున్నవాడు అని అర్థం చెప్పుకోవచ్చు. ఆలా అవి ఆ పాత్రల స్వభావాలకి తగిన పేర్లే! కాని ఎంత బంధ విముక్తుడవుదామనుకున్నాడో అంతకి అంతా బంధాల్లో చిక్కుకున్నాడు అయుతుడు, అదీ విచిత్రం! రామకృష్ణుని విలక్షణత యీ కథలో అడుగడుగునా కనిపిస్తుంది. విద్యాభ్యాసంపై అయుతనియుతుల శ్రద్ధ గూర్చి వర్ణిస్తూ, అలుపూసలుపూ ఆకలిదప్పులూ అనేవి లేకుండా పగలూ రాత్రీ చదువుతారని చెపుతూ చివరలో, ఆసీనప్రచలాయితంబయిన లేదు ఆహా! అంటాడు. అంటే ‘ఓహో! అంతసేపు కూర్చొని చదువుతున్నా చిన్న కునుకుపాటైనా లేదు,’ అని అర్థం. ఇదీ రామకృష్ణుని చూపులోని విలక్షణత! అలాగే, అయుతుని తపోగ్ని సెగ స్వర్గంలో ఇంద్రునికి కూడా తగులుతుంది. అప్పుడు ఇంద్రుని పరిస్థితి, ‘నిప్పు త్రొక్కినట్టుగా, తలపై తేలుకుట్టినట్టుగా,’ ఉన్నదంటాడు. ఈ పోలికలు కొంత విలక్షణమైనవే అయినా, యితర కవులు కూడా అలాంటివి చేసే అవకాశం ఉంది. కాని తర్వాత పోలిక చూడండి, ‘ఉవ్వెత్తుగా ఆవరసం త్రాగినట్లుగా’ అయిందట ఇంద్రునికి! ఇంద్రుని చేత ఆవరసం త్రాగించగలిగిన ఘనుడు తెనాలి రామకృష్ణకవి ఒక్కడే!

ఇప్పుడీ పద్యం విషయానికి వస్తే, ఆవరసం త్రాగినంత ఠారెత్తిన దేవేంద్రుడు, ముసలి బ్రాహ్మణ వేషంలో అయుతుని దగ్గరకి వచ్చి, అతన్ని ముక్తిమార్గం విడనాడి సంసారయాత్ర సాగించమని ఉద్బోధించే సందర్భం లోని పద్యమిది. మోక్షసాధన అంత సులువు కాదని చెపుతూ ఆ మార్గంలో ప్రయాణిస్తున్నామని చెప్పుకొనే సన్యాసులకు కూడా ముక్తి గురించి నిజంగా తెలియదని అంటున్నాడు ఇంద్రుడు. ఆ అనడంలో ఉన్న అధిక్షేపం ఎంత పదనుగా ఉందో గమనిస్తే, ఆ కాలంలో యిలాంటి పద్యం వ్రాసిన రామకృష్ణుని స్వతంత్ర వ్యక్తిత్వానికి ఆశ్చర్యపోకుండా ఉండలేం! సన్యాసులని ముండధారులు అన్నాడు. అంటే బోడితలలవాళ్ళు అని అర్థం. వాళ్ళు తీవ్రవ్రతాచారశష్కులట. శష్కులము అంటే చక్కిలం. తీవ్రమైన వ్రతాచారాలవల్ల వాళ్ళ శరీరం కృశించి చక్కిలంలా అయిపోయిందని అర్థంచేసుకోవాలి. ఇది తెనాలి రామకృష్ణుని విలక్షణ పదగుంఫనం! పురాణాల గురించి వాళ్ళు చేసే వ్యాఖ్యానాలూ ప్రవచనాలూ ప్రసంగాలూ, ‘కలలో వార్తలు విప్పిచెప్పడం’ వంటిదట. ఇది మరొక ఆశ్చర్యమైన పోలిక. దీని గురించి విప్పిచెప్పడం కూడా కలలో వార్తలు విప్పిచెప్పడం లాంటిదే అవుతుంది. అంచేత అందులోని స్వారస్యం పాఠకులే గ్రహింతురు గాక! అలా పురాణార్థాలను వివరించే సన్యాసులకు సైతం నిజంగా మోక్షం అంటే ఏమిటో తెలియదబ్బాయ్ అన్నాడు. మోక్షాన్ని కౌగిలించుకోవడం అనేది చింతకాయ కజ్జాయం వంటిదట. ఈ ‘చింతకాయ కజ్జాయం’ అనే మాట బహుశా ఆ కాలంలో ఒక జాతీయం. ఈ కాలంలో కూడా అది ఎక్కడైనా వాడుకలో ఉన్నదేమో నాకు తెలీదు. ఇది రాయలసీమ ప్రాంతానికి చెందిన జాతీయం అయి ఉండవచ్చు. అన్నమయ్య కీర్తనలలో కూడా రెండు మూడు చోట్ల యిది కనిపిస్తోంది –

– “చింతకాయ కజ్జాయము చెలువునితో పొందు”
– “చింతకాయ కజ్జాయము చేరి యిసుమంత వుంటే, అంతటనే నోరూరు నందరికిని”
– “కడు మోవితీపు చింతకాయ కజ్జము”

పైకి రుచిగా అనిపించినా నిజంగా రుచికరం కానిదీ, మింగుడుపడనిదీ, అనే అర్థం స్ఫురిస్తోంది. మొత్తానికి రామకృష్ణకవి పుణ్యమా అని ఇంద్రుడు ఆవరసాన్నీ, చింతకాయ కజ్జాయాన్నీ కూడా రుచి చూశాడు! ఈ పద్యం వెంటనే మరొక మంచి పద్యం కూడా ఉంది. దాన్ని కూడా చెప్పనిదే నాకు తృప్తి ఉండదు. అది కూడా అయుతునితో ఇంద్రుడు అంటున్న మాటలే:

వరసారస్వత పట్టభద్రులు కవుల్ వర్ణించి వర్ణించియున్
సరసావంతయు గానలేరు తుది యోషావిభ్రమాంబోధికిన్
విరసాంతఃకరణుండవై యెటులుగా నిందించెదో యయ్య! త
త్సరసాకార ముదారమన్మథకళాసర్వస్వశృంగారమున్!

ఈ పద్యంలో తన మాటల వెటకారాన్ని కవులవైపు తిప్పాడు కవి. కవులు వరసారస్వత పట్టభద్రులట! అంత మహామహా కవులే తమ కావ్యాలలో శృంగారాన్ని వర్ణించీ వర్ణించీ కూడా ఆఖరికి స్త్రీల శృంగారచేష్టలనే సముద్రపు హద్దు (సరస అంటే హద్దు) ఆవగింజంత కూడా చూడలేరట! అంటే వారివి కూడా వట్టి మాటలే తప్ప నిజమైన అనుభవానికి వస్తే, అది అత్యల్పం సుమా అని. అలాంటిది రసమంటే తెలియని వెఱ్ఱికుఱ్ఱవి, నువ్వు రసస్వరూపమై మన్మథకళకు ఆటపట్టైన శృంగారాన్ని నిందించడం ఏమి సబబు! అని అంటున్నాడు ఇంద్రుడు. ఓ అయ్య! అనడంలో వృద్ధు రూపంలో అయుతునిపై ఇంద్రుడు ఒలకబోస్తున్న వాత్సల్యం ధ్వనిస్తూనే, ఏమీ తెలియని కుఱ్ఱవాడివిరా నువ్వు! అనే భావం కూడా స్ఫురిస్తోంది.

మొత్తానికి ఎలాగైనా అయుతుని దృష్టి సంసారం వైపు తిప్పాలని ఇంద్రుని తాపత్రయం. మాటలతో కాని పని చేతలతో అయింది. వెళుతూ వెళుతూ కామధేనువును విడిచి వెళ్ళిపోతే దాని ద్వారా చివరకు వద్దనుకున్న జంజాటంలో చిక్కుకోక అయుతునికి తప్పింది కాదు! ఈ అయుతుని కథ నాకు తెలిసి రామకృష్ణకవి స్వకపోలకల్పితమే, ఏ పురాణంలోనూ లేదు. పాండురంగమాహాత్మ్యంలో వచ్చే చాలా కథలు అలాంటివే. అయుతునికి ఆవుపై ఏర్పడిన మమకారం భాగవతంలో జడభరతుని వృత్తాంతాన్ని గుర్తుకు తెస్తుంది. పాండురంగమాహాత్మ్యంలో నాకు భక్తిరసం కన్నా మనుషులపై, వారి చిత్రమైన మనస్తత్వాలపై రామకృష్ణుడు గుంభనంగా చేసిన అధిక్షేపమే ఎక్కువగా కనిపిస్తుంది. వ్యవహారభాషకు దగ్గరగా ఉంటూనే మంచి ధారతో సాగడం తెనాలి రామకృష్ణకవి పద్యాల ప్రత్యేకత.