గ్రంథ పరిచయం: శ్రీవిజయుని కవిరాజమార్గం

 1. కన్నడిగులు ఎలాంటివారు అని చెప్పడంలోనూ రచయిత ఆత్మాభిమానం కనిపిస్తుంది. ‘సొగసుగా చెప్పడం, చెప్పినదానిని శోధించడం వీరికి తెలుసు. వాళ్ళు చాతుర్యం కలవారు. చదువు లేకున్నా కావ్యాన్ని రాయగల పరిణతములు (1-38)’ అని కన్నడిగుల గురించి చెప్పాడు.
 2. పదనఱిదు నుడియలుం నుడి
  దుదనఱిదారలుమార్పరా నాడవర్గళ్
  చదురర్ నిజదిం కుఱితో
  దదెయుం కావ్య ప్రయోగ పరిణత మతిగళ్ (1-38)

  (ఆ ప్రదేశంలో వారికి సొగసుగా చెప్పడం, చెప్పిన దాన్ని శోధించడం తెలుసు. వాళ్ళు చతురులు, చదువు లేకున్నా కావ్యాన్ని రాయగల పరిణత మతులు.)

  మిగతా పండితకవుల లాగా కాకుండా జానపదులను కూడా మెచ్చుకున్నాడు. ‘వీళ్ళు తమ తమ నుడులలో జాణతనం ఉన్నవాళ్ళు’ అని ప్రాంతీయ భాషల సొగసును పొగిడాడు. చివరకు చిన్నపిల్లలు, మూగవాళ్లు కూడా వివేకం కలవారన్నాడు.

  కుఱితవరల్లదె మత్తం
  పెఱరుం తంతమ్మ నుడియొళెల్లర్ జాణర్
  కిఱువక్కళ్ మామూగరు
  మఱిపల్కఱివర్ వివేకమం మాతుగళం (1-39)

  (ముందు చెప్పిన వాళ్ళే కాకుండా మిగిలిన వారు కూడా తమ తమ నుడులలో జాణతనం కలవారు. చిన్న పిల్లలు, మూగవాళ్ళు సైతం మాటల్లో వివేకాన్ని చూపించగల సమర్థులు.)

 3. సంస్కృత ప్రాకృతాలను గురించి శ్రీవిజయుడు వ్యక్తం చేసిన అభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ భాషల్లో నిర్దిష్టమైన లక్ష్యలక్షణాలున్నాయి. అందువల్ల ఆ భాషల్లో రాయడం తేలికే. కానీ, కన్నడంలో అలాంటి లక్షణగ్రంథాలు లేకున్నా రాస్తున్నారు కాబట్టి తమ భాషలో వాళ్ళే ఒజ్జబంతులని చెప్పాలి.
 4. అరిదాదం కన్నడదొళ్
  తిరికొఱెగొండఱియ పేళ్ వెనెంబుదిదార్గం
  పరమాచార్యరవోల్ సై-
  తిరలఱియర్ కన్నడక్కె నాడవరోజర్ (1-42)

  (అరుదైన కన్నడంలో పరమాచార్యులలాగా గొప్పగా చెప్పడానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ కన్నడానికి సంబంధించినంత వరకూ ఆ నాడులో ఉన్నవారే ఒజ్జలు.)

 5. మాండలికాలను గుర్తించిన మొదటి కవి కూడా ఇతనే. కన్నడంలో దేసి వేరువేరుగా ఉండడం వల్ల “దాన్ని తెలుసుకొని మాండలిక భేదాలను గుర్తించడం వాసుకి వల్లకూడా కాదు” అన్నాడు.
 6. దోసమినితెందు బగెదు
  ద్భాసిసి తఱిసందు కన్నడంగళొళెందుం
  వాసుగియుమఱియలాఱదె
  బేసఱుగుం దేసి బేఱెబేఱప్పుదఱిం (1-46)

  (కన్నడ భాష ప్రభేదాలలోని దోషాలను విడమర్చి చెప్పడానికి వాసుకి వల్ల కూడా కాదు. దేసి వేరువేరుగా ఉండడం వల్ల అతనికే విసుగు పుడుతుంది.)

 7. ‘ఎవరికీ తమ తమ దోషాలను తెలుసుకోవడం సాధ్యం కాదు. తమ కన్నులలోని కాటుకను ఎవరూ చూచుకోలేరు. అందువల్ల తెలివిగల వారెవరికైనా చూపించి కావ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి,’ అని గొప్ప సలహా ఇచ్చిన శ్రీ విజయుణ్ణి ప్రశంసించాల్సిందే.
 8. కాణనేగెయ్దుం తన్న దోషమం
  కాణదంతెందుం కణ్గళ్ తమ్మ కాడిగెయం
  పూణిగనాదుదఱిం పెఱరిం
  జాణరినోదిసి పేళ్వుదు కబ్బమం (1-45)

  (తన దోషాన్ని తాను తెలుసుకోవడం కష్టం. కళ్ళు తమ కాటుకను ఎప్పుడూ చూడలేవు. అందువల్ల కావ్యరచనకు పూనుకున్నవాడు తెలివిగల వాళ్ళ చేత తన కావ్యాన్ని చదివించుకోవాలి.)

 9. పాతవడ్డ మాటల్ని గురించి శ్రీ విజయుని అభిప్రాయం స్పష్టంగా ఉంది. ‘పాతమాటలు పురాణకావ్య ప్రయోగానికి సొగసుగానే ఉంటాయి. కానీ, ‘దేసి’కి అవి పనికిరావు. వాటిని వాడితే, ముసలిదాన్ని సంభోగిస్తున్నట్టు ఉంటుంది,’ అని కటువుగా చెప్పడం గమనించదగింది.

  దొరెకొండిరె సొగయిసుగుం
  పురాణ కావ్య ప్రయోగదొళ్ తత్కాలం
  విరసం కరమవు దేసిగె
  జరద్వధూ విషయ సురత రస రసికతెవోల్ (1-50)

  (పురాణకావ్య ప్రయోగానికయితే, [పాత కన్నడ పదాలు] ఆ కాలానికి చక్కగానే ఉంటాయి. కానీ, దేసికి సంబంధించినంత వరకూ అవి ముసలిదాన్ని సంభోగించే రసికతలాగా చాలా విరసంగా ఉంటాయి.)

 10. ‘తత్సమాల్ని కూడా చూచుకోని వాడండి, ఇష్టం వచ్చినట్లు వాడవద్దు. సంస్కృతాన్ని కన్నడాన్ని కలిపి రాయవద్దు. అహరహః, ముహుర్ముహుః, పునఃపునః, లాంటి అవ్యయాల్ని అలాగే వాడవద్దు. కన్నడాన్ని, సంస్కృతాన్ని ఈ విధంగా కలిపి రాస్తే కరడె, మద్దెలల లాగా కర్కశంగా ఉంటుంది’ (1-51 నుండి 1-53 వరకూ) అన్నాడు రచయిత.
 11. సమ సంస్కృతంగళొళ్ సై-
  తమర్దిరె కన్నడమనఱిదు పేళ్గెంబుదిదా-
  గమ కోవిద నిగదిత మా
  ర్గమిదం బెరసల్కమాగదీ సక్కదదొళ్ (1-51)

  (సంస్కృత సమాసాలతో కన్నడాన్ని కలిపి చెప్పేటప్పుడు జాగ్రత్త వహించాలన్నది ఆగమకోవిదులు నిర్దేశించిన మార్గం. సంస్కృతంతో కన్నడం కలిపి చెప్పడానికి వీలులేదు.)

  అహరహరుచ్చైర్నీచై
  ర్ముహుర్ముహురితస్తతః పునః పునరంత-
  ర్బహిరాదిహ ప్రాదురహో-
  సహసాదిగళవ్యయంగళసహాయంగళ్ (1-52)

  (అహరహః, ఉచ్చైః, నీచైః, ముహుర్ముహుః, ఇతస్తతమ్, పునః పునః, అంతర్, బహిర్, ఇహ, ప్రాదుర్, అహో వంటి అవ్యయాలను అలాగే వాడుకోకూడదు).

  బెరసిరె కన్నడదొళ్ బం
  ధురమాగదు కావ్యరచనె పేళ్దొడె పీనం
  పరుషతరమక్కుమొత్తుం
  గరడెయ మద్దళెయ జర్ఝరధ్వనిగళవోల్ (1-53)

  (వీటిని కలిపివేస్తే కన్నడం అందంగా ఉండదు. చాలా పరుషంగా కరడె, మద్దెల చేసే కర్కశ ధ్వనిలాగా ఉంటుంది).

  అలా ఛందోబద్దమైన పద్యం హృద్యమైనదని శ్రీవిజయుని అభిప్రాయం. పద్యకవులను గురించి రాసేటప్పుడు పద్యం ఎంత సొగసుగా ఉంటుందో తెలిపాడు. చక్కని సంస్కృత పదాలను వాడడం వల్ల ఈ పద్యం తెలుగు వాళ్లకూ అర్థమవుతుంది.

  పద్యం సమస్త జనతా
  హృద్యం పదవిదితపాదనియమనివేద్యం
  విద్యా పారాయణ
  మాద్యం సద్వృత్తి వృత్త జాత్యాయత్తం (1-30)

  (పద్యం సమస్త జనతకు హృద్యమైనది. పదములతో కూడి పాదనియమం కలిగి ఉండేది. విద్యావంతులకు ఇష్టమైనది. ఆద్యమైనది. వృత్తాలతోనూ, జాతులతోనూ కూడి ఉండేది.)

ఇంకా ఈ అలంకార శాస్త్రంలో ఉన్న అన్ని విశేషాలను చెప్పాలంటే చాట భారతం అవుతుంది. కన్నడంలో యతి స్వరూపం, కారకాదులలో దోషాలు, గురులఘుదోషాలు, అలంకార లక్షణం, అలంకార భేదాలు, ప్రాస భేదాలు, దక్షిణోత్తర మార్గాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, వాటికి లక్ష్యాలు కవిరాజమార్గంలో ఉన్నాయి. దండి కావ్యాదర్శంలో ఉన్నట్లే చిత్రకవిత్వం గురించి కూడా ఇందులో విపులమైన వివరణ ఉంది. ధ్వనిని కూడా అలంకారంగా నిరూపించడం ఒక విశేషం. మహాకావ్య లక్షణాన్ని విశదీకరించి తన లక్షణ గ్రంథాన్ని ముగించాడు శ్రీవిజయుడు.

ఇన్ని విధాల విశిష్టతను సంతరించుకొన్న కవిరాజమార్గం తొమ్మిదవ శతాబ్దిలోనే రచించిన శ్రీవిజయుడు, ఈ మార్గాన్ని నిర్దేశించిన నృపతుంగుడు యశోభూషణులు అయ్యారు. నీతినిరంతరుడు, ఉదారుడు, అతిశయధవళుడు అని బిరుదులు పొందిన నృపతుంగ చక్రవర్తి సార్థక నామధేయుడయ్యాడు.

రాళ్ళపల్లి సుందరం

రచయిత రాళ్ళపల్లి సుందరం గురించి: రాయటం మొదలుపెట్టి సుమారు 50 ఏళ్ళు, రాసింది తెలుగు,కన్నడం ,ఇంగ్లీషుల్లో 90 పుస్తకాలు, పెక్కు పరిచయాలు, దేశవిదేశ యాత్రలు, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన  ...