పాఠశాలకై పర్మిటు

(స్థలము: విద్యామంత్రి గృహం. మంత్రిగారి ఆంతరంగికకార్యదర్శి రంగదాసు ముందు నడచుచు దారి చూపగా జంటకవులు – రామకృష్ణకవులు – అనగా రామశాస్త్రి, కృష్ణశర్మలు – ప్రవేశింతురు. రంగదాసు మంత్రికి దగ్గరగా ప్రక్కనే యున్న కుర్చీలో కూర్చొనును. వారి ముందర మంత్రిగారి కుక్క ‘టైగర్’ పడుకొనియుండును. రామకృష్ణకవులు మంత్రి కభిముఖముగా కొంచెము దూరముగా నున్న కుర్చీలలో కూర్చొందురు.)

కవులు:

నమస్కారము మంత్రివర్యులకు…

మంత్రి:

దండాలు . కూరుసోండి.

రంగదాసు:

(మంత్రి నుద్దేశించి) వీరే జంటకవులు రామకృష్ణులు. కార్యార్థమై మీదర్శనానికి వచ్చినారు.

మంత్రి:

కవిగారలూ! మీరెక్కడినుంచి వచ్చిండ్రు, ఎందుకొచ్చిండ్రు?

కృష్ణశర్మ:

రాముఁడీతండు, నే కృష్ణనామకుండ,
పుట్టినారము బల్మూరుపురమునందు,
వచ్చినారము హైదరాబాదనంగ,
భాగ్యనగర మనంగను ప్రథితమైన
తెలుఁగురాజధానికి మిమ్ముఁ గొలుచుకొఱకు.

రంగదాసు:

ఓహో! అంత గొప్పకవులా? పోయెట్రీలోనే మాట్లాడేస్తారా?

రామశాస్త్రి:

యతుల నతుకంగలేక, యే గతులు లేక,
పదపరిజ్ఞాన మొసఁగెడు చదువు లేక,
వచనకవితల వల్లించువారి కేము
పాఠముం గఱపంగ సత్పద్యకవిత
లోనె భాషింతుమయ్య వీలైనకొలఁది.

మంత్రి:

కవిగారలూ! ఎన్కటికి చక్కగా పాడుకునే పదియాలుండేవి. అట్లే మీరూ పాడిండ్రు. ఇప్పుడేమో ప్రతివాడూ కవే! కాకులూ కవులే, మేకలూ కవులే. స్టేజిమీది కెక్కి ఏదో పొడువూగ రాసి దాన్ని దీర్గాలు దీర్గాలు తీసి చదివితే దాన్నే గొప్ప కవితం అంటూ అందఱూ చప్పట్లు చరుస్తుండ్రు.

రామశాస్త్రి:

అందుకే అన్నానండి ‘పదపరిజ్ఞాన మొసఁగెడు చదువు లేక’ అని. వచన కవిత్వం రాసే వారికైనా పదపరిజ్ఞానం, భాషాజ్ఞానం, భావజాలం ఉంటే కొంతవఱకు బాగుంటుందండి. యతులు ప్రాసలు గణాలు వీనితో పని లేదన్నారని భాష నేర్చుకొనకుండా రాస్తే మనబోటి వారి సంగతి అటుంచి రాసిన వాడికే అర్థం కాదండి.

మంత్రి:

నేను బడికి వెళ్లింది లేదు, చదివింది లేదు గాని, నాచిన్నతనంలో మా అమ్మమ్మ చెప్పిన పదియం ఇంకా నాకు గుర్తుకొస్తుంటది. చూడండి:

గంగిగోవుపాలు గంటెడైనను చాలు
కడివెడైన నేల ఖరముపాలు
భక్తి గల్గు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!

రామశాస్త్రి:

చక్కగా పాడినారు మంత్రిగారూ. పదాల అర్థం తెలిస్తే ఆనాటి పద్యాలు అర్థ మయ్యేవి. అక్షరాలు రానివాండ్లు కూడ వానిని పాడుకొని ఆనందించేవాండ్లు. ఇప్పటి కవిత్వంలో పదం లేదు, పస లేదు, అర్థం లేదు. పాడటం అసలు లేదు. పదాల అర్థం తెలిసినా ఆ కవిత్వం అర్థం కాదు. రాసినవాడిని దీనికి అర్థమేంట్రా అని అడిగితే వానికీ గొంతులో వెలగకాయ పడినంత పనౌతుంది. మీరెప్పుడో నేర్చుకున్న పద్యం ఇప్పటికీ గుర్తుంది. సర్వత్ర పద్యాలు ధారణకు అనుకూలంగా ఉంటాయి. ఇది పద్యాల కుండే విశేషలక్షణం. మఱి ఈనాటి కవిత్వాల్లో ఒక్క ముక్కైనా ఇట్లా గుర్తుంచుకోవడానికి వీలుంటున్నదా?

కృష్ణశర్మ:

మహామతిమంతులు మీరు మంత్రిగారూ! స్కూలులో చదువుకొనకున్నా మహా తెలివిగలవారండి. లేనిదే రాజకీయాల్లో ఇంత ముందుకువచ్చి మంత్రులౌతారా?

రంగదాసు:

ఎలక్షన్లో నిలిచేందుకు సంఘబలం ఉండడం ముఖ్యంగాని చదువుబలంతో పనేముంది. అందుకే ఎలక్షన్లలో గెలువడానికి గొప్ప చదువుండాలనే నిర్బంధాన్ని ప్రభుత్వాలు పెట్టడమూ లేదు, వోట్లు వేసే జనాలు పట్టించుకోవడమూ లేదు.

రామశాస్త్రి:

చక్కగా చెప్పారు రంగదాసుగారూ! ఔను మఱి …

చదువు లేకున్న నేమయ్యె సంఘబలమె
చాలదా యెలక్షన్లలో జయమునంద,
యేచదువు నేర్చి వనచరం బెక్కుచుండె
నున్నతంబగు తరువుల (తరగల) నుర్వియందు?

(పైపద్యము లోని చివరి పాదమును చదువునప్పుడు తరువులు అని పలికి వెంటనే తడబడి తరగలు అని సవరించుకొనును.)

రంగదాసు:

ఏమయ్యా! వనచరం అని నెమ్మదిగా అనేస్తున్నావే! వనచరం అంటే కోతి కాదూ? వనచరం అని అర్థం కాని పదం వేసి మంత్రిగారిని చెట్టెక్క నేర్చిన వనచరం అంటున్నావా? నాకు బాగా తెలుసులే – వనచరం అంటే కోతి అని.

రామశాస్త్రి:

ఎంతమాట. ఎంతమాట. నేనట్లంటానా రంగదాసుగారూ? ‘వనే సలిల కాననే’ అని వనానికి అమరకోశం రెండర్థాలు చెపుతూ వుంది. సలిలం అంటే నీరు, కాననం అంటే అడవి. వీనిలో మనకు కావలసింది మొదటి వనం కాని రెండవ వనం కాదండి. అందుచేత వనచర మంటే నీటిలో తిరుగుతూ ఉండేది – అంటే చేప. చేపలు సముద్రంలో ఉండే తరగలకు ఎదురెక్కుతుంటాయి గదా! ఏవిద్య నేర్చి అవి అంత అసాధ్యమైన కార్యాన్ని చేస్తున్నాయి? అట్లాగే మంత్రివర్యులూ చదువులతో పని లేని బుద్ధిబలంతో, సంఘ బలంతో ఎన్నో అడ్డంకులు ఎదురైనా వాటికి ఎదురీది, వానిని అధిగమించి గొప్ప ప్రభువు లైనారు – అని అన్నానంతే!

రంగదాసు:

చేపలు తరువు లెట్లెక్కుతాయయ్యా?

రామశాస్త్రి:

ఆ! అలా అనలేదండి? మీరు వినలేదా? పొరపాటున తరువులు అని నోట జారినందున వెంటనే తరగలు అని దానిని సవరించుకొన్నానండి.

కృష్ణశర్మ:

(సమయస్ఫూర్తితో) క్షమించాలి రంగదాసుగారూ! నాకుమాత్రం తరగలనే వినిపించింది. ‘ఏచదువు నేర్చి వనచరం బెక్కుచుండె, ఉన్నతంబగు తరగల నుర్వి యందు’ అనే వినిపించింది. ‘ఉన్నతంబగు తరగల నుదధియందు’ అంటే ఇంకా బాగుండేది. తరగ లంటే అలలూ, ఉదధి అంటే సముద్రం గదా! అందుచేత, మా రామన్న పద్యాన్ని ఇట్లా పాడితే ఇంకా బాగుంటుంది.

చదువు లేకున్న నేమయ్యె సంఘబలమె
చాలదా యెలక్షన్లలో జయమునంద,
ఏచదువు నేర్చి వనచరం బెక్కుచుండె
నున్నతంబగు తరగల నుదధియందు?

మంత్రి:

రంగదా సేమంటుండడో కాని, నాకు మాత్రం మీపదియం ఇనసొంపుగా ఉండది.

రామశాస్త్రి:

మంత్రిగారూ మనం ప్రకృతి నుండి నేర్చుకొనవలసింది చాలా వుందండి. చూడండి. వసంతకాలం వస్తూనే పంచమ రాగంలో ఏగాయకుడూ పాడలేనంత తీయ తీయగా పాడుతూ వుంటుంది కోకిల. కాని అది ఏ సంగీతకళాశాలలో, ఏ గురువు దగ్గర విద్యను నేర్చుకుంది?

ఏకళానిలయంబున నేప్రసిద్ధ
గురువుకడ విద్య నేర్చెను కోకిలంబు?
పరమగాయకమణులేనిఁ బాడలేని
పాటచే మదిఁ బరవశింపంగఁజేయు.

కృష్ణశర్మ:

కాన విద్యతోఁ బనిలేదు ఘనుల కిలను,
మేటి తరగల కెదురెక్కు మీనమట్లు,
తీయగాఁ బాడనేర్చిన కోయిలట్లు,
సహజమతిమంతులే మీరు సచివవర్య!

మంత్రి:

బాగున్నదయ్యా మీపదియం, ఆ పదియం చదివిన తీరు. పోయిన వారం ఏదో కవుల సంబేళనమని నడపడానికి నన్ను రమ్మనిండ్రు. నేను చదువుకోకున్నా విద్యా మంత్రి నైతే ఐతి గదా! అందుచేత నన్ను పిల్చిండ్రనుకుంటా. ఆ కవుల కవితాలు నాకు తలాతోకా అరథమైందంటె ఒట్టు. పలుగురాళ్ల బాటపై నడిచే బండిలాగ గడబిడ చేసే వాండ్ల కవితంలో దునియా సాంతం దుక్ఖం, రక్తంతో నిండిన పీన్గుల పెంటనే. ఒక గొప్ప కవి యంట. ఈ కాలంలో గొప్ఫ కవితం రాస్తడంట. ఆయన ‘కుక్కపిల్లా, గాజుబిళ్లా, గాడిదపిల్లా’ ఇట్లా దేనిమీద నైనా కవితం కమ్మగా రాయొచ్చు అని మొదలుపెట్టి, కాయితం గతిలేదా మరి కాయితం మీద రాయక గాడిదపిల్ల మీద ఎందుకు రాస్తుండడో అని నేను విస్తుపోతుండగనే , తాను ‘పెంటకుప్ప’పై రాసిన కవితం పెద్దగా చదివిండు. అది పిసరంతా నాకరథం కాలేదు గాని, అది చదువుతుంటే అందఱూ చెవులు మూసికొనిండ్రు. రోడ్డుపక్క పెంటకుప్పను చూచి దాని కంపుకు తట్టుకోలేక ముక్కు మూసుకున్నట్టే పెంటకుప్పపై ఆయన రాసిన కవితం యిని, యినలేక, తాళలేక వాండ్లు చెవులు మూసుకుండ్రేమో అని నాకనిపించింది. కవిగారలూ! మీరు గొప్ప కవులమని చెప్పుకుంటుండ్రు గదా! ఏదీ పెంటకుప్పపై మీరూ ముద్దుగా పదియం చెప్పండి చూతాం!

కృష్ణశర్మ:

వీథికుక్కల కెల్లను విందుసేయు

రామశాస్త్రి:

పందులకు నగు నందమౌ మందిరంబు

కృష్ణశర్మ:

ఎరువుగామారి పంటల వృద్ధి సేయు

రామశాస్త్రి:

పెంటకుప్పకు సరిలేదు పృథ్వియందు!

కృష్ణశర్మ:

కలవు మానవులందున కామ లోభ
మదము లను పెంటకుప్పలు మంత్రివర్య!
వీథికుప్పలకన్నను వేయిరెట్లు
చెఱచుచుండెను మనుజులఁ జేరి యవియె.

రామశాస్త్రి:

ఇట్టివారలు ప్రభువులై యేలిరేని
పెంటకుప్పయె రాజ్యమై వెలయునయ్య!
న్యాయహీనత యవినీతి యనెడు పాడు
కంపులం గూడి దేశంబు క్షయముఁ జెందు.

(ఈ పద్యము చదువుచుండగా రంగదాసు, మంత్రి చేదును మింగుచున్నవారివలె ముఖ వైఖరులను ప్రదర్శింతురు.)