యద్భావం తద్భవతి

పూల అంగడికి పొద్దున్నే బయలుదేరుతూంటే పక్క ఇంట్లోంచి అరుపులు వినిపించాయి సుదాముడికి, “నా ప్రాణానికి నువ్వెక్కడ దొరికావే? నా బతుకే ఇలా ఏడుస్తుంటే, నువ్వూ, నీ అవకరాలు ఉన్న శరీరమూ, నాకు శనిలా దాపురించేవు.”

మనస్సు చివుక్కుమంది. బయటనే అరుగు మీద కూర్చున్న ఈ త్రివక్ర అనే అమ్మాయి తండ్రి కేసి చూసేడు సాలోచనగా. ఇదంతా నా ఖర్మ అన్నట్టూ ఆయన నుదిటి మీద వేలు అడ్డంగా రాస్తూ చూపించేడు. సుదాముడు ఆయన దగ్గిరకెళ్ళి చిన్న గొంతుతో చెప్పేడు.

“మధ్యాహ్నం భోజనం అయ్యేక కాస్త తీరిక చేసుకుని, అమ్మాయితో పాటు నా పూల అంగడికి రండి. మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు.”

“అలాగే” అన్నట్టూ తలాడించేడు తండ్రి. ఆయన కంట్లో సన్నటి నీటి పొర సుదాముడి కంట పడనే పడింది. ఓదార్పుగా భుజం తట్టి, “హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే” నోటిలో నిరంతరంగా సాగిపోయే కృష్ణ స్మరణంతో అంగడి కేసి నడిచేడు.

మధ్యాహ్నం భోజనం అయ్యేక అంగట్లో ఖాళీగా ఉన్నప్పుడు వచ్చారు తండ్రీ త్రివక్రా – సుదాముణ్ణి చూడ్డానికి. వచ్చిన వాళ్ళని కూర్చోపెట్టి అడిగేడు. “ఎందుకు మీరీ పిల్లని అలా హింసిస్తున్నారు రోజూ? ఈ శరీరం, ఈ అవకరాలు అన్నీ భగవంతుడిచ్చినవి. మనం ఏదో జన్మలో చేసుకున్న కర్మ వల్ల ఇలాంటి మానవ జీవితం వచ్చింది. ఇప్పుడు సంతోషంగా ఆ మిగిలిపోయిన కర్మ మౌనంగా అనుభవించేస్తే మేలు. ఎవరూ కూడా ఇవి కావాలని కొని తెచ్చుకోరు కద?”

“నాకేం రాదని, అందరి పిల్లల్లా ఉండననీ అమ్మ నన్ను రోజూ కొడుతోంది.” త్రివక్ర ఏడుస్తూ చెప్పింది.

“ఊరుకోమ్మా, రోజూ చూస్తూంటే అసలు తల్లి అనేది ఇలా ఉండగలదా అనిపిస్తోందనుకో అది నా భార్యో, ఈ కంస మహారాజు మనమీద కాపలా పెట్టిన రాక్షసో. దానికి నేనెన్ని సార్లు చెప్పినా అలాగే మాట్లాడుతోంది. ఏం చేద్దామన్నా నాకు కరచరణాలు ఆడటం లేదు.” తండ్రి సముదాయించాడు కూతురిని.

“ఇలా అమ్మాయిని ఇంట్లో కూర్చోపెట్టడం కంటే ఏదో ఒక వృత్తి నేర్పరాదూ?” సుదాముడడిగేడు తండ్రిని.

“దీనికి ఎవరైనా ఏదైనా నేర్పుతానంటే నేను వెంఠనే జేర్పించనా?” తండ్రి చెప్పేడు.

“నా పక్క అంగడిలో లేపనాలు తయారు చేసే ఆయన చాలా కాలం నుంచీ పని ఎక్కువగా ఉందనీ ఎవరో ఒకరు సహాయానికి కూడా ఉంటే బావుణ్ణనీ అంటున్నాడు. లేపనాలంటే చేయడం కొంచెం కష్టమే కానీ అలవాటైతే ఎవరైనా చేయవచ్చు.”

“నాకెన్ని అవకరాలున్నా కానీ చేతులు కాళ్ళూ బాగానే ఉన్నాయి. అమ్మ ఇంట్లో నాకు చూపించే నరక యాతన కన్నా కష్టమా ఈ లేపనాలు నేర్చుకోవడం?” పదేళ్ళ పాప మాటలకి శ్రోతలిద్దరూ ఆశ్చర్యపోయేరు.


ఎన్ని అవకరాలున్నా లేపనాలు చేయడం నేర్చుకోవడానికి పనిలో కుదురుకున్న త్రివక్ర పని దొంగ కాదు. యజమానిక్కూడా సంతోషమే. ఈ అమ్మాయి అందరి పిల్లల్లా నిముషానికోసారి లేచి అటూ ఇటూ తిరగదు. ఒద్దికగా ఓ చోట కూర్చుని తానేదో, తన పనేదో. ఇంటి దగ్గిరైతే తల్లి తిట్టే తిట్లు గుర్తొస్తాయి కాబోలు పాపకి ఇక్కడే బాగున్నట్టుంది. తీరిక వేళల్లో సుదాముడి దగ్గిర కృష్ణుడి గురించో, ఆయన చేసే కృష్ణ స్మరణమో వినడం. త్రివక్రకి మొదట్లో కృష్ణుడెవరో తెలియడానికే ఊహకందేది కాదు. గోకులం నుంచి తెరలు తెరలుగా వచ్చే కధలు వింటూంటే ఈ నల్ల పిల్లాడు భగవంతుడి అవతారం అనుకోవడం తాను వింది. కూర్చుంటే అంత సులభంగా లేవలేని తనకి, ఇన్ని అవకరాలున్న తనకి, సుదాముడంతటి వాడికే లేనిది, భగవంతుడి దర్శనం అవుతుందా?

పక్క అంగడిలో సుదాముడికీ ఇదే రకం ఆలోచనలు – ఎక్కడి గోకులం, ఎక్కడి తానూ, తన పూల అంగడి? ఎప్పుడైనా తన జీవిత కాలంలో ఓ సారి ఆ కృష్ణుడు మధురానగరం వస్తే, గిస్తే, ఊరి మారుమూలనున్న తన అంగడి కేసి వచ్చేనా తనని చూసేనా? ఈ జీవితం ఇలా అయిపోవాల్సిందే కాబోలు. వేల ఏళ్ళ తపస్సు చేసే మునులకే లేదు ఆయన దర్శనం, నేనెంత? ఇంకో వంద జన్మల తర్వాతైనా బాగుపడొచ్చు ఈ కృష్ణ స్మరణంతో. ఆయనకి ఎప్పుడు నన్ను చూడాలనిపిస్తే అప్పుడే వస్తాడు. చూడబోతే ఇన్ని భ్రూణ హత్యలు చేసే రాజు గారి అనుచరులూ, ఈ రాజుగారూ నా కన్నా అదృష్టవంతులు కాబోలు. కనీసం వాళ్ళకి చచ్చే ముందు ఆయన్ని చూసే భాగ్యమైనా కలుగుతోంది.


“ఈ చిన్న మరక, అదీ లోపల వేసుకునే అంగీ మీద, పోవాలా? పైన వేసుకునే బట్టల మూలంగా ఇది కనబడనే కనబడదు కదా? అయినా సరే ఈ మరక ఉందని నన్ను కంస మహారాజు కొరడా దెబ్బలు కొట్టించేడు. ఈ వెధవ రాజు ఉంటే ఎంత? పోతే ఎంత? నా తడాఖా చూపిస్తాను. రేపీపాటికి ఈ గుడ్డలెన్నీ ఎలా మెరుస్తాయో….” తప్పతాగి ఒళ్ళు తెలీకుండా పేలుతూ కసిగా బండమీద రుద్దుతున్నాడు బట్టలన్నీ రజకుడు.

“నాయినా అమ్మ తిండి తినడానికి రమ్మంటోంది,” పదేళ్ళ కుర్రాడొచ్చి చెప్పేడు.

చేతిలో గుడ్డ తీసి వాడి నడుం మీద కొట్టి అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తూ అరిచేడు, “పోరా నువ్వూ మీ అమ్మా, పోయి యమునలో దూకండి.” కుర్రాడేడుస్తూ లోపలకి పోయేడు. గంటా రెండు గంటలు గడిచేక మరకలు పోగొట్టి ఉతికిన బట్టలన్నీ ఆరేసి లోపలకెళ్ళి పడుకున్నాడు. తాగిన మైకంలో ఒంటి మీద కొరడా దెబ్బల నెప్పి తెలియలేదు మర్నాటి పొద్దున్న దాకా.


లేపనాల అంగడికి ఓ రోజు మహారాజుగారి దగ్గిర్నుంచి కబురు! ఏమి చావొచ్చిందో అని గుండెలదురుతూండగా, యజమాని దాదాపు పరుగెట్టుకుంటూ రాజ దర్శనానికి వెళ్ళేడు.

“ఏమోయ్ నీ దగ్గిర లేపనాలు చేసే ఒకమ్మాయ్ ఉందిట, పని చేయడంలో మంచి సిద్ధహస్తురాలని విన్నాం. నగరంలో వాణిజ్య ప్రముఖుల దగ్గిరా ఆ లేపనాలన్నీ చూశాం. ఇంకా నీ దగ్గిరే పనిచేస్తోందా?”

“అవును మహారాజా, వెన్నెముక కాస్త వంకర కానీ చేతులతో అద్భుతమైన లేపనాలు చేయగలదు. అది అమ్మాయికి దేవుడిచ్చిన వరం.”

“రేపట్నుంచి మహారాజుగారికి కావాల్సిన లేపనాలన్నీ ఆ అమ్మాయి చేత చేయించి పంపించు. నీకూ, ఆ అమ్మాయికి తగిన విధంగా జీతం అందుతుంది. ఏమేమి లేపనాలు కావాలో ఓ రోజు ముందుగా నీకు మా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇష్టమేనా?”

“తప్పకుండా మహారాజా”

“నీ కేమన్నా కావలిస్తే రాజభవనంలో అడుగుతూ ఉండు. లేపనాలు అద్భుతంగా ఉండాలి. ఎక్కడా తేడా రాకూడదు సుమా. గుర్తు పెట్టుకో మరి.”

“అవశ్యం. మీరంతగా చెప్పాలా?

కంస మహారాజు త్రివక్రని తన స్వంతానికి లేపనాలు చేయించుకోవడం కోసం పెట్టుకున్నాడనే వార్త సుదాముడికి చేరింది. ఆయన సంతోషంగా చెప్పేడు అమ్మాయితో, “చూశావా భగవంతుడి అనుగ్రహం? నీ అవకరం భగవంతుడికి కనపడదు. ఆయనకందరూ ఒకటే. ఆయన బమ్మిని తిమ్మి చేయగలడు. ఎప్పుడో ఓ సారి మన కంస మహారాజు ఆయన చేతిలో ఛస్తాడని ప్రజలందరూ అనుకోవడం నీకు తెల్సిందే కదా? ఆయన్ను చూసే అదృష్టం నాకు ఎలాగా ఉన్నట్టు లేదు. రాజభవనానికి వెళ్తూ ఉంటావు కనక నువ్వేనా చూడగలవు. జాగ్రత్తగా గమనిస్తూ, కంసుడికి కాదు, ఇదంతా భగవంతుడి కోసం అనుకుంటూ రోజూ నువ్వు శ్రద్దగా పని చేయి. దీక్షగా పని చేస్తూ అద్భుతాలు చేయడమే యోగం అంటున్నారు తెలిసినవాళ్ళు.”

త్రివక్ర తలవంచుకుని అలాగేనన్నట్టూ ఊపింది. తలెత్తితే తన కన్నీళ్ళు సుదాముడి కంటపడేను. ఇంట్లో సాక్షాత్తూ స్వంత తల్లి చేతిలో నరకయాతన అనుభవించే తనని బయటకి తీసుకొచ్చి జీవితానికో దారి చూపించిన ఈ సుదాముడి ఋణం ఏ జన్మకి తీరేను?


పట్టుకొచ్చిన బట్టలన్నీ చూసి కంసుడు రజకుణ్ణి లోపలకి పిల్చేడు, “ఈ సారి బట్టలన్నీ బాగున్నాయి. కొరడా దెబ్బలు బాగా పని చేసినట్టున్నాయే?” అదో వంకర నవ్వు మాటల్లో.

“ఆయ్”, రజకుడికి అంతకంటే నోట మాట రాలేదు. ఏమో ఏమంటే ఏమౌతుందో. పాత దెబ్బలు ఇంకా నడుము మీద మండుతున్నాయ్.

“సరే ఫో,” కసిరినట్టూ చెప్పేడు కంసుడు.

బయటకొచ్చిన రజకుడికి లోపల ద్వేషం అనంతంగా పెరిగిపోతూంది ఈ కంసుడి మీద. “….తనకి గానీ ఒక్క అవకాశం వచ్చిందా ఈ కంసుణ్ణి తల తగేలా చంపేసి ఉండేవాడు. చిన్న మరక, అదీ లోపల వేసుకునే అంగీ మీద. దాన్ని చూసి తనకి కొరడా దెబ్బలు! ఇవి మానడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పేరు మందు ఇచ్చిన ఆచార్యులు. పోనీ కొట్టాక అక్కడే వదిలేడా? ఈ రోజు పిల్చి మరీ నవ్వుతున్నాడు మొహం మీద. ఎంతటి దుర్మార్గుడు కాకపోతే నేను ఏడుస్తూంటే అలా నవ్వగలడు? భగవంతుడనేవాడుంటే నన్ను ఇలా కొరడా దెబ్బలు కొట్టిస్తాడా, ఈ ప్రపంచం ఇలా ఏడుస్తుందా? నాకు జరిగే ప్రతీ దానికీ నేను మాత్రం నా ఖర్మ అనుకోవాలి. అయితే ఈ రాజుగారు చేసే పనులకి మాత్రం ఏమీ ఖర్మా గిర్మా లేదు. నేనేమో వళ్ళు హూనం చేసుకుని బట్టలు మల్లెపూవులా మెరిసిపోయేలాగ ఉతకాలి. ఈ తెల్లటి బట్టలేసుకుని ఈ చచ్చు మహారాజు చేసేదేవిటీ? ఊరూరా తలొకణ్ణీ పంపించి చంటిపిల్లలని చంపించడం. ఇదా న్యాయం? ఎప్పుడో గోకులం నుంచి వచ్చి కృష్ణుడు ఈ కంసుణ్ణి చంపేదాకా నేను ఇలా ఏడవాలా? రానీయ్, ఆ కృష్ణుడు కానీ నాక్కనబడ్డాడా ఇలా నన్ను కొట్టించినందుకు సరైన గుణపాఠం నేర్పుతాను. ఈ కంసుడి దగ్గిర ఎంత బాగా పనిచేసినా నాకు దెబ్బలు తప్పవు. కృష్ణుణ్ణి వీళ్ళందరూ భగవంతుడనీ, ఎప్పుడో వచ్చి ఈ కంసుణ్ణి చంపుతాడనీ అనుకోడమే తప్ప ఇప్పటిదాకా ఆయనొచ్చే అతీ గతీ లేదు. నేనెలాగా ఈ కంసుడి బారి నుంచి తప్పించుకోలేను. ఆ కృష్ణుడు కానీ వచ్చి నాక్కనిపించాడా అప్పుడు చూపిస్తాను నా కోపం అంతా.” కోపంగా గొణుక్కుంటూ, జాలిగా చూస్తున్న మధురానగరం జనాలని తప్పుకుంటూ ఇంటికి నడక సాగించేడు రజకుడు.


“కంస మహారాజు మిమ్మల్ని పిలుచుకు రమ్మని శెలవిచ్చారు,” సేవకుడు చెప్పేడు అక్రూరుడితో.

“సరే పద పోదాం” నిలుచున్నపాటే బయల్దేరేడు.

వచ్చిన అక్రూరుడితో చెప్పేడు కంసుడు, “చూడూ నువ్వు నాకు బాగా ఆప్తుడవనీ, నా క్షేమం కోరేవాడివనీ ఇలా పిలిచి చెప్తున్నాను. అక్కడ గోకులంలో కుర్రాళ్ళిద్దరూ నా గుండెల్లో బల్లెంలా తయారయ్యేరని నీకు తెల్సిందే కదా? రాబోయే రోజుల్లో నేను ధనుర్యాగం మొదలు పెడుతున్నాను. ఆ కుర్రాళ్ళని ఇద్దర్నీ ఎలాగో ఒకలాగ – మందు పెట్టో, మభ్య పెట్టో…”

అక్రూరుడు కంసుడికేసి తలెత్తి చూసేడు. నవ్వొచ్చింది కంసుడి మాటలకి. ఈయన పంపించిన రాక్షసులందర్నీ ఒంటిచేత్తో చంపేసిన కృష్ణుణ్ణి, లీలామానుషవిగ్రహుడనీ, సాక్షాత్తూ భగవంతుడనీ ప్రపంచం అంతా అనుకునే కృష్ణుణ్ణి మభ్యపెట్టో మందు పెట్టో ఏదో చేయాలిట! కంసుడి మతి గానీ పోలేదు కదా?

“…వింటున్నావా? ఎలాగో ఒకలాగ ఇక్కడకి తీసుకొచ్చావంటే నా దగ్గిర ఇద్దరు మల్ల యుద్ధ యోధులున్నారు – చాణూర ముష్టికులని – వాళ్ళిద్దరితో ఆ కుర్రాళ్లని చంపించేస్తాను. పీడ విరగడౌతుంది. ఏదో ఒకటి అడ్డొచ్చి ఈ కుర్రాళ్ళు మల్ల యుద్ధంలో చావకపోతే మిగిలిన ఉపాయం ఏమిటంటే మన భద్రగజం ఉంది గదా – కువలయాపీడం, దానిచేత వీళ్ళని తొక్కించేయడమే. అర్ధం అయిందా?”

“సరే” చావబోయేవాళ్ళ జాబితా చదివిన కంసుణ్ణి చూస్తూ తలాడించేడు అక్రూరుడు.

“ఎప్పుడు బయల్దేరుతావు?”

“రేపే బయల్దేరమని శెలవా?” చావడానికి కంసుడికంత తొందరెందుకో?

“నాకు తెలుసు నువ్వు నా క్షేమం కోరేవాడివని. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ అక్కడ చెప్పకు సుమా? ఇవన్నీ తెలిస్తే కుర్రాళ్ళు బెదిరిపోయి నీకూడా రావడానికి భయపడొచ్చు. జాగ్రత్త మరి. నువ్వు మంచి మాటకారివి. కపటం అదీ లేకుండా మాట్లాడు. వెళ్ళిరా.”

కంసుడి దగ్గిర్నుంచి వెనక్కి వచ్చిన అక్రూరుడి ఒళ్ళు గాలిలో తేలుతున్నట్టుంది. రేపీపాటికి తనకి లీలామానుష విగ్రహుడైన భగవంతుడి దర్శనం కాబోతోంది. ఏం తపస్సు చేశాడు తాను? తెలిసో తెలియకో పాత్రులైన వాళ్ళకి ఏదైనా దానం చేశాడా? ఇంటికొచ్చి పడుకున్నాడన్న మాటేగానీ రాత్రంతా కలత నిద్రే. కంసుడి దగ్గిర్నుంచి వచ్చాడంటే వీడు కూడా రాక్షసుడై ఉంటాడని అనుకుని కృష్ణుడు తన కేసి కూడా చూడడేమో? నీ పేరేమో అక్రూరుడా, నువ్వు చేసేది కౄరుడైన కంసుడి దగ్గిర ఉద్యోగమా అని అందరి ముందు నవ్వి హేళన చేయడు కదా? అయినా కృష్ణుడు కనపడగానే ఆయన నోరు తెరిచే లోపుల కాళ్లమీద పడి నమస్కారం చేస్తే నేను చేసిన తప్పులు క్షమించడా?

మర్నాడు ఉదయమే రథం బయల్దేరుతూంటే అక్రూరుడు చెప్పేడు సారథితో, “గోకులం వచ్చే ముందు కాస్త జాగ్రత్తగా చూసి చెప్పు నాయనా, కృష్ణుడి పాద ముద్రలు కనపడితే వాటికి నమస్కారం పెట్టుకుంటాను ముందు.”

“కృష్ణుడి పాద ముద్రలు గుర్తించడం ఎలా?”

“పద్మయుగళం, చక్ర, చాప, హల, జలచర రేఖాంకితాలు ఉంటాయి. అవే కొండ గుర్తు”

“తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను,” రథం మధురానగరం వీధుల్లోకి సాగిపోయింది.