ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం!


మురుగన్ – అబోరుగన్

ఒక సమాజపు ఔన్నత్యం, ఆ సమాజం తన స్త్రీలు, పిల్లలు, వృద్ధులతో ఎలా ప్రవర్తిస్తుంది అన్న అంశంపై ఆధారపడి వుంటుందని వాడుక. వీరితో మనం ప్రస్తుతం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకూ తెలుసు. ఇప్పుడు ఈ జాబితాలో మనదేశపు రచయితలనూ కళాకారులనూ చేర్చవలసి రావడం దౌర్భాగ్యం. సంస్కృతి పేరుతో స్త్రీలపైన, మనోభావాలు దెబ్బ తింటున్నాయన్న నెపంతో రచయితలు, కళాకారులపైన, తమ ఆత్మన్యూనతను కప్పి పుచ్చుకునేందుకు ఈ సంస్కృతీరక్షకుల దౌర్జన్యం రానురానూ దుర్భరమవుతున్నది. వీరికి మాత్రమే సమాజపు మంచీ చెడూ తెలుసు, వీరు ఒప్పుకున్నవే విలువలు, కేవలం వీరే నైతికధర్మాధికారులు, వీరిని వీరే ఎన్నుకుంటారు. సృజనకూ అభిప్రాయ వ్యక్తీకరణకూ స్వేచ్ఛ ఇవ్వని సమాజమూ విమర్శను తీసుకోలేని సంస్కృతీ పతనానికే దారి తీస్తాయని వీరు గ్రహించరు. ఈ రకమైన ప్రవర్తనలో వీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారో స్పష్టంగానే కనిపిస్తుంది. మనవారు రాయని శాస్త్రం లేదని, ప్రవచించని సత్యం లేదని, కనిపెట్టని విజ్ఞానం లేదని, మనల్ని మనం మభ్యపెట్టుకుంటూ అబద్ధాల చరిత్రలు రాసుకున్నంత మాత్రాన మన సమాజం, సంస్కృతి ఉన్నతమైనవి అయిపోవని, మన ఔన్నత్యం కేవలం మన ప్రజాస్వామ్యపు విలువలని కాపాడుకోవడం లోనే ఉందనీ వీరు గ్రహించరు. సంస్కృతీసాంప్రదాయాల పరిరక్షణ ముసుగులో వీరు చేస్తున్న అఘాయిత్యాలు కేవలం వీరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే. ఈ రకమైన నిర్బంధాలు మానవ చరిత్రలో కొత్త కాదు. కాలం నిదానంగా అయినా సరే, నిష్పక్షపాతంగానే నిజాన్ని వెలికితీస్తుంది. చరిత్రలో ఇంతకు ముందు ఇదేవిధంగా ఎందరో ఉగ్రవాదులను పంపిన దారినే వీరినీ పంపుతుంది. రక్షణ కోసం స్వాతంత్ర్యాన్ని త్యాగం చేసిన మనిషి ఆ రెంటికీ అర్హుడు కాడని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నట్టు, ఇలాంటి ప్రతికూలత ఎదురైనప్పుడల్లా ఎవరికీ తల ఒగ్గకుండా మన స్వేచ్ఛను నిర్భయంగా ప్రకటించుకుంటూ వుండడమే మనం చేయగలిగిందీ చేయాల్సిందీ.


ఈ సంచికలో:

  • కథలు: శిక్ష ఖరీదు – ఆర్. శర్మ దంతుర్తి; మరో లోకం – ఇంద్రగంటి సత్యనారాయణ మూర్తి; సై కిల్ – కె. వి. గిరిధరరావు; వచనానికి ఒక జాబు – మాగంటి వంశీ మోహన్; స్టార్‌బక్స్ కథలు: పచ్చబొట్ల కాఫీ కప్పు – సాయి బ్రహ్మానందం గొర్తి.
  • కవితలు: మహాలయం – మానస చామర్తి; ఉడుత – పాలపర్తి ఇంద్రాణి; నెగడు చుట్టూ నాట్యం – చంద్ర కన్నెగంటి; శతపుష్పసుందరి – జెజ్జాల కృష్ణ మోహన రావు.
  • వ్యాసాలు శీర్షికలు: ఒక చాటు పద్యం కవికి తెచ్చిన చేటు – వేలూరి వేంకటేశ్వర రావు; చెంఘిజ్ ఖాన్ నవలలో యుద్ధనిర్వహణ కళ – సూరంపూడి పవన్ సంతోష్; శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన – ఏల్చూరి మురళీధరరావు; ఐడ్స్ ఆఫ్ ఏప్రిల్ – ఎనానిమస్సు; నాకు నచ్చిన పద్యం: అజాత నాస్తికునికి అరుదైన స్వాగతం – భైరవభట్ల కామేశ్వరరావు.
  • శబ్దతరంగాలు: 1. తెన్నేటి సూరి చెంఘిజ్ ఖాన్: రేడియో నాటకం, 2. అలనాటి నటి ఎస్. వరలక్ష్మితో ముఖాముఖీ – సమర్పణ: పరుచూరి శ్రీనివాస్.