స్టార్‌బక్స్ కథలు: కాఫీ బానిస

హడావిడిగా పరిగెత్తుకుంటూ స్టార్‌బక్స్ వైపు పరిగెత్తాను. లోపలకి అడుగు పెట్టానో లేదో కమ్మటి కాఫీ వాసన!

వెళుతూనే బ్యాక్‌పేక్ పక్కన పడేసి, చేతులూ, మొహం కడుక్కొని ఏప్రాన్ తగిలించుకొని కౌంటర్ దగ్గరకి వెళ్ళాను.

“కొంతమందికి కాఫీ వ్యసనం, మరి నీకేమో లేటుగా రావడం…” నన్ను చూడగానే మేగన్ అంది.

“బస్సు లేటుగా…” పూర్తి చేయకుండానే రిజిస్టర్ వైపు వెళ్ళాను. అప్పటికే లైనులో చాలామంది ఉన్నారు.

నేను శాన్‌హొసే స్టేట్ యూనివర్శిటీలో డిగ్రీ చదువుతూ ఉదయం స్టార్‌బక్స్‌లో పనిచేస్తాను. చాలా వరకూ నా క్లాసులన్నీ సాయంత్రమే ఉంటాయి. దీనితో వచ్చే సంపాదన నా ఖర్చులకి సరిపోతుంది. ఇక్కడ జేరి నాలుగు నెలలు కావస్తోంది. శాన్‌హొసే నుండి ఈ లాస్ ఆల్టోస్ స్టార్‌బక్స్‌కి దూరం ఎక్కువ. నాకు కారు కూడా లేదాయే. రెండు మూడు బస్సులు మారి రావాలి. పొద్దున్నే లేచి రావడం మొదట్లో ఇబ్బంది అనిపించినా ఈ కాఫీ సెంటర్ నాకు బాగా నచ్చేసింది.

రిజిస్టరులో అన్ని ఆర్డర్లూ పూర్తి చేసి నాకోసం ఒక కప్పు కాఫీ కలుపుకుంటూండగా, మేగన్ – “నీ ఫ్రెండు నీకోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికి నాలుగు సార్లొచ్చింది, నువ్వొచ్చావా అంటూ. నేను ఆర్డర్ తీసుకుంటానన్నా వినలేదు. పరవాలేదంటూ నువ్వొచ్చే వరకూ వెయిట్ చేస్తాననంది. నాకెప్పటికీ అర్థం కాదు – ఇద్దరం కలిపేది అదే కాఫీ కదా? మరి…” తలాడిస్తూ అంది.

మేగన్ చెప్పే ఫ్రెండు పేరు డెబ్బీ. వయసు అరవై దాటుంది. ప్రతీ రోజూ ఉదయం తొమ్మిదింటికల్లా స్టార్‌బక్స్‌కి వచ్చేస్తుంది. ఆమెతో పాటు జెర్రీ కూడా వస్తాడు. అతనికీ ఓ డెబ్బై యేళ్ళుంటాయోమో? ఇద్దరూ ఠంచనుగా ప్రతీరోజూ వస్తారు. మా సెంటర్ని ఆనుకొని వున్న ఓపెన్ స్పేసులో కుర్చీలవీ వేసుంటాయి. చాలామంది కాఫీకని వచ్చి అక్కడే బాతాఖానీ కొడుతూ గడిపేస్తారు. డెబ్బీ ఉదయమే వచ్చి మధ్యాన్నం ఎప్పుడో వెళుతుంది. జెర్రీ ఎక్కువగా మాట్లాడడు. ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ ఉంటాడు. డెబీ ఐపాడ్లో బ్రౌజింగ్ చేస్తుంది. లేదంటే తెలుసున్న వాళ్ళొస్తే వాళ్ళతో కబుర్లు చెబుతూ గడుపుతుంది. ఒక్కోసారి జెర్రీతో ఐపాడ్లో చెస్ ఆడుతూ ఉంటుంది.

నాకు డెబ్బీతో పరిచయం విచిత్రంగా జరిగింది. నేను బరిస్టాగా పనిలో చేరిన కొత్తలో కస్టమర్ల ఆర్డర్లు తీసుకోవడం కాస్త కష్టంగా ఉండేది. అలవాటు లేని పని. పైగా వచ్చే ప్రతీ వాడూ ఒక్కో కాంబినేషన్లో కాఫీ ఆర్డర్ చేస్తాడు. సాధారణంగా కాఫీ గ్లాసు మీద ఆర్డరు రాస్తారు. దాన్ని బట్టే కాఫీ చేస్తారు. ఓ సారి కౌంటర్లో ఉండగా –

“డీకాఫ్, ట్రిపుల్, టాల్, వన్ పంప్ సినమిన్, వన్ పంప్ హేజల్ నట్, సోయా, ఎక్స్ట్రా హాట్, ఫోమీ, లాటే విత్ లైట్ విప్!” ఆర్డరు చేసింది డెబ్బీ. ఇంత పెద్ద ఆర్డరు తీసుకోవడం అదే ప్రథమం నాకు. ఆమె చెప్పేది వింటూ రాస్తూంటే కళ్ళు తిరిగాయి.

కొంతసేపయ్యాక కాఫీ కప్పుతో డెబ్బీ వెనక్కి వచ్చింది. నేను ఆర్డర్లు తీసుకోడంలో మునిగిపోయాను. వేంటనే మేగన్ నన్ను పిలిచింది. ఏం గొడవ జరిగిందా అనుకొని నేను భయపడ్డాను. ఇదేవిటంటూ కాఫీ కప్పు చూపిస్తూ అడిగింది. అప్పుడు కానీ అర్థం కాలేదు నే చేసిన పొరబాటు. కంగారులో డీకాఫ్‌కి బదులు నేను వెంటీ బోల్డ్ అని కప్పు మీద రాసేసాను. డెబ్బీ ముందతను వెంటీ బోల్డ్ ఆర్డరు ఇచ్చాడు. డెబ్బీకి క్షమాపణ చెప్పి, మరలా ఇంకోటి చేసిస్తానని అన్నాను.

ఉద్యోగం కొత్త కావడంతో బాగా భయపడిపోయాను నేను. ఒకటికి మూడుసార్లు క్షమాపణ కూడా చెప్పాను. వెంటీ బోల్డ్‌తో కూడా తను చెప్పిన కాఫీకి మరింత రుచి వచ్చిందంటూ తనకి బాగా నచ్చిందని డెబ్బీ అంది. నా పేరు మాత్రం అడిగింది. అలా డెబ్బీతో పరిచయం అయ్యింది. రోజూ నేను వచ్చే వరకూ కాఫీ ఆర్డరు చెయ్యదు. చాంతాడంత డెబ్బీ ఆర్డరు నాకు నోటికొచ్చేసు. డెబ్బీని చూడగానే ఆర్డరు చేసేస్తాను. నేను కౌంటర్లో ఉన్నా, డెబ్బీ కోసం నేనే ప్రత్యేకంగా చేసి ఇస్తాను. ఎప్పుడయినా ఖాళీ ఉంటే వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పొస్తాను.

కాస్త విరామం కావాలని బయటకొచ్చి డెబ్బీ కోసం చూశాను. సోఫాలో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. వెళ్ళి పలకరించాను. నన్ను చూడగానే డెబ్బీతో మాట్లాడుతున్నావిడ లేచి వెళ్ళొస్తానని చెప్పి వెళిపోయింది.

“రేపు డాన్ పుట్టినరోజు. ఏం కొనిస్తే బావుంటుంది చెప్పు డెబ్బీ?” అని అడిగాను. డాన్ నా గర్ల్‌ఫ్రెండ్. ఇద్దరం ఆరు నెలలుగా డేటింగ్ చేస్తున్నాం. ఈ విషయం డెబ్బీకి తెలుసు. ఒకసారి ఈ స్టార్‌బక్స్‌కి వచ్చినప్పుడు పరిచయం చేశాను కూడా.

“మొన్ననే కదా ఐపాడ్ కొనిచ్చావు? మళ్ళా గిఫ్టా?” కనుమొమ్మలు ముడేసి నాకేసి అదోలా చూసింది.

“అది పరీక్ష పాసయినందుకు. ఇది పుట్టినరోజుకి,” నవ్వుతూ అన్నాను.

“నాతో పరిచయం అయ్యాక డాన్‌కి నువ్వు కనీసం పది గిఫ్టులు ఇచ్చి ఉంటావు. ప్రతీ సారీ నీకు ఏదో ఒక సాకు.”

“డెబ్బీ! నేను డాన్‌ని ప్రేమిస్తున్నాను. తనూ నన్ను ప్రేమిస్తోంది. అలాంటప్పుడు…”

“డాన్ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందా?” నా మాటలకి అడ్డు తగులుతూ అంది.

“ఖచ్చితంగా చెప్పలేదు కానీ… మేం ఇద్దరం…” అంటూ ఆగిపోయాను. అర్థమయినట్లు తలూపింది డెబ్బీ.

“నా మాట విని ఈసారి గులాబీ పువ్వుల బొకే ఇచ్చి చూడు.”

“నేను డైమండ్ రింగ్…” అంటూ ఆగిపోయాను.

డెబ్బీ గట్టిగా నవ్వింది. నేనొక పిచ్చోణ్ణని తిట్టింది. డాన్‌కి డైమండ్ రింగు ఆర్డరిచ్చాను. డాన్‌ని సర్ప్రైజ్ చేద్దామని ఆగిపోయాను. డెబ్బీ సలహా మేరకు గులాబీలు కొనిచ్చాను. తీరా స్టోరుకి తీసుకెళితే ఇంకా రెడీ కాలేదని అన్నాడు. దాంతో డాన్‌కి కోపం వచ్చింది. నేను స్టోరు వాడి మీద కోప్పడ్డాను. సమయానికి గిఫ్ట్ ఇవ్వలేకపోయానన్న బాధ నా మనసుని పాడుచేసింది.

ఓ రెండ్రోజుల తరువాత స్టార్‌బక్స్‌కి వెళ్ళినప్పుడు డెబ్బీని కలిసి జరిగింది చెప్పాను.

“డాన్ నేను డైమండ్ రింగ్ కొన్నానని చెప్పినా నమ్మలేదు. ఆఖరికి షాపువాడూ చెప్పాడు. తనని తక్కువ చేయడానికిలా చేశానని తగాదా పెట్టుకుంది. ఆ రోజంతా పాడయ్యింది.”

“ఒకటి చెప్పనా? డాన్‌కీ, నీకూ సరిపడదు. షీ ఈజ్ నాట్ యువర్ టైప్ ఆఫ్ గర్ల్!” అనేసి కాఫీ తాగాలన్నట్టు లేచింది.

నే తెస్తానంటూ – “రెండు కాఫీ కదా?” అని అడిగాను.

ఒకటే అన్నట్లు చెయ్యి చూపించింది. డెబ్బీ ఒక్కతే ఉందని అప్పుడు గమనించాను. జెర్రీ కనిపించలేదు. అదే విషయం అడిగాను.

“జెర్రీ వాళ్ళావిడకి ఒంట్లో బాగో లేదు…” అంది. అది విని ఆశ్చర్యపోయాను. పైకి ఎప్పుడూ అడగకపోయినా ఇన్నాళ్ళూ జెర్రీ, డెబ్బీ మొగుడూ పెళ్ళాలనే అనుకున్నాను. ఎందుకంటే ఇద్దరూ కలిసి వస్తారు. మాట్లాడుకుంటారు. పోట్లాడుకుంటారు. ఒక్కోసారి ఎంతో సంతోషంగా నవ్వుకుంటారు. నా ఆశ్చర్యం నా ముఖంలో కనిపించినట్టుంది.

“నాకు నలుగురు పిల్లలు. అందరూ మంచిగానే సెటిల్ అయ్యారు. మా ఆయనకి పోకర్ పిచ్చి. ఉదయం అతనలా వెళ్ళగానే నేనిలా వచ్చేస్తాను. జెర్రీకి ఇద్దరే పిల్లలు. ఇద్దరూ ఈ చుట్టుపక్కలే ఉంటారు. జెర్రీ నాకు నలభయ్యేళ్ళుగా తెలుసు. ఇద్దరం చదువుకునేటప్పుడు ప్రేమించుకున్నాం. డేటింగ్ కూడా చేశాం. ఎందుకో చిన్న గొడవొచ్చి విడిపోయాం. తరువాత నాకు విలియంతో పరిచయం అయ్యింది. పెళ్ళి చేసుకున్నాం. విలియమ్ చాలా మంచి వాడు. కానీ అతనికి పోకర్ వ్యసనం. దానికి తగ్గట్టు విపరీతమైన తాగుడు…”

“మరి నువ్వు తాగొద్దని చెప్పవా?”

“ఒకరు చెబితే పోయేవి కావు ఈ వ్యసనాలు. మా ఆయనకి పోకర్ పెద్ద వ్యసనం. దానికి తోడుగా తాగుడు. జెర్రీకి పుస్తకాల వ్యసనం. నీకు డాన్‌ని మెప్పించడం వ్యసనం. నాకు జెర్రీతో మాట్లాడ్డం వ్యసనం. అంతెందుకూ? నాకు ఈ కాఫీ ఒక వ్యసనం. నీ చేతి కాఫీ మరో కొత్త వ్యసనం. ఇలా మనమందరమూ ఒక వ్యసనంతో గడిపేస్తూనే ఉంటాం!”

“నా చేతి కాఫీ ఒక అలవాటు. వ్యసనం కాదు. రెంటికీ తేడా లేదూ? వ్యసనం అంటే బలహీనత!”

“అవును. నిజమే! బలహీనత. బలమైన బలహీనత!” నవ్వుకుంటూ అంది. నేను కాఫీ తీసుకురావడానికి లోపలికెళ్ళి తయారు చేసి బయటకి వచ్చాను.

అక్కడ సోఫా ఖాళీగా ఉంది. డెబ్బీ కోసం చుట్టూ వెతికాను. చేతిలో కాఫీ పారవేయడం ఇష్టంలేక ఒక గుక్క తాగాను. వెంటీ బోల్డ్ ట్రిపుల్, టాల్, వన్ పంప్ సినమిన్, వన్ పంప్ హేజల్ నట్, సోయా, ఎక్స్ట్రా హాట్, ఫోమీ, లాటే విత్ లైట్ విప్!

అమృతంలా అనిపించింది.